అవినీతి ఆట | Education officials who are corrupt in chittoor | Sakshi
Sakshi News home page

అవినీతి ఆట

Published Fri, Apr 28 2017 9:29 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

అవినీతి ఆట - Sakshi

అవినీతి ఆట

► పీఈటీల ఉద్యోగోన్నతుల్లో అక్రమాలు కోకొల్లలు
► చక్రం తిప్పుతున్న డీఈవో కార్యాలయ సిబ్బంది
► గందరగోళంగా సీనియారిటీ జాబితా
► కలెక్టర్‌గారూ.. స్పందించాలి మీరు

అన్ని శాఖలకు ఆదర్శంగా నిలవాల్సిన విద్యాశాఖాధికారులు అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతున్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉద్యోగోన్నతులు వచ్చినప్పుడే కాసులు  కొల్లగొట్టాలని ప్రణాళిక రచించుకున్నారు. దానికి పీఈటీల సీనియారిటీ జాబితాను లక్ష్యంగా ఎంచుకున్నారు. ముడుపులిచ్చే వారిని అందలం ఎక్కిస్తూ మిగిలిన వారిని పక్కకు నెట్టేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ఆగడాలకు తమ జీవితాలే సర్వనాశనమవు తున్నాయని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు.

సాక్షి, చిత్తూరు: జిల్లాలో సీనియర్‌ పీఈటీలకు ఉద్యోగోన్నతుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పలుకబడి, ముడుపులు సమర్పించుకున్న వారినే అందలం ఎక్కిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని పలువురు పీఈటీలు విద్యాశాఖ చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతోంది. ప్రస్తుత ఉద్యోగోన్నతుల్లో తమకు అన్యాయం జరిగితే భవిష్యత్‌లో నష్టపోయి పీఈటీ పోస్టులకే పరిమితం కావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర విభజన కాకముందు2000 డీఎస్సీలో ఎంపికైన నాన్‌ లోకల్‌ పీఈటీల వ్యవహారం ప్రస్తుతం అమలులో లేనప్పటికీ దాదాపు 80 మంది సీనియర్‌ పీఈటీల పేర్లను ఉద్యోగోన్నతుల జాబితాలో చేర్చలేదు. ఇదే డీఎస్సీకి చెందిన వారికి పలు జిల్లాల్లో ఉద్యోగోన్నతులు కల్పించారని, కానీ తమకు అలాంటి అవకాశం కల్పించడంలేదని చెబుతున్నారు. తమకంటే వెనుక డీఎస్సీ చేసిన వారికి సైతం  జాబితాలో అవకాశం కల్పించారని ఆరోపిస్తున్నారు.

జాబితా తారుమారు
నెల రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పీఈటీల ఉద్యోగోన్నతుల వ్యవహారం సాగుతోంది. ఇందుకు అర్హులైన వారి నుంచి సర్వీసు రిజిష్టర్, దరఖాస్తులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్న సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు అర్హులైన పీఈటీల  వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను తయారుచేశారు. ఆ జాబితాను విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఓ అధికారి తారుమారు చేశారని  సమాచారం. డీఈవో సమక్షంలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఒక్క రోజు కూడా అలా జరగకపోవడం వల్లే  అవకతవకలు జరిగాయని ఉపాధ్యాయ సంఘ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను విడుదల చేసి, అందులో అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌ చేసుకోవాలని సూచించడంతో బాధితులు వివరాలు సమర్పించారు. గత నెలలో డీఈవో కార్యాలయంలో జరిగిన అభ్యంతరాల స్వీకరణకు వందల మంది పీఈటీలు క్యూ కట్టారు.  ఇక్కడా న్యాయం జరగకపోవడంతో అమరావతి కెళ్లి విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. కానీ స్పందన లేదు.

ముడుపులే కారణం
పలు శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన విద్యాశాఖ లోనే భారీ అవకతవకలు జరుగుతున్నాయంటే.... దాని కి ప్రధాన కారణం ముడుపుల వ్యవహరమేనన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జాబితాను తయారు చేసి లక్షల సొమ్ము పోగేసుకుంటున్నట్టు బాధిత పీఈటీలు ఆరోపిస్తున్నారు.

ఇవే ఆధారం
2000 డీఎస్సీలో ఎంపికైన ఓ ఉపాధ్యాయుని మెరిట్‌లో 34వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. మరొకరు 110వ స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ముందుకు వచ్చేశారు. స్పౌస్‌ జాబితా అంటూ ఓ ఉపాధ్యాయుడి పేరును జాబితాలో చేర్చితే ఇదే∙నిబంధన ఉన్న ఓ పీఈటీ ఉపాధ్యాయురాలిని జాబితా నుంచి తొలగించారు. ఇవే కాదు ఇలా ఎన్నో అవకతవకలు.. కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ న్యాయం చేయాలి
జిల్లాలోని పదోన్నతుల వ్యవహారంలో చాలా మంది పీఈటీలకు అన్యాయం జరిగింది. రోస్టర్, మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయాల్సి ఉండగా, ఇక్కడి విద్యాశాఖ సిబ్బంది పూర్తి విరుద్ధంగా జాబితాను సిద్ధం చేశారు. గతంలో ఒక విధానం, ప్రస్తుత పదోన్నతుల్లో మరొక విధానం పాటించడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. – రెడ్డిశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకుడు

ప్రత్యేక బృందంతో పరిశీలించాలి
పలువురు పీఈటీలకు అన్యాయం జరిగిందని తమకు ఇటీవలే తెలిసింది. ఈ విషయంపై తమ ఆపస్‌ సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశాం. ఎటువంటి స్పందన లేదు. ఈ విషయంలో ప్రత్యేక బృందంతో పీఈటీల సీనియారిటీ జాబితాను మరోసారి పరిశీలించాలి. – బాలాజీ, ఉపాధ్యాయ సంఘం నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement