Department of Health
-
మయోనైజ్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ వినియోగంపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబర్ చివరివరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా జరిగిన అనేక ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలకు పచ్చిగుడ్లతో చేసిన మయోనైజ్ కారణమని గుర్తించామని పేర్కొన్నారు. మయోనైజ్ సాధారణంగా శాండ్విచ్లు, సలాడ్లు, స్నాక్స్ వంటి వాటిల్లో రుచి కోసం వినియోగిస్తారు. గ్రిల్డ్, తందూరి చికెన్, కబాబ్‌లు వంటి వాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్‌్కఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేధం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. నోటిఫికేషన్‌లోని కీలక అంశాలు,వివరాలివీ.. » మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్–1లో 79, జోన్–2లో 53, జోన్–3లో 86, జోన్–4లో 98, జోన్–5లో 73, జోన్–6లో 154, జోన్–7లో 88 పోస్టులు ఉన్నాయి. » ఈ పోస్టులకు పేస్కేల్ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. » రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. » ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజి్రస్టేషన్ చేసి ఉండాలి. » ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. » అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్సీసీ, ఎక్స్ సర్విస్‌మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. » రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. » పూర్తి వివరాలను అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్‌హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): వైద్యారోగ్య శాఖలో ఇన్నాళ్లూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబదీ్ధకరించింది. దీంతో వారి జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 2006లో 49 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లుగా రూ.5 వేల వేతనానికి విధుల్లో చేరారు. 2012లో మరో 36 మంది వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వీరంతా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత కరువై వెట్టిచాకిరి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాలు కేవలం రూ.25,400 మాత్రమే. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. వేతనాల పెంపు కోసం ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే న్యాయం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలలకే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల వేతనాలను భారీ స్థాయిలో పెంచింది. రూ.25,400గా ఉన్న వేతనాన్ని సీఎం జగన్ ఏకంగా రూ.32,460కు పెంచారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 10న పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 మండలాల్లో పనిచేస్తున్న 85 మందికి రెగ్యులైజేషన్ ఆర్డర్లను అందజేశారు. దీంతో వారంతా సోమవారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల వద్దకు వెళ్లి వాటిని అందించారు. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా మారడంతో ఉద్యోగులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. నెలకు సుమారు రూ.50 వేలు వేతనంగా అందుకోనున్నారు. సీఎం జగన్ వల్లే తమ జీవితాల్లో వెలుగులు నిండాయని, ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు. -
మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎస్ ఛాంగ్సన్ పేర్కొన్నారు. ప్రత్యేక బోర్డ్‌ల ఏర్పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ(ఎస్‌ఎంహెచ్‌ఏ)తో పాటు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజినల్ రివ్యూ బోర్డ్‌ల ఏర్పాటును చేపట్టింది. ఎస్ఎంహెచ్ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లు రిజిస్ట్రర్ చేసుకున్నాయి. మరోవైపు మానసిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్ ఫౌండేషన్‌తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వారిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్ ఇన్ ఏపీ(ఈఏఎస్‌ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్హాన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. -
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారు. తక్షణమే రద్దు ఆదేశా లు అమలులోకి వ చ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యుటేషన్లలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు వెంటనే తమ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.ఎస్.క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని వైద్య సిబ్బంది తక్షణమే రిలీవ్ అయి బుధవారం సాయంత్రమే అసలు పోస్టింగ్ స్థలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివిధ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ కేడర్‌లో ఉన్న డాక్టర్లను రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఎంఈ డాక్టర్ త్రివేణి మెమో జారీ చేశారు. ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్య సిబ్బంది గురువారం సాయంత్రానికి తమ ఒరిజినల్ పోస్టింగ్‌లలో చేరాలని ప్రజా రోగ్య సంచాలకులు ఆదేశించారు. డిప్యుటేషన్లు లేదా వర్క్ ఆర్డర్లు రద్దయిన ఉద్యోగుల జాబితాను సంబంధిత విభాగాల అధిపతులు గురువారం సాయంత్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తమ విభాగాల్లో డిప్యుటేషన్లలో ఎవరూ లేరన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపాలని కోరారు. ‘అవసరాల మేరకు డిప్యుటేషన్లు అంటూ’పైరవీలకు రంగం సిద్ధం... జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆమోదంతో అవసరాల మేరకు ఆయా శాఖల అధిపతులు డిప్యుటేషన్లు జారీ చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవైపు డిప్యుటేషన్లను రద్దు చేస్తూనే ఈ మెలిక పెట్టడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ డిప్యుటేషన్లు తీసుకోవడానికే ఈ మెలిక అన్న చర్చ జరుగుతోంది. 2 వేల మందికిపైగా డిప్యుటేషన్లలోనే.. ఒక అంచనా ప్రకారం వైద్య,ఆరోగ్యశాఖలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దాదాపు 2 వేల మందికి పైగా డిప్యుటేషన్లలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేయడం వెనుక కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేసి, కొత్తగా ఇవ్వడం ద్వారా పైరవీలకు తెరలేపాలన్నదే కొందరు అధికారుల ఉద్దేశమన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. సొమ్ములు చేతులు మారేందుకేనా అవసరాల మేరకు ప్రభుత్వ రాతపూర్వక అనుమతితో డిప్యుటేషన్లు ఇవ్వొచ్చన్న నిబంధన పెద్ద ఎత్తున దుర్వినియోగం కానుందని అంటున్నారు. సాధారణ సిబ్బంది డిప్యుటేషన్లకు రూ.లక్ష, స్టాఫ్‌నర్సులకు రూ.లక్షన్నర, డాక్టర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ ఉంటుంది. అలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకే అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాల మేరకు తీసుకోవచ్చని ఉత్తర్వులో చెప్పాల్సిన అవసరమేంటి? ఒకవేళ అవసరాలున్నచోట ఇప్పటికే ఉన్నవారిని తొలగించి వెనక్కు పంపించాల్సిన అవసరమేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ 18 మంది డీఎంహెచ్‌వోల మాటేమిటి కాగా, డిప్యుటేషన్‌పై ఉన్న దాదాపు 18 మంది జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) వెనక్కు పంపించాలన్న ఆదేశాలు వెలువడలేదని ఒక అధికారి వెల్లడించారు. దీనికి కారణాలు ఏంటో అంతుబట్టడంలేదన్న వాదనలున్నాయి. ఉద్యోగులు... సంఘాల అభ్యంతరం ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి. విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ వంటి పరీక్షలు ఉన్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయడం వల్ల గందరగోళం నెలకొంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే అమలు చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను వచ్చే జూన్ వరకు నిలి పివేయాలని కోరుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్పౌజ్ గ్రౌండ్లలో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు సమయం ఇవ్వాలని, సాధారణ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు. -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిడ్నీ బాధితులకు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో రూ.50 కోట్లు వెచ్చించి రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మి0చారు. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. అందుబాటులో అన్నిరకాల చికిత్సలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే (డిజిటల్), ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో అందుబాటులోకి రానున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలివీ ♦ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 చొప్పున ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచింది. ప్రతినెలా 1వ తేదీనే లబి్ధదారుల గుమ్మం చెంతకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ను వలంటీర్లు అందజేస్తున్నారు. ♦ టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను 2020లో ప్రారంభించారు. మరో 25 మెషిన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో (మే నాటికి) 55,708 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ♦ ఇచ్చాపురం, కంచిలీ సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీల్లో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ♦ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను అందుబాటులో ఉంచారు. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా ఇక్కడి ఆస్పత్రుల్లో అందించేవారు. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. ♦కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సమీపంలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటినిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
ప్రజలందరికీ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. తొలి రెండు దశల్లో 1.60 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్రోచర్ల ద్వారా వైద్యసేవలు పొందే విధానాన్ని వివరిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. బాధితులను గుర్తించిన అనంతరం ఇంటి వద్దే స్పెషలిస్టు వైద్యులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ఒకప్పుడు 919 ఉండే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,283కు పెంచారని తెలిపారు. ఇందులో 204 ఆస్పత్రులతో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ వైద్యంలో 638 ప్రొసీజర్స్‌ను చేర్చడంతో పాటు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా 104కు ఫిర్యాదు చేస్తే ఆ హాస్పిటల్స్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు: ప్రభుత్వ విప్ కొరముట్ల అనంతరం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అందుకే పీహెచ్‌సీలు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 300కు పైగా ఓపీలు నమోదవడంతో పాటు గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్యం ఉచితంగా అందుతోందని, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. బద్వేల్ సీహెచ్‌సీలో ఆర్థోపెడిక్ సర్జన్ పోస్టు మంజూరు చేయాలని, ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధ కోరారు. సీఎస్ఆర్ కింద పూర్తయిన డయాలసిస్ యూనిట్ భవనాన్ని ప్రభుత్వం తీసుకుని వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో బలోపేతం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి తెలిపారు. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి పథకాన్ని చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1059 ప్రొసీజర్లు ఉంటే ఈ ప్రభుత్వం 3,257కు పెంచిందన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే జగన్మోహనరావు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కొన్ని ప్రొసీజర్స్‌కు ఆరోగ్యశ్రీపై వైద్యం చేయట్లేదని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌లో ఉండటంతో సహాయ నిధిని విడుదల చేయట్లేదని తెలిపారు. ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రుల్లో సదుపాయాలపై తనిఖీలు చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, అక్కడ లభించే ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే తిప్పేస్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా, డిశ్చార్జి తర్వాత ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చి, స్థానిక ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. అయితే, కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు రోగుల దగ్గర, ఆరోగ్యశ్రీలోనూ రెండు రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 108లను కర్ణాటకకూ నడపండి: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రజలు వైద్యం కోసం 150 కిలోమీటర్ల దూరంలోని అనంతపురానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమీపంలోనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోనూ నెట్వర్క్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరారు. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు కర్నాటకకు తీసుకెళ్లడంలేదని, ఇకపై 108లను కర్ణాటకకు కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిని వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
టెలి మెడిసిన్‌లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: వయో వృద్ధులు, మహిళలకు టెలీ మెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,10,12,570 మంది వయో వృద్ధులు టెలిమెడిసిన్ సేవలు పొందగా ఆంధ్రప్రదేశ్‌లో 34.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది. దేశవ్యాప్తంగా పోలిస్తే 31.04 శాతం వయో వృద్ధులకు ఏపీలో సేవలు అందాయి. మహిళలకు టెలిమెడిసిన్ సేవలందించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 5,22,15,224 మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందగా ఆంధ్రప్రదేశ్‌లోనే 1.37 కోట్ల మంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పోలిస్తే ఏపీలో 26.41 శాతం మంది మహిళలు టెలి మెడిసిన్ సేవలు పొందారు. ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలోనూ కోటి మందికి పైగా మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందలేదు. పశ్చిమ బెంగాల్లో 85.16 లక్షల మంది మహిళలు, తమిళనాడులో 62.94 లక్షల మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21,236 స్పోక్స్ హబ్‌లు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా అస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లతో అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సేవలకు సంబంధించి 21,236 స్పోక్స్ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్ నుంచి వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి తగిన ఎలాంటి మందులు వాడాలో సూచిస్తారు. ఆ మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌తో ఇంటి నుంచే వైద్య సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారితో పాటు వాటిని వినియోగించలేని వారి కోసం ఇంటి వద్దే ఈ–సంజీవని ఓపీ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్ ల కు అనుసంధానించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను పొందగలుగుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అందిస్తున్న టెలిమెడిసిన్ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో అత్యధికంగా వృద్ధులు, మహిళలకు టెలి మెడిసిన్ సేవలు అందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. -
నేటి నుంచి ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ సర్వే కోసం సోమవారం ఉన్నతాధికారులు జిల్లాల వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే చేపట్టాల్సిన విధానం, మార్గదర్శకాలను వివరించారు. కరోనా వ్యాప్తి సమయంలో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి, లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రారంభ దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా వ్యాధుల నియంత్రణకు సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 విడతలు రాష్ట్రంలో సర్వే నిర్వహించారు. ఇదే తరహాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నియంత్రణకు సర్వే చేపడుతున్నారు. డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులున్న వారిని, లక్షణాలున్నవారిని గుర్తిస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బాధితులకు మందులు అందిస్తారు. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తారు. సీజనల్ వ్యాధులను గుర్తించడానికి ఫీవర్ సర్వే యాప్‌లో మార్పులు చేశామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో కరోనా వైరస్ ప్రశ్నావళి మాత్రమే ఉండేదని, ప్రస్తుతం డెంగీ, మలేరియా, విష జ్వరాల లక్షణాల ప్రశ్నావళిని అదనంగా చేర్చామని చెప్పారు. ఫీవర్ సర్వే నిర్వహణపై అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలను సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేస్తోందని వివరించారు. -
ఆరోగ్యాధారిత వ్యవస్థలు బలోపేతం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘రానున్న ఆరోగ్య విపత్తులను ఎదుర్కునేందుకు అంతర్జాతీయంగా ఆరోగ్యాధారిత వ్యవస్థలను ఏకీకృతం, బలోపేతం చేయడం తక్షణ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని మూలస్తంభంగా ఉంచి, బలమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై మనం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానించిన నెట్వర్క్, ఎకో సిస్టమ్‌ను సృష్టించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆమె ఈ సందర్భంగా జీ 20 దేశాలను కోరారు. దానికి ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ పై అంతర్జాతీయ కార్యక్రమ ఏర్పాటుకు భారత్ చేసిన ప్రతిపాదనను ఆమె ఈ సందర్భంగా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇది దేశాల మధ్య డిజిటల్ వైరుధ్యాలను తగ్గించడానికి సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచపు ఫార్మసీ భారత్: కిషన్‌రెడ్డి కేంద్ర çపర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం, వెల్‌నెస్‌ల కోసం అత్యధికులు ఎంచుకుంటున్న 10 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు. ప్రపంచపు ఫార్మసీగా మన దేశాన్ని అభివరి్ణంచిన ఆయన...మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33శాతం హైదరాబాద్‌లోని ఒక్క జీనోమ్ వ్యాలీ ద్వారానే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. వచ్చే 2030కల్లా అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మన దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే బలమైన ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి బాఘెల్ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ మాట్లాడుతూ స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించగలమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి నేరి్పందని గుర్తు చేశారు. అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లను జీ20 వేదిక ద్వారా అందించడం భారత్ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యులు డా.వి.కె.పాల్, ఐసీఎంఆర్ డీజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హెకాలీ జిమోమి, జీ20 దేశాల ప్రతినిధులు, వైద్యరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
మరింత చేరువగా అత్యవసర వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనీషియేషన్ (టెరి)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, హార్ట్ అటాక్.. బ్రెయిన్ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్.. సర్జికల్ ఎమర్జెన్సీస్ వంటి ఆరు రకాల బాధితులకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించడం, తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంతవరకు నివారించడమే దీని ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎమర్జెన్సీ కేసుల్లో 24% ట్రామా బాధితులే.. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24 శాతం ట్రామా బాధితులే (గాయాలకు గురైనవారు) ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరకముందు జరుగుతున్న 35 శాతం మరణాలకు, చేరిన 24 గంటలలోపు జరిగే 40 శాతం మరణాలకు రక్తస్రావం కారణం అవుతోంది. అయితే ప్రీ హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ సర్విసెస్, రిహాబిలిటేషన్, సర్జరీ, స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ మధ్య సమన్వయం లోపం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. సకాలంలో స్పందించడం ద్వారా 30 నుంచి 40 శాతం హాస్పిటల్ మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని రహదార్లు కవర్ అయ్యేలా 55 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 17 టీచింగ్ ఆసుపత్రులు, 21 జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటినే ‘టెరి’లుగా వ్యవహరిస్తారు. ప్రీ హాస్పిటల్ సేవలు.. ప్రీ హాస్పిటల్, ఇంట్రా హాస్పిటల్ సేవలుగా విభజించి ట్రామా కేర్ సెంటర్లలో సేవలు అందించనున్నారు. ౖప్రీ హాస్పిటల్లో భాగంగా ప్రమాద బాధితులను తక్షణమే, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చుతారు. ప్రమాద స్థలికి 108 అంబులెన్స్ వేగంగా చేరేలా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తారు. ప్రస్తుతం 426 అంబులెన్సులు ఉండగా, 292 వాహనాల్లో ఏఈడీలున్నాయి. మిగతా 133 వాహనాల్లో త్వరలో ఏర్పాటు చేస్తారు. 108 వాహనంలోకి బాధితుడిని తీసుకున్న వెంటనే అతని ఆరోగ్య పరిస్థితిని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని ఆసుపత్రికి చేరగానే అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు. ఇంట్రా హాస్పిటల్ కేర్... ట్రామా కేర్ ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల్లో తగిన మార్పులు చేయనున్నారు. అంబులెన్స్ సులభంగా వచ్చి పోయేలా ఏర్పాటు చేయడంతో పాటు, దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలా సదుపాయం కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపీ సేవలు కొనసాగిస్తారు. క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లుగా మార్చుతారు. ఎమర్జెన్సీ విభాగంలో డెడికేటెడ్ ట్రయాజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులో నాలుగు క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగు సూచీలతో వీటిని విభజిస్తారు. ట్రయాజ్‌లో మల్టీ పారామీటర్ మానిటర్లు, మెడికల్ గ్యాస్ ఔట్ లెట్స్, ఇతర వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుబాటులో అధునాతన వైద్య పరికరాలు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం, 5,000 చదరపు అడుగుల్లో 10 పడకల ఎమర్జెన్సీ మెడికల్ డిస్పాచ్ (ఈఎండీ) ఏర్పాటు చేస్తారు. ఆస్పత్రుల సామర్థ్యాన్ని బట్టి ఎమర్జెన్సీకి పడకలు కేటాయిస్తారు. ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్ రే, ఈ ఫాస్ట్, సక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రా సౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఓటీ ఎక్విప్మెంట్ వంటి అధునాతన వైద్య పరికరాలు సమకూరుస్తారు. ఒక్కో ట్రామా కేర్ సెంటర్లో మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. వీరికి జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణకు కృషి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోం. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయాల్లో సరైన సమయంలో అవసరమైన వైద్యం అందక బాధితులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నివారించేందుకు ‘టెరి’కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట< వ్యాప్తంగా 55 చోట్ల ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. – టి.హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
జనాన్ని పట్టిపీడిస్తున్న.. ‘హికికోమొరి’ పరిస్థితి.. కోవిడ్‌తో మరింత తీవ్రం
చలాకీగా ఉండే ఓ 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉన్నట్టుండి ముభావంగా మారిపోయాడు.బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు..ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదు.ఎవరితోనూ కలవడం లేదు. అసలు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి..కాలేజీకి వెళ్లడం మానేసింది.. అలాగనిస్నేహితులతో షికార్లు, కబుర్లు వంటివి కూడా లేవు.. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఓ గదిలో కూర్చుండి పోతోంది.. ఏమిటని అడిగితేబాగానే ఉన్నానంటోంది.. .. ఏమైంది ఈ ఇద్దరికి? వారు దారుణమైన ఘటనలేమీ ఎదుర్కోలేదు.. తీర్చలేని ఇబ్బందేమీఎదురుకాలేదు.. కానీ ‘హికికోమొరి’బారినపడ్డారు. అందరికీ దూరంగా ఏకాంతంగా గడిపేస్తున్నారు. అసలు ఏమిటీ ‘హికికోమొరి’? అదేమైనా మానసిక సమస్యా? దానికి కారణాలేమిటి?నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా.. జపాన్‌లో 15లక్షల మందికి.. జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల ఓ సర్వే చేసింది. దాదాపు 15 లక్షల మంది ‘హికికోమొరి’పరిస్థితిలో ఉంటున్నారని గుర్తించింది. నెలలు, సంవత్సరాలుగా వారు ఎవరితోనూ కలవడం లేదని తేల్చింది. వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. దానిపై స్పందించిన పలు స్థానిక సంస్థలు.. ‘హికికోమొరి’లతో మెటావర్స్ వేదిగా సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. దీనికి సంబంధించి భారత్ సహా పలు దేశాల ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. ఏమిటీ హికికోమొరి? సామాజిక జీవనానికి దూరంగా దాదా పు ఒంటరితనంతో కూడిన జీవితాన్ని గడపడమే ‘హికికోమొరి’. 1980వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు, ఉపాధి దెబ్బతినడంతో.. తొలిసారిగా ఇలాంటి పరిస్థితిని గుర్తించారు. దానికి ‘హికికోమొరి (అంతర్ముఖులుగా మారిపోవడం)’అని పేరుపెట్టారు. దీనిబారిన పడినవారు తమచుట్టూ తామే గిరి గీసుకుని బతికేస్తుంటారు. అలవాట్లను మార్చుకుంటారు. మానసిక ఆందోళన (యాంగ్జైటీ), కుంగుబాటు (డిప్రెషన్), అందరి మధ్య ఉన్నా ముభావంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరిలో అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా దీనిని మానసిక సమస్యగా ప్రకటించలేదు. దీనికి కారణాలేమిటి? సామాజిక, విద్య, ఉద్యోగ పరమైన ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆర్థికపరమైన సమస్యలతో ఆందోళన, వివిధ రకాల వేధింపులు వంటివి ‘హికికోమొరి’పరిస్థితికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం, విద్య, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటివి కూడా హికికోమొరి సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఇది వారిపై వ్యక్తిగతంగా, పరోక్షంగా సమాజంపైనా వ్యతిరేక ప్రభావం చూపుతుంది’’అని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ విష్ణుప్రియ భగీరథ్ తెలిపారు. బయటపడేందుకు డబ్బులిస్తూ.. దక్షిణకొరియాలో 19 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న మూడున్నర లక్షల మంది ‘హికికోమొరి’ సమస్యతో బాధపడుతున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ఇటీవల గుర్తించింది. ముఖ్యంగా తొమ్మిదేళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని తేలి్చంది. వారిని ఈ సమస్యనుంచి బయటపడేలా ప్రోత్సహించేందుకు నెలకు సుమారు రూ.40 వేలు (490 డాలర్లు) లివింగ్ అలవెన్స్‌గా ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కుటుంబం,దగ్గరివారితో పరిష్కారం! ‘హికికోమొరి’బారినపడినవారు అందరికీ దూరంగా, ఏకాంతంగా గడపడం వల్ల మరింతగా మానసిక, శారీరక సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోసారి ఇవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని బాధితులు మందుల కంటే.. కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల సాంత్వన వంటి మార్గాల ద్వారానే త్వరగా కోలుకుంటారని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అవసరమైతే డిప్రెషన్ వంటి కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుందని అంటున్నారు. సంస్థలు, కార్యాలయాలు తమ ఉద్యోగుల్లో, విద్యా సంస్థలు తమ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. భారత్ సహా అన్ని దేశాల్లోనూ.. అన్ని రంగాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులకు తోడు కరోనా మహమ్మారి దెబ్బతో ‘హికికోమొరి’పరిస్థితి పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోవడం, ఉపాధి దెబ్బతినడం, నెలలకు నెలలు లాక్డౌన్, కోవిడ్ బారినపడి ఆరోగ్యం దెబ్బతినడం వంటివాటి నుంచి కోలుకోవడానికి చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు హికికోమొరి బారినపడుతున్నారు..’’అని ఢిల్లీకి చెందిన లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ నిఖిలా దేశ్‌పాండే వివరించారు. వర్క్ ఫ్రం హోం, అన్నిరకాల సరుకుల హోం డెలివరీ వంటివి దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క జపాన్ అనే కాకుండా ప్రపంచదేశాలన్నిటా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా తక్కువకావడంతో.. ‘హికికోమొరి’సమస్య తలెత్తినా గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. 8% 2017 నాటి ఆస్పెన్ అధ్యయనం ప్రకారం..భారతదేశంలో ఒంటరితనంతో బాధపడుతున్న యువత – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజన్ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్–19 జాగ్రత్తలు మరవద్దు.. దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడిలో ఉన్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఇన్‌ఫ్లూయెంజా ఏటా సీజనల్‌గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
పోస్ట్ కోవిడ్‌తో యువతలో గుండెపోటు!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యువత, మధ్య వయస్సు వారిలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జిమ్ చేస్తూ కొందరు, సాధారణ పనుల్లో ఉంటూనే మరికొందరు గుండెపోటుతో కుప్పకూలిపోయి అకాల మరణాల పాలవుతున్నారు. కొందరిలో కోవిడ్ సోకి తగ్గిన తర్వాత (పోస్ట్ కోవిడ్) ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా గుండెపోటు మరణాలకు కారణం అవుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో యువకుల్లో గుండెపోట్లను నివారించడానికి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఒక అడ్వైజరీ (సలహాలు, సూచనల నివేదిక)ను విడుదల చేశారు. కొందరు కోవిడ్ సోకి కోలుకున్నా కూడా.. వైరస్ ప్రభావం వల్ల ఎండోథెలియం (గుండె రక్తనాళాల్లోని లోపలి పొర)లో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. యువతీ యువకుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీన్ని వెంటనే గుర్తించలేకపోతారని.. దీనితో ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణాలు సంభవిస్తున్నాయని విశ్లేషించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన అడ్వైజరీ ఇదీ.. ►యువతీ యువకులు కూడా నిర్ణీత కాలంలో ఆ రోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు కనీసం రెండేళ్లకోసారి బీపీ పరీక్షలు చే యించుకోవాలి. 18–39 మధ్య వయసు వారు ఏడాదికోసారి, 40 ఏళ్లు దాటినవారు తరచూ బీపీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ►20 ఏళ్ల వయసు నుంచే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల గుండె జబ్బుల సమస్యను ముందుగా గుర్తించవచ్చు. పెద్దలు కనీసం 4 నుంచి 6 నెలలకోసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. ►గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో మధు మేహం (షుగర్) ఒకటి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా షుగర్ ఉంటే, ముందస్తుగానే షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ►గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. పండ్లు, బీన్స్, చిక్కుళ్లు వంటివి, చేపలు, తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులు, తృణధాన్యా లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు కలిగిన పదార్థాలు తీసుకోవాలి. ►ఎక్కువ ఉప్పు, చక్కెర ఉండేవి, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలు, ఆల్కహాల్, మాంసం, కొవ్వు, పాల ఉత్పత్తులు, వేయించిన ఫాస్ట్ ఫుడ్, చిప్స్, కాల్చిన ఆహారం వంటివాటికి దూరంగా ఉండాలి. ►రోజూ 30 నుంచి 60 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన ఏరోబిక్ వ్యాయామం చేయాలి. లేదా వారానికి 75 నిమిషాలు రన్నింగ్ వంటి శ్రమతోకూడిన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. ►ఎత్తుకు తగ్గ శారీరక బరువు ఉండేలా చూసుకో వాలి. 3 నుండి 5 శాతం వరకు బరువు తగ్గడం వల్ల రక్తంలో కొన్ని కొవ్వులు, రక్తంలో చక్కెర (గ్లూకోజ్) తగ్గడం, టైప్–2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ►ఏ వయసు వారైనా కంటి నిండా నిద్రపోవాలి. పెద్దలకు రాత్రిపూట కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. రోజూ ఒకే సమయాల్లో పడుకోవడం, మేల్కోవడం చేయాలి. పడకగది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా తగినంత నిద్రపోవడం సాధ్యమవుతుంది. ►మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. శారీరక శ్రమ, ధ్యానం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ►ధూమపానం, పొగాకు వాడకాన్ని నిలిపివేయాలి. ఈ అలవాటు ఇప్పటికిప్పుడు మానేసినా గుండె జబ్బు ప్రమాదం సగం తగ్గుతుంది. -
వైద్యారోగ్య శాఖలో...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అవసరమైన చోట కొత్త పోస్టుల మంజూరు, అవసరం లేనిచోట రద్దు చేయడంతోపాటు వైద్యులు అధికంగా ఉన్నచోట నుంచి తక్కువగా ఉన్నచోటుకు బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించాయి. కొత్తగా డీఎంహెచ్‌వో పోస్టులు ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 19 జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక డీఎంహెచ్‌వో పర్యవేక్షించడం కష్టమైన వ్యవహారం. దీంతో హైదరాబాద్‌కు మరో ఐదు డీఎంహెచ్‌వో, ఇతర జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో పోస్టులు అవసరమని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్తగా 19 డీఎంహెచ్‌వో పోస్టులకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, మొత్తం డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరిగినట్టేనని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి హైదరాబాద్‌కు ఆరుగురు డీఎంహెచ్వోలు, మిగతా అన్ని జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో ఉంటారు. త్వరలోనే హైదరాబాద్‌కు ఐదుగురు అదనపు డీఎంహెచ్‌వోల నియామకం జరగనుందని.. దీనితో నగరంలో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ సులువు అవుతుందని అధికారులు అంటున్నారు. అవసరమైన చోటకి వైద్యం, సిబ్బంది వైద్యారోగ్యశాఖలో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలు చాలాకాలం నుంచి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి మించి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఉంటుంటే.. కొన్ని ఆస్పత్రుల్లో అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు. చాలామంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది కొరతతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్న చోటి నుంచి తక్కువగా ఉన్న చోట్లకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రతిపాదించింది. దీనికి కూడా సర్కారు ఆమోదం తెలిపిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కౌన్సెలింగ్ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. అవసరం లేని పోస్టుల రద్దు లెప్రసీ వంటి పలు విభాగాల్లోని కొన్ని పోస్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలోని చాలా మందికి పనిలేదని, పలుచోట్ల ఆయా పోస్టుల అవసరం లేదన్న అభిప్రాయమూ ఉందని చెప్తున్నాయి. అటువంటి పోస్టులను అవసరమైన చోటికి మార్చడమో, రద్దు చేయడమో చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల లిఫ్ట్ ఆపరేటర్లు అవసరం లేదని భావిస్తున్నారు. ఇలా విభాగాల వారీగా అవసరం లేని పోస్టులను గుర్తించి.. రద్దు చేయడమా, ఇతర చోట్ల సర్దుబాటు చేయడమా, పోస్టుల విధులు మార్చడమా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలు పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు–నేడు కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. అయితే, అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డ్యాక్టర్ కాన్సెప్ట్ పైలెట్ ప్రాజెక్టు అమలుపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు అమలుకోసం తీసుకుంటున్న చర్యలను, పైలెట్ ప్రాజెక్టు అమలులో గుర్తించిన అంశాలను అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులు.. 26 జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 7,166 విలేజ్ క్లినిక్స్‌లలో రెండుసార్లు చొప్పున, 2,866 విలేజ్ క్లినిక్స్‌లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్ 104 వాహనంతో పాటు వెళ్లారని తెలిపారు. డిసెంబర్లో అదనంగా మరో 260.. 104 వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తిస్థాయిలో 104 వాహనాలు అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వల్ల వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత గణనీయంగా పెరిగాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపైన కూడా పరిశీలన చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. ఎనీమియాతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నెలరోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలందించామని వెల్లడించారు. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న 1,78,387 మందిని, 1,25,948 మంది మధుమేహంతో బాధపడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. వీరికి వైద్యసాయం అందించినట్టు స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవే.. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాదు.. వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై సూచనలు కూడా ఇవ్వాలి. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలి. - అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలి. - ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలి. ఆలోగా విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. - ఉగాది కల్లా వీటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. - పిల్లలు, గర్భవతులు, బాలింతల్లో ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆ డేటాను స్త్రీ శిశుసంక్షేమశాఖకు బదిలీచేయాలి. డేటా ప్రకారం ఆయా లక్షణాలున్నవారికి పౌష్టికాహారం, మందులు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. - గ్రామ సందర్శనలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ ఆ గ్రామంలో మంచానికి పరిమితమైన రోగులను తప్పనిసరిగా కలవాలి. - వైద్య, ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలి. - ఆరోగ్యశాఖలోని ఆశా వర్కర్ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్ఫోన్లు ఇవ్వాలి. - ఇందులో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్‌లు ఉంచాలని ఆదేశించారు. - ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కలిగించాలి. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాజేయాలి. - ఎవరికైనా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలంటే.. సంబంధిత చికిత్సను అందించే నెట్వర్క్ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌ను రూపొందించాలి. సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్ కూడా చూపేలా ఈ యాప్ ఉండాలి. - ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి గురించి గైడ్ చేసే పరిస్థితి రావాలి. ప్రజలకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉండేలా చూడాలి. ఆరోగ్య శ్రీసాప్ట్‌వేర్ కూడా బాగా మెరుగుపరచాలి. - ఎవరైనా తమకు వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఏ జబ్బుకు ఎక్కడ వైద్యం అందుతుంది? దీనికి ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ అందుతాయి అన్నదానిపై లొకేషన్ సైతం తెలియజేసేలా యాప్‌లో వివరాలు ఉండాలి. - అలాగే ఫ్యామిలీ డాక్టర్ సంబంధిత గ్రామానికి వెళ్లినప్పుడు కూడా రియల్‌టైం డేటా కూడా రికార్డు చేయాలి. దీనివల్ల సిబ్బంది మధ్య సమన్వయం, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య కూడా సమన్వయం చక్కగా కుదురుతుంది. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు సమర్థయంత్రాంగం ఉండాలి. రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను ఉంచాలి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేయాలి. ఆరోగ్యరంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలని, విలేజ్ క్లినిక్స్ సహా అన్నిచోట్లా ఈ నంబర్‌ను ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. - ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సరిగ్గా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌పై కచ్చితంగా పరిశీలన, చర్యలు ఉండాలి. డయాలసిస్ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Telangana: గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) ప్రత్యేక బులిటెన్ 2018–20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017–19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు అన్నమాట. 2017–19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 49 పాయింట్లు తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా... ఇప్పుడు 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్లు మాత్రమే తగ్గుదల నమోదైంది. ►అత్యధిక మాతృమరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాల్లో అస్సాం 195, మధ్యప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదయ్యాయి. 2017–19 నుంచి 2018–20 మధ్య ఆయా రాష్ట్రాల్లో ఎంఎంఆర్ తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 10 పాయింట్లు, హరియాణాల్లో 14 పెరగగా, ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఐరాస ప్రకారం 70 కంటే తక్కువ లక్ష్యం... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘మాతృ మరణం అనేది ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. 15–49 ఏళ్ల వయస్సుగల సంబంధిత మహిళల్లో లక్షకు జరిగే మరణాలను లెక్కలోకి తీసుకుంటారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లక్ష్యం లక్షకు 70 కంటే తక్కువ చేయాలని నిర్ణయించగా, తెలంగాణ ఎప్పుడో ఆ లక్ష్యానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ చర్యల్లో భాగంగానే ఎంఎంఆర్ తగ్గింది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెలా చెకప్స్ చేయించడం, ఉచితంగా అమ్మ ఒడి వాహన సేవలు అందించడం వల్ల గర్భిణులకు నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృ మరణాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్‌రావు ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 12.61 లక్షల మంది గర్బిణులు లబ్ధి పొందారు. మొత్తం కేసీఆర్ కిట్ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1,525 కోట్లు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు అస్సాం, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే. -
మరణించిన వ్యక్తికి.. బూస్టర్ డోస్
బయ్యారం(వరంగల్): మరణించిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు. కోవిడ్ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్ పీహెచ్సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్‌డోస్ వేసినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్లైన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరిశీలించారు. అందులోనూ బూస్టర్‌డోస్ వేసినట్టు ఉంది. -
కొత్త కళ్ల జోడుతో సరికొత్త వెలుగులు
సిద్దిపేటజోన్: కొత్త కళ్ల జోడు.. కళ్లలో కొత్త వెలుగులు నింపుతుందని, ప్రభుత్వం తరఫున గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. ‘‘మీ చల్లని చూపుతో మా కంటికి కొత్త వెలుగులు వచ్చాయని, ఇప్పుడు అన్ని బాగా చూడగలుగుతున్నాం. బిడ్డా... నీవు సల్లంగా ఉండాలి’’అని మంత్రిని ఈ సందర్భంగా వృద్ధులు ఆశీర్వదించారు. దశాబ్దాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదవారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు ఇవ్వడం సంతృప్తినిచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 762 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. మరో 1,800మందికి చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ డీ ఎడిక్షన్ (మద్యానికి బానిసైన వారిని ఆ అలవాటు మాన్పించేలా చికిత్స ఇచ్చే) కేంద్రాల ఏర్పాటుపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో తదుపరి వాయిదాకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లు నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ డీ ఎడిక్షన్, లిక్కర్ డీ ఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవోలో ఉన్నా.. ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్ హైకోర్టులో 2016లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ.. డీ ఎడిక్షన్ కేంద్రాలను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవో ఇచ్చిందన్నారు. పిటిషన్ దాఖలు చేసి ఆరేళ్లవుతున్నా ప్రతివాదులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. -
సీజనల్ వ్యాధులకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. డెంగీ, మలేరియా, ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని, అధికారులు కూడా ఇంటింటి సర్వే ద్వారా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో మంత్రుల సమీక్ష జరిగింది. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు, గూడేలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్త వహించాలని కోరారు. మలేరియా, డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను అంటువ్యాధులకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గురుకులాల్లో నిల్వ ఉంచిన బియ్యం స్థానంలో తాజా బియ్యాన్ని సరఫరా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ను కోరినట్లు చెప్పారు. వరదల వల్ల ఏర్పడిన కరెంటు ఇబ్బందుల పరిష్కారానికి సంబంధిత శాఖలకు రూ.పదేసి కోట్ల చొప్పున విడుదల చేసినట్లు తెలిపారు. సమీక్షలో హరీశ్‌రావుతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. గురుకులాలకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు సంక్షేమ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలకు ఉపక్రమించింది. కొన్ని రోజులుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలతోపాటు ఇతర విద్యాసంస్థల్లో ఆహారం వికటిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్న క్రమంలో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యాసంస్థలు, సక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యతను పరిశీలించాలని కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉన్నాం మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీం నమూనాలను పుణేలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపాం. మంకీపాక్స్ చికిత్సకు ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే ఫీవర్ ఆసుపత్రిని సందర్శించాలి’అని హరీశ్‌రావు చెప్పారు. ప్లేట్లెట్స్ పడిపోతే ఆందోళనలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్లేట్లెట్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.