వరదలో చిక్కుకుని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇబ్బందులు
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: వరదలో చిక్కుకున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు వైద్య సేవలు, మందులు అందక అగచాట్లు పడుతున్నారు. కావాల్సిన ఆహారం, మందులు బయటకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితులు లేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వద్దామంటే ప్రభుత్వం కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైద్య శాఖ మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పినప్పటికీ వరదల్లో చిక్కుకుపోయిన వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. వరద ప్రాంతాల్లో అనారోగ్య సమస్యల బారినపడిన వారు వేసుకోవాల్సిన మందులపై వైద్య శాఖ సోమవారం ప్రి్రస్కిప్షన్‌ను జారీ చేసింది. మందులు ఇవ్వకుండా ఈ ప్రి్రస్కిప్షన్ జారీ చేసి ఏం ప్రయోజనం అని బాధితులు మండిపడుతున్నారు.
మా కష్టం పగవాడికి కూడా రాకూడదు
నాకు రెండు కాళ్లు లేవు. పైగా గర్భిణిని కూడా. దీనికి తోడు మా అమ్మ మెదడు సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. ఇద్దరం నిస్సహాయులం. ఎవరైనా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తారని చాలా ఎదురుచూశాం. కానీ ఎవరు రాలేదు. రెండు రోజులుగా నాకు, మా అమ్మకు ఆహారం లేదు. మాకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. – ఎస్‌కె. తాహిరున్నిసా, డాబాకొట్లు సెంటర్, సింగ్‌నగర్
ఇదో విషమ ‘పరీక్ష’
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి, ప్రతినిధి : కుమార్తెలు ఐఐటీ మద్రాస్‌లో చదవాలన్న సంకల్పానికి వరద ముంపు విషమ పరీక్ష పెడితే.. ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇద్దరు ఆడ బిడ్డలతో ఊరుకాని ఊర్లో.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాడు. పలకరించిన నాథుడు లేడు. తిన్నావా అని అడిగే దిక్కులేదు. కళ్ల ముందు బోట్లు తిరుగుతున్నా.. ఎక్కించుకునే వాడే లేడు. భీమవరానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్.. ఇద్దరు బిడ్డలతో కండ్రిగలోని ఓ పరీక్ష కేంద్రంలో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ ప్రవేశానికి సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష కోసం ఆదివారం ఉదయం వచ్చారు. పరీక్ష కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. అయితే వరద ఉధృతి పెరగడంతో ఆకస్మాత్తుగా పరీక్ష రద్దయ్యింది. అప్పటికే ఆ ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. అక్కడి నుంచి బయట పడేందుకు ట్రాక్టర్ ఎక్కితే.. డ్రైవర్ మధ్యలో దించేశాడు. ఇక అంతే.. సోమవారం ఉదయం 11 గంటలకు వరకూ తిండీతిప్పల్లేకుండా నీళ్లలో ఇద్దరు ఆడ బిడ్డలతో ఉండిపోయారు.
ప్రాణాల కోసం ఆరాటం.. ఆకలితో పోరాటం
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘చిన్నా’ కన్నవారి కోసం పడిన ఆవేదన వర్ణనాతీతం. సింగ్‌నగర్‌లోని డాబాకొట్లు సెంటర్‌లో మనిషి ఎత్తు లోతులో నీళ్లు చేరాయి. చిన్నా నివాసం ఉంటున్న ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున కట్టుబట్టలతో ఇంటి మేడపైకి చేరుకున్నారు. వర్షం వచి్చనా తడుస్తూనే అక్కడే ఉండిపోయారు.
ఇంటిలో వంట సామగ్రి మొత్తం తడిచిపోయింది. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. సోమవారం ఉదయం 11 గంటలకు పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లయ్‌ఓవర్‌పైకి చేరుకున్నాడు. ఆహారం కోసం వెతుకులాట తప్ప దక్కిందేమీ లేదు. కనుచూపు మేరలో వరద నీళ్లు తప్ప.. తాగడానికి నీళ్లు దొరకలేదు. చివరికి దాతలు ఇచ్చిన పాల ప్యాకెట్లతో కన్నవారి కోసం మళ్లీ నీటిలో నడక ప్రయాణం ప్రారంభించాడు.’’ జీవితం ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్ పడవలు షో కోసమే నీళ్లలో తిరుగుతున్నట్టు ఉంది. మాలో ఏ ఒక్కరినీ వాళ్లు ఒడ్డుకు తీసుకురాలేదు. ఇంకెన్నీ రోజులు చస్తూ బతకాలో తెలియడం లేదు – చిన్నా.
దెబ్బతిన్న విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దెబ్బతిన్న వ్యవస్థను సరిచేయడానికి 356 మంది సిబ్బందిని 102 బృందాలుగా నియమించినట్లు ఇంధనశాఖ తెలిపింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్‌టీటీపీఎస్‌లోకి బుడమేరు బ్యాక్ వాటర్ భారీగా రావడంతో ఒక్కోటీ 210 మెగావాట్ల సామర్థ్యం గల 6 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment