సరైన విద్య, ఉద్యోగ అవకాశాలు లభించకే నక్సలైట్లలోకి....
గవర్నర్ వి.ఆర్.వాలా ఆవేదన
బెంగళూరు: సరైన విద్య, ఉద్యోగ అవకాశాలు లభించక పోవడం వల్లే అనేక మంది యువతీ, యువకులు మావోయిస్టుల్లో చేరుతున్నారని గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడి బెంగళూరు విశ్వవిద్యాలయంలో అల్లంపల్లి వెంకటరామ్ కార్మిక పరిశోధనా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి నిర్భంద విద్యను అందజేయాలని భారత రాజ్యాంగం చెబుతోందని, అయితే ఇప్పటి వరకు ఈ అంశం ఎక్కడా కూడా సమర్థవంతంగా జారీ కాలేదని అన్నారు. వెంకటరామ్ కార్మిక సంశోధనా పీఠం ఆధ్వర్యంలో ‘ఇంటి పనులు’ చేసే వారిపై నిర్వహించిన సర్వేనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం ఇంటి పనులు చేసే వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరిలో అక్షరాస్యుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు.
ఈ రంగంలో పనిచేస్తున్న వారికి వేతనాలు చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల వారు కూడా తమ పిల్లలను విద్యాభ్యాసానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు విద్యాభ్యాసానికి దూరంగా ఉండడం జాతీయ సమస్య కాదని, అది జాతికి కళంకం అని పేర్కొన్నారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయించడం కంటే పేదలకు అవకాశాలను చేరువ చేయడం ఎంతో ఉత్తమమైన పని అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ డి.హెచ్.శంకరమూర్తి, వెంకటరామ్ కార్మిక పరిశోధనా పీఠం డెరైక్టర్ నారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు.