డీఈఓ కార్యాలయం
అనంతపురం ఎడ్యుకేషన్: అధికార మార్పుతో విద్యాశాఖ అధికారి, సర్వశిక్షా అభియాన్ కార్యాలయాల్లో ఫారెన్ సర్వీస్ కింద పని చేస్తున్న ఐదుగురి టీచర్లపైనే చర్చ జోరుగా సాగుతోంది. డీఈఓ కార్యాలయంలో ఏఎస్‌ఓ శ్రీనివాసులు, ఏపీఓ మంజునాథ్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులుతో పాటు సైన్స్ సెంటర్ క్యూరేటర్ వెంకటరంగయ్య, ఎస్‌ఎస్‌ఏలో ఏఎంఓ జయచంద్ర, అసిస్టెంట్ ఐఈడీ నరహరి మంత్రుల సిఫార్సులతో వచ్చారు. అధికార మార్పు నేపథ్యంలో వీరి కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే తనను స్కూల్‌కు పంపాలంటూ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ డీఈఓకు విన్నవించుకున్నారు. తక్కిన వారు ఆలోచనలో పడ్డారు. అలాగే డీఈఓ కార్యాలయంలోనే డెప్యూటేషన్‌పై మరో ముగ్గురు టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఓ టీచరు ఏ ఎండకాగొడుగు పడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు. సుమారు పదేళ్లకు పైగా ఈయన బడిబాట పట్టలేదు.
కార్యాలయంపై పెత్తనం చెలాయించిన ఉద్యోగి
ఫారెన్ సర్వీస్ కింద డీఈఓ కార్యాలయంలోకి అడుగుపెట్టిన ఉద్యోగి ఒకరు మినిస్టీరియల్ ఉద్యోగులపై పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ వచ్చాడు. మంత్రి కాలవ శ్రీనివాసులు పేరు చెబుతూ చివరకు డీఈఓను కూడా చాలా సందర్భాల్లో లెక్కచేయలేదనే ప్రచారం ఉద్యోగుల్లో సాగుతోంది. డీఈఓ కార్యాలయంలో ప్రధానంగా ఎస్టాబ్లిష్‌మెంట్, మోడల్ స్కూళ్లు, ఆర్‌ఎంఎస్‌ఏ, ఎండీఎం, పరీక్షల విభాగం, పాఠ్యపుస్తకాలు తదితర విభాగాలున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమైనా ముందుగా డీఈఓ మెయిల్‌కు వస్తుంది. అయితే డీఈఓ బిజీగా ఉంటుండడంతో తన పర్సనల్ మెయిల్ పాస్‌వర్డ్ ఓ ఉద్యోగికి ఇచ్చారు. ఆయన ఎప్పటికప్పుడు మెయిల్స్ పరిశీలించి వచ్చిన సమాచారాన్ని అవసరం మేరకు ఆయా విభాగాలకు చేరవేయాల్సి ఉంటుంది.
అయితే ఈ విషయంలో డీఈఓ కార్యాలయ ఉద్యోగులను మరీ నిర్లక్ష్యం చేశారు. కనీస గౌరవం లేకుండా, ఉద్యోగులు ఏది చెప్పినా పట్టించుకోకుండా తాను అనుకున్నదే చేశారు. డీఈఓ కూడా ఇతడికే ప్రాధాన్యత ఇవ్వడంతో తక్కిన ఉద్యోగులు మౌనం దాల్చుతూ వచ్చారు. సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, చివరకు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి పట్ల కూడా సదరు ఉద్యోగి అలసత్వం ప్రదర్శించారు. సదరు ఉద్యోగి వైఖరి నచ్చక ఆయన విభాగంలోకి కూడా వెళ్లేందుకు చాలామంది ఉద్యోగులు ఇష్టపడడం లేదు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో చాలామంది మినిస్టీరియల్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. సదరు ఉద్యోగి వ్యవహారంపై ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. మాజీమంత్రి కాలవ అండతో రెచ్చిపోయిన ఉద్యోగి కూడా తిరిగి బడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరి స్కూళ్లలో ఉన్న ఖాళీలను చూసుకుని వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment