Food adulteration
-
మయోనైజ్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్‌లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్‌్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
అనకాపల్లి: అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
అనకాపల్లి, సాక్షి: వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్.. నలుగురు చిన్నారుల్ని బలిగొంది. మరో 27 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కైలాసపట్నంలోని ఓ ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు.. ఓ ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎం. కిరణ్ కుమార్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నాం వసతి గృహంలో పిల్లలు సమోసా తిన్నారు. వాటితో ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు.. పిల్లలను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు. వీళ్లలో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు పిల్లలు.. వాళ్ల ఇళ్ల వద్ద మృతి చెందారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డిఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ పి రామారావు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిబంధనల అమలులోనే అసలు చిక్కు!
భారతీయ మసాలాలపై హాంకాంగ్ ఈమధ్యే నిషేధం విధించింది. మూడు బ్రాండ్లపై ఈ నిషేధం వేటు పడింది. సింగపూర్‌లోనూ ఇంకో భారతీయ మసాలా కంపెనీపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలే తీసుకున్నారు. ఎథిలీన్ ఆక్సైడ్ అనే కేన్సర్ కారక రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఆయా దేశాల నియంత్రణ సంస్థలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. మాల్దీవులు చర్యలకు సిద్ధమవుతూండగా... అమెరికా, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా మసాలాల్లో కలుషితాలపై నివేదికలను అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి. నిజానికి ఇలాంటి చర్యలు భారతీయ కంపెనీలకు కొత్తేమీ కాదు. అమెరికా చేరుతున్న భారతీయ ఉత్పత్తుల్లో ఏటా కొన్ని వందలు నాణ్యత ప్రమాణాల లేమి కారణంగా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. ఆయుర్వేద మందులపై కూడా ఎఫ్‌డీఏ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. సీసం వంటి ప్రమాదకర భారలోహాలు, పదార్థాలు పరిమితికి మించి ఉంటాయన్నది వీరు తరచూ వ్యక్తం చేసే అభ్యంతరం. చిన్న పిల్లల ఆహారం విషయంలో ఇటీవలే అంతర్జాతీయ కంపెనీ నెస్లే భారత్‌లో మాత్రమే అధిక చక్కెరలు వాడుతున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు అన్నింటిలోనూ ఒక నిర్దిష్ట క్రమం కనిపిస్తుంది. కంపెనీ భారత్‌ది అయినా, విదేశీయులది అయినా సరే మా తప్పేమీ లేదని ప్రకటిస్తాయి. తయారు చేసిన దేశం లేదా ఎగుమతి చేస్తున్న దేశం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నామని కూడా చెబుతాయి. భారతీయ నియంత్రణ సంస్థలు ఇచ్చే సమాధానం కూడా పద్ధతిగా ఉంటుంది. ‘పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం’ అనేసి చేతులు దులిపేసుకుంటాయి. విదేశీ సంస్థలు సమచారం పంచుకోలేదన్న ఆరోపణ కూడా ఉంటుంది. ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలు, కంపెనీలు రెండూ తాము బాధితులమని వాదిస్తూంటాయి. భారతీయ ఎగుమతులను మాత్రమే పాశ్చాత్య దేశాలు అడ్డుకుంటున్నాయని వాపోతాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నిస్సహాయంగా మిగిలిపోయేదెవరూ అంటే... వినియోగదారుడు మాత్రమే. కొంచెం సద్దుమణిగిన తరువాత అంతా షరా మామూలుగానే నడిచిపోతూంటుంది. కల్తీ, హానికారక, కాలుష్యాలతో కూడి ఆహార పదార్థాలు విదేశాలను చేరుతున్న విషయంలో అసలు సమస్య ఏమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆహార నియంత్రణ వ్యవస్థ నిబంధనల్లోని లోటుపాట్లు సరి చేసే ప్రయత్నం జరగడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం పరిశ్రమలను, ఎగుమతులను కాపాడుకోవాలనే నెపంతో ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు. తప్పు చేసినా వాటి ప్రభావం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం. ఈ క్రమంలోనే వీళ్లు ప్రజారోగ్యాన్నీ; వినియోగదారులు, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చుతూంటారు. వివాదాల్లో చిక్కుకున్న కంపెనీలు భారత్‌లోని ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకుని ఎలాగోలా తప్పించుకుంటాయి. నెస్లే విషయంలో ఈమధ్య జరిగింది ఇదే. కాబట్టి... ఆహార రంగంలో ఎగుమతులకు సంబంధించి ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించడం చాలా అవసరం. ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఆహార ఉత్పత్తుల (పానీయాల నుంచి సముద్ర ఉత్పత్తుల వరకూ) ప్రమాణాలపై సమాచారం ఇచ్చేందుకు, నిర్దేశించేందుకు 26 శాస్త్రీయ కమిటీలు ఉన్నాయి. 2008లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటైన ఈ ప్యానెల్స్‌లో భారతీయ, విదేశీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వీటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ ఆహార కంపెనీల ప్రతినిధుల పెత్తనమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్నేళ్ల తరువాత ఇది కూడా మారింది. ప్రస్తుతం ఈ ప్యానెళ్లలో ఎక్కువగా శాస్త్రవేత్తలు, రిటైర్ అయిన వాళ్లు ఉంటున్నారు. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో పరిశ్రమల ప్రభావం లేదని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న ప్యానెళ్ల కూర్పును మచ్చుకు తరచి చూస్తే చాలామందికి ఇప్పుడు, లేదంటే గతంలో... పరిశ్రమలతో ఏదో ఒక లింకు కచ్చితంగా కనిపిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందు ఈ ప్యానెళ్ల సభ్యుల పూర్వాపరాలను కచ్చితంగా బహిరంగపరచాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను తినే ఆహారానికి సంబంధించి ఎవరు రూల్స్ తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సీఐఐ, హిందుస్థాన్ లీవర్ వంటి సంస్థలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యం వంటి ఏర్పాటు పలు సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని గుర్తించాలి. నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడం అవసరం, మేలు కూడా. చాలా ఏళ్లు వినియోగదారు సమూహాలు, ఆరోగ్య నిపుణులు ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ప్రత్యేకమైన లేబుల్ ఒకటి వేయాలని కోరుతున్నాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, పరిశ్రమ వర్గాలు రెండూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంకోవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశ్రమలు చేసే డిమాండ్లను నెరవేర్చడంలో చాలా చురుకుగానే ఉంటోంది. విటమిన్లు ఇతర పోషకాలను చేర్చిన ఆహారానికి ప్రత్యేకమైన లేబుల్ ఉండాలన్న పరిశ్రమ డిమాండ్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆగమేఘాలపై ఒప్పేసుకోవడం ఒక ఉదాహరణ.ఆహార పదార్థాల విషయంలో నియంత్రణ అధ్వాన్నంగా ఉంటే... పరిశ్రమ వర్గాల నిబంధనల పాలన కూడా అంతే తక్కువ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కాగ్ 2017 లోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను నిర్దేశించేందుకు సమయ బద్ధమైన ప్రణాళిక ఏదీ పాటించడం లేదని విమర్శించింది. అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, ఆహార పదార్థాలను పరిశీలించే ల్యాబొరేటరీలు 72లో 56 ల్యాబ్స్‌కు తగిన అక్రిడిషన్ సర్టిఫికెట్లు కూడా లేనవి ఎత్తి చూపింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన విషయంలో మరింత పారదర్శకత తీసుకు రావాల్సిన అవసరాన్ని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఆహార పదార్థాల విషయంలో కొంత జాగరూకతతో వ్యవహరించాలన్నది ఇప్పటికైనా గుర్తిస్తే అది ప్రజారోగ్యానికి మంచి చేయగలదని అర్థం చేసుకోవాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఆరోగ్యం మటాష్
సాక్షి, అమరావతి: ప్రాసెస్డ్, అల్డా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురి పెద్దల్లో ఒకరు, ప్రతి 8మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనపరులుగా మారుస్తోంది. ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్, రెడీ మీల్స్ (రెడీ టు ఈట్), ప్రాసెస్ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అడిక్షన్’ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్ ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. మద్యంతో సమానం ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కాహాల్ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్‌లో ఎక్స్ట్రా సెల్యులర్ డోపమైన్‌ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్టు తేల్చారు. తద్వారా తీవ్రమైన కోరికలు, స్థూలకాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక–మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. యూకే, యూఎస్‌లలో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణ కోసం ఏడాదికి 7 ట్రిలియన్ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థూలకాయం, నాన్–కమ్యూనికేబుల్ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాలలో గణనీయంగా పెరిగాయి. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులతోపాటు స్త్రీ, పురుషుల ఉద్యోగాలు, ప్రయాణ సమయాలు పెరగడంతో కొన్ని దేశాల్లో అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రాసెస్ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, నూడుల్స్, కృత్రిమ స్వీటెనర్లతో కార్డియో వాసు్కలర్, కార్డియో మెటబోలిక్ కోమోర్చిడిటీలు 9శాతం పెరుగుతోంది. అయితే రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని నివేదించింది. పౌష్టికాహార భద్రత లోపం ఇప్పటికే ఆసియా, లాటిన్ అమెరికాల్లో అత్యంత ప్రాసెస్‌తోపాటు సహా ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. ఇది ఆఫ్రికాకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కోవిడ్–19కి ముందు స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా పౌష్టికాహార లోపం భయపెడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 29.6 శాతం మంది (240 కోట్ల మంది ప్రజలు) 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 90 కోట్ల మంది (11.3 శాతం మంది) ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. ఇక 2030లో దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన చెందుతోంది. తొమ్మిది దక్షిణాసియా దేశాలలో పోషకాహార లోపం (24 కోట్ల మంది)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారత్‌లో పోషకాహార లోపం 2004–06లో 21.4 శాతం నుంచి 2020–22 నాటికి 16.6కి తగ్గింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడికక్కడ లభిస్తున్నాయి. నగరం/పట్టణం నుంచి 1–2 గంటలు, అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న గ్రామాల్లోనూ ఈ ఆహార విధానం వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
ఎక్కడికైనా వస్తుంది.. కల్తీని పట్టేస్తుంది
సాక్షి, అమరావతి: ఆహార కల్తీ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆహార కల్తీని సులభంగా గుర్తించేలా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరిట ల్యాబ్‌తో కూడిన మొబైల్ వాహనాలు త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. వీటిద్వారా ఆహార కల్తీని అప్పటికప్పుడే కనిపెట్టే సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. రెండు దశల్లో 14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలి దశలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం రీజియన్లకు ఒక్కొక్కటి, స్టాండ్ బై కింద ఒక వాహనం చొప్పున మొత్తం నాలుగు కొనుగోలు చేస్తున్నారు. ఇక రెండో దశలో 10 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. రెండు దశల్లో 14 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన పాత జిల్లా కేంద్రంలో ఒక్కొక్క వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో వాహనం కొనుగోలుకు రూ.45 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. తొలి దశలో 4 వాహనాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్ఐడీసీ) టెండర్లు ఆహా్వనించింది. ప్రతి వాహనంలో 80 రకాల పరీక్షలు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనంలో 80 రకాల పరీక్షలు చేసే సౌకర్యం ఉంటుంది. పాల కల్తీని నివారించడానికి యూరియా, డిటర్జెంట్, ఇతర రసాయనాలను కలిపారా? లేదంటే పాలల్లో కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ (ఘన పదార్థాలు) స్థాయిలను తెలుసుకోవడానికి మిల్క్ అనలైజర్ అందుబాటులో ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారేమో తెలుసుకోవడానికి టీపీసీ, ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ ఆనవాళ్లు పసిగట్టడానికి, ఉప్పులో అయోడిన్ వంటి పరీక్షలు చేయడానికి మ్యాజిక్ బాక్స్, టిష్యూపేపర్ టెస్ట్‌లు మొబైల్ ల్యాబ్‌లో నిర్వహించవచ్చు. డిజిటల్ మల్టీ పారామీటర్, హ్యాండ్ మిల్లీమీటర్ (పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీ ఫ్యాక్టో మీటర్, డిజిటల్ బ్యాలెన్స్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్క్రీనింగ్ తదితర పరికరాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి ఘటనల్లో నీటిలో బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించడానికి శాంపిళ్లను నిర్ధేశిత టెంపరేచర్లో భద్రపరిచి సెంట్రల్ ల్యాబ్‌కు తరలించడానికి వీలుంటుంది. కల్తీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. కల్తీని తక్షణమే పసిగట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న విధానంలో శాంపిళ్లు సేకరించి ల్యాబ్స్‌కు పంపి పరీక్షించి ఫలితాలు రావడానికి సమయం పడుతోంది. ఈ కాలయాపనకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌తో చెక్ పడుతుంది. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్, డయేరియా కేసులు నమోదైనప్పుడు సత్వరమే స్పందించడానికి మొబైల్ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. – జె.నివాస్, కమిషనర్, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ -
ఆహారం కల్తీ చేస్తే కఠినచర్యలు
మల్లాపూర్ (హైదరాబాద్): ఆహారకల్తీ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్టవ్యాప్తంగా నాలుగు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలను ప్రవేశపెట్టినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఫుడ్ లేబొలేటరీ ఆవరణలో మంత్రి హరీశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆహారంతోపాటు పాలు, నెయ్యి, పండ్లు తదితర వస్తువులలో కల్తీ జరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఈ వాహనాలను కేటాయించినట్లు చెప్పారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న వైద్యపరికరాలు సరిగాలేక కల్తీ ఫలితాలను తొందరగా రాబట్టలేకపోతుండటంతో నాచారంలో రూ.10 కోట్లతో అత్యాధునిక సాంకేతిక ల్యాబ్‌ను ప్రారంభించుకున్నామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య కూడా పెంచామన్నారు. కల్తీ చేసివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎవరైనా కల్తీ చేస్తే 040 – 21111111కు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కల్తీ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, అడిషనల్ డైరెక్టర్ శివలీల, ఏవో కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఆహారం కల్తీ చేస్తే జీవితాంతం జైల్లోనే!
భోపాల్: రోజు తినే ఆహారాన్ని కల్తీ చేయడం కొంతమందికి వ్యాపారంగా మారింది. అయితే దాన్ని అరికట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆహరాన్ని కల్తీ చేసే వారికి జీవితఖైదు శిక్ష విధించే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ కేబినెట్ కొత్త చట్టాన్ని రూపొందించింది. ‘మిలావత్ పే కసావత్’ నినాదంలో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్లు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా శనివారం మీడియాకు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గతంలో ఆహర పదార్థాలు కల్తీ చేసేవారికి ఆరు నెలల జైలు శిక్ష విధించేవారు. ఆ తర్వాత దీన్ని మూడేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆహారం కల్తీ చేసేవారికి మంత్రి వర్గం జీవితఖైదు విధించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇకపై తయారీ తేదీ ముగిసిన వస్తువులను అమ్మేవారికి విధించే శిక్షలను కూడా మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. ఇక కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సూచించారు. ఆహరం కల్తీ క్షమించరాని నేరమని, ఇది ప్రజల ఆరోగ్యాన్నితీవ్రంగా ప్రభావితం చేస్తొందని ఆమె అన్నారు. చదవండి: దత్తత పుత్రుడిని ఆశ్చర్యపర్చిన కేంద్రమంత్రి -
దాడులు చేస్తున్నా మార్పేదీ..?
నెల్లూరు(సెంట్రల్): అధికారులు వరుస దాడులు జరుపుతూ.. కేసులు నమోదు చేస్తున్నా పలువురి తీరులో ఎలాంటి మార్పు రావడంలేదు. ఇష్టానుసారంగా నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయాలు సాగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆహార పదార్థాల్లో 80 శాతం వరకు కల్తీ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లాలో ఎక్కడో ఒక చోట నిత్యం తనిఖీలు చేస్తున్నా, కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. పాలు, నెయ్యినీ కల్తీ చేస్తుండటం గమనార్హం. కఠినంగా చట్టాలు ఆహార భద్రత ప్రమాణాల 2006 సెక్షన్ 37 చట్టం మేరకు కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసే వారిని తనిఖీ చేసే పూర్తి బాధ్యతలను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. సెక్షన్ 41 ప్రకారం కల్తీ చేసే వారిపై కేసుల నమోదు, సీజ్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు చేయొచ్చు. 2011 నుంచి వివిధ శాఖలకు అనుబంధంగా ఉన్న ఫుడ్‌సేఫ్టీని విభజించి ఇతర శాఖలతో సంబంధం లేకుండా ప్రత్యేక ఫుడ్‌సేఫ్టీ విభాగంగా మార్చారు. 85 కేసుల నమోదు ఇటీవలి కాలంలో జిల్లాలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి కల్తీ చేస్తున్న వారిని గుర్తించి 85 కేసులు నమోదు చేశారు. ఇందులో 75 కేసుల వరకు జాయింట్ కలెక్టర్ వద్దకు పంపారు. నిల్వ ఉన్న మాంసాహారం, నీటి ప్యాకెట్లు, నెయ్యి, తదితరాలపైనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. అధికారులు తనిఖీలు చేస్తున్నా, తయారీదారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. సత్వరమే కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చూస్తే వీరిలో మార్పొచ్చే అవకాశం ఉంది. కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికరంగా, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అనుమానం ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఆహార నిల్వలపై రోజూ తనిఖీలు చేస్తాం.– శ్రీనివాస్, ఫుడ్ సేఫ్టీ అధికారి -
పసుపు..కారం..కాదేదీ కల్తీకనర్హం!
సాక్షి సిటీబ్యూరో: యూరియాతో పాలు, ఇనుప రజను పౌడర్‌తో టీ పొడి..ఇటుక పొడితో కారం..బట్టల సోడాతో చక్కెర..మోటానిల్‌తో పసుపు పౌడర్, జంతువుల కొవ్వుతో వంట నూనె..నాసిరకం వస్తువులతో అల్లం వెల్లుల్లి పేస్ట్...డూప్లికేట్ ఇంజిన్ ఆయిల్స్...ఇలా సిటీలో సర్వం కల్తీ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని అక్రమార్కులు కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి మార్కెట్లోకి జొప్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరినీ అనుమతించకుండా..నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యధేచ్చగా నడుస్తున్నాయి. దాదాపు సరుకులన్నీ... చిన్న పిల్లకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నూనె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువులు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు సైతం డూప్లికేట్ అవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకిలీవి తయారవుతున్నాయి. నగర శివారు నుంచే... నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుతోంది. రాచకొండ, సైబరాబాద్ ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్, జల్పల్లి, షాహీన్ నగర్, బాలాపూర్ శివారు, శ్రీరాంనగర్ కాలనీ, మీర్పేట్, నాదర్‌గూల్, బడంగ్పేట్, కందుకూర్, మామిడిపల్లి, హయాత్‌నగర్, పెద్ద అంబర్పేట్, ఆదిభట్ల, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. . ఇక్కడ రూ.50 విక్రయించే వస్తువును పది రూపాయలకే తయారుచేస్తున్నారు. డూప్లికేట్ ప్యాకింగ్‌తో లారీల ద్వారా బస్తీలు, కాలనీలు, గ్రామాలకు తరలిస్తున్నారు. చిన్నా చితక కిరాణా షాపులకు తక్కువకే విక్రయిస్తున్నారు. వ్యాపారులకూ పాత్ర కొందరు వ్యాపారులు సైతం కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. కల్తీ మాఫియా సంబంధిత అధికారులనే మేనేజ్ చేసుకొని తమ దందాను కొనసాగించడానికి నగర శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. నిత్యవసర వస్తువుల తయారీ పేరుతో పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని మాటున నకలీ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఫుడ్స్ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం..కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్ చేయించుకోవడం.. ఇక పై దందా షురూ! ఓ భారీ షెడ్.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్ చేసుకొవడం...ఇలా కల్తీ వ్యాపారం మూడు పొట్లాలు ఆరు ప్యాకెట్లుగా కొనసాగుతుంది. ఏటేటా పెరుగుతున్నా... కల్తీ ఆహార పదార్థాల కేసులు ప్రపంచంలో ఏటా లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కల్తీ పదార్థాలు తినడం వల్ల ఏటా దాదాపు 30 లక్షల మంది మర ణిస్తున్నారని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. 2011–12లో 13 శాతం ఉన్న కల్తీ వ్యాపారం 2018–19 నాటికి 26 శాతానికి పెరిగింది. దీనికి కారణం అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ లోపించడమే. కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా,యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. పోలీసులు దాడులు పెరగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. -
ఇక్కడ ప్రతి ఆహార పదార్థం కల్తీ!
సాక్షి, చీరాల(ప్రకాశం): కల్తీ ఆహార పదార్థాలకు చీరాల మల్టీ బ్రాండ్‌గా మారింది. ఉప్పు..పప్పు.. కారం.. టీ పొడి నుంచి ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారింది. అయితే కల్తీలన్నింటిలో నూనెలదే పైచేయిగా ఉంది. పైకి బ్రాండెడ్ కంపెనీల పేరుతో లోపల మాత్రం నాణ్యతలేని నాసిరకం నూనెను నింపి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. బ్రాండెడ్ వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి వచ్చే నీటిని కలిపి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు జరిపితే చీరాలలోని నూనె వ్యాపారులు అంతా దుకాణాలు సర్ది పరారయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం చీరాల పట్టణంలో ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతో కల్తీ నూనెలను విక్రయిస్తున్న దుకాణంపై అధికారులు దాడులు చేశారు. అక్కడ వేరుశనగ నూనె కావాలని కోరిన గ్రామీణులకు వ్యాపారులు కల్తీ నూనెనే విక్రయిస్తున్నారు. నూనె వ్యాపారుల కాసుల కక్కుర్తికి కొందరు అధికారులు తోడుగా నిలిచి నామమాత్రంగా కూడా తనిఖీలు చేయకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. వేరుశనగ నూనెలో పత్తి గింజల నుంచి తీసిన నూనెను కలిపి చీరాల్లోని వ్యాపారులు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటుగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విడి వినియోగం ఎక్కువే.. చీరాల ప్రాంతంలోని బార్లు, రెస్టారెంట్లు, ఖానా ఖజానాలు, హోటళ్లు, మెస్లల్లో వంటకాల తయారీకి, తోపుడు బండ్లలో పిండివంటలు చీరాల్లోని నూనె దుకాణాలు, గానుగల నుంచి వంట నూనెలను కొనుగోళ్లు చేస్తున్నారు. ఒక్క చీరాల ప్రాంతంలోనే వీటి ద్వారా నెలకు రూ.90 లక్షలకు పైగా వ్యాపారాలు చేస్తుంటారు. తినుబండారాలు, ఆహార పదార్థాలు విక్రయించే వారు అధికంగా నూనె వినియోగిస్తుంటారు. ఆహార పదార్థాలను తయారు చేసినప్పుడు మిగిలిన నూనెను మరుసటి రోజు వాడకుండా పారబోయాలని నిబంధనలు ఉన్నా వ్యాపారులు పట్టించుకోకుండా ఆ నూనెలను వాడుతూనే ఉన్నారు. కల్తీ నూనెలతో వ్యాపారాలు చేసే వారికి కనీసం 95 శాతం మందికి లైసెన్స్‌లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కల్తీ నూనెలతో వంటపదార్థాలు తయారు చేసిన వ్యాపారులకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉన్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నెలకు రూ.కోటికి పైగా విక్రయాలు కల్తీ నూనె విక్రయాలు నెలకు దాదాపుగా రూ. కోటి వరకు విక్రయాలు జరుగుతున్నాయంటే కల్తీ వ్యాపారం ఇక్కడ ఎంత జోరుగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చీరాల్లో 30 వరకు ప్రత్యేక నూనె దుకాణాలు ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు కల్తీ నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. చీరాల నుంచి తయారైన కల్తీ నూనెను చీరాల, పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ నూనెల విక్రయాల్లో కనీసం 10 శాతం మేరకు ఇతర నూనెలు కలిపి నాసిరకం నూనె, విడినూనెలను బ్రాండెడ్ కంపెనీల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ కల్తీ నూనె తయారీ, అమ్మకాల్లో దర్బార్ రోడ్డు, సంతబజారు, రామమందిరం వీధిలోని నూనె దుకాణాలు, కొన్ని హోల్‌సేల్ కిరాణా వ్యాపారులు కీలకపాత్ర పోసిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రత్యేక నూనె దుకాణాలు ఇతర ప్రాంతాల నుంచి పత్తి గింజల నూనె, పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెలను డ్రమ్ముల్లో చీరాలకు దిగుమతి చేసుకుని వేరుశనగ నూనెలో కల్తీలు చేసి బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని నాసిరకం నూనెల డ్రమ్ములను దిగుమతి చేసుకుని ప్రజలకు బ్రాండెడ్ పేరుతో అమ్మకాలు చేస్తున్నారు. కల్తీ పక్కకు.. అసలు పరీక్షలకు..! ఆహార భద్రతాధికారులు ప్రతినెలా నూనెలను తనిఖీలు చేయాల్సి ఉండగా వారు వచ్చే సరికి వ్యాపారులు కల్తీ నూనెల డ్రమ్ములను పక్కనబెట్టి బ్రాండెడ్ నూనెలను చూపించి వాటిని పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. అక్రమ, కల్తీ వ్యాపారాల్లో అధికారులు పాత్ర కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నూనెలను కొనుగోళ్లు చేసిన హోటళ్లు, మెస్‌లు, పిండివంటల తయారీదార్లు నుంచి అధికారులు శాంపిళ్లు తీసుకుని పరీక్షలకు పంపిస్తే కల్తీ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది. కలీలకూ చెక్ పడుతుంది. కానీ ఆహారభద్రతా అధికారులు మాత్రం కేవలం బ్రాండెడ్ నూనెలను ల్యాబ్‌లకు పంపించడం వలన కల్తీ నూనె విషయం తెలియడం లేదు. అనారోగ్యం తప్పదు కల్తీ ఆహార పదార్థాలను భుజించడం వలన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వంట నూనెల్లో కల్తీ వలన హృద్రోగ, రక్తనాళ సంబంధిత వ్యాధులు, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. కొవ్వు పెరిగి రక్తపోటు, కొన్ని సందర్బాల్లో గుండెపోటు, మొదడు పోటు వచ్చి ప్రాణాలను హరించివేస్తుంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పరిశుభ్రత లోపిస్తే అతిసారం, ఫుడ్‌పాయిజనింగ్, జీర్ణకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. డాక్టర్ ఎన్.రాజ్‌కుమార్, చీరాల -
కల్తీ తిండి.. ఆరోగ్యానికి గండి
సాక్షి, బీబీపేట(నిజామాబాద్) : రంగు రంగుల ప్యాకెట్లలో ఆకట్టుకునే తినుబండారాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. విషతుల్యమైన రసాయనాలతో తయారు చేసిన ఆయా ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలాంటి అనుమతి లేకుండా రకరకాల పేర్లతో కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో విరివిగా హోల్‌సేల్ షాపుల్లో తినుబండారాల ప్యాకెట్లను జోరుగా విక్రయిస్తున్నారు. ప్రతీ రోజు రూ.వేలల్లో వ్యాపారం పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఈ ప్యాకెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. నిత్యం రూ.వేలల్లో వ్యాపారం కొనసాగుతోంది. నాసిరకమైన ఉత్పత్తులను నగరాల నుంచి దిగుమతి చేసుకొని జోరుగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాల వరకు సైతం కల్తీ ఆహార పదార్థాల రంగు రంగుల ప్యాకెట్లు విస్తరించాయి. ప్రభుత్వ పాఠశాలల ఎదుట ఏర్పాటు చేసిన చిల్లర దుకాణాల్లో కేవలం ఒకటి రెండు రూపాయలకే ఆయా ప్యాకెట్లు లభిస్తున్నాయి. మార్కెట్లో బ్రాండ్ కంపెనీలను తలపించేలా రంగురంగుల బొమ్మలతో ప్యాకింగ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తినుబండారాలకు రంగులు, చాట్ మాసాలా వేసి రంగులు రుచిని జోడిస్తున్నారు. ఈ కల్తీ ఆహార పదార్థాలు తింటున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టించుకోని ఆరోగ్యశాఖ.. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా జరుగుతున్నా సంబంధిత ఆహార కల్తీ నియంత్రణ, ఆరోగ్యశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోడంతో చిన్నారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మారుమూల గ్రామాలకు సంబంధిత అధికారులు రాకపోవడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో ఏ షాపులో చూసినా రంగురంగుల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఒకటి ఆరా తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇక, పల్లెల వైపు అయితే కన్నెత్తి చూడడం లేదు. దీంతో గ్రామాలల్లోకి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరోగ్యానికి హానికరం.. మార్కెట్లో లభించే తినుబండారాలు చిన్నారులకు ఎంతో హాని కలిగిస్తున్నాయి. రంగు రంగుల ప్యాకింగ్లతో చిన్నారులను ఆకర్షించేలా ప్యాకెట్లు రూపొందించి వ్యాపారులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాసిరకం వస్తువులతో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తుండడంతో ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపుతోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల చిన్నారులకు రకరాకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం.. కల్తీ తినుబండారాలు తినడంతో ఆకలి సరిగా కాకపోవడం, కడుపులో నట్టలు తయారు కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి. రంగు రంగుల ప్యాకెట్లతో ఆకర్షించే కల్తీ పదార్థాలను కొనివ్వకూడదు. పిల్లలకు పోషక ఆహారాలను అందించాలి. – డా.ప్రవీణ్‌కుమార్, బీబీపేట -
హోటళ్లలో తనిఖీలు
కర్నూలు: హోటళ్లలో ఆహార పదార్థాల కల్తీపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. హోటళ్లలో పాచిపోయిన పదార్థాలు, రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు ఆదేశాల మేరకు అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలోని పలు హోటళ్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విక్టరీ టాకీస్ సమీపంలోని హిందూస్థాన్ హోటల్ గ్రాండ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. కిచెన్, డీఫ్రిజ్, డైనింగ్ రూం తదితర వాటిని పరిశీలించారు. కిచెన్‌లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు లోపాలు గుర్తించారు. ప్లేట్లు సరిగా శుభ్రం చేయకుండా వాడుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. పరిశుభ్రతకు సంబంధించిన విషయాలపై హోటల్ యజమానికి తగిన సూచనలిచ్చారు. ఆహార పదార్థాల నిల్వల్లో లోపాలను గుర్తించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా హోటల్ యజమానికి పై చర్యలుంటాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాసరెడ్డి, ఏఏఓ షన్ముఖ గణేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మినారాయణ, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, రాముడు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ హోటల్లో.. కర్నూలు ఆర్టీసీ బస్టాండులో ఉన్న బాలాజీ హోటల్లో విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. హోటలోని కిచెన్ రూం, డైనింగ్ సెక్షన్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. హోటల్లో పరిశుభ్రత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంపిల్స్ సేకరణలో వచ్చిన నివేదికల ఆధారంగా హోటల్ నిర్వాహకులపై చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు. వాహనాల తనిఖీ.. జిల్లాలో అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు. కర్నూలు యూనిట్ బృందం గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్‌తో వెళ్తున్న 31 వాహనాలను తనిఖీలు నిర్వహించి తదుపరి చర్యలు నిమిత్తం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. లైమ్‌స్టోన్, ఇతర మెటీరియల్‌ను తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేసి, రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. వారి నుంచి రూ.4.62 లక్షలు అపరాధ రుసుం వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. తనిఖీల్లో సీఐ లక్ష్మయ్యతో పాటు ఏఈ మధు, సిబ్బందిపాల్గొన్నారు. -
ఘుమ ఘుమల వెనుక.. ఘాటైన నిజాలు..!
నోరూరించే రుచులు.. ఘుమ ఘుమలాడే సువానలు.. పెద్దపెద్ద హోటళ్లు.. ఫుట్‌పాత్‌లపై ఉండే హోటళ్లు.. భోజనశాలల్లో వంటకాలను చూస్తే ఆగలేని పరిస్థితి. ఈ జిహ్వాచాపల్యాన్ని కాస్త అదుపుచేసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. తింటున్న మాంసం మంచిదేనా.. అంటే..? ఏమో అని దిక్కులు చూడాల్సిన పరిస్థితి జిల్లాలో పలుచోట్ల ఎదురవుతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా మాంసాహారాన్ని నిల్వ ఉంచుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిల్వ మాంసానికే రంగులద్ది మళ్లీమళ్లీ నూనెలో వేయించి.. వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తున్నారు. వాటిని ఎక్కువగా తినేవారిపై ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. సాక్షి, సూర్యాపేట : మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జిల్లాలో అధిక శాతం బయటి తిళ్లకు మక్కువ చూపుతున్నారు. అన్ని రోజుల్లోనూ మాంసాహారానికి గిరాకీ ఉంటుంది. ఇదే అదునుగా రోగాలభారిన పడిన జంతువుల మాంసాన్ని సైతం వంటకాల్లో కలిపేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ పట్టణాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అడ్డగోలు వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. నిల్వ మాంసంతో పాటు నాసిరకం నూనెలు, అనుమతిలేని రంగులు మితిమీరి వాడకం ఎక్కువైపోయింది. నాణ్యత ప్రశ్నార్థకం.. నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, పంచాయతీల్లో జంతువధ శాలల నిర్వహణ సమర్థంగా సాగాలి. మూగజీవాలను వధించే ముందురోజు వాటి ఆరోగ్య పరిస్థితి పరీక్షించి, అంతా సవ్యంగా ఉంటేనే వధించాలి. జిల్లాలో చూస్తే జంతువధ శాలల్లో ఒకటిరెండు ముద్రలు వేయించుకుని, తెరవెనుక మిగిలినవి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్నవీ విక్రయించేస్తున్నారు. కోడి మాంసం విక్రయించే దుకాణాల్లో కనీస శుభ్రత ఉండడం లేదు. అదే నీటిలో పదేపదే కోళ్లను కడగడం.. చర్మం తీసి అందులోనే ఎ క్కువ సేపు ఉంచడంతో బ్యాక్టీరియా సోకే ఆస్కా రం ఉంటోంది. దుకాణాల్లో కనీస రక్షణగా అద్దాలు.. జాలీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వేలాడదీసిన మాంసంపై ఈగలు వాలుతున్నాయి. ధుమ్ము దూళి తాకి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వండిన వంటకాలదీ అదే పరిస్థితి జాడలేని అధికారుల తనిఖీలు జిల్లాలో పలు హోటళ్లలో మాంసం నిల్వలో ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు.. కొన్ని చోట్ల మాంసం బూజుపట్టడం.. నిషేధిక రంగుల వాడకాన్ని వినియోగిస్తున్న హోటళ్లపై నిఘా ఉంచాల్సిన సంబంధిత శాఖ అధికారులే జాడ లేకుండా పోయింది. కేవలం నెలకోమారు వారికి అవసరమున్నప్పుడే మాత్రమే పెద్దపెద్ద హోటళ్లతో కుమ్మకై వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. కొన్ని హోటళ్ల నుంచి ఏకంగా మామూళ్లు వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలోని హోటళ్లతో పాటు జాతీయ రహదారిపై ఉన్న దాబా హోటళ్లను తనిఖీ చేయాలని ఆహారప్రియులు వేడుకుంటున్నారు. -
ఒకే ఒక్కడు..!
నల్లగొండ టూటౌన్ : మార్కెట్లో రోజురోజుకూ ఆహార పదార్థాల కల్తీ రాజ్యమేలుతోంది. ప్రతిదాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నా తనిఖీలు చేసి పట్టుకొనే వారు లేకపోవడం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉన్నా అక్కడ ఉద్యోగుల కొరత ఉండడంతో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టాల్సిన శాఖలో ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నల్లగొండలో ఉన్న కార్యాలయంలో కేవలం ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. ఆయనకు ఖమ్మంలో అదనపు బాధ్యతలు అప్పగించారు. దాంతో అక్కడ మూడు రోజులు, ఇక్కడ మూడు రోజులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక్కడ పని చేసే మూడు రోజులు కోర్టుల్లో ఉన్న కేసుల చుట్టూ తిరగడానికి సమయం సరిపోతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా యాదాద్రిభవనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ ఉన్నా అక్కడ గెజిటెడ్ స్థాయి అధికారి లేకపోవడంతో ఆ జిల్లాల్లో కూడా ఈయనే పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్తీలపై చర్యలేవీ? జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా కల్తీ జరిగితే ఫిర్యాదు చేయడానికి కార్యాలయంలో దరఖాస్తులు తీసుకునే బాధ్యత గల ఉద్యోగి లేకపోవడం గమనార్హం. కార్యాలయంలో కేవలం ఒక మహిళా అటెండర్, ఒక పార్ట్ టైం ఉద్యోగి మాత్రమే ఉన్నారు. కల్తీల గురించి సమాచారం ఇవ్వాలన్నా, వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా అక్కడ ఏ ఒక్క ఉద్యోగికి విషయ పరిజ్ఞానం లేదు. గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఒక్కడే అన్ని విధులు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్కా అమ్మకాలు, ఆయిల్ మిల్లుల్లో కల్తీ అమ్మకాలు జరుగుతున్నా వాటి గురించి పట్టించుకునే వారే లేరని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆయిల్ మిల్లుల్లో గత ఏడాది తనిఖీలు చేసినా నేటికి వాటిపై చర్య తీసుకోకపోవడం చూస్తే ఆహార కల్తీ నియంత్రణ శాఖ పని తీరు ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. కొరవడిన నిఘా.. జిల్లాలో కల్తీ మాయాజాలం జోరుగా సాగుతున్నా వాటిపై నిఘా లేకపోవడం వ్యాపారులకు ఎంచక్కా కలిసి వస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారుల తనిఖీలు లేక కల్తీలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద, పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పాలు, ఆయిల్ మిల్లులు, బ్రెడ్ కంపెనీల్లో కల్తీ ఎక్కువగా జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. ఉన్నతాధికారులు స్పందించి ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసి జిల్లాలో కల్తీ వ్యాపారాన్ని నియంత్రించాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. కల్తీ చేస్తే చర్యలు తప్పవు ఆహార పదార్థాలను కల్తీ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. కల్తీలపై ఫిర్యాదులు చేస్తే కార్యాలయంలో పార్ట్‌టైం ఉద్యోగి స్వీకరిస్తారు. నేను నల్లగొండతో పాటు ఖమ్మంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. – ఖలీల్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, నల్లగొండ -
కల్తీపై ‘పిడి’కిలి!
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేవారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించింది. ఆహార నియంత్రణ విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తోంది. ఆహార నాణ్యతా నియంత్రణ విభాగం సిబ్బంది కొరతతో అవస్థలు పడుతోంది. కనీసం ఆహార నమూనాలను సేకరించే పరిస్థితి కూడా లేదు. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష మంది జనాభాకు ఒకరు చొప్పున ఆహార నియంత్రణ అధికారి ఉండాలి. ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు అధికారులు ఉండాలి. 15 జిల్లాల్లో నియంత్రణ అధికారుల్లేరు... రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 మంది ఆహార నియంత్రణ అధికారులున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురు, 15 జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. మరో 15 జిల్లాల్లో ఆహార నియంత్రణ విభాగమేలేదు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో ఆహార కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. ఏది కల్తీయో, ఏదీ నాణ్యమైన పదార్థమో తెలియని పరిస్థితి ఉంది. కల్తీ నియంత్రణ దాదాపు లోపించింది. ఆహార కల్తీపై ఇటీవల హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీ నియంత్రణకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారో తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 23న దీనిపై హైకోర్టుకు నివేదించాల్సి ఉండగా వాయిదా పడింది. హైకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పాలుపోవడంలేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఏడాది క్రితమే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఆహార నియంత్రణ అధికారి ఉన్న జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్(ముగ్గురు), వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్. -
ఆహార కల్తీ కట్టడిలో విఫలం
సాక్షి, హైదరాబాద్ : పండ్లు, ఇతర ఆహార పదార్థాల కల్తీకి అడ్డుకట్ట వేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, దృఢ సంకల్పం లేకపోవడం వల్లే కల్తీ వ్యాపారులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించింది. పండ్లను, ఆహార పదార్థాలను భయం భయంగా తినాల్సిన పరిస్థితులు ఉన్నాయని.. ఏది కల్తీయో, ఏ పండును రసాయనాలతో మగ్గించారో.. ఏది తింటే ఏమవుతుందో తెలియడం లేదని పేర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే అందరం విషపూరిత ఆహారాన్ని తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. వ్యాపారులకు డబ్బు, లాభాపేక్షే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టడం లేదని.. వారిని కఠినంగా శిక్షించే యంత్రాంగమేదీ లేకపోవడమే దీనికి కారణమని పేర్కొంది. ఆహార కల్తీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించాలని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి, తమ ముందుంచాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు కల్తీ ద్వారా ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు విచ్చలవిడిగా కార్బైడ్ వినియోగిస్తున్న తీరుపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజాప్రయోజ వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ కేసులో కోర్టు సహాయకారిగా (అమికస్ క్యూరీ) వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆహార కల్తీకి సంబంధించి అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని కోర్టుకు విన్నవించారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి కేవలం 48 మంది ఆహార తనిఖీ అధికారులు మాత్రమే ఉన్నారని.. అదే తమిళనాడులో ఏకంగా 521 మంది, చిన్న రాష్ట్రమైన గోవాలోనూ 24 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5న ఈ కేసు విచారణకు వచ్చిన తరువాతే.. అధికారులు మేల్కొని ఆయా మార్కెట్లలో తనిఖీలు చేశారని, ఈ ఏడాది చేపట్టిన మొదటి తనిఖీలు ఇవేనని కోర్టుకు తెలిపారు. ఇక ఆహార భద్రత చట్టం కింద అధికారుల నియామకాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం వివరించారు. గత విచారణ సందర్భంగా ఏపీలో 622 మంది అధికారులను నియమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కోర్టుకు చెప్పారని... కానీ తాత్కాలిక పద్ధతిలో 29 మందిని మాత్రమే నియమించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నెలకు మూడు తనిఖీలేనా..? విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. అధికారులు నెలకు మూడే తనిఖీలు చేసినట్లు అర్థమవుతోందంటూ.. తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉండాలని స్పష్టం చేసింది. కార్బైడ్ ఉపయోగించిన పండ్లను తింటే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదుల వివరణను ధర్మాసనం తప్పుబట్టింది. ‘‘అవగాహన కల్పించడం సమస్యకు పరిష్కారం కాదు. అసలు మనం కొనే పండు కార్బైడ్ వాడి మగ్గబెట్టిందా? కార్బైడ్ వాడనిదా? అన్న విషయం ఎలా తెలియాలి? ఎలా గుర్తించాలి? ఇందుకు ఓ విధానం ఉంటే తప్ప ప్రయోజనం ఉండదు..’’అని స్పష్టం చేసింది. అసలు ఇప్పటివరకు ఎంత మంది కల్తీ వ్యాపారులను జైలుకు పంపారంటూ.. కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎప్పటికి మారుతుందని నిలదీసింది. -
రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న కేంద్రం ఇందుకోసం అగ్రిటెక్ స్టార్టప్స్ భాగస్వామ్యం అవసరమని గుర్తించింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ గ్రాండ్ చాలెంజ్‌ను ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో 12 కీలక అంశాల్లో రైతులు ఎదుర్కొనే వివిధ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలని ఔత్సాహికులు, స్టార్టప్స్ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగాన్ని లాభాలబాట పట్టించేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అలా ముందుకు వచ్చే స్టార్టప్స్‌కు అవసరమైన ఆర్థికసాయం అందించేందుకు కూడా సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి వసతి లేకపోవడం, పెట్టుబడులు పెట్టే స్థితి లేకపోవడం వంటి కారణాలు రైతును అప్పులబాట పట్టిస్తున్నాయి. ఇదేకాక సాగు ఖర్చు పెరగడం, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం, ఫలితంగా ఉత్పాదకత పెరగకపోవడం తదితర కారణాలతో పంట గిట్టుబాటయ్యే పరిస్థితులు కొరవడ్డాయి. ఈ నేపథ్యంలో 12 కీలక అంశాల్లో వినూత్న ఆలోచనలు చేసి రైతులకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రిటెక్ స్టార్టప్స్ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. 12 కీలక అంశాలేంటంటే? - భూసార పరీక్షలను మరింత సరళీకృతం చేయడం. ఇష్టారాజ్యంగా ఎరువులు, పురుగు మందులు చల్లుతుండటంతో సాగు ఖర్చు భారీగా పెరుగుతోంది. సాగు ఖర్చు తగ్గాలంటే భూసార పరీక్షలు జరగాలి. అప్పుడే ఎంతమేర ఎరువులు అవసరమో తెలుస్తుంది. - ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ–నామ్)లో లోపాలను సరిదిద్ది రైతుకు మరింత ప్రయోజనకారిగా మార్చాలి. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతుంది. - ఈ–నామ్‌కు అనుగుణంగా ఈ–మార్కెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని కేంద్రం భావిస్తోంది. అందుకు స్టార్టప్స్ కృషిచేయాలని కోరుతోంది. - పంట సాగు సమయంలోనే ధరను అంచనా వేయడం. సాగు చేసే సమయంలో ఒక్కోసారి పంట ధర అధికంగా ఉంటోంది. పంట చేతికొచ్చాక మార్కెట్లోకి అడుగిడే సరికి ధర పతనమవుతోంది. ఇది రైతును నిలువునా ముంచుతోంది. ఒక ఏడాది ధర అధికంగా ఉంటే, మరోసారి తక్కువగా ఉంటుంది. దీనికి కారణాలను సాగు సమయంలోనే అంచనా వేసే పరిస్థితి ఉంటే రైతు నష్టపోడు. ఈ నేపథ్యంలో సాగు సమయంలోనే ధరను అంచనా వేసేలా స్టార్టప్స్ ముందుకు రావాలని కేంద్రం కోరింది. - కేంద్ర రాష్ట్రాలు అనేక వ్యవసాయ పథకాలను అమలుచేస్తున్నాయి. కానీ ఆయా పథకాల వివరాలు రైతుకు పూర్తిస్థాయిలో చేరడంలేదు. దీంతో రైతు నష్టపోతున్నాడు. పథకాలను రైతులకు ఎప్పటికప్పుడు చేరవేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు స్టార్టప్స్ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి. - ఉత్పాదకతను అంచనా వేయడంలో ఇప్పటికీ అశాస్త్రీయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. పంట కోత ప్రయోగాలంటూ నెలల తరబడి చేస్తున్నారు. దీనివల్ల రైతుకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందడంలేదు. పంట ఉత్పాదకతను అంచనా వేసేలా శాటిలైట్ ఆధారిత వ్యవసాయ–వాతావరణ కొలమానాలు అవసరం. ఇందులో అగ్రిటెక్ స్టార్టప్స్ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి. - రైతు ఆదాయం పెరగడం.. పంటల నష్టాలను అరికట్టడం కోసం వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముంది. అందుకోసం శాస్త్ర పరిజ్ఞానం కీలకం కావాలి. ఇందులోనూ స్టార్టప్స్ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి. - ఆహార కల్తీ వల్ల వినియోగదారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కల్తీని అరికట్టడానికి వినూత్న పరిజ్ఞానాన్ని తీసుకురావాలి. హా కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల వ్యవసాయ సంబంధిత పరికరాలు, ఇన్పుట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, అవసరమైన ఎరువులు, పురుగుమందుల ఎంపిక అంతా ఇక్కడే జరిగేలా ఈ కేంద్రాలను వినూత్నంగా తీర్చిదిద్దాలి. హా గడ్డి తగలబెట్టడాన్ని నిరోధించాలి. దాన్ని ప్రత్యామ్నాయ అవసరాలకు ఎలా ఉపయోగించాలన్న పరిజ్ఞానాన్ని కనుగొ నాలి. హా ప్రమాదకరమైన పురుగు మందు లు, కీటక నాశినిలతో రైతులకు, పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పంట కోతకు ముందు, తర్వాత జరిగే నష్టాలను నివారించాలి. హా పంటల ఉత్పాదకత పెంచే చర్యలపై స్టార్టప్స్ దృష్టిసారించాలి. తక్కువ ఖర్చు, సులువైన పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. తద్వారా పంటల ఉత్పాదకతను పెంచాలి. -
ఆహార కల్తీపై ‘నియంత్రణ’ ఏదీ..?
► ఆహార నియంత్రణ శాఖను పట్టించుకోని ప్రభుత్వం ► రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది 20 మంది ఉద్యోగులే సాక్షి, హైదరాబాద్: కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఆహార కల్తీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తోంది. ఎలాంటి కల్తీలు జరిగినా బాధ్యులపై పీడీ చట్టం ప్రయోగించాలని చెబుతోంది. అయితే ఆహార నాణ్యతను పర్యవేక్షించే ఆహార నియంత్రణ శాఖను మాత్రం పట్టించుకోవడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండే ఆహార నియంత్రణ విభాగాన్ని అరకొర సిబ్బంది సమస్య వేధిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆహార నమూనాలను వెంటనే సేకరించే పరిస్థితి ఎక్కడా లేదు. కనీసం జిల్లాకు ఒక్క అధికారి కూడా లేని పరిస్థితి. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఆహార నియంత్రణ అధికారి ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార నియత్రణ అధికారి ఉండాలి. అయితే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. ఆహార నియంత్రణ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్నారు. మిగిలిన 17 మంది జిల్లాల్లో ఉన్నారు. ఈ లెక్కన ఆహార నియంత్రణ విభాగం లేని జిల్లాలో 13 ఉన్నాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గదర్శకాల ప్రకారం కాకున్నా.. నగరపాలక సంస్థలు మినహా ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు చొప్పున అధికారుల ఉండాల్సిన అవసరం ఉంది. నమూనాలు ఎట్లా.. నీరు, ఔషధాలు, మద్యం.. మినహా మనుషులు తీసుకునే ప్రతి ఆహార పదార్థం నాణ్యత పర్యవేక్షణ బాధ్యత ఆహార నియంత్రణ విభాగం పరిధిలోనే ఉంటుంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. అయితే నాణ్యత విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే నమూనాలను సేకరించే పరిస్థితి లేదు. ఆహార నియంత్రణ అధికారి ఒక్కరే ఉన్న జిల్లాలు వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, వికారా బాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజా మాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్. -
ఆ ఆహారంపై ప్రకటనలివ్వండి
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార కల్తీపై సర్కారుకు హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: ఎక్కడైతే ఆహార కల్తీ జరిగినట్లు తేలుతుందో.. ఆ హోటల్, రెస్టారెంట్లలోని ఆహారం తినేందుకు ఎంతమాత్రం పనికిరాదంటూ పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రజలందరికీ తెలియచేయాలని రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అంతేగాక ఆహార కల్తీకి పాల్పడినవారి ట్రేడ్ లెసైన్స్‌ను సైతం రద్దు చేయాలని స్పష్టం చేసింది. అప్పుడే ఆహార కల్తీకి కొంతమేరకు అడ్డుకట్ట వేయగలుగుతామని అభిప్రాయపడింది. ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రస్తుత చట్టాలు ఏం చెబుతున్నాయి? మీరెటువంటి చర్యలు తీసుకుంటున్నారు.. తీసుకోబోతున్నారు.. తదితర వివరాల్ని తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో అమ్ముతున్న తినుబండారాలపై అధికారుల పర్యవేక్షణ లోపించిందని, ఆహారం కల్తీపై అధికారులు పట్టించుకోవట్లేదంటూ న్యాయవాది ఐ.ఎం.అహ్మద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మరోసారి విచారించింది. -
ఆహార కల్తీపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆహార కల్తీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహారాన్ని కల్తీ చేస్తే కఠిన శిక్షలు విధించే విధంగా చట్టాలు చేయాలని కూడా కోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. పాల కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆహార భద్రతా చట్టాల సవరణ అంశం పరిశీలించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన చేసింది. ఆహారాన్ని కల్తీ చేస్తే జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని మార్చాలని కోర్టు కోరింది. ఈ అంశంపై నాలుగు వారాలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. **