సాధారణ విపత్తులా చూడొద్దు
ప్రజలు భారీగా నష్టపోయారు.. రైతులు కుదేలయ్యారు
తిండి, తాగునీరు లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారు
వారందరినీ తిరిగి నిలబెట్టే విధంగా కేంద్రం సాయం చేయాలి
కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఊహించని విపత్తు తలెత్తిందని.. అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణంగా.. గతంలో వచ్చిన వరదల్లా చూడొద్దు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు.
11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరగ్గా.. మొన్న కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పంటలు నీట మునిగి రైతులు కుదేలయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు.. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రజలు ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడండి’ అని కేంద్ర బృందాన్ని కోరారు.
‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం కావాలన్నారు..
అనంతరం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం వరద ప్రాంతాల్లో తమ అనుభవాలను సీఎంకు వివరించారు. ‘భారీగా పంట నష్టం జరిగిందని, మౌలిక సదుపాయాలపరంగా తీవ్ర నష్టం జరిగిందని గుర్తించాం. బుడమేరు వరదలపై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలని వారు కోరారు. తమకు ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకంలో ప్రజలున్నారు. మా పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందేలా కృషి చేస్తాం’ అని కేంద్ర బృందం తెలిపింది.
ఎంఎస్‌ఎంఈలతో డ్వాక్రా సంఘాల అనుసంధానం
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలతో అనుసంధానం చేసి, ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు విలువ జోడించడం, ప్యాకింగ్ వంటి ఉమ్మడి సౌకర్యాల వినియోగంతో పాటు మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తేవాలన్నారు. సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను ఎంఎస్‌ఎంఈ మంత్రి కె.శ్రీనివాస్ విలేకరులకు వివరించారు.
రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులను ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా విక్రయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. విశాఖలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరహాలోనే అమరావతిలో మరొకటి ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా 10కి పైగా వివిధ రంగాల హబ్ అండ్ స్పోక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తోందని, కేంద్రం రూ.5,000 కోట్లు గ్యారంటీ ఇవ్వడంతో చిన్న పరిశ్రమలకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలు లభిస్తాయని అన్నారు.
ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన రూ.1,500 కోట్ల ప్రోత్సాహక బకాయీలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. రాజధానిలో రైతులకు లబ్ధి చేకూర్చిన విధానాన్నే ఈ ఎంఎస్‌ఎంఈ పార్కులకూ అవలంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
రైతులు పండించే పంటలకు వారే విలువను పెంచుకునేలా పాలసీ తేవాలని సీఎం సూచించారు. విజయవాడ వరదల్లో దెబ్బతిన్న పరిశ్రమలను ఏ విధంగా ఆదుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి సీఎం నారా చంద్రబాబునాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. వారు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment