మయోనైజ్‌పై నిషేధం | Ban on mayonnaise by Medical Health Department Orders | Sakshi
Sakshi News home page

మయోనైజ్‌పై నిషేధం

Published Thu, Oct 31 2024 6:09 AM | Last Updated on Thu, Oct 31 2024 6:09 AM

Ban on mayonnaise by Medical Health Department Orders

వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు 

ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలకు మయోనైజ్‌ కారణమని గుర్తింపు 

ఆహార కల్తీపై ఫిర్యాదులకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్‌ సెల్‌: మంత్రి దామోదర రాజనర్సింహ

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్‌ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ కర్ణన్‌ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్‌ పాయిజనింగ్‌ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్‌ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్‌ సాధారణంగా శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు, స్నాక్స్‌ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్‌లు వంటి    వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. 

మంత్రి సమీక్ష నేపథ్యంలో.. 
ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్‌్కఫోర్స్‌ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్‌ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. 

వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్‌ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్‌ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్‌ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  

ఆహార భద్రతపై అధ్యయనం చేయండి 
రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్‌ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. 

కొత్తగా మూడు ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ కర్ణన్, డైరెక్టర్‌ శివలీల, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement