ఆవిష్కరణం: ఏసీ తయారీకి రైలు స్ఫూర్తినిచ్చింది!
వేసవి వస్తే చాలు... ఏసీ కావాల్సిందే! ఒక్కక్షణం దాన్ని ఆపినా, ఉక్కపోతతో ఉడికిపోతాం. మలయ పవనాలను మించిన చల్లదనాన్ని అందించే ఏసీ ఆవిష్కరణ ఎలా జరిగిందో తెలుసా! విల్లీస్ హ్యావిల్యాండ్ క్యారియర్ అమెరికాలోని బ్రూక్లీన్ ముద్రణా సంస్థలో పది డాలర్ల జీతానికి పనికి చేరాడు. అతి వేడిమి కారణంగా ఇలా ముద్రించగానే అలా తేమ తగ్గిపోయి రంగులు అల్లుకుపోతుండేవి. మళ్లీ మళ్లీ ముద్రించాల్సి వచ్చేది. దాంతో విసిగిపోయి, ఎలాగైనా గాలిని చల్లబరిచే మార్గం కనిపెట్టాలనుకున్నాడు. కష్టపడి సంవత్సరం తిరిగేలోపు ఓ యంత్రాన్ని తయారుచేసి తన యజమానికి చూపించాడు. అదే మొట్టమొదటి ఏసీ.
1906లో ఏసీ మీద పేటెంటును పొందాడు విల్లీస్. అయితే వేడిని నియంత్రిం చడంపై పూర్తి స్పష్టత లేకపోవడంతో దానిపై పరిశోధనలు కొనసాగించాడు. ఓ మంచు కురుస్తున్న రాత్రి రైలు కోసం ఎదురుచూస్తున్నాడు విల్లీస్. రైలు వచ్చింది. వెంటనే అప్పటివరకూ ఉన్న చల్లదనం మాయమై వేడిగాలి ఆక్రమించింది. అప్పుడే వేడి, తేమ, మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు విల్లీస్. వేడిగాలి కారణంగా మంచు చెదిరిపోతుంది. ఆ సమయంలో చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడి తగ్గుతుంది అని కనిపెట్టాడు. రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఓ కొత్త సూత్రాన్ని కనుగొని, అమెరికాలోని ఓ ఇంజినీరింగ్ సొసైటీకిచ్చాడు. దాని ఆధారంగా వాళ్లు అందమైన ఏసీని తయారు చేశారు. తర్వాత విల్లీస్ పరిశ్రమల కోసం ఆరోగ్యానికి హాని కలిగించని సెంట్రీఫ్యూగల్ రిఫ్రిజిరేషన్ యంత్రాన్ని, ఆ పైన ఇంట్లో వాడుకోవడానికి వెదర్ మేకర్‌ని తయారు చేశాడు. అవన్నీ ఇప్పటికీ మనకు చల్లదనాన్ని పంచుతూనే ఉన్నాయి!