జిల్లా విద్యాధికారి కార్యాలయంలో చేయి తడపందే పనులు కావడం లేదు. ఆమ్యామ్యాలిస్తేనే అనుమతులిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు, రెన్యూవల్‌కు రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లను పెండింగ్‌లో ఉంచేస్తున్నారు. అధికారులు అడిగినంత ముట్టజెబుతున్న స్కూళ్ల నిర్వాహకులు ఆ మేరకు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులు, ఉన్న స్కూళ్ల గుర్తింపు రెన్యూవల్స్‌కు సంబంధించిన విషయాల్లో డీఈఓ కార్యాలయంలో మామూళ్ల దందా నడుస్తోంది. అక్కడి అధికారుల పనికి బట్టి ఫిక్స్‌డ్ రేట్లు నిర్ణయించారు. వారు చెప్పిన మేరకు చెల్లిస్తే సరే... అందులో పైసా తగ్గినా ఫైళ్లు ముందుకు కదలవు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి 60–70 పైళ్లు ఇలా డబ్బుతోనేముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలు ఇలా...
♦ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేయాలన్నా, ఉన్న స్కూల్ గుర్తింపు రెన్యూవల్ చేసుకోవాలన్నా రూ.2,500 చలానా తీయాలి.
♦ ఉన్నత పాఠశాలకైతే రూ. 5 వేలు చలానా కట్టాలి.
♦ ప్రాథమిక పాఠశాలలైతే ఎంఈఓ, ఉన్నత పాఠశాలలైతే డిప్యూటీ డీఈఓ వెళ్లి... సదరు పాఠశాలలో నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నాయా...? లేదా..? వాటికి సంబంధించి సర్టిణఫికెట్లు పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత డీఈఓకు సిఫార్సు చేయాలి.
♦ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి డీఈఓ అనుమతిలిస్తారు.
♦ ఉన్నత పాఠశాలల ఫైళ్లు డీఈఓ నుంచి రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ, కడప)కి... అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్తాయి. అన్నీ సవ్యంగా ఉంటేనే ప్రభుత్వం అనుమతిలిస్తుంది.
జరుగుతోందిలా...
♦ ప్రాథమిక పాఠశాలలకైతే ఎంఈఓకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఇవ్వాల్సి వస్తోందని పలు పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు.
♦ ఫైలు అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి వెళ్లగానే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రూ.30 వేలు చెల్లించాలి.
♦ ఉన్నత పాఠశాలలైతే డిప్యూటీ డీఈఓలకు ఐదేళ్ల ఫైళ్లయితే రూ.30 వేలు, పదేళ్ల ఫైళ్లయితే రూ. 60 వేలు ఇవ్వాలట.
♦ అక్కడి నుంచి ఫైలు డీఈఓ కార్యాలయానికి రాగానే అక్కడ వారికి రూ. 30 నుంచి రూ. 40 వేలు ఇవ్వాలి. డబ్బు ముట్టజెబితే తప్ప ఫైలుకు ముందుకు వెళ్లని పరిస్థితి. – ఆర్జేడీ కార్యాలయంలోనూ ఒక్కో ఫైలుకు రూ. 60 వేలు ముట్టజెబితేనే ఫైళ్లు ముందుకు వెళ్తాయని ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు వాపోతున్నారు.
♦ పాఠశాల నిర్వహణకు కీలకమైన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, సౌండ్‌నెట్, శానిటరి, ఫైర్ ఎన్‌ఓసీ, ట్రాఫిక్ ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు పక్కాగా జత చేసినా...వీరికి మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే ఫైళ్లకు బూజు పడతాయి.
డబ్బులిస్తే మేనేజ్ చేస్తారట
పాఠశాల రెన్యూవల్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు కచ్చితంగా ఇటీవల తీసుకున్నవే ఉండాలి. డీఈఓ కార్యాలయంలో కొందరు సిబ్బంది పాత సర్టిఫికెట్లు జతచేసి వాటితోనే ఫైళ్లను పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక అధికారుల పర్యవేక్షణలో ఈ మూమాళ్ల తతంగం నడుస్తోంది. ఏ ఫైలుకు ఎంత ఇవ్వాలనేది ఫిక్స్ చేసింది వారేనని ప్రచారం సాగుతోంది. పాఠశాల అనుమతి, రెన్యూవల్ విషయంలో డీఈఓ కార్యాలయ సిబ్బంది తీరుపై ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లలో చర్చనీయాంశమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యాశాఖలో కొందరికి పండుగే. కొందరు ఎంఈఓలతో పాటు డీఈఓ కార్యాలయంలో రెన్యూవల్స్, అనుమతులకు సంబంధించి ఫైళ్లు చూసే సెక్షన్ల సిబ్బంది సీజన్ ముగిసేదాకా కళకళలాడుతుంటారు.
కొసమెరుపు
డీఈఓ కార్యాలయంలో దందా చేస్తున్న సిబ్బంది అధికారుల వాటాగా మాత్రం రూ.4–5 వేలు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా అధికారుల పేరు చెబుతూ వసూళ్లకు తెర తీస్తుండడం కొసమెరుపు.
విచారణ చేయిస్తా
ప్రైవేట్ స్కూళ్ల రెన్యూవల్స్, కొత్తగా అనుమతులకు డబ్బులు తీసుకుంటున్న విషయం ఎవరూ నాదృష్టికి తీసుకురాలేదు. అయినా దీనిపై విచారణ చేయిస్తా. కార్యాలయంలో ఎవరైనా సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. ఎవర్నీ ఉపేక్షించం. – జనార్దనాచార్యులు, జిల్లా విద్యాశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment