Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Sand Mafia Major scam next to CM Chandrababu residence1
ఇసుకలో మస్కా!

ఓచేత్తో ఉచిత ఇసుక అంటూ ప్రజలను మాయ చేస్తూ... మరోచేత్తో భారీ దందాను ప్రోత్సహిస్తూ జేబులు నింపు­కొంటున్నారు పెదబాబు, చినబాబు. అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని.. అనుమతుల్లేని తవ్వకాలతో రోజుకు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణా నదీ గర్భం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో బల్లకట్టు నావిగేషన్‌ చానల్‌ ముసుగులో సాగుతున్న భారీ దందా.సాక్షి, అమరావతి: పెదబాబు, చినబాబు అండదండలే అర్హతగా... కృష్ణా నదిలో బల్లకట్టు నావిగేషన్‌ చానల్‌ పూడికతీత పనుల కాంట్రాక్టు చేజిక్కించుకుంది కృష్ణా–గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థ. ఇది పైకి మాత్రమే. చేస్తున్నది మాత్రం నిత్యం వేలాది ట­న్నుల ఇసుక అక్రమ తవ్వకం.. తరలింపు. రాజధాని పను­లకు ఇసుక, నావిగేషన్‌ చానల్‌ పేరిట అడ్డగోలుగా తవ్వి రోజుకు దాదాపు రూ.4 కోట్లు మింగేస్తోంది. ⇒ కృష్ణా నది మీదుగా గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాకపోకలకు ఇబ్రహీంపట్నం–వైకుంఠపురం మధ్య బల్లకట్టు దారి ఉంది. దీనిలో ఇసుక మేటలను తొలగించేందుకు కృష్ణా, గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థ డిసెంబరులో కాంట్రాక్టు పొందింది. ఇసుక తవ్వకంలో ఎలాంటి అర్హత లేకున్నా కేవలం చినబాబు సన్నిహితులంతా కలిసి దీనికి కాంట్రాక్టు ఇప్పించారు. తాము చెప్పినట్టల్లా సంతకం పెట్టే ఇరిగేషన్‌ అధికారిని గుంటూరు జిల్లాలో నియమించి అనుమతులు తీసుకున్నారు. నావిగేషన్‌ చానల్‌ పరిధిలో ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వి తీయాలనేది కాంట్రాక్టు. టన్నుకు రూ.215 చొప్పున చెల్లిస్తోంది. వాస్తవానికి టన్ను ఇసుక తవ్వేందుకు రూ.50, లోడింగ్‌కు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, అంతా సొంతవాళ్లే కావడంతో ప్రభుత్వ పెద్దలు అదనంగా రూ.150 కలిపి కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. దీంట్లోనే.. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశిత 7 లక్షల టన్నులకు రూ.10.5 కోట్లు అప్పనంగా ఇచ్చినట్లయింది. ⇒ ఇప్పటికే 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వేసినట్లు స్థానిక బోట్స్‌మెన్‌ సంఘాలు చెబుతున్నాయి. రాజధాని పనుల కోసమని చెబుతూ రోజుకు 30 వేల టన్నుల ఇసుకను తోడుతున్నారు. ఇందులో సగానికి పైగా హైదరాబాద్, తదితర నగరాలు, పట్టణాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు టన్ను రూ.130కే ఇసుక సరఫరా చేయాలని మొదట ఒప్పుకొన్నారు. కానీ, కాంట్రాక్టు రూ.215కు తీసుకున్నాం కాబట్టి అంతే ఇవ్వాలని వసూలు చేస్తున్నారు. ఇందులోనూ టన్నుకు రూ.85 మిగుల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌కు తరలించే ఇసుకను టన్ను రూ.2,500తో అమ్ముతున్నారు. మొత్తంగా రోజుకు 30 వేల టన్నుల మీద సుమారు రూ.4 కోట్లు.. నెలకు రూ.100–120 కోట్లు అక్రమంగా అర్జిస్తున్నారు. ఈ లెక్కన మార్చి నుంచి ఇప్పటి వరకు.. అంటే ఐదు నెలల్లో రూ.580 కోట్లకు పైగా దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దందా చూస్తుంటే... బల్లకట్టు కోసం కానే కాదు.. చినబాబు మూటల కోసమేనని స్పష్టమవుతోంది. అంతా ఆ తాను ముక్కలే...కృష్ణా–గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థ తాతినేని వంశీది చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ కీలక పాత్ర అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న కీలక అనుయాయుడు కేఆర్‌కృష్ణా–గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థ తాతినేని వంశీ అనే వ్యక్తికి చెందినది. కరకట్టపైనే నివాసం ఉండే, చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్, మరికొందరు కలిసి దీన్ని నడిపిస్తున్నారు. వీరికి చినబాబు తరఫున ప్రతినిధిగా ఆయన కీలక అనుయాయుడు కేఆర్‌ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అందరూ ముఠాగా ఏర్పడి ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ప్రకాశం బ్యారేజీ పూడికతీత పనుల్లోనూ రెట్టింపు మొత్తం దండుకునేందుకు స్కెచ్‌ వేశారు. రాజధాని పనులు చేస్తున్న బడా కంపెనీల తరఫున ఇదే కంపెనీతో టెండర్లు వేయించి, దాన్ని కూడా సిండికేట్‌గా దక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా త్వరలో రూ.286 కోట్ల విలువతో టెండర్‌ పిలిచేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కాంట్రాక్టు కూడా కృష్ణా–గోదావరి వాటర్‌ వేస్‌కు ఇచ్చేలా చినబాబు స్కెచ్‌ వేశారు. అందుకుతగ్గట్టుగానే టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.అర్హత, అనుభవం లేని సంస్థకు కట్టబెట్టేసి...చినబాబు జేబు సంస్థకు అడ్డగోలుగా అనుమతులులారీలు ఆపితే పేషీ నుంచి వెంటనే ఫోన్లుఅడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకిగత ప్రభుత్వంలో పక్కనపెట్టినా.. కూటమి వచ్చాక పచ్చజెండాకృష్ణా–గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థకు ఇసుక తవ్వే అర్హతలు ఏమాత్రం లేవని బోట్స్‌మెన్‌ సంఘాలు చెబుతున్నాయి. డ్రెడ్జింగ్‌ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వాపోతున్నాయి. తమ ఉపాధి పోతోందని, నదీ గర్భం కుంగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునేవారే లేరని బోట్స్‌మెన్‌ సంఘాల వారు వాపోతున్నారు. వాస్తవానికి డ్రెడ్జింగ్‌కు అవసరమైన రిజిస్ట్రేషన్లు, బోట్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, సరంగు లైసెన్స్‌లతో పాటు ఇతర చట్టపరమైన అర్హతలు ఏవీ లేవని తేలడంతో గత ప్రభుత్వంలో ఈ సంస్థకు ఏ పనీ ఇవ్వలేదు. ఇప్పుడు చినబాబు బినామీగా మారడంతో కాంట్రాక్టులు సులభంగా వచ్చేస్తున్నాయి. పేరు ఆ కంపెనీదైనా వ్యవహారాలన్నీ చినబాబు మనుషులే చూసుకుంటున్నారు. అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు. కంపెనీ లారీలు, వ్యవహారాలను ఎవరైనా ఆపితే వెంటనే చినబాబు పేషీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. నావిగేషన్‌ చానల్, డ్రెడ్జింగ్‌ పేరుతో తమ ఇంటి పక్క నుంచే రూ.కోట్లు కురిపించే ఇసుక చానల్‌ను పెదబాబు, చినబాబు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Farmers are waiting for urea in Telangana2
యూరియా కోత.. రైతన్న వెత

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో ఎరువుల కోసం డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌ విధానంలో ఒక్కొక్కరికి రెండు బస్తాలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్‌కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్‌ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..రాష్ట్రానికి కోటాకు మించి ఎరువులు సరఫరా చేశామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇది రైతులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, గ్రామాల్లో యూరియా కోసం ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. చర్చనీయాంశమైన కేంద్రమంత్రి ప్రకటన రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఈ ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో అవసరమైన 20.30 ఎల్‌ఎంటీల కన్నా అధికంగా 22.15 ఎల్‌ఎంటీలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దీంతో బిత్తరపోవడం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల వంతయ్యింది. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి.. యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పీ ఎరువులు కలిపి 22.15 ఎల్‌ఎంటీ ఇచ్చినట్లు చెప్పాల్సిన కేంద్ర మంత్రి.. కేవలం యూరియానే 22.15 ఎల్‌ఎంటీ సరఫరా చేసినట్లుగా చెప్పారని ఓ అధికారి వివరించారు. నిజానికి ఇప్పటివరకు ఇచ్చిన యూరియా 4.50 ఎల్‌ఎంటీలు మాత్రమేనని చెప్పారు. అసలు లెక్కలేంటి? రాష్ట్రంలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో ఏకంగా 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 10.48 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం ఈ సీజన్‌కు గాను నెలవారీగా 9.80 ఎల్‌ఎంటీలు మాత్రమే కేటాయించింది. అదేమంటే యాసంగి సీజన్‌లో మిగిలిన యూరియా 1.92 ఎల్‌ఎంటీ గోదాముల్లో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాచారం మేరకు.. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు కేంద్రం 6.60 ఎల్‌ఎంటీల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.50 ఎల్‌ఎంటీలే వచ్చింది. అంటే 2.10 ఎల్‌ఎంటీ (32 శాతం) తక్కువగా వచ్చిందన్న మాట. దీనికి రాష్ట్రం వద్ద ప్రారంభ నిల్వ కింద ఉన్న యూరియా 1.92 ఎల్‌ఎంటీలు కలిపితే మొత్తం 6.42 ఎల్‌ఎంటీలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ఇందులో సుమారు 5.20 ఎల్‌ఎంటీలు ఇప్పటికే రైతులకు విక్రయించగా.. 1.20 ఎల్‌ఎంటీల పైచిలుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఎల్‌ఎంటీలైనా వస్తేనే.. ఈ సీజన్‌లో రాష్ట్రానికి కేటాయించిన 9.80 ఎల్‌ఎంటీలకు గాను జూలై వరకు 4.50 ఎల్‌ఎంటీలు సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా 5.30 ఎల్‌ఎంటీల యూరియా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో కోత విధించిన 2.10 ఎల్‌ఎంటీలతో పాటు ఆగస్టు కోటా 1.70 ఎల్‌ఎంటీలు కలిపి ఈ నెలలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో అధికారులు సమావేశమై యూరియా కొరత పరిస్థితిని సమీక్షించారు. ఆగస్టులో కనీసం 2 ఎల్‌ఎంటీల యూరియా అయినా వస్తేనే ప్రస్తుతానికి గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు లేఖ రాశారు. రాష్ట్రానికి యూరియా కేటాయింపులు, ఇప్పటివరకు కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చిన యూరియా వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొరతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అవసరమైన యూరియాను పంపించాలని విజ్ఞప్తి చేశారు.

Rasi Phalalu: Daily Horoscope On 04-08-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోగతి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.దశమి ఉ.9.44 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: అనూరాధ ఉ.8.31 వరకు, తదుపరి జ్యేష్ఠ,వర్జ్యం: ప.2.38 నుండి 4.23 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.1.29 నుండి 2.55 వరకు.సూర్యోదయం : 5.42సూర్యాస్తమయం : 6.29రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.వృషభం..... పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.మిథునం... కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. కొత్త విద్యావకాశాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం......ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ.సింహం... అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులు నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.కన్య... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. విందువినోదాలు.తుల... వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు.వృశ్చికం.... ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.ధనుస్సు.... ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.మకరం.... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.కుంభం... కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు పనిభారం నుంచి బయటపడతారు. దైవదర్శనాలు.మీనం... ఆర్ధిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Sakshi Guest Column On Donald Trump Tarrifs On India Trade4
తలతిక్క సుంకాల తలనొప్పి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఆయన బృందంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్‌ నాలుగు నెలలు చర్చలు జరిపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిపై 26 శాతం సుంకం విధిస్తామని ఏప్రిల్‌ 2న బెదిరించిన ట్రంప్‌ ఆగస్టు 30న 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.చర్చలు మొదలైనప్పటి నాటికన్నా పరిస్థితి ఇపుడు మరింత దారుణంగా తయారైంది. రష్యా నుంచి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్ళను నిలిపివేయకపోతే జరిమానా కింద మరికొంత సుంకాన్ని విధిస్తామని కూడా ట్రంప్‌ హెచ్చరించారు. అయితే, ఆ సుంకం శాతాన్ని నిర్దిష్టంగా ప్రకటించలేదు. భారత్‌ సుంకాలు ప్రపంచం మొత్తంమీద చాలా ఎక్కువగా ఉన్నాయని, ద్రవ్యేతర వాణిజ్య చర్యలు ‘‘అత్యంత శ్రమ పెట్టేవిగా, అప్రియమైనవిగా’’ ఉన్నాయని ఆయన అన్నారు.ట్రంప్‌ కోరుతున్నదేమిటి?అమెరికాతో వాణిజ్యం విషయంలో, ట్రంప్‌ కుయుక్తులను, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని రకాల చర్చలనూ విరమించుకోవాలా లేక లొంగిపోవాలా? ద్వైపాక్షిక వాణిజ్య లోటును నిర్మూలించే పేరుతో ట్రంప్‌ మొదలెట్టిన జూదం దాని భాగస్వామ్య దేశాలకు ఎంత రుచించని దైనా, ఆయన లక్ష్యాలు మాత్రం స్పష్టం. అమెరికాతో వాణిజ్యంలో మిగులులో ఉన్న దేశాలు, ఆ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు నాలుగు చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ కోరుతున్నారు. 1. సుంకం పైసా కూడా లేకుండా అన్ని అమెరికా ఉత్పత్తులకూ సంపూర్ణ మార్కెట్‌ సౌలభ్యం కల్పించడం; 2. అమెరికాకు ఎగుమతి చేసే వాటిపై 15–25 శాతం సుంకం విధించడానికి అంగీకరించడం; 3. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు వీలుగా అమెరికా నుంచి ఇపుడు కొంటున్నవాటికి తోడుగా విమానాలు, ఇంధనం వంటివాటిని కొనడం; 4. అమెరికాలో వస్తూత్పత్తికి పెట్టుబడులు పెట్టడం.చాలా దేశాలు రెండు కారణాలతో అమెరికాకు ఎగుమతులు ఇష్టపడతాయి. ఒకటి– అది చాలా పెద్ద మార్కెట్‌ (మొత్తం ప్రపంచం ఎగుమతుల్లో సుమారుగా 15 శాతం దానికే వెళుతున్నాయి), రెండు – ఎగుమతిదారులకు లాభాలు సమకూరుతాయి. కానీ అద నపు సుంకాల భారాన్ని నెత్తికెత్తుకుని అనిష్టంగానైనా ఎగుమతులు చేస్తే వారికొచ్చే లాభాలు ఏమీ ఉండవు. అదనపు సుంకాల భారాన్ని భరించినా ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోగలిగిన అవకాశం భారతీయ ఎగుమతిదారులకు లేదు. కనుక, అదనపు 25 శాతం సుంకానికీ, జరిమానా సుంకానికీ భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.తీర్చలేని డిమాండ్లుజన్యుపరంగా సవరించిన గింజలతో తీసిన వంటనూనె దిగు మతులను (జీఎం నూనె మనుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలు ఏవీ జరగలేదు), పాడి పరిశ్రమ ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను (అమెరికన్‌ చికెన్‌ లెగ్స్‌ వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి) అనుమతించడం అంటే... వ్యావసాయిక వాణిజ్యాన్ని భారత్‌ సరళీకృతం చేయడం. ఇది వివేకవంతమైన చర్యగానే తోస్తుంది. కానీ, దేశీయ రైతులను సంరక్షించవలసిన బాధ్యత వల్ల, ఈ విషయంలో భారత దేశం పాలుపోని స్థితిలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇవ్వగలిగిన స్థితిలో ఇండియా లేదు. భారతదేశ రక్షణ అవసరాలకు ఒదగని లేదా మరీ ఖరీదుతో కూడిన ఎఫ్‌–35 విమానాలను లేదా ముడి చమురును కొనాలని అమెరికా బలవంతపెట్టడం బ్లాక్‌ మెయిల్‌ చేయడమే! దానికి లొంగి పోతే భారత్‌ బలహీనమైనదనే ముద్రపడుతుంది. ఇక భారత్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడమేకానీ, ఇవ్వడం చాలా అరుదు. విదేశాల్లో భారత్‌ పెట్టుబడులు కొద్దిగానే ఉన్నాయి. రానున్న 5–10 ఏళ్ళలో, అమెరికాలో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టడం కూడా మనకు కష్టమే. ట్రంప్‌ అడుగుతున్న నాలుగింటిలో దేన్నీ తీర్చగల స్థితిలో ఇండియా లేదు.ట్రంప్‌ నాలుగు డిమాండ్లకూ వియత్నాం, జపాన్, ఇండో నేషియా, యూరోపియన్‌ యూనియన్‌ మాత్రమే అంగీకరించాయి. అమెరికా అదనపు సుంకాలను దిగమింగుకుని ఈ దేశాల ఎగుమతిదారులు తమ వస్తువుల ధరలను తగ్గిస్తారా లేక అమెరికా వినియోగదారులకు ఆ భారాన్ని బదలీ చేస్తారా? లేక రెండింటి మిశ్రమంతో ముందుకు సాగుతారా? ఆ యా ఎగుమతి దేశాలు అదనపు సుంకాలను తామే భరించడంలో లేదా అమెరికా వినియోగ దారులకు బదిలీ చేయడంలో విఫలమైతే నష్టపోయేది అమెరికా, దాని వినియోగదారులే! ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆ యా దేశాలు, నిజంగా చెప్పినంత సంఖ్యలో విమానాలను, ఇంధన ఉత్పత్తులను, రక్షణ పరికరాలను కొనుగోలు చేయగలుగుతాయా? దానికి చాలా కాలం పడుతుంది. పైగా, వాటి ధరలు తగ్గించాలని అవి అమెరికాను డిమాండ్‌ చేయవచ్చు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇలా ఉండాలి, అలా ఉండాలని చర్చలతో సుదీర్ఘ కాలయాపన చేయ వచ్చు. ఈ తతంగం ద్వారా ట్రంప్‌ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు. లేదా ఆశించింది కొండంత, లభించింది ఆవగింజంతగా పరిణమించవచ్చు. ఇండియా ముందున్న మార్గంభారత్‌ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఒకటి– జపాన్, వియత్నాం, ఇండోనేషియా, యూరోపియన్‌ యూనియన్‌ల మాదిరిగా తలొగ్గి ఒప్పందం కుదుర్చుకోవడం. తర్వాత, భారత్‌ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎగువ పేర్కొన్న ఎత్తుగడలను అనుసరించడం. రెండు– ట్రంప్‌ వాణిజ్య బృందంతో అన్ని చర్చలకూ స్వస్తి పలికి, ఏ సుంకాలు విధించుకుంటావో విధించుకో అనడం. అదనపు సుంకాల భారాన్ని నెత్తిన రుద్దుకోకుండా, వస్తువులను వాటి సాధారణ ధరలకే విక్రయించవలసిందని ఎగుమతిదారులకు నచ్చజెప్పడం. అమెరికాలోని దిగుమతిదారులు కొంటే మంచిదే. లేదంటే, ఆ వస్తువులను, అటువంటి అసంబద్ధ సుంకాలు లేని ఇతర దేశాలకు విక్రయిచడం. దేశీయ మార్కెట్‌ లోనూ అమ్ముకునేటట్లు చూసుకోవడం. కొన్ని ఎంపిక చేసుకున్న వాటికి అంగీకరించి, మధ్యే మార్గాన్ని అనుసరించడం వల్ల భారత దేశానికి పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అంతకంటే, రెండవ దారిని ఎంచుకుని ముందుకు సాగడమే మంచిది. ట్రంప్‌ పాలనా యంత్రాంగం తలతిక్కతో తీసుకుంటున్న సుంకాల చర్యల ప్రతికూల పర్యవసానాలను త్వరలోనే (మహా అయితే 3–6 నెలల్లో) చవిచూడవలసి రావచ్చు. అమెరికా దిగు మతులు మందగిస్తాయి (ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసిక గణాంక వివ రాలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి). సుంకాల రాబడి కింద అమెరికాకు కొద్ది వందల బిలియన్ల డాలర్లు లభించవచ్చు. కానీ, దానిలో చాలా భాగాన్ని అమెరికాలోని దిగుమతిదారులు, వినియోగదారులే చెల్లించవలసి ఉంటుంది. ధరలు మంట పుట్టించడంతో వినియోగ దారుల తిరుగుబాటుకు ఎంతో కాలం పట్టదు. పరిస్థితులు తేటతెల్లమవుతున్నకొద్దీ, ట్రంప్‌ తాను విధించిన చాలా సుంకాలను వెనక్కి తీసుకోక తప్పదు. అందుకే ఇండియా వేచి చూడటమే మంచిది. దానివల్ల పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు.సుభాష్‌ చంద్ర గర్గ్‌ వ్యాసకర్త ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Trump Showers Praise on White House Press Secretary Karoline Leavitt5
కరోలిన్‌పై ట్రంప్‌ ‘వంకర పొగడ్తలు’ 

వాషింగ్టన్‌: మహిళలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చూపు ఇప్పుడు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లెవిట్‌(27)పై పడింది. ఆమె అందరికంటే ఉత్తమ సెక్రటరీ అంటూ కితాబివ్వడంతోపాటు పలు విపరీత పొగడ్తలు కురిపించారు. న్యూస్‌మ్యాక్స్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో ట్రంప్‌.. లెవిట్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు. అధికార పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే ట్రంప్‌ ఆరు ప్రాంతాలకు సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందాలను కుదిర్చారంటూ శుక్రవారం మీడియా సమావేశం సందర్భంగా ట్రంప్‌పై లెవిట్‌ ప్రశంసలు కురిపించారు. ‘లెవిట్‌ పెద్ద స్టారైపోయారు. ఆ ఫేస్‌..ఆ బ్రెయిన్‌ అద్భుతం. ఆమె పెదాలు అబ్బో..అవి కదులుతుంటే అచ్చు మెషీన్‌ గన్‌ లాగే ఉంటాయి’అంటూ పేర్కొన్నారు. ఆమె చాలా గొప్పవ్యక్తి. కరోలిన్‌ కంటే ఉత్తమ ప్రెస్‌ సెక్రటరీ ఇప్పటి వరకు ఎవరూ లేరనే అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదంటూ నెటిజన్లు తప్పుబట్టారు. ఆయన పొగడ్తలు అసౌకర్యం, భయంకరం, అనవసరం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ బెస్ట్‌ఫ్రెండ్‌ మాట్లాడినట్లే ఉందంటూ ఎద్దేవా చేశారు. గతంలో ట్రంప్, ఎప్‌స్టీన్‌ మధ్య కొనసాగిన మైత్రి వివాదాస్పదంగా మారడం తెల్సిందే. ‘అదే ఒక వ్యక్తి తన మహిళా కొలీగ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, కోర్టు బోనెక్కించేవారు అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. వృత్తిపరమైన ప్రవర్తనలో ద్వంద ప్రమాణాలకు ఇదే ఉదాహరణ అంటూ ఆ యూజర్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు సంబంధించి మీడియా ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రధాన మీడియా సంస్థలు గానీ, వైట్‌ హౌస్‌ గానీ ఈ విపరీత వ్యాఖ్యలపై ట్రంప్‌ను ప్రశి్నస్తాయా అంటూ నిలదీస్తున్నారు.

Cops admit to erasing 15 years of unidentified death records6
‘ధర్మస్థల’ దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం

బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్‌ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్‌(యూడీఆర్‌)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్‌ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల సమక్షంలోనే ఖననం ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్‌ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్‌కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్‌ ఫిర్యాదుపై సిట్‌ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్‌ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్‌ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్‌మార్టం రిపోర్టులు, వాల్‌ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్‌ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్‌ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్‌కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు. నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు.

Sakshi Editorial On Fifty years of Sholay Movie7
యాభై ఏళ్ల షోలే

థియేటర్‌లోని ప్రేక్షకులు సీటు కిందకు తల ఒంచి అటూ ఇటూ వెతికారు... కాయిన్‌ ఇక్కడెక్కడైనా పడిందా అని. ‘షోలే’ క్లయిమాక్స్‌లో అమితాబ్‌ మరణించాక అతని చేతిలోని కాయిన్‌ చూసి ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. ఆ కాయిన్‌ కు రెండు వైపులా ‘హెడ్స్‌’ ఉంటుంది. ఇంతకాలం తన ప్రాణమిత్రుడు దొంగటాస్‌ వేసి మోసం చేశాడని, ఇవాళ అదే టాస్‌తో తనను కాపాడితాను మరణించాడని గ్రహించి, ఆగ్రహంతో కాయిన్‌ ని విసిరి కొడతాడు. అది గల్‌గల్‌మంటూ థియేటర్‌లోనే ఎక్కడో పడుతుంది. ఒక క్షణం ప్రేక్షకులు దాని కోసం అటూఇటూ వెతుకుతారు. ఎందుకంటే అందాక వారికలాంటి అనుభూతి తెలియదు. స్టీరియోఫోనిక్‌ వల్ల వచ్చింది. షోలేను షోలే అభిమానులు స్టీరియోఫోనిక్‌ థియేటర్‌ వెతుక్కుంటూ నగరాలకు వెళ్లి చూశారు. 70 ఎం.ఎంలో చూశారు. స్కోప్‌లో చూశారు. 35 ఎం.ఎం.లో చూశారు. చిన్న ఊళ్లలో నిడివి కుదించి జయభాదురి ఫ్లాష్‌బ్యాక్‌ లేని వెర్షన్‌ రిలీజ్‌ చేస్తే అదీ చూశారు. దూరదర్శన్‌ లో చూశారు. కేబుల్‌ టీవీలో చూశారు. యూ ట్యూబ్‌లో చూశారు. ఓటిటిలో చూశారు. యాభై ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. షోలే అభిమానులది వేరే లెవల్‌.ఆడే సినిమాలు ఆడదగ్గ రీతిలో తీస్తే ఆడతాయి. సెట్స్‌ వల్ల, విఎఫ్‌ఎక్స్‌ వల్ల, భారీ బడ్జట్‌ వల్ల, ముహూర్తబలం వల్ల ఆడవు. ఆడదగ్గ రీతిలో కథ అనుకుని ఇవన్నీ కలిపితే ఆడొచ్చు. షోలే సినిమా తొలిషాట్‌ తీయడం కుదరలేదు. వాన. ముహూర్తం అప్‌సెట్‌ అయ్యింది. రెండోరోజు తెల్లచీర కట్టుకుని వితంతువు పాత్రలో ఉన్న జయభాదురి అమితాబ్‌కు ఇనప్పెట్టె తాళాలు ఇవ్వడం ఫస్ట్‌షాట్‌గా తీశారు. దక్షిణాది సినీచరిత్రలో నేటి వరకు వితంతువు పాత్రపై ముహూర్తం షాటు తీసిన దాఖలా లేదు. అలా తీస్తే ఫ్లాప్‌ అవుతుందా? అలా తీయకపోతే హిట్‌ ఏమైనా అయ్యిందా? తాము చేసే దుర్మార్గాలకు, దోపిడీలకు దైవబలాన్ని తోడు అడగడం కూడా షోలే తీసేసింది. గబ్బర్‌ సింగ్‌ ఒక్కనాడు కూడా కాళీమాత విగ్రహం ఎదుట ప్రమాణం చేసి దోపిడీకి బయలుదేరడు. అప్పటి వరకూ హిందీ సినిమాలలోని బందిపోట్లు అందరూ కాళీమాత బలాన్ని తోడు అడిగేవారే.సమాజం చెడ్డను భరించగలదుగానీ మరీ దారుణమైన చెడ్డను సహించలేదు. ఆ చెడ్డను పరిహరించడానికి మెరుగైన చెడ్డనైనా శరణుజొచ్చడానికి వెనుకాడదు. గబ్బర్‌ సింగ్‌ అఘాయిత్యాలు పట్టనలవి కానప్పుడు అంత చెడ్డవాణ్ణి నిర్మూలించడానికి కొంచెం చెడ్డవాళ్లను నియమిస్తారు. వీరు, జయ్‌ చిల్లర దొంగలే గాని వారిలో బహాదూరి ఉంది. మానవత్వం కూడా ఉంది. ఊరు వారిని ఆదరిస్తుంది. వర్తమానంలో కరడుగట్టిన నేరస్తుల శిక్షకు పోలీసులు ఎన్‌ కౌంటర్‌ అనే చెడ్డమార్గం ఎంచుకుంటే ప్రజలు ఆదరించడం ఇలాంటిదే కావచ్చు. వ్యక్తిగత ఆగ్రహాన్ని సామాజికస్థాయికి తీసుకెళ్లమని షోలే చెబుతుంది. గబ్బర్‌ సింగ్‌ వల్ల ఠాకూర్‌ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. గబ్బర్‌ని శిక్షించడం వ్యక్తిగతమైన కక్షే... కాని అందులో సామాజిక న్యాయం ఉంది. ఇవాళ సగటు మనిషి తన నెత్తిన పన్నులు పడుతున్నా, తన ప్రమేయం లేకుండా కుల, మత, పార్టీల జంజాటంలో పడుతున్నా, తన సంపాదనను స్కూళ్లు, హాస్పిటళ్లు బట్టలిప్పించి దోచుకుంటున్నా, చిల్లర జీతాలతో సంస్థలు గాడిద చాకిరీ చేయిస్తున్నా, న్యాయం కోసం ఏళ్లకేళ్లు అంగలార్చాల్సి వస్తున్నా కిమ్మనడం లేదు... శాపనార్థాలు పెట్టుకోవడం తప్ప. ఎలుక శాపం పిల్లికి తగలదు. ఠాకూర్‌లా కార్యాచరణకు దిగితే, ఒకరొకరుగా కదిలి ఊరు మొత్తం గబ్బర్‌ అంతు చూసినట్టు సమస్య అంతు చూడొచ్చు. దురదష్టవశాత్తు జనంలో అది పూర్తిగా పోయింది.షోలేలోని మహిళలు ధీర వనితలు. గబ్బర్‌ను ధిక్కరించే బసంతి గాని, పరిస్థితులకు చలించక స్థైర్యం చూపే ఠాకూర్‌ కోడలుగాని ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా’ తరహా కాదు. షోలే కథ ‘రేప్‌’ సీన్‌ కు చోటివ్వలేదు. నేడులా బడ్జెట్‌లో సగాన్ని బకెట్ల బకెట్ల బ్లడ్‌కు కేటాయించే పని లేకుండా రక్తమే చూపలేదు. కొండలు, గుట్టలు, పచ్చదనం ఉన్న బెంగళూరు సమీపంలోని రామ్‌నగర్‌ అనే చోట షూటింగ్‌ చేయడం తప్ప షోలే చేసిన సర్కస్‌ ఏదీ లేదు. షోలే మానవ ఉద్వేగాల మేజిక్‌. కెమెరా, సంగీతం, మాట, పాత్ర, దర్శకత్వం... వీటిని ఎంత మేలిమి నైపుణ్యంతో వాడి ఈ మేజిక్‌ చేయవచ్చో చరిత్ర చెప్పుకునేలా చూపింది. 1975 ఆగస్టు 15న షోలే విడుదలైంది. ఈ ఆగస్టు 15కు యాభై ఏళ్లు. ఇప్పటికే దేశంలో చర్చలు, కార్యక్రమాలు, జ్ఞాపకాల రీవిజిట్‌లు సాగుతున్నాయి. తెలుగు అభిమానులు ఎలాగూ ఉత్సవాలు జరుపుతారు. మన పరిశ్రమ... ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు షోలేకు ఎటువంటి స్మరణ, సత్కారం చేస్తారో చూడాలి.

ACB Court Serious on SIT Over AP liquor Scam Case: Andhra pradesh8
బేతాళ కుట్రలో మరో అంకం

సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్‌ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్‌ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్‌ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్‌ నంబర్‌ను రికార్డ్‌ చేయాలని సిట్‌ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.డిపాజిట్‌ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్‌ (కౌంటర్‌ ఫైల్‌) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్‌కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్‌ చేశారు.తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్‌ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు. చెల్లని నోట్లతో కట్టుకథ చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్‌ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీ­కరించారు. ఆ ఫొటో­లు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవి­రెడ్డిని అరెస్టు చేశారు.దీనిని బట్టి అర్థం కావ­డం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్‌ నా­యుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్‌ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్‌, పుట్టా మహేష్‌లతో వెంకటేశ్‌ నా­యు­డు ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్‌ నాయు­డు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటో­లు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్ప­గలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతు­న్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శ­నం.ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడి­యా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాట­­కం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మ­ద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్‌ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో పరువు పోగొట్టుకున్న సి­ట్‌.. మరో సరికొత్త ఎపిసోడ్‌ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది.

Explanation of the Fractional Real Estate Investment, sakshi special story9
రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్‌..!

ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఓనర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌’లు. ‘ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్‌ అండ్‌ మీడియం రీట్‌ (ఎస్‌ఎం రీట్‌) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్‌ చేసే ప్రతి ప్లాట్‌ఫామ్‌ కూడా స్మాల్‌ అండ్‌ మీడియం రీట్‌ (ఎస్‌ఎం రీట్‌)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్‌ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్‌పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్‌ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్‌ఎం రీట్‌ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్‌్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్‌కు చెందిన కునాల్‌షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్‌్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్‌ అస్సెట్‌ క్లాసెస్‌: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్‌ స్పేస్‌లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్‌ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌లు ఎస్‌ఎం రీట్‌లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ప్రస్తుతం 500–600 మిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్‌ అండ్‌ కో పార్ట్‌నర్‌ హర్ష్ పారిఖ్‌ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్‌ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుబడికి లాకిన్‌ పీరియడ్‌ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌ అయినా లేదా ఎస్‌ఎం రీట్‌లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్‌ ఎస్‌ఎం రీట్‌ లేదా రీట్‌ల్లో ఈ తరహా రిస్క్‌ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్‌ ఎస్‌ఎం రీట్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్‌ఫామ్‌లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్‌ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్‌ రియల్‌ ఎస్టేట్‌ లేదా ఎస్‌ఎం రీట్‌లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్‌ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్‌’ సహ వ్యవస్థాపకుడు కునాల్‌ మోక్తాన్‌ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌ఎం రీట్‌లు పంపిణీ చేసే డివిడెండ్‌లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్‌ఎం రీట్‌ – రీట్‌ → రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్‌ అయిన రీట్‌లను ఒక్క యూనిట్‌ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్‌ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్‌ రీట్‌లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్‌ఎం రీట్‌లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్‌ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్‌ జారీ చేయాల్సిందే. → ఎస్‌ఎం రీట్‌లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్‌ రీట్‌లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. → ఎస్‌ఎం రీట్‌లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్‌లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్‌ఎం రీట్‌లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్‌ రీట్‌లలో కనీసం ఒక యూనిట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్‌ఎం రీట్‌లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్‌ రీట్‌లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్‌ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్‌ ఎస్టేట్‌పై పెట్టుబడికి ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ లేదా రీట్‌లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్‌లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

India vs England: England need 35 runs and India require four wickets10
India vs England: ఇంకా ఉంది!

ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ 3–1 ఆధిక్యంతో సిరీస్‌ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్‌ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్‌కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్‌: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్‌ సిగ్నల్‌’ ఇవ్వడంతో ‘టెండూల్కర్‌–అండర్సన్‌ ట్రోఫీ’ సిరీస్‌ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్‌ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్‌ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్‌ (2 బ్యాటింగ్‌), ఓవర్టన్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌కు ఒక వికెట్‌ దక్కింది. ‘టాప్‌’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్‌ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌ చేరారు. ఓవర్‌నైట్‌ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన డకెట్‌ (54, 6 ఫోరు), కెప్టెన్‌ ఒలీ పోప్‌ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ డకెట్‌ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్‌ చక్కని డెలివరీతో కెపె్టన్‌ పోప్‌ను ఎల్బీగా అవుట్‌ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్‌ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్‌ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్‌లోనే బ్రూక్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్‌ 164/3 వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. బ్రూక్, రూట్‌ శతకాలు నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెషన్‌లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్‌ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్‌తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్‌ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్‌ భారత్‌ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్‌ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్‌లో రూట్‌ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్‌ (5), రూట్‌ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 224; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 247; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 396; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) సిరాజ్‌ 14; డకెట్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌కృష్ణ 54; పోప్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 27; రూట్‌ (సి) జురేల్‌ (బి) ప్రసి«ద్‌ 105; బ్రూక్‌ (సి) సిరాజ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 111; బెథెల్‌ (బి) ప్రసి«ద్‌కృష్ణ 5; స్మిత్‌ బ్యాటింగ్‌ 2; ఓవర్టన్‌ బ్యాటింగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 20–4–85–1, ప్రసి«ద్‌కృష్ణ 22.2–3–109–3, సిరాజ్‌ 26–5–95–2, సుందర్‌ 4–0–19–0, జడేజా 4–0–22–0.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement