బాబు జమానా.. అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు | Chandrababu Government Huge Fraud In Vijayawada Flood Compensation: AP | Sakshi
Sakshi News home page

బాబు జమానా.. అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు

Published Tue, Oct 8 2024 5:13 AM | Last Updated on Tue, Oct 8 2024 1:14 PM

Chandrababu Government Huge Fraud In Vijayawada Flood Compensation: AP

చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దిమ్మతిరిగే అవినీతి 

అరకొర సహాయక చర్యలు.. వాటిలోనే రూ.534 కోట్లు బొక్కేశారు

భోజనాలకే రూ.368 కోట్ల వ్యయం 

అసలు పెట్టని ఒక్కో భోజనానికి రూ.376 చొప్పున ఖర్చు 

పంచని అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు  

కేవలం డ్రోన్లకే రూ.2 కోట్లు

మంచినీళ్ల బాటిళ్ల కోసం ఏకంగా రూ.26 కోట్లు.. వాటికి అంత 

ఖర్చవుతుందా! అని ప్రశ్నిస్తున్న జనం  

అవన్నీ ఎక్కడ పంచారని బాధితుల నిలదీత

బుడమేరు గేట్లెత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కారు.. ఆదుకోండి మహాప్రభో అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్‌ గేట్లు మూసి నిర్దయగా గాలికొదిలేసింది. కానీ.. అదే వరద పేరు చెప్పి పాలకులు రూ.వందల కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఆ ముసుగులో ఏ పనీ చేయకుండానే ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీఎత్తున నిధులను పక్కదారి పట్టించారు.

సాక్షి, అమరావతి: వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. బుడమేరు, కృష్ణా వరదలో పేరుకుపోయిన అవినీతి బురదను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ఘోరంగా విఫలమైన టీడీపీ సర్కారు.. ఖర్చులు మాత్రం దిమ్మతిరిగేలా చూపడంతో ఇంత ఖర్చు ఎక్కడ పెట్టారోనని ముక్కున వేలేసుకుంటున్నారు.

అసలు సహాయక చర్యలే చేపట్టక జనం అల్లాడిపోతే ప్రభుత్వం ఏకంగా రూ.534 కోట్లను రిలీఫ్‌ క్యాంప్‌ల కోసం ఖర్చు చేసినట్టు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. గత నెలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను వరదలు అతలాకుతలం చేసినా ప్రభుత్వం ఎక్కడా పునరావాస కేంద్రాలు తెరవలేదు. విజయవాడలోని సగం ప్రాంతం మునిగిపోయినా పునరావాస కేంద్రాలు లేకపోవడంతో జనం డాబాలపైన, అపార్ట్‌మెంట్స్‌లోని పై అంతస్తుల్లోనే వారం రోజులపాటు గడిపారు. కాగితాల్లో పునరావాస కేంద్రాలు తెరిచినట్టు చూపించినా రెండు, మూడు మినహా అవి ఎక్కడా లేవు.   

భోజనం ఖర్చు రూ.376 
అన్ని ఖర్చుల్లోనూ భోజనాల ఖర్చే రూ.368.18 కోట్లు చూపించడంతో వరద బాధితులు నోరెళ్లబెడుతున్నారు. బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్దఎత్తున ఆహారం సమకూర్చారు. వరద ఎక్కువగా ఉండటంతో ముంపు ప్రాంతాల్లో శివారు ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తరఫున 97 లక్షల మందికి ఆహారం అందించినట్టు లెక్క రాసేశారు. 3.97 లక్షల మందికి టిఫిన్, 4.33 లక్షల మందికి మధ్యాహ్న భోజనం, 4.26 లక్షల మందికి రాత్రి భోజనం ఇచ్చినట్టు ఆయనే స్వయంగా పలుమార్లు వెల్లడించారు.

97.70 లక్షల మందికి టిఫిన్, లంచ్, డిన్నర్‌కి రూ.368.18 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపారు. అంటే ఒక్కో బాధితుడికి రోజుకు రూ.376 చొప్పున ఆహారం కోసం ఖర్చు చేసినట్టు రాసుకుని ఆ మొత్తాన్ని కొల్లగొట్టారు. ఆహారం అందక జనం అష్టకష్టాలు పడితే.. వారికి స్టార్‌ హోటల్‌ భోజనం పెట్టినట్టు చెప్పడాన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.  

మంచినీళ్లలోనూ అదే తీరు  
వరద బాధితులకు 94 లక్షల మంచినీళ్ల బాటిళ్లు ఇచ్చినట్టు లెక్క రాసుకుని రూ.26.80 కోట్లను పాలకులు బొక్కేశారు. 94 లక్షల బాటిళ్లలో పావు వంతు కూడా జనానికి అందలేదు. నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందకపోయినా లక్షలాది మందికి ఇచ్చేసినట్లు.. అందుకోసం రూ.61 కోట్లకు పైగా ఖర్చయినట్టు లెక్కల్లో చూపించారు. విజయవాడ సింగ్‌నగర్‌ పరిసరాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల వరద కంపు కొడుతున్నా, చెత్త కనిపిస్తున్నా పారిశుధ్యం మాత్రం సూపర్‌గా ఉందని.. ఇలా చేయడానికి రూ.51 కోట్లు ఖర్చయ్యిందని లెక్కల్లో రాసేసుకున్నారు. 

అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోటా రూ.23 కోట్లు  
అన్నిటికంటే విచిత్రమైన విషయం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23.07 కోట్లు ఖర్చవడం. అసలు జనానికి ఇవి ఎక్కడ ఇచ్చారో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏ ప్రాంతంలో వరద బాధితుల్ని అడిగినా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మొబైల్‌ జనరేటర్ల ఖర్చు కూడా అందులో ఉందని కవర్‌ చేసుకుంటున్నారు. కానీ.. అవి ఎక్కడ, ఎన్ని పెట్టారో కూడా అధికారులకు తెలియదు. అవినీతి వరదలో వీటి ఖర్చే వింతల్లోకెల్లా వింతగా కనిపిస్తోంది.  

డ్రోన్ల ఖర్చు రూ.2 కోట్లు
వరద ఖర్చుల వింతల్లో డ్రోన్ల ఖర్చు సరికొత్తగా ఉంది. కేవలం డ్రోన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. డ్రోన్లతో ఆహారం సరఫరా చేసినట్టు ఏఐ సాయంతో ఫొటోలు తయారు చేసి.. ఇప్పుడు వాటి కోసం కోట్లు ఖర్చయినట్టు లెక్కలు రాశారు. చెత్త తరలింపు, వరద నీరు తోడటం వంటి ఖర్చులే రూ.7 కోట్లు దాటిపోయాయి. వరద బాధితుల తరలింపు, చెత్త ఎత్తడం, పారిశుధ్యం ఈ లెక్క వేరేగా ఉంది. అవన్నీ కలుపుకుంటే ఖర్చులే రూ.557 కోట్లు దాటిపోయింది.

అంత ఖర్చు ఎక్కడ పెట్టారు?
ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయ­ని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు దండుకున్నట్టు ఏ లెక్క చూసినా స్పష్టమవుతోంది. ఈ సొమ్ములో చాలా వరకూ విడతల వారీగా ఇప్పటికే విడుదలైంది. కలెక్టర్లు, వివిధ శాఖల ద్వారా ఆ సొమ్మును డ్రా చేసి బిల్లులు కూడా చాలా వరకూ చెల్లించేశారు. వరద ఖర్చుల్లో ఒక్కో అంశంపైనా అవినీతి కేసు­లు పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవు­తోంది. వరద బాధితులను ఆదుకోకపోగా వారి పేరుతో రూ.వందల కోట్లు దోచేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా­యి. 

రూ.500 కోట్ల విరాళాలు హుష్‌ కాకే! 
వరద బాధితులను ఆదుకోవడానికి చం­ద్ర­బాబు భారీగా విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా నిధు­లు దాతల నుంచి అందినట్టు ప్రకటించారు. విరాళాలు బాగా వచ్చాయనుకుంటే.. వాటికి మించి రూ.557 కోట్ల ఖర్చు­ల లెక్కలు చూపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని కుంగదీసిన వరద చంద్రబాబు సర్కారుకు కాసులు కురిపించినట్టు స్పష్టమవుతోంది. బాధితులకు రూ.602 కోట్ల నష్టపరిహారం ఇచ్చినట్టు ప్రకటించినా.. ఇంకా చాలా మందికి అందలేదు. నిత్యం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బాధితులు చేస్తున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement