
ప్రతి ఏటా వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఏసీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2021-22లో 84 లక్షలు.. 2023-24 నాటికి 1.1 కోట్ల ఏసీలు అమ్ముడైనట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏసీల విక్రయాలు పెరుగుతున్న సమయంలో.. విద్యుత్ వినియోగం ఎక్కువవుతోంది. ఈ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ప్రభుత్వం 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన 2025 అమలు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీఎం మోదీ ఏసీ యోజన పథకాన్ని.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మిర్వహించనుంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. విద్యుత్ ఆదా చేయడమే. కొత్త ఏసీ.. పాత ఏసీ కంటే కొంత తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బిల్ తగ్గుతుంది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం, పాత ఏసీని ఫైవ్ స్టార్-రేటెడ్ మోడల్‌తో రీప్లేస్ చేసుకోవడం వల్ల ఒక ఇంటికి సంవత్సరానికి రూ. 6,300 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతాయి. కుటుంబాలకు ఖర్చులను తగ్గించడంతో పాటు, ఇది పవర్ గ్రిడ్‌పై కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
పీఎం మోదీ ఏసీ యోజన అమలులోకి వచ్చిన తరువాత, ఈ స్కీమ్ కింద.. ఎక్కువ విద్యుత్ వినియోగించే లేదా పాత ఏసీని స్థానంలో 5 స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది, తద్వారా కరెంట్ బిల్ తగ్గుతుంది. అంతే కాకుండా ఈ స్కీమ్ కింద ఏసీ కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఈ స్కీమ్ కింద కొత్త 5 స్టార్ ఏసీ పొందటం ఎలా?
➤ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీని గుర్తింపు కలిగిన రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వండి. వారు మీకు ఒక సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఉపయోగించి.. కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు పొందవచ్చు.
➤బ్లూ స్టార్, ఎల్‌జీ, వోల్టాస్ వంటి పెద్ద ఏసీ బ్రాండ్స్ కూడా పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ అందిస్తాయి.
➤పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ వినియోగించేవారి.. విద్యుత్ బిల్లులో కూడా కొంత తగ్గింపు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించనుంది.
ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!