యువ నాయకత్వం వైపు ఓటర్ల మొగ్గు: సర్వే
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చదువుకున్న, దాదాపు 40 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థుల వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది.
పుణెకు చెందిన గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్, ఎకనామిక్స్ సర్వే నిర్వహించింది. 92 శాతం మంది ఓటర్లు చదువుకున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయాలని అభిప్రాయపడ్డారు. కనీసం మెట్రిక్యులేషన్ చదవనివారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని 78 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 5100 మంది ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబాల వారే ఎక్కువగా పోటీ చేస్తున్నారని 86 శాతం మంది చెప్పారు. మహారాష్ట్రలో నవంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు నాలుగు విడతల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.