మూత‘బడి’ | Education Department Delayed English Medium in Government Schools | Sakshi
Sakshi News home page

మూత‘బడి’

Published Thu, May 2 2019 11:24 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Education Department Delayed English Medium in Government Schools - Sakshi

పూతలపట్టు నియోజకవర్గంలో మూతబడిన పాఠశాల(ఫైల్‌)

విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే విద్యాశాఖ అధికారులు రేషనలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. తక్కువ మంది విద్యార్థులున్నవి, విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేయాలని, యూపీఎస్‌లను దగ్గరలోని పాఠశాలల్లో విలీనం చేయాలని, గ్రామ పంచాయతీకి ఒకే పాఠశాల ఉండేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. దీంతో జిల్లాలో పలు పాఠశాలలు మూతపడనున్నాయి. జీఐఎస్‌ (జియోలాజికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం) ద్వారా అధికారులు పాఠశాలలు, విద్యార్థులు, టీచర్లు పూర్తి వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కసరత్తు మొత్తం వేసవి సెలవుల్లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారని సమాచారం. ఈ ప్రక్రియ ద్వారా టీచర్లకు కూడా స్థానచలనం తప్పేలా లేదు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో 1,032 పైగా పాఠశాలలకు వచ్చే విద్యా సంవత్సరంలో తాళం వేయనున్నారు. విద్యార్థులు లేని పాఠశాలలు, పది మంది విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో పది మంది విద్యార్థులున్న పాఠశాలలు 450, 10 నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 345, 30 మంది లోపు 237 పాఠశాలలకు పైగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది తక్కువమంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేసేందుకు ప్రయత్నించగా జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ప్రభుత్వంతో చర్చలు జరిపి మూసివేతను నిలిపివేశారు. అయితే ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏమాత్రమూ పెరగలేదు. గతంలో జిల్లాలో రేషనలైజేషన్‌ ద్వారా 840 పాఠశాలల వరకు మూసివేశారు. రేషనలైజేషన్‌ ద్వారా పోస్టులను రద్దుచేసి అక్కడ పనిచేస్తున్న వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఈసారి మూతబడే పాఠశాలలు ఎక్కువగా కుప్పం, తంబళ్లపల్లె, పలమనేరు, జీడీ నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో ఉన్నట్లు సమాచారం.

పీఎస్‌లు.. హెచ్‌ఎస్‌లే
ప్రభుత్వం రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపడితే జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మాత్రమే మిగిలే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ప్రాథమిక 3,589, ప్రాథమికోన్నత 450, ఉన్నత పాఠశాలలు 545 ఉన్నాయి. వాటిలో 1,22,495 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మాత్రమే ఉంచి, ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది.

ఇంగ్లిష్‌ మీడియంపెట్టినా ప్రయోజనం శూన్యం
జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడి యం ప్రవేశపెడితే విద్యార్థుల సంఖ్య  పెంచవచ్చ ని భావించారు. ఆ దిశగా జిల్లాలోని 806 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. అయితే ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగని పరిస్థితి. దీంతో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినా అడ్మిషన్లలో పురోగతి కనిపించలేదని విద్యాశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతుంటే భవిష్యత్తులో ప్రభుత్వ బడులే కనిపించని పరిస్థితికి వస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే జిల్లాలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గనివ్వకుండా, తక్కువగా ఉండే చోట సంఖ్యను పెంచేందుకు టీచర్లు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మూసివేస్తే ఆందోళనలు చేస్తాం
ప్రభుత్వ బడులను మూసివేస్తే ఆందోళనలు చేస్తాం. ప్రస్తుత సర్కారు గత ఐదేళ్లలో చాలా ప్రభుత్వ బడులను కనుమరుగు చేసింది. ప్రభుత్వ బడుల్లో నూతన సంస్కరణలు అమలు చేసి బలోపేతం చేయాలే గాని మూసివేయకూడదు.    – శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ నేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement