సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా మహిళలు, బాలల ఆరోగ్యం పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ఎప్పటికప్పుడు వైద్యం, మందులు అందిస్తున్నారు.
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే ప్రసూతి మరణాలతో పాటు శిశు మరణాలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ప్రసూతి మరణాలు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రసూతి మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రగతిని సాధించిందని పేర్కొంది. సుస్థిర ప్రగతి లక్ష్యం మేరకు ప్రతి లక్ష ప్రసవాల్లో ప్రసూతి మరణాలు 70లోపు ఉండాలి. 2017–18లో రాష్ట్రంలో లక్ష ప్రసవాల్లో 58 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో ఈ సంఖ్య 45కు తగ్గినట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెలలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జాతీయ స్థాయిలో కూడా ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గినప్పటికీ రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ ఉన్నాయి.
2017–18లో జాతీయ స్థాయిలో ప్రతి లక్ష ప్రసవాల్లో 103 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో 97కు తగ్గాయి. అలాగే సజీవ జననాల్లో శిశు మరణాలు జాతీయ స్థాయికన్నా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి సజీవ జననాల్లో శిశు మరణాలు 2018లో 29 ఉండగా 2019లో 25కు, 2020లో 24కు తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇదే జాతీయ స్థాయిలో వెయ్యి సజీవ జననాల్లో 2018లో 32 శిశు మరణాలు సంభవించగా 2019లో 30కు, 2020లో 28కు తగ్గినట్లు తెలిపింది.
ఆస్పత్రుల్లోనే 97 శాతం ప్రసవాలు
ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఆస్పత్రుల్లో కాన్పులు 92 శాతమే ఉంటే.. 2019 – 21లో 97 శాతానికి పెరిగింది. అత్యధిక కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. మూడు శాతమే ఇళ్ల వద్ద జరుగుతున్నాయి.
పటిష్ట ప్రణాళికతో గర్భిణులు, శిశువుల పరిరక్షణ
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గర్భిణులు, శిశువుల పరిరక్షణకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. వలంటీర్లు సచివాలయాల స్థాయిలో గర్భిణులు, 5 ఏళ్లలోపు బాలల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారు. పిల్లలు, గర్బిణుల డేటా, ఆధార్‌ను ఆర్‌సీహెచ్ (పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య) పోర్టల్ ఐడీతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 2.59 లక్షల గర్భిణుల వివరాలను మ్యాపింగ్ చేశారు.
ఈ వివరాలను సచివాలయాల గృహ కుటుంబాల డేటాలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోఎక్కువ ప్రమాదం గల గర్భిణులను గుర్తించి వారికి సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంలతో పాటు ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఏఎన్‌ఎం స్వయానా ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు అందిస్తున్నారు.
చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ
అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద గర్భిణులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. శిశువుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ (ఎస్‌ఎన్సీయూ )లు పనిచేస్తున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన టీకాలు ప్రభుత్వం వేయిస్తోంది. బాలలకు ఐఎఫ్‌ఏ సిరప్, డి–వార్మింగ్, విటమిన్ ఏ చుక్కలు అందిస్తోంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత లేకుండా చూడటం వలన గర్భిణులు, శిశువులకు నిరంతర వైద్య సేవలు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment