ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు | High Court expresses anger over food poisoning in government schools | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు

Published Thu, Nov 28 2024 4:07 AM | Last Updated on Thu, Nov 28 2024 4:07 AM

High Court expresses anger over food poisoning in government schools

ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్‌ పాయిజన్‌పై హైకోర్టు ఆగ్రహం

ఒకేచోట వరుస ఘటనలు జరిగినా స్పందించరా? 

జిల్లా విద్యాశాఖాధికారి నిద్రపోతున్నారా? 

20న ఘటన జరిగితే అధికారుల వద్ద వివరాలే లేవా? 

అధికారులకూ పిల్లలు ఉన్నారు కదా.. మానవత్వం లేదా? 

ఈ ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు కనిపిస్తోంది 

అధికారుల తీరుపై సీజే ధర్మాసనం మండిపాటు 

ప్రతి జిల్లాలో ఆహార నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచన

డిసెంబర్‌ 2లోగా నివేదిక అందజేయాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నారాయణపేట జిల్లా మాగనూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు అనిపిస్తోంది. 

హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్‌ ది పీపుల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’అధ్యక్షుడు కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్‌ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్‌ 2వ తేదీ) వాయిదా వేసింది.  

చట్టం అమలే లేదు.. 
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్‌ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్‌) ప్రకారం మెనూ అందించడం లేదు. 

మాగనూర్‌ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్‌ జిల్లా గంగాధర్‌ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్‌ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు.  

ఇంత నిర్లక్ష్యమా? 
ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్‌ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 

జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్‌ చేస్తాం. పాస్‌ ఓవర్‌ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.  

అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి 
పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్‌ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్‌ పాయిజన్‌పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్‌ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌లను ఆదేశించింది. 

జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్‌ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్‌ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement