సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3,675 మంది శిశువులు చని పోగా, 2019–20 సంవత్సరంలో 2,408 మంది మృతి చెందినట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వం శిశు మరణాల తగ్గుదలపై అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నందువల్లే మరణాలు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1,040 శిశు మరణాలు సంభవించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి (10 నెలల్లో) వరకు 498 మంది చనిపోయినట్లు తెలిపింది.
అంటే సగం పైగా మరణాలు తగ్గడం గమనార్హం. నల్లగొండ జిల్లాలోనూ గత ఆర్థిక సంవత్సరంలో 207 మంది శిశువులు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 138 మంది చనిపోయారు. ఇక వరంగల్ అర్బన్‌లోనూ గత ఆర్థిక సంవత్సరంలో 726 మంది చనిపోగా, ఈ సారి ఆ సంఖ్య 99కు తగ్గింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 245 మంది శిశువులు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 66కు పడిపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ గతంలో 248 మంది చనిపోగా, ఈసారి ఆ సంఖ్య 53కు పడిపోయింది. అయితే కొన్ని జిల్లాల్లో శిశు మరణాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో 34 మంది శిశువులు చనిపోగా, ఈసారి ఏకంగా 139 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో నలుగురు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే 32 మంది శిశువులు చనిపోయారు. అలాగే భూపాలపల్లి జిల్లాలో గతంలో ఇద్దరు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 27 మంది శిశువులు కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 79 మంది చనిపోగా, ఇప్పుడు 139 మంది శిశువులు చనిపోయారు.
‘రూరల్’లో ఎక్కువ.. ‘అర్బన్’లో తక్కువ
ఇటు రాష్ట్రంలో పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగే శిశువుల శాతం గతం కంటే తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పుట్టిన శిశువుల్లో గంటలోపే తల్లిపాలు తాగినవారు 79.2% మంది ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 74.3 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 99.2 శాతం, సూర్యాపేటలో 99%, వరంగల్ రూరల్ జిల్లాలో 99.3% శిశువులు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగటం విశేషం. అత్యంత తక్కువగా వరంగల్ అర్బన్ జిల్లాలో 33.9 శాతం శిశువులు మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగుతున్నారు. తల్లిపాలు గంటలోపు తాగితేనే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని, భవిష్యత్తులో పిల్లలు ఇతరత్రా అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు.
అయితే అనేక సందర్భాల్లో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతుండటం వంటి కారణాల వల్ల తల్లులు గంటలోగా శిశువులకు పాలిచ్చే పరిస్థితి ఉండటం లేదంటున్నారు. ఇక రెండున్నర కేజీల బరువు కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారి సంఖ్య గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో 32,586 మంది రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి అంటే 10 నెలల కాలంలోనే 34,696 మంది అలా తక్కువ బరువుతో పుట్టడం గమనార్హం.
దాదాపు సగం తగ్గిన ఇన్ఫెక్షన్ మరణాలు..
శిశు మరణాలు వివిధ కారణాల వల్ల సంభవిస్తాయి. ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా సహా ఇతరత్రా కారణాలుంటాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోయిన వారి శాతం గణనీయంగా తగ్గింది. దాదాపు సగం మేరకు తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో ఇన్ఫెక్షన్లతో 6.9 శాతం మంది చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది.
ఇక పుట్టిన తర్వాత శ్వాస ఆడకపోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం తదితర కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం మంది చనిపోగా, ఈసారి 6.4 శాతం తగ్గడం విశేషం. ఇక శిశు మరణాల్లో న్యుమోనియాతో చనిపోయే వారి శాతం రెండింతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో న్యుమోనియాతో 2.4 శాతం మంది మరణిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి నాటికి 5.4 శాతానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment