వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న సరుకులను నొక్కేస్తున్న టీడీపీ నేతలు.. దాతలు అందజేసినవాటికి కవర్లు మార్చి టీడీపీ ఇస్తున్నట్లుగా బిల్డప్
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయం వద్ద మహిళల ఆగ్రహం
విజయవాడస్పోర్ట్స్: బుడమేరు ముంపు వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారు. వరద వల్ల ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు విజయవాడ నగర శివారులోని కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, సుందరయ్యనగర్, శాంతినగర్, ప్రశాంతినగర్, కండ్రిక, రాజీవ్‌నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది ముందుకొచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో ఆహారం, నీళ్లు, దుప్పట్లు, సరుకులు తీసుకొచ్చారు.
వాటిపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. చాలావరకు సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వాటిని ఎగరేసుకుపోయారు. అంతటితో ఆగకుండా తమ పలుకుబడి ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, దుస్తులు వంటివి సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సమీపంలోని ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయానికి తరలించారు. వాటిని పసుపు సంచుల్లో వేసి టీడీపీ పంపిణీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ సరుకుల పంపిణీకి కూడా పలు ప్రాంతాల్లో ముందుగా టోకెన్లు ఇస్తున్నారు.
టోకెన్ల కోసం వాంబేకాలనీలోని ఫంక్షన్ హాలు వద్దకు గురువారం అధిక సంఖ్యంలో పేదలు చేరడంతో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి టోకెన్లు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళితే షట్టర్ మూసి ఉందని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయం చేస్తామని చెప్పి వారం నుంచి టోకెన్లు, సరుకులు అంటూ తిప్పుకుంటున్నారని వాంబేకాలనీకి చెందిన మహిళలు కె.జయలక్ష్మి, ఎస్.కనకదుర్గ, ఎ.నాగమణి, కె.దుర్గాభవాని, వి.లక్ష్మి, బి.నాగరాణి, శాంతి, ఎస్.సన్యాసమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహిళ పేరు బాణావతు మల్లేశ్వరి. టీడీపీ నాయకురాలు. 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో నివసిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరిపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసి ఉంది.
‘మా ప్రాంతానికి ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకే చెందిన మాజీ కార్పొరేటర్ యరబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు, దుస్తులు కాజేస్తున్నారు’ అని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరి ఇళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకా ఇవ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నీచమైన బతుకులు
అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మాకు ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేసేందుకు వచ్చిన వారి నుంచి సరుకులన్నీ టీడీపీ నాయకులే తీసుకుంటున్నారు. వాటిని బయటపెట్టడం లేదు. ఎవరికీ పంచడం లేదు. మాకు అందాలి్సన వాటిని కాజేస్తూ నీచాతినీచమైన బతుకు బతుకుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆఫీసుకు వెళ్లి అడిగితే రోడ్డు పక్కన పడేసే చిరిగిన దుస్తులు పంపించారు. వాటనీ్నంటినీ బుధవారం రాత్రి మా వీధిలో పడేసి తీసుకువచ్చిన టీడీపీ నాయకుల ముందే తగలబెట్టేశాం. – రాజులపాటి తిరుపతమ్మ, న్యూఆర్‌ఆర్‌పేట
సాయం అడిగితే పార్టీలు అంటగడుతున్నారు
ఇంట్లో సామాన్లు అన్నీ పోయి ఇబ్బందులు పడుతున్నాం. సాయం చేయాలని అడుగుతుంటే టీడీపీ నాయకులు పార్టీలను అంటగడుతున్నారు. మా పార్టీకి ఓటు వేయలేదు... మీకు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ పార్టీ వాళ్లు వచ్చి అందరికీ సాయం అందించారు. టీడీపీ వాళ్లు మాత్రం పార్టీల పేరుతో వేరు చేసి మాట్లాడుతున్నారు. వాళ్లు సాయం చేయకపోగా, సాయం చేసే వాళ్లని మా వరకు రానివ్వడం లేదు. – గుడిసే నాగమణి, న్యూఆర్‌ఆర్‌పేట
Comments
Please login to add a commentAdd a comment