విద్యావంతుల్లోనే అధిక అవినీతిపరులు
గవర్నర్ వీఆర్ వాలా ఆవేదన
బెంగళూరు : నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యుల్లోనే ఎక్కువగా అవినీతి కనిపిస్తోందని గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడి భారతీయ సంస్కృతి విద్యాపీఠ సువర్ణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడే వారంతా సంస్కార హీనులని పేర్కొన్నారు. ఎన్నికష్టనష్టాలు ఎదురైనా నైతిక విలువలను విస్మరించరాదన్నారు. మనం సంపాదించిన జ్ఞానాన్ని దేశ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలనే ఆలోచనా ధోరణిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని సూచించారు. ఇక మహిళలు పువ్వులా ఎంతో మృదువుగా ఉండగలరని.. అదే సందర్భంలో అగ్నిలా శక్తివంతంగా కూడా మారగలరని అన్నారు. ఇందుకు ఝన్సీరాణి వంటి వారే ఉదాహరణ అని అన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ మాట్లాడుతూ...స్వాతంత్య్రానికి ముందు భారత్‌లో 20-27 శాతం అక్షరాస్యత ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య 70 శాతానికి పెరిగిందని అన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో నిజాయితీ గల వ్యక్తుల కంటే అవినీతిపరులే అధికంగా ఉండడం శోచనీయమన్నారు. జీవితంలో ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి వేషధారణ, అతని వద్ద ఉన్న డబ్బును బట్టి కాకుండా కేవలం అతని వ్యక్తిత్వాన్ని బట్టే గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా చిన్నారుల్లో ఈ విధమైన ఆలోచనా విధానాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెంపొందించాలని కోరారు.