infant mortality rate
-
అమ్మ కడుపు చల్లగా.. ఏపీలో రెండేళ్లుగా తగ్గిన మాతా, శిశు మరణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా మహిళలు, బాలల ఆరోగ్యం పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ఎప్పటికప్పుడు వైద్యం, మందులు అందిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే ప్రసూతి మరణాలతో పాటు శిశు మరణాలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ప్రసూతి మరణాలు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రసూతి మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రగతిని సాధించిందని పేర్కొంది. సుస్థిర ప్రగతి లక్ష్యం మేరకు ప్రతి లక్ష ప్రసవాల్లో ప్రసూతి మరణాలు 70లోపు ఉండాలి. 2017–18లో రాష్ట్రంలో లక్ష ప్రసవాల్లో 58 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో ఈ సంఖ్య 45కు తగ్గినట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెలలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జాతీయ స్థాయిలో కూడా ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గినప్పటికీ రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ ఉన్నాయి. 2017–18లో జాతీయ స్థాయిలో ప్రతి లక్ష ప్రసవాల్లో 103 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో 97కు తగ్గాయి. అలాగే సజీవ జననాల్లో శిశు మరణాలు జాతీయ స్థాయికన్నా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి సజీవ జననాల్లో శిశు మరణాలు 2018లో 29 ఉండగా 2019లో 25కు, 2020లో 24కు తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇదే జాతీయ స్థాయిలో వెయ్యి సజీవ జననాల్లో 2018లో 32 శిశు మరణాలు సంభవించగా 2019లో 30కు, 2020లో 28కు తగ్గినట్లు తెలిపింది. ఆస్పత్రుల్లోనే 97 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఆస్పత్రుల్లో కాన్పులు 92 శాతమే ఉంటే.. 2019 – 21లో 97 శాతానికి పెరిగింది. అత్యధిక కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. మూడు శాతమే ఇళ్ల వద్ద జరుగుతున్నాయి. పటిష్ట ప్రణాళికతో గర్భిణులు, శిశువుల పరిరక్షణ మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గర్భిణులు, శిశువుల పరిరక్షణకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. వలంటీర్లు సచివాలయాల స్థాయిలో గర్భిణులు, 5 ఏళ్లలోపు బాలల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారు. పిల్లలు, గర్బిణుల డేటా, ఆధార్‌ను ఆర్సీహెచ్ (పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య) పోర్టల్ ఐడీతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 2.59 లక్షల గర్భిణుల వివరాలను మ్యాపింగ్ చేశారు. ఈ వివరాలను సచివాలయాల గృహ కుటుంబాల డేటాలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోఎక్కువ ప్రమాదం గల గర్భిణులను గుర్తించి వారికి సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఏఎన్ఎం స్వయానా ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు అందిస్తున్నారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద గర్భిణులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. శిశువుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ )లు పనిచేస్తున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన టీకాలు ప్రభుత్వం వేయిస్తోంది. బాలలకు ఐఎఫ్ఏ సిరప్, డి–వార్మింగ్, విటమిన్ ఏ చుక్కలు అందిస్తోంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత లేకుండా చూడటం వలన గర్భిణులు, శిశువులకు నిరంతర వైద్య సేవలు అందుతున్నాయి. -
దేశంలో తగ్గిన నవజాత శిశు మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: నవజాత శిశు, బాలల మరణాల నివారణలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. 2014తో పోలిస్తే శిశు మరణాల రేటు (ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు (ఎన్ఎంఆర్), ఐదేళ్లలోపు వారి మరణాల రేటు(యూఎంఆర్)లో బాగా తగ్గాయని తెలిపింది. ‘‘నవజాత శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యిమందికి 22 కాగా, 2020 నాటికి 20కి తగ్గింది. మరణాల వార్షిక తగ్గుదల రేటు 9.1%. ఇది పట్టణ ప్రాంతాల్లో 12%, గ్రామీణ ప్రాంతాల్లో 23%. ఐదేళ్ల కంటే తక్కువ వయసు బాలల మరణాలు 2019లో ప్రతి వెయ్యికి 35 కాగా 2020కి 32కి తగ్గాయి. వీటిని 2030 నాటికి 25కు తగ్గించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ సహా 11 రాష్ట్రాలు ఇప్పటికే చేరుకున్నాయి’’ అని నివేదిక తెలిపింది. ఈ తరహా మరణాల తగ్గింపులో కేరళ (8), తమిళనాడు (13), ఢిల్లీ (14)ముందు వరుసలో ఉండగా తెలంగాణలో ప్రతి వెయ్యి మందికి 23 మరణాలు ఉన్నాయని వెల్లడించింది. శిశు మరణాల రేటు 2019లో ప్రతి వెయ్యి మందికిు 30 ఉండగా, 2020 నాటికి అది 28కి తగ్గిందని తెలిపింది. -
మొదటి పుట్టినరోజు జరక్కుండానే
న్యూఢిల్లీ: దేశంలో శిశు మరణాల రేట్(ఐఎంఆర్) గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా..మొత్తమ్మీద పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఇప్పటికీ దేశంలో పుట్టే ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే కన్నుమూస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికలోని విషయాలు ఈ కఠోర సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సమయంలో (ఏడాది నిండకుండానే) మరణించే శిశువుల సంఖ్యను ఐఎంఆర్‌గా పేర్కొంటారు. 1971లో ఐఎంఆర్ 129 కాగా, 2020 సంవత్సరం నాటికి ఇది 28కు..అంటే సుమారు నాలుగో వంతుకు తగ్గింది. గత దశాబ్ద కాలంలో ఐఎంఆర్‌లో 36% తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్త ఐఎంఆర్ 44 నుంచి 28కి తగ్గిపోయింది. ఈ సమయంలో ఐఎంఆర్ పట్టణప్రాంతాల్లో 29 నుంచి 19కి, గ్రామీణ ప్రాంతాల్లో 48 నుంచి 31కి దిగివచ్చింది. అంటే వరుసగా 35%, 34% తగ్గుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. ఇంతగా ఐఎంఆర్ పడిపోయినా ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకుండానే కన్నుమూస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ఐఎంఆర్ అత్యధికంగా 43 కాగా, మిజోరంలో 3 మాత్రమేనని తెలిపింది. దేశవ్యాప్తంగా గత 5 దశాబ్దాలుగా జననాల రేటులో కూడా తగ్గుదల వేగంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 1971లో 36.9% ఉన్న జననాల రేటు 2020కి 19.5%కి తగ్గింది. 2011–2020 సంవత్సరాల మధ్య జననాల రేటు 11% తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఒక ప్రాంతంలో ఏడాది సమ యంలో నమోదైన జననాల రేటు ప్రాతిపదికగానే జనాభా పెరుగుదల రేటును అంచనా వేస్తారు. -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల కారణంగానే ఈ పురోగతి కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది శిశువులు చనిపోయేవారని ఎస్ఆర్ఎస్ వెల్లడిం చింది. 1971లో దేశంలో శిశు మరణాల సంఖ్య 129గా ఉండేది. 21 రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల సంఖ్య అత్యంత తక్కువగా కేరళలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 43 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాంలో ముగ్గురు, ఎక్కువగా మేఘాలయలో 29 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో అధికంగా శిశు మరణాలు.. రాష్ట్రంలో ప్రతి వెయ్యి జననాలకు మగ శిశు మరణాలు 21, ఆడ శిశువుల మరణాల సంఖ్య 22గా ఉంది. పట్టణాల్లో శిశు మరణాల సంఖ్య 17 ఉండగా, పల్లెల్లో 24 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో మరణించే వారిలో ప్రతి వెయ్యి జననాలకు 25 మంది మగ శిశువులు, 24 మంది ఆడ శిశువులు ఉంటున్నారు. పట్టణాల్లో మరణించే శిశువుల్లో 16 మంది మగ, 18 మంది ఆడ శిశువులు ఉంటున్నారు. రాష్ట్రంలో శిశు మరణాల సంఖ్యలో గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఎక్కువ తేడా కనిపిస్తోంది. ఈ తేడాకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పట్టణాల్లోనైతే వైద్య వసతి అధికంగా ఉండటం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ?
Most unsafe hospital భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో గత ఐదేళ్లలో సగటున దాదాపు 37 మంది శిశువులు మృతిచెందారు. దేశంలోని మొత్తం శిశు మరణాలలో 13 శాతం మరణాలు ఈ హాస్పిటల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఎన్సీయూ యూనిట్లో ఈ ఏడాది (2020- 21) దాదాపు 5,00,996 నవజాత శిశువులను చేర్చుకోగా, వారిలో 68,301 మంది మరణించారు. 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. ఈ యూనిట్లో చేరిన చాలా మంది శిశువులు క్రిటికల్ కండీషన్లో ఉన్నారు. డిసెంబర్ 21న (మంగళవారం) రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుడు జితు పట్వారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి ఈ డేటాను అందించారు. నెలలు నిండని శిశువులు కూడా హమీడియా ఆసుపత్రిలో చేరారని ఆరోగ్య మంత్రి తెలియజేశారు. ఐతే ఈ శిశువుల ఆరోగ్య భద్రతపై మంత్రి వ్యాఖ్యానించలేదు. అత్యంత ప్రమాదకర ఆసుపత్రి ఈ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది మధ్యప్రదేశ్‌లోనే హమీడియా హాస్పిటల్ అత్యంత ప్రమాదకర ఆసుపత్రి అని పట్వారీ పేర్కొన్నాడు. ఇది ఆందోళన కలిగించే విషయమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని పట్వారీ పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా 2018 శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్ ముందంజలో ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రతి వెయ్యి శిశుజననాలకుగాను 48 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో భవనాలు కూలిపోవడం, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల వంటివాటివల్లకూడా వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌లో భోపాల్‌లోని కమ్లా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన 40 మంది నవజాత శిశువుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తర్వాత 48 గంటల్లో మరో పది మంది మరణించారు. చదవండి: Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ! -
బంగారు తల్లులు అమ్మకే బరువుగా మారుతున్నారు..!
ఔను...అమ్మకే ఆడ శిశువు బరువవుతోంది. దీంతో జిల్లాలో మగ,ఆడ పిల్లల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలి కాన్పులో కూడా ఆడపిల్లను తిరస్కరించడంతో పిండ దశలోనే పిండేస్తున్నారు. చట్టరీత్యా నేరమని తెలిసినా నారీ గళాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. నిఘాల మాటునే నీరుగార్చేస్తున్నారు. సాక్షి,విజయనగరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడపిల్లను పిండ దశలోనే పిండేస్తున్నారు. దీంతో మగపిల్లల నిష్పత్తితో పోల్చుకుంటే ఆడపిల్లల నిష్పత్తి (1000:938)గా గుర్తించారు. జిల్లాలో బంగారు తల్లులను ఉమ్మనీటిలోనే కన్నుమూసే పరిస్థితి ఎదురవుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడే లోపల పెరిగేది ఆడ, మగ అని తెలుసుకుని మరీ చంపేస్తున్న ఘటనలు వైద్యుల సాయంతోనే గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇందుకు గర్భిణులు కూడా సహకరిస్తుండడంతో ఇవేవీ బయటకు రావడం లేదు. జిల్లాలో 66 ప్రైవేట్, 14 ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లున్నాయి. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం సంబంధిత వ్యక్తులకు సైగలతో చెప్పడంతో గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రూ.10 వేలు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిసినా పరస్పర ఒప్పంద ప్రాతిపదికగా చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. రెండోసారి తప్పు చేసినట్లు నిర్ధారణయితే ఐదేళ్లపాటు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు వైద్య ధ్రువీకరణ పత్రం భారత వైద్య మండలి ద్వారా ఐదేళ్ల రద్దు చేస్తారు. తర్వాత కూడా ఇదే పనికి పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానాతోపాటు శాశ్వతంగా వైద్య ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తారు. 12 ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే అనుమానంతో జిల్లాలో బొబ్బిలి, ఎస్.కోట, సాలూరు ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం. ఇలా మొత్తం 12 ఆసుపత్రుల్లో తమ సిబ్బంది డెకోయ్ ఆపరేషన్ నిర్వహించింది. వైద్యులు తప్పిదాలకు పాల్పడితే వారి వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా రద్దు చేస్తాం. గర్భస్ధ పిండం పరిస్ధితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో డెకోయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల్లో ఎవరైనా సరే లింగ నిర్ధారణకు పాల్పడుతున్నారని తెలిస్తే నేరుగా 9849902385 నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ, విజయనగరం చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’ -
తెలంగాణలో పురోగతి.. ప్రతి వెయ్యికి 23 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కారణంగానే ఈ పురోగతి కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 2019లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) సర్వే నిర్వహించి తాజాగా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 30 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 23 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది చనిపోయేవారని ఎస్ఆర్ఎస్ వెల్లడించింది. 1971లో దేశంలో శిశు మరణాల రేటు 129 ఉండేది. 21 పెద్ద రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల రేటు అత్యంత తక్కువగా కేరళలో ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 46 మంది మరణిస్తున్నారు. 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాం, నాగాలాండ్‌లో ప్రతి మందికి ముగ్గురు చొప్పున శిశువులు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మేఘాలయలో 33 మంది మరణిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత తక్కువగా అండమాన్ అండ్ నికోబార్‌లో ఏడుగురు మరణిస్తుండగా, అత్యంత ఎక్కువగా డామన్, డయ్యూలో 17 మంది శిశువులు మరణిస్తున్నారు. పల్లెల్లో అధికంగా శిశు మరణాల రేటు.. రాష్ట్రంలో మగ శిశు మరణాల రేటు 24, ఆడ శిశువుల మరణాల రేటు 22గా ఉంది. పట్టణాల్లో శిశు మరణాల రేటు 18 ఉండగా, పల్లెల్లో 26 మంది మరణిస్తున్నారు. పల్లెల్లో మరణించే శిశువుల్లో 27 మంది మగ శిశువులు, 25 మంది ఆడ శిశువులు ఉన్నారు. పట్టణాల్లో మరణించే శిశువుల్లో 18 మంది మగ, 19 మంది ఆడ శిశువులు ఉన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటులో గ్రామాలకు, పట్టణాలకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఈ తేడాకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడమేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదో అర్ధ రాత్రి గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లే దిక్కుండదు. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే సరికి శిశు మరణాలు సంభవిస్తున్నాయన్న భావన నెలకొని ఉంది. సమీప పట్టణాలకు తీసుకెళ్లాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది. ఇక గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. పట్టణాలు, నగరాల్లోనైతే వైద్య వసతి అధికంగా ఉండటం వల్ల ఇక్కడ శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ప్రసవ సమయంలో తక్షణమే స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటేనే శిశు మరణాల రేటు తక్కువగా నమోదు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తగ్గుదలకు కారణాలివే.. తెలంగాణలో శిశు మరణాలు గతం కంటే తగ్గడానికి ప్రధాన కారణం ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడమేనని చెబుతున్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం, ఆసుపత్రుల్లో శిశు మరణాలు పెరగకుండా ప్రత్యేకమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడమేనని పేర్కొంటున్నారు. కేసీఆర్ కిట్‌ను ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు ప్రోత్సాహకం ఇస్తుండటం కూడా శిశు మరణాల రేటు తగ్గుతోందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
జనాభా కాదు... నైపుణ్యం ముఖ్యం!
ప్రపంచ జనాభా కోటి నుంచి వంద కోట్లకు చేరుకోవడానికి 5,000 సంవత్సరాలు పట్టింది. కానీ ఎప్పుడైతే సైన్సు అందుబాటులోకి వచ్చిందో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గి, జన విస్ఫోటనం పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ మార్కుకు చేరుకుంది. ఇది 2030లో సుమారు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. మనిషి సగటు జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 నుండి 2019 వరకు 72.6 ఏళ్లకు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా 1980లలో వన్–చైల్డ్ విధానం అమలు చేయడానికి ముందు జన్మించిన తరాలు నేడు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. రాబోయే పదేళ్ళలో 55 అంతకంటే ఎక్కువ వయసు గల 12.39 కోట్ల మంది అక్కడ ఉండబోతున్నారు. చైనా జనాభా సగటు వయసు 1990లో 25 ఏళ్లు ఉండగా, 2020లో 38 ఏళ్లకు పెరిగింది. జనాభా సంక్షో భాన్ని నివారించడానికి దశాబ్దాల నాటి వన్–చైల్డ్ పాలసీని సడలించి నప్పటికీ, చైనా జనన రేటు 2017 నుండి స్థిరంగా క్షీణించింది. ప్రధాన నగరాల్లో పిల్లలను పెంచడానికి అధిక వ్యయంతో పోరాడుతున్న జంటలు, మహిళా సాధికారత పెరగడం వల్ల సహజంగానే ప్రసవాలను ఆలస్యం చేయడం లేదా నివారించడం దీనికి కారణం. జనాభా నియంత్రణ విధానాన్ని తీసివేస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వానికి జనాభా శాస్త్రవేత్తలు సూచించారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ టెక్నాలజీ సాయంతో ప్రతికూల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చుననే వాదన కూడా చైనాలో ఉంది. మరోవైపు 2027 నాటికి చైనా జనాభాను భారతదేశం అధిగమిస్తుందని అంచనా. అయితే భారతదేశంలో ప్రపంచం లోనే అత్యధిక కౌమారులు, యువకులు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం, భారతదేశంలో ప్రతి ఐదవ వ్యక్తి కౌమార దశలో (10–19 సంవత్సరాలు) ఉన్నారు. మొత్తం 23.65 కోట్లు. అయితే దేశ భవిష్యత్తు కార్మికుల సంఖ్య పెంచడం కంటే, ప్రతి కార్మికుడి నైపుణ్యాలు, ఉత్పత్తి విలువను పెంచడం మీద ఆధారపడి ఉంటుంది. స్వాతంత్య్ర కాలంలో దేశ జనాభా 35 కోట్లు. అప్పటి నుండి నాలుగు రెట్లు పెరిగింది. 2019లో ఇది 1.37 బిలియన్లు. జనాభా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. అధిక జనాభా వల్ల సహజ వనరులను వేగంగా వినియోగించుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా పెరుగుతున్న జనాభా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దృష్ట్యా 2019 ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ’జనాభా విస్ఫోటనం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని ప్రకటించారు. జనాభా విషయంలో సామాజిక అవగాహన చాలా అవసరమని నొక్కి వక్కా ణించారు. దేశాల మధ్య జనాభా అసమతుల్యత కారణంగా విపత్కర పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఒక రాష్ట్రం, దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా పటిష్టమైన విధానాన్ని అవలంబిం చాలి. తద్వారా పటిష్టమైన మానవ వనరులను ఏర్పరుచుకోవడా నికి అవకాశం ఉంటుంది. అది ప్రకృతి పైన భారాన్ని తగ్గించి, మానవ, జీవజాతుల శ్రేయస్సుకు దోహదకారి అవుతుంది. చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ‘ 91825 52078 (నేడు ప్రపంచ జనాభా దినోత్సవం) -
శిశుసంరక్షణపై మరింత శ్రద్ధ అవశ్యం
చిన్నారుల ఆరోగ్యం పట్ల ఎలా వ్యవహరిస్తున్నామన్న అంశమే ఏ సమాజ భవిష్యత్తుకైనా గీటురాయి అవుతుందని నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఒక సందర్భంలో చెప్పారు. శిశువులను జాతి సంపదగా భావించి వారి శ్రేయస్సుకు చేతనైనదంతా చేస్తేనే భవిష్యత్తు సమాజం మెరుగ్గా వుంటుంది. సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటైన శిశు మరణాల నియంత్రణలో మన దేశం ఆనాటికానాటికి పురోగతి సాధిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వున్న శిశు మరణాల అధ్యయన సంఘం నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం 1990లో మన దేశంలో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతి వేయి మందికి 126మంది చనిపోయేవారు. ఇప్పుడా సంఖ్య 34కి తగ్గింది. ఈ వయసు పిల్లల్లో మరణాల రేటు గత రెండు దశాబ్దాల్లో ఏటా 4.5 శాతం చొప్పున తగ్గుతున్నదని నివేదిక అంటోంది. అంకెల రూపంలో చెప్పాలంటే 1990లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు మన దేశంలో 34 లక్షలుంటే... ఇప్పుడది 8,24,000కు తగ్గింది. మాతా శిశు సంరక్షణ కోసం పథకాలు రూపొందించి, వాటికి తగినన్ని నిధులు కేటాయించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి. అయితే ఈ కృషి సరిపోదు. ఈ రంగంలో మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అయిదేళ్లలోపు పిల్లల మరణాల్లో 49 శాతం కేవలం అయిదు దేశాల్లో సంభవిస్తున్నాయని నివేదిక వివరిస్తోంది. ఆ అయిదు దేశాల్లో నైజీరియా ప్రథమ స్థానంలో వుంటే మన దేశం రెండో స్థానంలో, పాకిస్తాన్, ఇథియోపియా, కాంగో ఆ తర్వాతి స్థానాల్లో వున్నాయి. అంటే ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు సగం ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి. గర్భధారణ సమయంలో మహిళలకు అవసరమైన పోషకాలు లభ్యమయ్యేలా చూస్తే, వారి ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటే పుట్టే శిశువు ఆరోగ్యవంతంగా వుంటుంది. ఆ సమయంలో మహిళకు అందించే కొద్దిపాటి ఆసరా ఆమె ప్రాణాలను నిలబెట్టడమే కాదు... పుట్ట బోయే శిశువుకు సైతం ఎంతగానో ఉపకరిస్తుంది. గర్భిణులూ, బాలింతల్లో రక్తహీనత వుంటే శిశువుల్లో కూడా ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు. ప్రసూతి సమయంలో సమస్యలు ఏర్పడటం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం, పుట్టిన నెలలోనే వ్యాధిబారిన పడటం, న్యూమోనియా, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు అయిదేళ్లలోపు శిశువుల మరణాలకు కారణమవుతు న్నాయి. సకాలంలో వ్యాక్సిన్లు అందించడంవల్లనే గత మూడు దశాబ్దాల్లో ఈ మాదిరి మరణాలు చాలా వరకూ అరికట్టడం సాధ్యమైంది. అయితే ఈ కృషి మరింతగా పెరగాలి. మన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరమైన సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమేనన్నది చేదు నిజం. పేరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా అక్కడ తగినంతగా సిబ్బంది వుండరు. అవసరమైన మందులు లభించవు. ఊరూరా తిరిగి గర్భిణులను గుర్తించి, వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే విస్తృతమైన నెట్ వర్క్ మన దేశంలో అమలవుతోంది. కానీ ఇదింకా పూర్తి సంతృప్తికరంగా లేదు. ఆ నెట్వర్క్ ద్వారా గర్భిణులకు కొంత మేర సాయం అందుతున్నా వైద్య రంగ మౌలిక సదు పాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడం పెద్ద శాపంగా మారింది. కనుకనే ప్రసవాల కోసం మంత్ర సానులను ఆశ్రయించే ఆచారం ఇంకా తగ్గలేదు. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు ఎంతో మెరుగని చెప్పాలి. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగినప్పుడే నవ జాత శిశుమరణాలు తగ్గుముఖం పడతాయని వైద్యరంగ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలని 2015 సెప్టెంబర్‌లో ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, శిశు మరణాల తగ్గింపు, ఆహారభద్రత, నాణ్యతగల విద్య తదితరాలున్నాయి. ఇవి సాధించాలంటే మనం ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం వుంది. అలా చేయగలిగితే నైజీరియా, పాకిస్తాన్, కాంగో వంటి దేశాల సరసన చేరే పరిస్థితి రాదు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి అన్ని రంగాలనూ ధ్వంసం చేసినట్టే ఆరోగ్య రంగ వ్యవస్థనూ కూడా దెబ్బతీసింది. ముఖ్యంగా శిశు మరణాల అదుపుకోసం దశాబ్దాలుగా శ్రమించి సాధించిన విజయాలను అది నాశనం చేసే ప్రమాదం కనబడుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్రమత్తతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలు ఎంతో ప్రశంసించదగ్గవి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వైద్యం రూపురేఖలు మార్చడానికి నడుంకట్టింది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రా లుంటే వాటిల్లో 80 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇకపై ప్రతి ఒక్క కేంద్రానికీ అన్ని సదుపాయాలతో కూడిన సొంత భవనం వుండాలన్నది ఏపీ ప్రభుత్వం తాజాగా పెట్టుకున్న లక్ష్యం. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల పేరిట వీటి రూపురేఖలు సంపూర్ణంగా మార్చి ప్రతి 2,500 మందికి ఒక కేంద్రం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు టీకాలు వేయించుకునే అవకాశం వుండటంతోపాటు 90 రకాల మందులు లభ్యమవుతాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారు, ఏఎన్ఎం అక్కడ అందుబాటులో వుంటారు. ఇటు తెలంగాణలో గ్రామీణ వైద్యరంగాన్ని మెరుగుపరచడంతోపాటు మాతా శిశు రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకం, ఆ మరుసటి ఏడాది ప్రారంభించిన అమ్మ ఒడి శిశు మరణాల రేటను తగ్గించడంలో గణనీయంగా తోడ్పడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా...ముఖ్యంగా ఉత్తరాదిన వైద్య రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే ప్రభుత్వాలు క్రియాశీలకంగా పనిచేస్తే అసంఖ్యాక పసిప్రాణాలను గండం నుంచి గట్టెక్కించగలమని పాలకులు గుర్తించాలి. -
భారత్‌లో తగ్గిన శిశు మరణాలు
ఐక్యరాజ్యసమితి: భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 1990–2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని తెలిపింది. ‘చైల్డ్ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్స్ 2020’ పేరుతో ఐరాస నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది. ► భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయ్యి మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది. ► ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పట్టాయి. ► అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి. ► సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి. -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు వయసున్న శిశువుల మరణాల రేటు రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల కిందట ప్రతి వెయ్యి జననాలకు శిశువులు 39 మంది మరణిస్తుండగా.. తాజాగా 2018 గణాంకాల్లో 27కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్)’సర్వేలో వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2.15 లక్షల జనాభా నుంచి నమూనాల నమోదు చేపట్టారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (32) కంటే తెలంగాణ (27)లో తక్కువగా నమోదవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ కిట్, మిషన్ ఇంద్రధనుష్ పథకం, ప్రభుత్వం 29 ఎస్ఎన్సీయూలను నిర్వహిస్తూ నవజాత శిశు ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. ఫలితంగా శిశు మరణాల రేటు తగ్గినట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 30 ఉండగా పట్టణాల్లో 21 మాత్రమే ఉంది. (చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..) -
అమ్మ.. హ్యాపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 3,675 మంది శిశువులు చని పోగా, 2019–20 సంవత్సరంలో 2,408 మంది మృతి చెందినట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వం శిశు మరణాల తగ్గుదలపై అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నందువల్లే మరణాలు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1,040 శిశు మరణాలు సంభవించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి (10 నెలల్లో) వరకు 498 మంది చనిపోయినట్లు తెలిపింది. అంటే సగం పైగా మరణాలు తగ్గడం గమనార్హం. నల్లగొండ జిల్లాలోనూ గత ఆర్థిక సంవత్సరంలో 207 మంది శిశువులు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 138 మంది చనిపోయారు. ఇక వరంగల్ అర్బన్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో 726 మంది చనిపోగా, ఈ సారి ఆ సంఖ్య 99కు తగ్గింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 245 మంది శిశువులు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 66కు పడిపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ గతంలో 248 మంది చనిపోగా, ఈసారి ఆ సంఖ్య 53కు పడిపోయింది. అయితే కొన్ని జిల్లాల్లో శిశు మరణాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో 34 మంది శిశువులు చనిపోగా, ఈసారి ఏకంగా 139 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో నలుగురు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే 32 మంది శిశువులు చనిపోయారు. అలాగే భూపాలపల్లి జిల్లాలో గతంలో ఇద్దరు చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 27 మంది శిశువులు కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 79 మంది చనిపోగా, ఇప్పుడు 139 మంది శిశువులు చనిపోయారు. ‘రూరల్’లో ఎక్కువ.. ‘అర్బన్’లో తక్కువ ఇటు రాష్ట్రంలో పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగే శిశువుల శాతం గతం కంటే తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పుట్టిన శిశువుల్లో గంటలోపే తల్లిపాలు తాగినవారు 79.2% మంది ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 74.3 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 99.2 శాతం, సూర్యాపేటలో 99%, వరంగల్ రూరల్ జిల్లాలో 99.3% శిశువులు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగటం విశేషం. అత్యంత తక్కువగా వరంగల్ అర్బన్ జిల్లాలో 33.9 శాతం శిశువులు మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగుతున్నారు. తల్లిపాలు గంటలోపు తాగితేనే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని, భవిష్యత్తులో పిల్లలు ఇతరత్రా అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అనేక సందర్భాల్లో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతుండటం వంటి కారణాల వల్ల తల్లులు గంటలోగా శిశువులకు పాలిచ్చే పరిస్థితి ఉండటం లేదంటున్నారు. ఇక రెండున్నర కేజీల బరువు కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారి సంఖ్య గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో 32,586 మంది రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి అంటే 10 నెలల కాలంలోనే 34,696 మంది అలా తక్కువ బరువుతో పుట్టడం గమనార్హం. దాదాపు సగం తగ్గిన ఇన్ఫెక్షన్ మరణాలు.. శిశు మరణాలు వివిధ కారణాల వల్ల సంభవిస్తాయి. ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా సహా ఇతరత్రా కారణాలుంటాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోయిన వారి శాతం గణనీయంగా తగ్గింది. దాదాపు సగం మేరకు తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో ఇన్ఫెక్షన్లతో 6.9 శాతం మంది చనిపోగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పుట్టిన తర్వాత శ్వాస ఆడకపోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం తదితర కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం మంది చనిపోగా, ఈసారి 6.4 శాతం తగ్గడం విశేషం. ఇక శిశు మరణాల్లో న్యుమోనియాతో చనిపోయే వారి శాతం రెండింతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మరణించిన శిశువుల్లో న్యుమోనియాతో 2.4 శాతం మంది మరణిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి నాటికి 5.4 శాతానికి చేరింది. -
శిశుమరణాల్లో మనదే రికార్డు
రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులలో 2019 డిసెంబర్ 1 నుంచి 500 శిశుమరణాలు చోటుచేసుకున్నాయని వార్తలు. రాజస్తాన్ కోటాలోని జేకే లోన్ ఆసుపత్రిలోనే 101 మంది శిశువులు హరీమన్నారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్, ఎండీఎమ్ ఆసుపత్రులలో 102 మంది, బికనీర్‌లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్‌లో 124 మంది శిశువులు మరణించడం విచారకరం. గుజరాత్ రాజ్‌కోట్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో 111 మంది, అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 85 మంది శిశువులు చనిపోయారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2018లో 7,21,000 శిశుమరణాలు చోటుచేసుకున్నాయని అంచనా. అంటే సగటున రోజుకు 1,975 మంది శిశువులు చనిపోయినట్లు లెక్క. శిశుమరణాల సమస్య ఒక్క కోటా సమస్యే కాదని గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై పనిచేస్తున్న మమతా కార్యనిర్వాహక డైరెక్టర్, శిశువైద్యుడు సునీల్ మెహ్రా పేర్కొన్నారు. ‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేకపోవడం, రోగులను నిపుణులకు సిఫార్సు చేయడంలో జాప్యం, రవాణా సౌకర్యాల లేమి వంటి సంస్థాగత సమస్యలే శిశుమరణాలకు అధికంగా కారణాలవుతున్నాయి’ అని అన్నారు. దేశవ్యాప్తంగా పిల్లలు, శిశువులు ఇంత అధికంగా ఎందుకు చనిపోతున్నారో అర్థం చేసుకోవడానికి డేటా విశ్లేషణ సంస్థ ఇండియాస్పెండ్ 13 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య డేటాను విశ్లేషించింది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం వంటి పేద రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి సంపన్న రాష్ట్రాల ఆసుపత్రుల్లో కూడా శిశుమరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటితో పోలిస్తే గోవా, కేరళ, తమిళనాడులోనే శిశుమరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా నమోదయ్యాయి. ఆరోగ్య మౌలిక వసతులు, శిశు సంరక్షణ, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానంతర సంరక్షణ వంటి అంశాల్లో నాసిరకం నాణ్యతవంటివి శిశువుల ప్రాణాలను హరిస్తున్నాయని విశ్లేషణ చెబుతోంది. పోషకాహార లోపం, పారిశుద్ధ్యం, రోగనిరోధకశక్తి వంటి వైద్యేతరమైన సమస్యలే శిశుమరణాలకు కారణమవుతున్నాయని ఢిల్లీలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపా సిన్హా చెప్పారు. న్యూమోనియా వంటి ప్రాథమిక స్థాయిలోనే చికిత్స చేయదగిన ఇన్ఫెక్షన్ల వల్లే శిశుమరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అంటే వ్యాధినిరోధక, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కుప్పకూలిపోయినట్లు చెప్పవచ్చని ఆమె చెప్పారు. ప్రపంచంలోనే మరణాల రేటు అధికం 2018లో భారతదేశంలో అయిదేళ్ల లోపు పిల్లలు 8,82,00 మంది చనిపోయారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు. భారత్‌లో అతిపెద్ద శిశుజనాభాలో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు (1000 మంది శిశువుల్లో 37మంది) నమోదవుతున్నప్పటికీ ప్రపంచ సగటు శిశుమరణాల రేటు (39)తో పోలిస్తే తక్కువగానే ఉంది. 1990లో వెయ్యిమందికి 126 మంది పిల్లలు మరణిస్తున్న స్థాయినుంచి సగటు శిశుమరణాల రేటు తగ్గుముఖం పట్టింది. పిల్లలకు అయిదేళ్లు రాకముందే ఎక్కువ మరణాలు మనదేశంలో సంభవిస్తున్నాయి. 2017లో సంవత్సరం వయసున్న పిల్లల్లో వెయ్యికి 33 మంది పిల్లలు చనిపోయారు. 11 ఏళ్లకు ముందు ఇది 42 శాతంగా ఉండేదని ప్రభుత్వ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ తెలిపింది. అయితే రాష్ట్రాల వారీగా చూస్తే శిశుమరణాల విషయంలో భారీ వ్యత్యాసాలను గమనించవచ్చు. 2017లో నాగాలాండ్ అత్యంత తక్కువగా 7 శాతం, గోవా (9), కేరళ (10) శిశుమరణాల రేటును నమోదు చేయగా, మధ్యప్రదేశ్ 47 శాతం అత్యధిక రేటును నమోదు చేసింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో విపరీతమైన రద్దీ అయిదేళ్లలోపు శిశువుల మరణాల్లో కొత్తగా పుట్టిన శిశువులవే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రసవానంతరం మాతా, శిశు ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను కల్పించడం ద్వారా వీరిలో చాలామంది శిశువులను కాపాడవచ్చని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ 2019 నివేదిక తెలిపింది. దేశంలో సంస్థాగత ప్రసవాల రేటు 2005లో 38.7 శాతంతో పోలిస్తే 2015–16 నాటికి 78.9 శాతం పెరిగింది. కానీ ఈ ప్రసవాల రేటుకు అనుగుణంగా నవజాత శిశువుల సంరక్షణలో మౌలిక వసతుల కల్పన పెరగలేదని గుజరాత్ ఆనంద్‌లోని ప్రముఖ్‌స్వామి మెడికల్ కాలేజ్ శిశువైద్య శాఖ ప్రొఫెసర్ సోమశేఖర్ నింబాల్కర్ తెలిపారు. 28 రోజుల వయసు ఉన్న నవజాత శిశువుల్లోనే అత్యధిక మరణాలు (57.9 శాతం) సంభవించాయని ది లాన్సెట్‌లో ప్రచురితమైన 2019 అధ్యయనం చూపింది. కంగారూ కేర్ (అంటే తల్లితో అత్యంత సమీపంలో శిశువును ఉంచి వెచ్చదనాన్ని అందించడం, తల్లి పాలు తాపడం, ఇన్ఫెక్షన్ల నుంచి, శ్వాస సమస్యల నుంచి ప్రాథమిక సంరక్షణ కల్పించడం, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా ఈ చిన్నారుల మరణాలను అరికట్టవచ్చు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద నవజాత శిశు సంరక్షణ వ్యవస్థలను పిల్లలను ప్రసవించే అన్ని కేంద్రాల్లో ఏర్పర్చారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రాథమిక రెఫరల్ యూనిట్లను, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లను నెలకొల్పారు. కానీ ఈ శిశు సంరక్షణ కేంద్రాల్లో వాటి శక్తికిమించిన రోగులు వెల్లువెత్తుతున్నారు. పైగా వైద్యుల కొరత, ఆసుపత్రిలో పడకల కొరత, వైద్యసామగ్రిని సకాలంలో మరమ్మతు చేసే యంత్రాంగాల కొరత తారాస్థాయికి చేరినట్లు జర్నల్ ఆఫ్ పెరినెటాలజీలో ప్రచురితమైన 2016 అధ్యయనం పేర్కొంది. 83 శాతం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో నవజాత శిశు కేంద్రాలు ఉంటుండగా, 59శాతం కేంద్రా ల్లో ఆరోగ్య స్థిరీకరణ విభాగాలు లేవని 2018 గ్రామీణ ఆరోగ్య గణాంకాల నివేదిక తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర మినహా తక్కిన 13 రాష్ట్రాల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో శిశువైద్య నిపుణులు లేరు. దీంతో చాలామంది రోగులు జిల్లా ఆసుపత్రుల వంటి ప్రాదేశిక సంరక్షణ విభాగాల్లో చేరాల్సి వస్తోంది. దీంతో అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ కేంద్రాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. ఈ పరిస్థితి ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమవుతోంది. పుట్టుకకు ముందే సమస్యలు శిశు, పిల్లల మరణాల్లో గృహ సంపద, ప్రసూతి విద్య అనేవి ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. విద్యావంత మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పిల్లలకు మెరుగైన ఆరోగ్య పరిస్థితులను కల్పిస్తున్నాయని ఇండియాస్పెండ్ 2017 మార్చి 20న ప్రకటించింది. 20 శాతం సంపన్న గృహాల్లో పుట్టిన శిశువులు 20 శాతం నిరుపేద గృహాల్లో పుట్టిన శిశువుల కంటే మూడు రెట్లు ఎక్కువగా మనగలిగే పరిస్థితులు ఉంటున్నాయి. పదేళ్లవరకు మాత్రమే చదువుకుని, బాల్యవివాహాలు ఎక్కువగా చేసుకున్న మహిళలు ఉంటున్న మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో శిశుమరణాలను అధికంగా నమోదు చేస్తున్నాయి. పైగా ఈ రాష్ట్రాల్లోని మహిళలకు రక్తహీనత, పోషకాహార లేమి, అధిక రక్తపోటు, ప్రసవానంతర మధుమేహంపై ప్రత్యేక సంరక్షణ చర్యలు అందుబాటులో లేవు. ప్రసవానంతర సంరక్షణ అతి తక్కువగా లభిస్తున్న రాష్ట్రాల్లో బిహార్ అగ్రగామిగా ఉంటోంది. ప్రసవసమయంలో సమస్యలు అయిదు మంది పిల్లల్లో ఒక్కరు 205 కేజీలకంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇక సగంమంది పిల్లలు మాత్రమే ఆరునెలలపాటు తల్లి పాలు తాగగలుగుతున్నారు. తల్లిపాలకు నోచుకున్న పిల్లల ఆరోగ్యం మాత్రం గణనీయంగా మెరుగుపడుతోంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అతిపెద్ద సమస్య ఏదంటే తక్కువ బరువుతో పుట్టడం, తల్లికి పోషకాహార లేమి ఉండటమేనని ఐఐటీ బాంబేకి చెందిన గ్రామీణప్రాంతాల సాంకేతిక ప్రత్యామ్నాయాల కేంద్రం శిశువైద్య నిపుణురాలు రూపల్ దలాల్ చెబుతున్నారు. శిశువుకు జన్మనిచ్చిన సమయంలో బిడ్డకు పాలుతాపడంపై గ్రామీణ తల్లులకు సరైన మార్గదర్శకత్వం లేదు. దీనితో తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమా దం ఎక్కువగా ఉంటోందని డాక్టర్ రూపల్ తెలి పారు. శిశువు పుట్టిన తర్వాత పాలు తాపడంలో జాప్యం జరిగితే అలాంటి పిల్లల ప్రాణాలకే ప్రమా దం సంభవిస్తుందని, తల్లిపాలకు ఎంత సమయం దూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రమాదం నవజాత శిశువులకు కలిగే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ నివేదిక హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన నలుగురు బిడ్డల్లో ఒక్కరికి మాత్రమే గంటలోపే తల్లిపాలు అందుతుండగా రాజస్తాన్‌లో 28.4 శాతం పిల్లలు తల్లిపాలు లేకుండా గంటపైగా గడుపుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే పిల్లల అధిక మరణాల రేటును చూడవచ్చు. ఇక పిల్లలకు టీకాలు తగినంత మేరకు లభిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు (69.7శాతం), గోవా (88.4శాతం) అగ్రస్థానంలో ఉంటున్నాయి. అస్సాం (47.1 శాతం), గుజరాత్ (50.4శాతం), ఉత్తరప్రదేశ్ (51.1 శాతం), రాజస్తాన్ (45.2 శాతం) రాష్ట్రాలు పిల్లలకు రోగనిరోధక శక్తి అత్యల్పంగా ఉన్న జాబితాలో అన్నిటికంటే దిగువన ఉంటున్నాయి. ఇకపోతే 2017లో ప్రచురితమైన ఇండియాస్పెండ్ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు పిల్లల్లో అధికమరణాలకు పోషకాహార లేమి ప్రధాన కారణమని తెలిసింది. ఇది మొత్తం శిశుమరణాల్లో 68.2 శాతంగా ఉంటోంది. స్వగతా యాదవర్, శ్రేయా రామన్, ప్రముఖ డేటా విశ్లేషకులు ‘ది వైర్’ సౌజన్యంతో.. -
మూఢనమ్మకాలెక్కువ..
గిరిజనులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం.. వారికి అన్ని సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందిస్తాం.. ఈ మాటలు అధికారులు, పాలకులు ఎప్పటికప్పుడు వల్లెవేస్తూనే ఉంటారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గిరిజన ప్రాంతంలో వైద్యం, అంగన్వాడీ సేవలు అంతంతమాత్రమే. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. అలాగే వైద్యసేవల తీరు కూడా అంతే. వీటన్నింటికీ తోడు మూఢనమ్మకాల ప్రభావం గిరిపుత్రులపై ఎక్కువగా ఉంటోంది. గర్భిణికి పురిటినొప్పులు వస్తే క్షుద్రపూజలు చేయించి పసర మందు తాగించింది ఓ గిరిజన కుటుంబం. అలాగే మరోచోట పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి దెయ్యం పట్టిందని ఆమె దగ్గరకే వెళ్లలేదు ఆ కుటుంబ సభ్యులు. ఇలాంటి సంఘటనలు మన్యంలో కోకొల్లలు. మరి వీరిని చైతన్యపరచాల్సిన అధికారుల జాడెక్కడ..? అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న పాలకులేరీ...? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నా సమాధానాలు దొరక్కుండానే మిగిలిపోతున్నాయి. సాలూరురూరల్: మైదాన ప్రాంతాలతో పోలిస్తే గిరిశిఖర గ్రామాల్లో మాతా,శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమాయక గిరిజనులకు వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. గ్రామాలకు రహదారి సౌకర్యం అంతంతమాత్రమే కావడం.. మూఢనమ్మకాలను విశ్వసించడం, తదితర కారణాల వల్ల మన్యంలో మరణాలు సంభవిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల సేవలు మన్యంలో అంతంతమాత్రంగా ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వైద్యసేవలు కూడా సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు. మరోవైపు గిరిజనులు మూఢనమ్మకాలను విశ్వసించడం వల్ల సకాలంలో ఆస్పత్రులను ఆశ్రయించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పౌష్టికాహారం లోపం, వైద్యం అందకపోవడం, తదితర కారణాల వల్ల మన్యంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాలెక్కువ.. ఏజెన్సీలో పలు మరణాలకు ముఖ్యంగా మూఢనమ్మకాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 16న సాలూరు మండలం సారిక పంచాయతీ మిర్తిగుడ్డివలస గ్రామానికి చెందిన గర్భిణి మువ్వల శారదకు నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు క్షుద్ర గురువును ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు పురిటినొప్పులతో బాధపడుతున్న శారదతో పూజలు చేయించి పసర మందు తాగించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. అలాగే ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలసకు చెందిన అంగన్వాడీ టీచర్ బడ్నాన పార్వతి ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించారు. అయితే ఈమె ప్రసవ నొప్పులతో తల్లడిల్లుతుంటే పలువురు గ్రామస్తులు ఆమెకు దెయ్యం పట్టిందని భావించి ఎవ్వరు చాలా సమయం దగ్గరకు చేరలేదు. చివరకు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చి రక్తపుమడుగులో మృతిచెందింది.బిడ్డ కూడా కన్నుమూశాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గిరిజన గ్రామాల్లో వెలుగు చూడని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య, అంగన్వాడీ సేవలు మెరుగ్గా అందించడంతో పాటు మూఢనమ్మకాలు విడనాడేలా చైతన్యపరచాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ఏడాది సెప్టెంబర్ 17న సాలూరు మండలం మిర్తిగుడ్డివలసకు చెందిన గర్భిణి మువ్వల శారద (20) జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడం.. పౌష్టికాహారలోపం వల్ల ఆమె మృత్యువాత పడినట్లు సమాచారం. ► ఈ ఏడాది జూలై 29న సాలూరు మండలంలోని గిరిశిఖర కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందెకు పురిటినొప్పులు వచ్చాయి. మూడో కాన్పు కావడంతో పాటు నెలలు నిండకపోవడంతో పుట్టిన వెంటనే మగబిడ్డ కన్నుమూశాడు. ఈక్రమంలో గిందెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే భర్త డుంబ్రీ, స్థానికులు డోలి ద్వారా సుమారు 12 కిలోమీటర్లు కొండమార్గం గుండా నడుచుకుంటూ దుగ్గేరు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యాధికారుల సూచనల మేరకు అక్కడ నుంచి 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా గిందె కోలుకుంది. ► ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలస గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త బడ్నాన పార్వతి (24) ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. పుట్టిన బిడ్డ కూడా కొద్ది క్షణాల్లోనే మృతి చెందాడు. పౌష్టికాహారం లోపం వల్లే మరణాలు సంభవించినట్లు సమాచారం. ► 2017 జూలై 24న సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు సాలూరు సీహెచ్‌సీలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రక్తస్రావం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆమెను విజయనగరం ఘోషా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో చిన్నమ్మలు మార్గమధ్యలోనే కన్నుమూసింది. ► 2017 జూలై 24న కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ సకాలంలో వైద్యం అందక ఓ బిడ్డకు జన్మనిచ్చి, తానూ మృత్యు ఒడిలోకి జారుకుంది. ► గర్భిణి పాలక రమణమ్మకు పురిటినొప్పులు రావడంతో గ్రామస్తులు డోలీ సహాయంతో మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరానికి తరలించగా అక్కడ బిడ్డ మృతి చెందాడు. దీంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. -
తగ్గుతున్న శిశుమరణాలు
ఆడపిల్లలను గుండెలమీద కుంపటిగా భావించే రోజులకు ఇక తావులేదు. ఆడపిల్ల పుట్టుకనే శాసించే భ్రూణ హత్యలూ, బాలికల శిశు మరణాలు ఇక ఎంతోకాలం సాగవు అనడానికి ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా గణాంకాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గతంతో పోలిస్తే పుట్టగానే మరణిస్తున్న ఆడపిల్లల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో తగ్గిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శిశుమరణాల విషయంలో సైతం మన దేశంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గత యేడాది 2017లో మన దేశంలో 8.02,000 శిశు మరణాలు సంభవించాయి. గత ఐదేళ్ళతో పోల్చుకుంటే ఇదే అతి తక్కువ అని యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్(యుఎన్ఐజిఎంఇ)గుర్తించింది. 2017లో 6,05,000 మంది శిశువులు పుట్టిన వెంటనే మరణిస్తే 5నుంచి 14 ఏళ్ళలోపు వారు 1.52.000 మంది మరణించారు. చిన్నవయస్సులోనే మరణిస్తున్న శిశువుల సంఖ్య 2016లో 8.67 లక్షలు ఉంటే, 2017కి 8.02 లక్షలకి తగ్గింది. 2016లో ప్రతి 1000 మంది పిల్లల్లో పుట్టిన వెంటనే 44 మంది మరణించారు. 2017లో పుట్టిన ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 39 మంది ఐదేళ్ళలోపే మరణించారు. ఆడపిల్లలైతే పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 40 మంది చిన్నారులు ఐదేళ్ళలోపు మరణించారు. గత ఐదేళ్ళతో పోలిస్తే పుట్టిన వెంటనే మరణిస్తోన్న బాలబాలికల్లో లింగభేదం నాలుగు రెట్లు తగ్గింది. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం, ప్రపంచబ్యాంకు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికను బట్టి ప్రపంచవ్యాప్తంగా 2017లో 63 లక్షల మంది 15 యేళ్ళలోపే మృత్యువాత పడ్డారు. దీన్ని బట్టి ప్రతి ఐదు సెకండ్లకూ నివారించదగిన కారణాలతో ఒక చిన్నారి మరణిస్తూనే ఉన్నపరిస్థితి. ఇందులో అత్యధికంగా 54 లక్షల మంది చిన్నారులు పుట్టిన తొలి ఐదేళ్ళలోపున మరణించారు. 2017లో అంతర్జాతీయంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సహారాఎడారి దిగువన ఉన్న ఆఫ్రికాలోనే 50 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో మరణిస్తున్న చిన్నారుల్లో 30 శాతం మంది దక్షిణాసియాకి చెందినవారే. యూరప్ కంటే సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికా దేశంలో 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 15 రెట్లు ఎక్కువ. శిశువుకి అత్యంత కీలక దశ అయిన పుట్టిన నెలలోపే ప్రపంచవ్యాప్తంగా 2017లో 25 లక్షల మంది శిశువులు మరణించారు. పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ళలోపు చిన్నారుల మరణాలు 50 శాతం అధికం. 1990లో 1.2.6 కోట్ల మంది ఐదేళ్ళ లోపు చిన్నారుల మరణిస్తే, 2017లో 54 లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు మరణించారు. ఐదు నుంచి 14 ఏళ్ళలోపు చిన్నారుల మరణాలు సైతం 17 లక్షల నుంచి పది లక్షల లోపుకి తగ్గడం పురోభివృద్ధిగా భావిస్తున్నారు. సాధారణ ఔషధాలూ, టీకాలూ, సురక్షిత నీరు, విద్యుత్ లాంటి చిన్న చిన్న సహకారం అందకనే చాలా మంది మరణిస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం, దీనితో పాటు దేశ వ్యాప్తంగా పుట్టినవెంటనే పిల్లల సంరక్షణకోసం ప్రత్యేక యూనిట్లు ప్రారంభించడం చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించినట్టు యూనిసెఫ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ క్యాంపెయిన్‌లో భాగంగా అందిస్తోన్న పౌష్టికాహారం, 2019కల్లా బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నివారించే లక్ష్యంతో జరుగుతోన్న ప్రయత్నం కూడా చిన్నారులను మృత్యువుదరికి చేరకుండా ఆపుతోందని భావిస్తున్నారు. -
కాకినాడ జిల్లా ఆసుపత్రిలో గర్భశోకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: హైకోర్టు ఆదేశాల్లో ఒకటి నేరుగా కాకినాడ జీజీహెచ్‌కు సంబంధించిన విషయం కాగా, మరొకటి రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న శిశు మరణాలపైన అనేది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంతో విదితమవుతోంది. ఈ రెండు అంశాలు జిల్లాకు కచ్చితంగా వర్తించినవే. ఇక్కడ చోటుచేసుకుంటున్న శిశు మరణాలు మరే జిల్లాలో చోటుచేసుకోవడం లేదు. అందుకు పేర్కొన్న శిశు మరణాల గణాంకాలే ఉదాహరణలు. గత నాలుగున్నరేళ్లలో 4474 శిశు మరణాలు సంభవించాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే 3889« శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. శిశు మరణాలే కాదు మాతృ మరణాలు నమోదవుతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లా వ్యాప్తంగా ప్రసవ సమయంలో 298 మంది తల్లులు చనిపోయారు. ఇందులో ఒక్క జీజీహెచ్‌లోనే 180 మంది మృతి చెందారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. వెలుగు చూడని, అధికారుల దృష్టికి రాని కేసులెన్నో ఆ పైవాడికే తెలియాలి. జిల్లా జడ్జి నివేదిక రప్పించుకున్నహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... ఆసుపత్రిలో తల్లులు వదిలేసిన మృత శిశువులు, పిండాలను వారానికోసారి మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి ఖననం చేయాల్సి ఉండగా సంబంధిత వాహనం మరమ్మతులకు గురైన కారణంగా నాలుగు వారాలుగా మృత శిశువులను తీసుకెళ్లకుండా వదిలేశారు. మృతదేహాలు పాడవుతున్నా బయటికి రాకుండా ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చడమే కాకుండా జిల్లా జడ్జి నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నివేదిక తెప్పించుకున్నారు. శిశు మరణాలకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేయాలని కూడా ఆదేశించారు. లోపమిదేనా... సాధారణంగా గర్బం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్ నెంబర్, చిరునామా లాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణికి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యేవరకు నిరంతరం ఏఎన్ఎం, డాక్టర్లు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు డాక్టర్ పురిశీలించాల్సి ఉంది. వారికి ఎస్కార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ ప్లానింగ్ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ, జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జీజీహెచ్‌లోనే ఎందుకిలా...అరకొర వైద్యులపై తీవ్ర పనిభారం... జిల్లాలో ప్రధాన ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ కొనసాగుతోంది. ఎక్కువ కేసులు ఇక్కడికే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడెన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు కాకినాడ ఆసుపత్రిలో నెలకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇక్కడన్నీ లోపాలే. కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. వారంతా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా,శిశు ప్రసూతి విభాగంలో సుమారు 300 పడకలున్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకూ వస్తుంటారు. రోజుకి 50 వరకూ ప్రసవాలు జరగుతుండగా 20–25 వరకు సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి.ప్రసూతి విభాగంలో ఆరు విభాగాల ఆ«ధ్వర్యంలో చేయాల్సిన పనిని కేవలం మూడు విభాగాల ద్వారానే చేపట్టడంతో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో ఐదుగురు వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఈ లెక్కన 27 మంది ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మూడు విభాగాలకు కలిపి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు ఒక్కో యూనిట్‌కి 30 బెడ్లతో మూడు యూనిట్లకు 90 బెడ్లుండాల్సి ఉండగా, ప్రస్తుతం 300 బెడ్లున్నాయి. దీనిబట్టి ఇక్కడెంత రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో సౌకర్యాల్లేకపోవడంతో ప్రసవానికొచ్చిన తల్లులకు గర్భశోకమే మిగులుతోంది. పూర్తి స్థాయి కమిటీ ఏదీ....సమీక్షలేవీ...? సాధారణంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలి. వైద్య సేవలపైనా, వైద్యుల పనితీరుపైనా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మరింత అప్రమత్తం కావాలి. మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవాలి. శిశు మరణాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా లోపమెక్కడో గుర్తించి తదననుగుణంగా> మరణాల నియంత్రణకు కృషి చేయాలి. కానీ, కాకినాడ ఆసుపత్రికి అటువంటి యోగం లేదు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకమే జరగలేదు. ముగ్గురు అధికారులతో ‘మమ’ అనిపించేస్తున్నారు. పాలకుల ఒత్తిళ్ల కారణంగానో...మరేమిటో తెలియదు గాని ఇంతవరకు అçసుపత్రి కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో సమీక్షలు, సమావేశాలకు ఆస్కారం లేకుండా లేకుండాపోయింది. గత రెండున్నరేళ్లుగా ఆసుపత్రి పరిపాలనకు సంబంధించిన సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవు. అసలు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఏమాత్రం పట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఈయనొచ్చాక కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వందల శిశు మరణాలు సంభవించాయి. గతం తెలియకపోయినా ఆయనొచ్చాక చోటుచేసుకున్న మరణాలైనా కదలించాలి. కచ్చితంగా స్పందించి ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. లోపమెంటో గుర్తించి, శిశు మరణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. శిశు మరణాలను కలెక్టర్ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. చిన్నారుల మృతికి కారణాలివీ... గర్భిణి ప్రసవం కోసం వచ్చే సమయంలో పౌష్టికాహార లోపం, గుండె, ఉదర, శ్వాస కోసం, మెదడు, పక్షవాతం, ఉమ్మనీరు మింగేయడం వంటి ప్రాణాంతక, సంక్లిష్ట పరిస్థితుల్లో శిశువులు చనిపోతున్నారు. ఆ దిశగా ఏం చేయాలో ఆలోచించి వైద్య సేవలందించాలి. దానికి సరిపడా వైద్యుల్లేకపోవడంతో అరకొర వైద్య సేవలందుతున్న పరిస్థితి నెలకుంది. దీంతో శిశువులకు చావు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతోంది. -
ఆయుష్మాన్‌భవ
సాక్షి, హైదరాబాద్ : దేశంలో సగటు మనిషి ఆయుః ప్రమాణం పెరుగుతోంది. 1990తో పోలిస్తే ఏకంగా పదేళ్లకుపైగా జీవితకాలం పెరిగింది. దేశవ్యాప్తంగా స్త్రీల జీవితకాలం 70.3 ఏళ్లు, పురుషుల జీవితకాలం 66.9 ఏళ్లకు పెరిగింది. అదే తెలంగాణలో దేశవ్యాప్త సగటుకన్నా అధికంగా స్త్రీల జీవితకాలం 73.2 ఏళ్లకు, పురుషుల జీవితకాలం 69.4 ఏళ్లకు పెరిగింది. భారత వైద్య పరిశోధన మండలి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ సంస్థలు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, వైద్య సౌకర్యాలు వంటివి ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. కానీ ఇదే సమయంలో మారుతున్న జీవన శైలి, పోషకాహార లోపం కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని, మరణాలకు కారణమవుతున్నాయని స్పష్టమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య విభాగాల ద్వారా ఈ అధ్యయనం చేసి.. నివేదిక రూపొందించారు. పెరుగుతున్న జీవన ప్రమాణం 1990లో భారత మెడికల్ కౌన్సిల్ ప్రజారోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా మహిళల సగటు జీవితకాలం 59.7 ఏళ్లుగా, పురుషుల జీవితకాలం 58.3 ఏళ్లుగా తేల్చింది. తాజాగా 2016–17 ఏడాదికిగాను నిర్వహించిన అధ్యయనంలో మహిళ ఆయుష్షు 70.3 ఏళ్లకు, పురుషుల ఆయుష్షు 66.9 ఏళ్లకు పెరిగినట్లు గుర్తించింది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు, శాతాలను లెక్కించింది. తెలంగాణలో 1990లో సగటు జీవితకాలం మహిళల్లో 61.8 ఏళ్లు, పురుషులకు 60.2 ఏళ్లుగా ఉండగా.. 2016–17లో స్త్రీలలో 73.2 ఏళ్లకు, పురుషుల్లో 69.4 ఏళ్లకు పెరిగినట్లు తేల్చింది. తగ్గుతున్న శిశు మరణాల రేటు దేశవ్యాప్తంగా కొన్నేళ్లలో శిశు మరణాల రేటు బాగా తగ్గిందని మెడికల్ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. 1990లో ప్రతి 1,000 మంది శిశువుల్లో 100 మంది వరకు మరణించగా.. 2016–17 నాటికి 39కి తగ్గినట్లు పేర్కొంది. ఇదే తెలంగాణలో 30కి తగ్గిందని తెలిపింది. ఏ వయసులో ఏ సమస్యతో.. వివిధ వయసుల్లో అనారోగ్య కారణాలతో మరణిస్తున్న వారి శాతాన్ని సైతం కౌన్సిల్ నివేదికలో పేర్కొంది. పద్నాలుగేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాల్లో.. గర్భస్థ దశలో సరిగా ఎదగక, వివిధ లోపాలతో పుట్టినవారి శాతమే 42.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 30.5 శాతం మరణాలకు మలేరియా, తట్టు వంటి సాంక్రమిక వ్యాధులు కారణమని, వివిధ ఇతర వ్యాధులతో 8.7 శాతం, ప్రసూతి సమస్యలతో 2.4 శాతం, పోషకాహార లోపంతో 1.2 శాతం మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. ► ఇక 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లలోపు వారిలో సంభవిస్తున్న మరణాల్లో... 13.5 శాతం శ్వాసకోశ వ్యాధులతో, ఎయిడ్స్‌తో 13 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 10.4 శాతం, కేన్సర్‌తో 10 శాతం, మలేరియా వంటి వ్యాధులతో 8.9 శాతం మరణిస్తున్నారు. ► 40 ఏళ్ల నుంచి 69 ఏళ్లలోపు వారి మరణాల్లో... 38.1శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 12.2 శాతం కేన్సర్‌తో, 10 శాతం శ్వాసకోశ వ్యాధులతో, 8.5 శాతం డయేరియా, 5.5 శాతం ఎయిడ్స్‌తో మృత్యువాత పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం ► అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ డిసీజెస్‌తో 8 శాతం మంది స్త్రీలు, 10 శాతం మంది పురుషులు సతమతమవుతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. ► ఐరన్ లోపంతో వచ్చే వ్యాధులతో 13 శాతం స్త్రీలు, 5 శాతం పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. ► వెన్నునొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులతో 7 శాతం స్త్రీలు, 6 శాతం పురుషులు జీవితం నెట్టుకొస్తున్నారు. ► మానసిక వ్యాధులతో 6 శాతం మహిళలు, 7 శాతం పురుషులు వేదనకు గురవుతున్నారు. ► నెలలు గడవక ముందు పుట్టినవారిలో 3 శాతం స్త్రీలు, 2 శాతం పురుషులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ► రోడ్డు ప్రమాదాల్లో 1 శాతం స్త్రీలు, 3 శాతం పురుషులు వైకల్యం బారిన పడుతున్నారు. ► డయాబెటిక్‌తో 2 శాతం స్త్రీలు, 4 శాతం పురుషులు దీర్ఘకాలంగా కాలం గడుపుతున్నారు. దీర్ఘకాలిక వైకల్యం, అనారోగ్యాలకు ఇవీ కారణాలు 1990 లో.. ►విరేచనాలు, సంబంధిత వ్యాధులు ►శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు ►గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు ►తట్టు, సంబంధిత వ్యాధులు ►నియోనాటల్ వ్యాధులు ►క్షయ వ్యాధి ►తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు ►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం ►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు ►గర్భస్థ, శిశు సంబంధిత వ్యాధులు ►పక్షవాతం ►మధుమేహం (డయాబెటిస్) 2016-17లో.. ►గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు ►తీవ్ర (క్రానిక్) ఊపిరితిత్తుల వ్యాధులు ►విరేచనాల సంబంధిత వ్యాధులు ►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు ►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం ►అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ వ్యాధులు ►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు ►పక్షవాతం ►రోడ్డు ప్రమాదాలు ►నడుంనొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులు ►మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్ ►శ్వాసకోశ వ్యాధులు ►రోడ్డు ప్రమాదాలు ఈ పదీ మరణ హేతువులు! జీవితకాలంలో వివిధ అనారోగ్యాలకు గురికావడానికి పది ప్రధాన కారణాలను సర్వే గుర్తించింది. 1990 నాటి కారణాలను, ప్రస్తుత కారణాలను నిగ్గు తేల్చింది. మొత్తంగా పోషకాహార లోపం ప్రధాన సమస్యగా ఉందని, మహిళల్లో అధికశాతం దీనితో బాధపడుతున్నారని గుర్తించింది. కారణాలను ర్యాంకుల వారీగా పరిశీలిస్తే.. మారిన రిస్క్ ఒకప్పుడు విరేచనాలు (కలరా) వంటి వ్యాధులతో భారీగా మరణాలు సంభవించగా.. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువమంది చనిపోతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. అప్పుడు, ఇప్పుడు ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న పది ప్రధాన అంశాలను నివేదికలో పేర్కొంది. పోషకాహార లోపమే పెద్ద సమస్య.. 1990 నాటి నుంచి ఇప్పటికీ పోషకాహార లోపమే పెద్ద సమస్యగా ఉందని మెడికల్ కౌన్సిల్ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు తగిన పోషకాహారం అందక ఆరోగ్య సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నట్లు పేర్కొంది. ఇక నగర ప్రాంతాల్లో అధిక కొవ్వు, ఊబకాయం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, జంక్ ఫుడ్ అలవాటు ఆయుష్షును తగ్గిస్తోందని స్పష్టం చేసింది. అరక్షిత శృంగారంతో.. దేశంలో అరక్షిత శృంగారం కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నట్లు మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో 627 మంది దీర్ఘకాలం వ్యాధిగ్రస్తులుగా ఉండిపోయారని పేర్కొంది. అరక్షిత శృంగారంతో తెలంగాణ నుంచే ఎక్కువ శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు గుర్తించింది. తర్వాతి స్థానాల్లో మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక లైంగిక వేధింపుల కారణంగా మతిస్థిమితం కోల్పోయినవారు తెలంగాణలో 124 మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ బాధితుల సంఖ్యలో తమిళనాడు (159) మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (140) రెండో స్థానంలో నిలిచింది. -
శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం
ఎన్ఎన్ఎఫ్ ప్రతినిధి డాక్టర్ అసితోష్ మహాపాత్ర వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం సందర్శన ఎంజీఎం : దేశవ్యాప్తంగా రోజుకు వేయ్యి మంది చిన్నారులు జన్మిస్తే అందులో 39 మంది చిన్నారులు నెల నిండక ముందే మృత్యువాతపడుతున్నారని, ఈ మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా నేషనల్ నియోనాటాలజీ ఫోరం (ఎన్ఎన్ఎఫ్) ప్రయత్నిస్తున్నదని ఒరిస్సాకు చెందిన ఎన్ఎన్ఎఫ్ ప్రతినిధి డాక్టర్ అసితోష్ మహాపాత్ర చెప్పారు. బుధవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో శిశువులకు అందుతున్న వైద్యసేవలతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్ఎన్ఎఫ్ అక్రిడిడేషన్ సర్టిపికేషన్ పొందడానికి నేషనల్ నియోనాటాలజీ ఫోరం నిర్దేశించిన కచ్చితమైన ప్రమాణాలలో వైద్యసేవలందించండంతో పాటు ప్రత్యేకమైన విధానాలు పాటించాలన్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే ఆయాతో పాటు నర్సింగ్ సిబ్బంది, వైద్యులు ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉండాలన్నారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది శిశువులకు అందిస్తున్న వైద్యసేవల విధానాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్నమౌలిక సదుపాయాలు, వైద్యసిబ్బంది, వైద్యుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నివేదికను ఢిల్లీ బృందానికి సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి అక్రిడిడేషన్ సర్టిఫికెట్ లభిస్తే సేవలు మరింత మెరుగుపడే ఆవకాశం ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సర్టిఫికేషన్‌తో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు భవిష్యత్తులో డీఎం నియోనాటాలజీ వంటి ప్రత్యేక కోర్సులు వచ్చే ఆవకాశం లభిస్తుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వైద్యవిద్య కళాశాలలో పరిధిలో ఉన్న ఏ ఆస్పత్రీ ఇంత వరకు ఈ సర్టిఫికేషన్ పొందలేదన్నారు. -
ఏడాదిలో శిశు మరణాల రేటును 20కి తగ్గిస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటును 20కి తగ్గిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. ఏడాది క్రితం వెయ్యి శిశువుల్లో 39 మంది మరణించేవారనీ ఈ ఏడాది ఆ సంఖ్యను 28కి తగ్గించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్-2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు గురువారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైంది. 8 వేల మంది దేశ విదేశీ పిల్లల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, శిశు మరణాలను తగ్గించడంలో మన దేశం విఫలమైందన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, పుట్టుకతోనే నవజాత శిశువుల్లో వచ్చే లోపాలను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. దీనివల్ల మొదట్లోనే లోపాలను గుర్తించి పిల్లలకు తక్షణమే వైద్యం చేయించే వెసులుబాటు కలిగిందన్నారు. ‘ఇద్దరు పిల్లల తల్లిగా పిల్లల సంరక్షణ ఎంత కష్టమైందో నాకు తెలుసు. అలాంటిది పీడియాట్రిక్ వైద్యులు పిల్లల సంరక్షణ కోసం ఎంత కష్టపడతారో ఊహించవచ్చు’ అని పేర్కొన్నారు. మహిళలు ముందుకొస్తే సమాజంలో పెద్దఎత్తున మార్పు వస్తుందన్నారు. ఒక ఎంపీగా తాను సాధికారత సాధించిన మహిళనని ప్రకటించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో రెండు విడతలుగా నిర్వహించామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 938 రోగాలకు ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా వెలుగొందుతుందన్నారు. గుండె, కాలేయ, మూత్రపిండాల మార్పిడి వంటివి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిని నవజాత శిశు సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు. కాగా, ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) అధ్యక్షుడిగా ప్రమోద్జోగ్ ఎన్నికయ్యారు. ఐఏపీ మహిళా విభాగాన్నీ ఏర్పాటు చేయగా, దీనికి కన్వీనర్‌గా ‘నిలోఫర్’ ప్రొఫెసర్ హిమబిందు ఎన్నికయ్యారు. మహిళావి భాగం లోగోను కవిత ఆవిష్కరించారు. ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జుల్కిఫ్లీ ఇస్మాయిల్, సెక్రటరీ జనరల్ బకుల్ జయంత్ పరేఖ్, డాక్టర్ రమేష్ ధంఫురి, డాక్టర్ మంచుకొండ రంగయ్య, ఎస్ఎస్ కామత్, డాక్టర్ లాలూప్రసాద్, డాక్టర్ షబ్బీర్ హాజరయ్యారు. ఘనంగా ప్రారంభమైన సదస్సు పెడికాన్-2106 సదస్సు హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం వరకు జరిగే ఈ సదస్సులో పిల్లలకు సంబంధించి ఆరోగ్య సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రత్యేకంగా 22 దేశాల నుంచి 100 మంది పిల్లల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రసంగించనున్నారు. శిశు మరణాల తగ్గింపు, భ్రూణ హత్య ల నిరోధానికి ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికను పెడికాన్ సదస్సు ప్రకటించనుంది. -
బాల్యవివాహాల్లో రాజస్థాన్‌ది రెండో స్థానం
దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ రెండోస్థానం ఆక్రమించిందని శుక్రవారం యుఎన్ నిపుణులు తమ నివేదికలో వెల్లడించారు. రాజస్థాన్‌లో రెండు నుంచి ప్రతి ఐదుమందిలో పెళ్లైన వారు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని పేర్కొంది. పిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం కారణంగా తల్లి, శిశు మరణాల రేటు దుర్భరమైన స్థాయికి చేరిందని రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో యుఎన్సీఈఎఫ్ చైల్డ్ ఆఫీసర్ సంజయ్ నిరాలా చెప్పారు. బాల్యవివాహాల వల్ల రాజస్థాన్‌లో తల్లి మరణాల రేటు, శిశు మరణాల రేటు తీవ్ర స్థాయికి చేరిందని చెప్పారు. దేశంలో జార్ఖండ్ కూడా బాల్యవివాహాల రేటులో నమ్మదగిని స్థాయికి చేరిందన్నారు. నాణ్యత పరంగా విద్యను అందించడంలో కూడా రాజస్థాన్ మూడో స్థానానికి పడిపోయిందని సంజయ్ చెప్పారు.