
వరద సాయం బియ్యాన్ని బొక్కేసిన జనసేన నేత
విజయవాడ వరద బాధితుల పేరుతో భారీగా బియ్యం సేకరణ
ఇలా సేకరించిన బియ్యం అమ్ముకుని సొమ్ము చేసుకున్న నియోజకవర్గ ఇన్‌చార్జి
విక్రయించిన సొమ్మును పార్టీకి విరాళంగా ఇస్తానంటూ వెల్లడి
మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పే చేశానన్న సదరు నేత
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో కలకలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది.
దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
అసలేం జరిగిందంటే..
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు.
ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్‌చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్‌చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్‌కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.
రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..
జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు.