
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘రావాలి జగన్...కావాలి జగన్’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులను జనం వైఎస్సార్‌సీపీ నేతల వద్ద ఏకరువు పెడుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం గొటుకూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, యువజన విభాగం నాయకులు ప్రణయ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి జనంతో మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి మొదలుకుని కార్యకర్త వరకు దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదన్నారు. ధర్మవరం పట్టణం ఒకటో వార్డు శాంతినగర్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదంటూ పలువురు మహిళలు వెంకటరామిరెడ్డితో వాపోయారు. మోసం చేసిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం యర్రయ్యగారిపల్లి, చుండురోళ్లపల్లిలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క హామీ అమలు చేయకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మడశికర నియోజకవర్గం గుండుమలలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని తిప్పేస్వామి అన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సయుక్త కార్యదర్శి రంగేగౌడు పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జగన్ సీఎం అయితే చేపట్టే పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఈదులకుంట్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం మోసం చేసిన వైనాన్ని గ్రామస్తులు నాయకుల వద్ద వాపోయారు. కళ్యాణదుర్గం పట్టణం ఇందిరమ్మకాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు కార్యక్రమం నిర్వహించారు. ఏళ్ల తరబడి బుట్టలు అల్లుకుని జీవిస్తున్నామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని మహిళలు వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలూ అభివృద్ధి చెందుతాయని ఉషశ్రీచరణ్ వారికి భరోసా ఇచ్చారు.