బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం | Threat to Andhra Pradesh govt schools with Chandrababu TDP Govt | Sakshi
Sakshi News home page

బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం

Published Mon, Jan 20 2025 4:48 AM | Last Updated on Mon, Jan 20 2025 8:33 AM

Threat to Andhra Pradesh govt schools with Chandrababu TDP Govt

సర్కారు బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం

దుమారం రేపుతున్న జీవో–117 ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు

ప్రైమరీ మోడల్‌ స్కూళ్ల పేరుతో కొత్త విధానం

ఇకపై 3–5 తరగతులు చదవాలంటే ఊరు దాటాల్సిందే

జీవో–117 ప్రకారం 4,731 స్కూళ్లలోనే 3–5 తరగతుల విలీనం

కొత్త విధానం వల్ల 34 వేల ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం

12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసివేసే ప్రమాదం

15 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం 

విద్యార్థులు తక్కువ ఉన్నచోట పాఠశాలలు మూసివేసే ఛాన్స్‌

మిగులు ఉపాధ్యాయులు ఉండటంతో డీఎస్సీ ఇచ్చే అవకాశం లేనట్టే!

ప్రతి గ్రామంలో రెండు, మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమి­కోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్‌ స్కూల్‌ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే.. జీవో–117కు ప్రత్యా­మ్నా­యంగా విడుదలైన విద్యా శాఖ కొత్త మార్గదర్శ­కాలు ప్రాథ­మిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.

సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 3–5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్టు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. 

సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే.. తెచ్చిన మార్పు ఓ ఐదేళ్లపాటు కొనసాగాలి, తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ.. ఇక్కడ జీవో117 ద్వారా 2022 జూన్‌లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ.. జీవో–117లో ఉన్న మంచి పోయి.. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది.

కొత్త విధానంతో 10 వేల సబ్జెక్టు టీచర్ల మిగులు
జీవో–117 రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దుచేసి, ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసురావాలి. కానీ.. ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు.. ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో 27 మంది విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైంది. 

ఆరో తరగతిలో 19 మంది, 7వ తరగతిలో 17 మంది, 8వ తరగతిలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత తరగతులు ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్‌ అసిస్టెంట్లు బోధన అందిస్తున్నారు. అయితే, 6, 7, 8 తరగతుల్లో మొత్తం 50 మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్‌ను రద్దు చేస్తారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు 27 మంది 2025–26 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగితే అప్పుడు 6, 7, 8 తరగతుల్లో 63 మంది, 9వ తరగతిలో 14 మంది మొత్తం 77 మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. కానీ.. అక్కడ బోధనకు స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులను రద్దు చేసి, ఎస్‌జీటీలను మాత్రమే ఇస్తుంది. 

అంటే హైస్కూల్‌గా మారినా పరిస్థితి మెరుగుపడకపోగా.. ఉన్న పోస్టులు సైతం వెళ్లిపోయి అప్‌గ్రేడ్‌కు బదులు డౌన్‌గ్రేడ్‌ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,760 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఇలాగే మారే ప్రమాదముంది. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవో–117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. దీంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు 8 సెక్షన్లు కొనసాగుతున్నాయి. 180 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున.. గణితం, ఇంగ్లిష్‌కు ఇద్దరు చొప్పున 12 మంది స్కూల్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. 

3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో 140 మంది విద్యార్థులతో 5 సెక్షన్లే మిగులుతాయి. దీంతో ఒక గణితం, ఒక ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్లు, మరో రెండు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి. ఇలానే జీవో–117 ద్వారా 3–5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు సగటున మూడు చొప్పున 10 వేల పోస్టులు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10 వేల స్కూల్‌ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. ఇంత భారీగా మిగులుతున్న స్కూల్‌ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.

34 వేల ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం జీవో–117 ప్రకారం ఉన్నత, యూపీ స్కూళ్లకు కి.మీ. పరిధిలో ఉన్న 4,731 ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. వీరికి సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. అలాగే, 1, 2 తరగతుల్లో 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్నా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 117 జీవోను రద్దు చేసి, 3–5 తరగతులను తిరిగి వెనక్కి తెస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. 



అంతేగాక, 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించకుండా మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం కి.మీ. పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులనే విలీనం చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 34 వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారు. దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కి.మీ. దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. 

ఇక 1, 2 తరగతుల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కారు.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక ఎత్తయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు, పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో (హేమ్లెట్స్‌) దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1–5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు. కూటమి కొత్త మోడల్‌ ప్రకారం ఇకపై వీటిలో 3 నుంచి 5 తరగతులు చదివే వారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే.

ఆ హైస్కూళ్లకు హెచ్‌ఎం పోస్టు ఉండదు
ప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు రెండు వేల హైస్కూళ్లకు హెచ్‌ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా.. 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 

కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దాని ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ మొదటి 53 మంది వరకు ఒక సెక్షన్, 54 నుంచి 88 వరకు రెండో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్‌గా గుర్తించి టీచర్లను ఇచ్చారు. 

తాజా మార్గదర్శకాల ప్రకారం 54 మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్, 55 నుంచి 94 వరకు రెండో సెక్షన్, 95 మంది నుంచి 3వ సెక్షన్‌గా నిర్ణయించారు. కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్‌ మంజూరు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయుల మిగులతో డీఎస్సీపై ప్రభావం 
కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్‌ జాడ లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15 వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్‌ అసిస్టెంట్లే దాదాపు 5 వేలకు పైగా, ఎస్‌జీటీలు మరో 10 వేలు మిగిలే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీలో ఖాళీలను ఎక్కడ నుంచి చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

స్కూల్‌ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్‌ అమరావతి
ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. జీవో–117 రద్దు చేస్తున్నందున అంతకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. యూపీ స్కూళ్లల్లో స్కూల్‌ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వారానికి 10 పీరియడ్లు గణితానికి కేటాయించాలని, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టని పక్షంలో జీవో–117 రద్దు వల్ల హైస్కూల్‌ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్నత పాఠశాల విద్య నిర్వీర్యం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement