సాక్షి, హైదరాబాద్ : దేశంలో సగటు మనిషి ఆయుః ప్రమాణం పెరుగుతోంది. 1990తో పోలిస్తే ఏకంగా పదేళ్లకుపైగా జీవితకాలం పెరిగింది. దేశవ్యాప్తంగా స్త్రీల జీవితకాలం 70.3 ఏళ్లు, పురుషుల జీవితకాలం 66.9 ఏళ్లకు పెరిగింది. అదే తెలంగాణలో దేశవ్యాప్త సగటుకన్నా అధికంగా స్త్రీల జీవితకాలం 73.2 ఏళ్లకు, పురుషుల జీవితకాలం 69.4 ఏళ్లకు పెరిగింది. భారత వైద్య పరిశోధన మండలి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ సంస్థలు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, వైద్య సౌకర్యాలు వంటివి ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. కానీ ఇదే సమయంలో మారుతున్న జీవన శైలి, పోషకాహార లోపం కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని, మరణాలకు కారణమవుతున్నాయని స్పష్టమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య విభాగాల ద్వారా ఈ అధ్యయనం చేసి.. నివేదిక రూపొందించారు.
పెరుగుతున్న జీవన ప్రమాణం
1990లో భారత మెడికల్ కౌన్సిల్ ప్రజారోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా మహిళల సగటు జీవితకాలం 59.7 ఏళ్లుగా, పురుషుల జీవితకాలం 58.3 ఏళ్లుగా తేల్చింది. తాజాగా 2016–17 ఏడాదికిగాను నిర్వహించిన అధ్యయనంలో మహిళ ఆయుష్షు 70.3 ఏళ్లకు, పురుషుల ఆయుష్షు 66.9 ఏళ్లకు పెరిగినట్లు గుర్తించింది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు, శాతాలను లెక్కించింది. తెలంగాణలో 1990లో సగటు జీవితకాలం మహిళల్లో 61.8 ఏళ్లు, పురుషులకు 60.2 ఏళ్లుగా ఉండగా.. 2016–17లో స్త్రీలలో 73.2 ఏళ్లకు, పురుషుల్లో 69.4 ఏళ్లకు పెరిగినట్లు తేల్చింది.
తగ్గుతున్న శిశు మరణాల రేటు
దేశవ్యాప్తంగా కొన్నేళ్లలో శిశు మరణాల రేటు బాగా తగ్గిందని మెడికల్ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. 1990లో ప్రతి 1,000 మంది శిశువుల్లో 100 మంది వరకు మరణించగా.. 2016–17 నాటికి 39కి తగ్గినట్లు పేర్కొంది. ఇదే తెలంగాణలో 30కి తగ్గిందని తెలిపింది.
ఏ వయసులో ఏ సమస్యతో..
వివిధ వయసుల్లో అనారోగ్య కారణాలతో మరణిస్తున్న వారి శాతాన్ని సైతం కౌన్సిల్ నివేదికలో పేర్కొంది. పద్నాలుగేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాల్లో.. గర్భస్థ దశలో సరిగా ఎదగక, వివిధ లోపాలతో పుట్టినవారి శాతమే 42.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 30.5 శాతం మరణాలకు మలేరియా, తట్టు వంటి సాంక్రమిక వ్యాధులు కారణమని, వివిధ ఇతర వ్యాధులతో 8.7 శాతం, ప్రసూతి సమస్యలతో 2.4 శాతం, పోషకాహార లోపంతో 1.2 శాతం మృత్యువాత పడుతున్నారని పేర్కొంది.
► ఇక 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లలోపు వారిలో సంభవిస్తున్న మరణాల్లో... 13.5 శాతం శ్వాసకోశ వ్యాధులతో, ఎయిడ్స్‌తో 13 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 10.4 శాతం, కేన్సర్‌తో 10 శాతం, మలేరియా వంటి వ్యాధులతో 8.9 శాతం మరణిస్తున్నారు.
► 40 ఏళ్ల నుంచి 69 ఏళ్లలోపు వారి మరణాల్లో... 38.1శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 12.2 శాతం కేన్సర్‌తో, 10 శాతం శ్వాసకోశ వ్యాధులతో, 8.5 శాతం డయేరియా, 5.5 శాతం ఎయిడ్స్‌తో మృత్యువాత పడుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం
► అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ డిసీజెస్‌తో 8 శాతం మంది స్త్రీలు, 10 శాతం మంది పురుషులు సతమతమవుతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది.
► ఐరన్ లోపంతో వచ్చే వ్యాధులతో 13 శాతం స్త్రీలు, 5 శాతం పురుషులు ఇబ్బందులు పడుతున్నారు.
► వెన్నునొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులతో 7 శాతం స్త్రీలు, 6 శాతం పురుషులు జీవితం నెట్టుకొస్తున్నారు.
► మానసిక వ్యాధులతో 6 శాతం మహిళలు, 7 శాతం పురుషులు వేదనకు గురవుతున్నారు.
► నెలలు గడవక ముందు పుట్టినవారిలో 3 శాతం స్త్రీలు, 2 శాతం పురుషులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
► రోడ్డు ప్రమాదాల్లో 1 శాతం స్త్రీలు, 3 శాతం పురుషులు వైకల్యం బారిన పడుతున్నారు.
► డయాబెటిక్‌తో 2 శాతం స్త్రీలు, 4 శాతం పురుషులు దీర్ఘకాలంగా కాలం గడుపుతున్నారు.
దీర్ఘకాలిక వైకల్యం, అనారోగ్యాలకు ఇవీ కారణాలు
1990 లో..
►విరేచనాలు, సంబంధిత వ్యాధులు
►శ్వాసకోశ సంబంధిత వ్యాధులు
►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు
►గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు
►తట్టు, సంబంధిత వ్యాధులు
►నియోనాటల్ వ్యాధులు
►క్షయ వ్యాధి
►తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు
►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం
►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు
►గర్భస్థ, శిశు సంబంధిత వ్యాధులు
►పక్షవాతం
►మధుమేహం (డయాబెటిస్)
2016-17లో..
►గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు
►తీవ్ర (క్రానిక్) ఊపిరితిత్తుల వ్యాధులు
►విరేచనాల సంబంధిత వ్యాధులు
►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు
►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం
►అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ వ్యాధులు
►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు
►పక్షవాతం
►రోడ్డు ప్రమాదాలు
►నడుంనొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులు
►మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్
►శ్వాసకోశ వ్యాధులు
►రోడ్డు ప్రమాదాలు
ఈ పదీ మరణ హేతువులు!
జీవితకాలంలో వివిధ అనారోగ్యాలకు గురికావడానికి పది ప్రధాన కారణాలను సర్వే గుర్తించింది. 1990 నాటి కారణాలను, ప్రస్తుత కారణాలను నిగ్గు తేల్చింది. మొత్తంగా పోషకాహార లోపం ప్రధాన సమస్యగా ఉందని, మహిళల్లో అధికశాతం దీనితో బాధపడుతున్నారని గుర్తించింది. కారణాలను ర్యాంకుల వారీగా పరిశీలిస్తే..
మారిన రిస్క్
ఒకప్పుడు విరేచనాలు (కలరా) వంటి వ్యాధులతో భారీగా మరణాలు సంభవించగా.. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువమంది చనిపోతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. అప్పుడు, ఇప్పుడు ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న పది ప్రధాన అంశాలను నివేదికలో పేర్కొంది.
పోషకాహార లోపమే పెద్ద సమస్య..
1990 నాటి నుంచి ఇప్పటికీ పోషకాహార లోపమే పెద్ద సమస్యగా ఉందని మెడికల్ కౌన్సిల్ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు తగిన పోషకాహారం అందక ఆరోగ్య సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నట్లు పేర్కొంది. ఇక నగర ప్రాంతాల్లో అధిక కొవ్వు, ఊబకాయం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, జంక్ ఫుడ్ అలవాటు ఆయుష్షును తగ్గిస్తోందని స్పష్టం చేసింది.
అరక్షిత శృంగారంతో..
దేశంలో అరక్షిత శృంగారం కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నట్లు మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో 627 మంది దీర్ఘకాలం వ్యాధిగ్రస్తులుగా ఉండిపోయారని పేర్కొంది. అరక్షిత శృంగారంతో తెలంగాణ నుంచే ఎక్కువ శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు గుర్తించింది. తర్వాతి స్థానాల్లో మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక లైంగిక వేధింపుల కారణంగా మతిస్థిమితం కోల్పోయినవారు తెలంగాణలో 124 మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ బాధితుల సంఖ్యలో తమిళనాడు (159) మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (140) రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment