Medicine
-
పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్‌లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్‌సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్
సాక్షి, అమరావతి: ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య రంగం నిలుస్తోంది. ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేకుండానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్లోనే వైద్యులతో సంప్రదింపులు, మందులు ఇంటికే పంపడం వంటివాటితో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువ ఖర్చుకే వైద్యం లభిస్తుండటంతో విదేశీయులు చికిత్సల కోసం మనదేశానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ రంగం 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించింది. బజాజ్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం.. » 2016లో 110 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆరోగ్య రంగం మార్కెట్ 2023 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంది. » 2016–23 మధ్య 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. గత పదేళ్లలో 17.5 శాతం సీఏజీఆర్ చోటు చేసుకుంది. » ప్రధానంగా ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. » 2021లో ఫార్మా మార్కెట్ 42 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే డ్రగ్స్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఆశాజనకమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె, కిడ్నీ, తదితర ప్రధానశస్త్రచికిత్సలకు వ్యయం 20 శాతంపైగానే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2020 నుంచి 2024 మధ్య దేశంలో మెడికల్ టూరిజం నాలుగు రెట్లు పెరిగింది. 2024లో 7.69 బిలియన్ డాలర్లుగా ఉన్న మెడికల్ టూరిజం మార్కెట్ 2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2048 నాటికి 12% పడకలు పెరుగుదలటైర్ 2–6 నగరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. 2048 నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 12 రెట్లు పెరగనుంది. అయితే జపాన్‌లో ప్రతి వెయ్యి మందికి 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9 చొప్పున పడకలు ఉండగా మన దేశంలో 1.3 మాత్రమే ఉన్నాయి. ఇక 2018తో పోలిస్తే 2022 నాటికి దేశంలో వైద్యుల సంఖ్య 1.1 రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2021 నివేదిక ప్రకారం.. ఆరోగ్య రంగంపై దేశ జీడీపీలో అమెరికా 17.4, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) 12.4, కెనడా 12.3 శాతం చొప్పున వెచ్చించాయి. భారత్ 3.3 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. -
సేవా నిరతికి ప్రతీక.. అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్
భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన తొలి మహిళ, అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో పట్టా గడించిన ఏడవ మహిళ అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్. 1874 జూలై 17న బెల్గామ్‌లో జన్మించిన ఆమె తండ్రి క్రైస్తవాన్ని స్వీకరించిన జొరాస్ట్రియన్ కాగా, తల్లి ఆదివాసీ. అలీస్ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందిన తర్వాత, మన దేశపు తొలి తరం మహిళా న్యాయవాదులలో ఒకరైన ఈమె అక్క కొర్నేలియా స్వరాబ్జీ ప్రోత్సాహంతో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో వైద్యశాస్త్ర పట్టాను 1905లో సాధించారు.భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత బహవల్పూర్లోని జనానా హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు. అక్కడే 1906లో బ్రిటిష్ మిషనరీ డాక్టర్ థియొడర్ లైటన్ పెన్నెల్‌ను కలవడం, 1908లో పెళ్లి చేసుకోవడం సంభవించింది. పిమ్మట ఢిల్లీలోని విక్టోరియా హాస్పిటల్ బాధ్యురాలిగా తరలి వచ్చారు. 1914–18 మధ్య కాలంలో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బొంబాయి ప్రెసిడెన్సీలోని మహాబలేశ్వర్ దగ్గర సైనికుల ఆరో గ్యాన్ని కాపాడిన, పర్యవేక్షించిన తొలి మహిళా వైద్యులలో ఈమె కూడా ఒకరు.అఫ్గానిస్తాన్‌లోని గిరిజన తెగల వారితో జీవనం గడిపిన క్రిస్టియన్ మిషనరీ మిస్టర్ పెన్నెల్, తన తల్లి ఇచ్చిన సొమ్ముతో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న) బన్నులో మిషనరీ ఆసుపత్రిని ప్రారంభించారు. దాంతో అలీస్ పెన్నెల్ కూడా ఈ ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఎంతో గౌరవ భావంతో వైద్య వృత్తిని కొనసాగించిన అలీస్ తన భర్తతో కలిసి ఉర్దూ, పష్తూన్ భాషలను నేర్చుకొని అక్కడి పఠాన్ల, పష్తూన్ల హృదయాలను చూరగొన్నారు. అంతే కాదు ఆ ప్రాంతాలలో ఈ దంపతులు జానపద నాయకులుపొందే గౌరవాలను పొందగలిగారు. ఈ సేవలకు ఆమె ‘కైజర్–ఇ–హింద్’ బంగారు పతకాన్ని కూడా పొందారు.చదవండి: అంతర్జాతీయ జీవ పరిణామ దినం.. ఎందుకు జరుపుకుంటారంటే?అయితే ఆమె భర్త 44 ఏళ్ల వయసులో చనిపోవడం విషాదం. ఆసుపత్రిలో పదవీ విరమణ చేసిన తర్వాత అలీస్ ఢిల్లీకి తరలివచ్చి సమాజ, ఆరోగ్య సేవా కార్యక్రమాలలో మునిగి పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాగానే లండన్‌లో స్థిరపడ్డారు. తన 74వ ఏట 1951 మార్చి 7వ తేదీన అలీస్ మాడే సొరాబ్జీ పెన్నెల్ అనారోగ్యంతో కనుమూశారు.– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
ఆస్పత్రుల్లో ఔషధ కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సర్కారు ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి అవి రోగి కి చేరేవరకు పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని తెలిపారు. సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్ర వారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తు న్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ ఔషధి’పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్‌షాపు నిర్వహించాలని సూచించారు. అవసరమై న ఔషధాల కోసం టీజీఎంఎస్ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఆస్పత్రు ల్లోని ఫార్మసీల్లో ఏయే ఔషధాలు అందుబాటు లో ఉన్నాయనేది ప్రజలు తెలుసుకొనేలా అక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ల్లో మందుల సరఫరాకు డిప్యూటీ డీఎంహెచ్వోలను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఫుడ్సేఫ్టీలో హైదరాబాద్ నగరం దేశంలోనే చిట్టచి వరి స్థానంలో ఉందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022 నాటి డేటా తో కొందరు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలపటంతో.. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నెల రోజుల్లో 5 కొత్త మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటివరకు 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తనిఖీ చేశారని, నిబంధనలు పాటించని 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.66 లక్షల జరిమానా విధించామ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్య దర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంతో చెడుగుడు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 104, 108 నిర్వహణను అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా అంబులెన్స్‌లను మూలన పడేయగా.. బీమాను తెరపైకి తెచ్చి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను అతలాకుతలం చేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా జిల్లా, బోధనాస్పత్రులకు మందులు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. ఆస్పత్రులకు అత్యవసర మందులు సరఫరా కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసింది. డీ–సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులను ఆస్పత్రులే స్థానికంగా కొనుగోలు చేసే పాత విధానాన్ని పునరుద్ధరించింది. కేంద్రీకృత విధానంతో జవాబుదారీతనం జిల్లా, బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్లో 80 శాతం మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టెండర్లలో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఎంఆర్పీలో 35.6 శాతం రాయితీపై మందులు సరఫరా చేస్తూ వచ్చింది. అత్యవసర మందులతో పాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్లోని ఎసెన్షియల్ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులను సరఫరా చేసేలా అనుమతులు ఇచ్చారు.తద్వారా లోకల్ టెండరింగ్‌లో నడిచే అవినీతి అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. దీంతో గతంలో ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తే అంతా ఖర్చైందని అదనపు బడ్జెట్ కోసం అడిగే పరిస్థితుల నుంచి రోగులకు మందుల కొరత లేకుండా ప్రజాధనం ఆదా అయ్యేలా పరిస్థితులు మెరుగయ్యాయి. 2022–23 నుంచి ఇప్పటి వరకు అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం రూ.84 కోట్లు కేటాయించగా అందులో రూ.37.09 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయింది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లులు చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉంటుంది.అవినీతికి గేట్లు ఎత్తిన సర్కార్రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరతో ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షణలో పారదర్శకంగా మందులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేసి స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు అవినీతికి గేట్లు తెరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో కొందరు వైద్యులతో తమకున్న పరిచయాలతో కమీషన్ ఆశ చూపిన సంస్థలకు మందులు సరఫరా చేసేలా టెండర్ నిబంధనలు రూపొందించి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ విధానంలో మందుల ధరల్లో ప్రతి జిల్లాకు వ్యత్యాసం ఉంటుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బోధనాస్పత్రుల సంఖ్య, మందుల వినియోగం, బడ్జెట్ భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.ఆస్పత్రుల్లో గందరగోళంఅత్యవసర మందుల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నట్లు సూపరింటెండెంట్లకు గత వారంలో డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నఫళంగా ప్రస్తుత విధానాన్ని రద్దు చేశారు. స్థానికంగా కొనుగోళ్లకు సరఫరా సంస్థలను ఎంపిక చేసే వరకూ జన్స్టోర్స్లో ఎంఆర్పీపై మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే బోధనాస్పత్రులకు అవసరమైన మందులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని మందులు ఆ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్పత్రులకు అవసరమైన స్థాయిలో సరఫరా చేయలేమని నిర్వాహకులు తేల్చిచెప్పినట్టు తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి 80 శాతం బడ్జెట్‌కు సంబంధించి 608 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఎక్కడ చూసినా 100 నుంచి 200 మేర మందులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కొరత ఉన్న మందులను సైతం ఆస్పత్రులు అత్యవసర మందుల సరఫరా సంస్థ నుంచే పొందుతున్నాయి. ఉన్నఫళంగా సరఫరా వ్యవస్థను రద్దు చేయడంతో గుంటూరు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ సహా చాలా ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబిలిన్స్, క్రిటికల్ కేర్, థియేటర్, ఎమర్జెన్సీ డ్రగ్స్ కొరత నెలకొంది. దీంతో రోగుల చికిత్సలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పలువురు సూపరింటెండెంట్లు స్థానికంగా సరఫరాదారులను ఎంపిక చేసే వరకు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖ కూడా రాసినట్టు సమాచారం. -
ప్రపంచ స్థాయి వైద్యం నగరంలో దొరుకుతుంది : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివద్ధి చెందుతున్నదని ఇది నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్లు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరమవుతారని అన్నారు. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులను ప్రతియేటా నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారని ఈ సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో పాటు అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం నగరంలోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటమే ఇందుకు గల కారణమని అన్నారు.అనంతరం ప్రాన్ కేర్ ఐకేర్ వైద్యురాలు అంజనీ ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పిల్లల కంటి సమస్యలు దూరపు చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్ళల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవొద్దని సూచించారు. తమ ఆస్పత్రిలో 20 రోజుల పాటు 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, డాక్టర్ జి. సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజలింగం, ప్రణవ్, సీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
సీమాప్లో ఔషధ, సుగంధ మొక్కల సాగుపై శిక్షణ
హైదరాబాదు బోడుప్పల్‌లోని కేంద్రియ ఔషధ, సుగంధ పరిశోధన మొక్కల సంస్థ (సీమాప్) ఆవరణంలో నవంబర్ 12–14 తేదీల్లో నిమ్మగడ్డి, కాశగడ్డి, అశ్వగంధ, వటివేర్, సిట్రొనెల్లా, జెరేనియం, మింట్, పచౌళి, సోనాముఖి, కాలమేఘ్ తదితర ముఖ్య ఔషధ, సుగంధ వాణిజ్య పంటల సాగు, ప్రాసెసింగ్, నాణ్యత, మార్కెటింగ్ అంశాలపై ఆంగ్లంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చీఫ్ సైంటిస్ట్ జి.డి కిరణ్‌బాబు తెలిపారు. నమోదు రుసుం రూ. 3,500. నవంబరు 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత్రి వసతి సదుపాయం లేదు. వివరాలకు: 94910 43252, 94934 08227ఇదీ చదవండి : దొండతో దండిగా ఆదాయం! -
ఆ మందులు ఇక మరింత ఖరీదు.. ధర పెరగనున్న 8 మెడిసిన్లు!
ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి మందుల భారం మరింత పెరగనుంది. ఆయా చికిత్సలకు వినియోగించే ఎనిమిది సాధారణ మందుల ధరలు మరింత ఖరీదు కానున్నాయి.ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ఔషధాల 11 షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల ధరలను వాటి ప్రస్తుత సీలింగ్ ధరపై 50 శాతం పెంచడానికి ఆమోదించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం, మారకపు ధరలు పెరగడం వంటి కారణాలతో ఔషధ తయారీదారులు ధరలను పెంచడానికి దరఖాస్తు చేసుకోగా ఎన్పీపీఏ ఆమోదించినట్లు తెలుస్తోంది.పెరగనున్న మందులు ఇవే..» బెంజిల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్» అట్రోపిన్ ఇంజెక్షన్ 06.mg/ml» ఇంజెక్షన్లో వాడే స్ట్రెప్టోమైసిన్ పౌడర్ 750 mg, 1000 mg» సాల్బుటమాల్ టాబ్లెట్ 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml» పిలోకార్పైన్ 2% డ్రాప్స్» సెఫాడ్రోక్సిల్ టాబ్లెట్ 500 mg» ఇంజెక్షన్లో వినియోగించే డెస్ఫెర్రిఆక్సమైన్ 500 mg» లిథియం మాత్రలు 300 mgడ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 నిబంధనల ప్రకారం 20 కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఎల్-కార్నిటిన్ మెకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది. -
మోకాలి నొప్పి భరించలేకపోతున్నారా? నల్లేరు పచ్చడి చక్కటి ఔషధం
ఔషధ మొక్క నల్లేరు గురించి ఎపుడైనా విన్నారా? అసలు పచ్చడి ఎపుడైనా తిన్నారా? పూర్వకాలంలో పెద్దలు దీన్ని ఆహారంగా వాడేవారు. పోషకాలమయమైన నల్లేరు చేసే మేలు చాలా గొప్పదని ఆయుర్వేదం చెబుతోంది. నల్లేరు ప్రకృతి ప్రసాదించిన వరం. దీన్నే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. అంటే వజ్రంలాంటి శక్తినిస్తుందన్నమాట. నల్లేరు కాడలతో చేసిన పచ్చడి మోకాళ్లు, నడుము నొప్పులను, బీపీ షుగర్ సహా పలు రకాల వ్యాధులను బాగా తగ్గిస్తుందని చెబుతారు.నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని పిలుస్తారు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, పైల్స్,మధుమేహం వంటి అనేక వ్యాధులను నయం చేయడానికి దీన్ని వాడతారు.నల్లేరు పచ్చడికావలసినవి10 నల్లేరు కాడలు, తరిగినవి ( లేత కాడలు అయితే బావుంటాయి.) ½ కప్పు వేరుశెనగలు కొద్దిగా చింతపండు రెండు ఎర్ర మిరపకాయలు నాలుగు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు ధనియాలు, పచ్చిమిర్చి పోపు దినుసులు జీలకర్ర ,తాజా కొత్తిమీరతయారీముందుగా లేత నల్లేరు కాడలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక బాణలిలో వేరుశెనగలను వేయించి పక్కన పెట్టండి. అదే బాణలిలో కొత్తిమీర, జీలకర్ర, ఎర్ర మిరపకాయలను సువాసన వచ్చేవరకు వేయించాలి. చల్లారనిచ్చి వీటిని మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత నూనె వేడి చేసి, తరిగిన నల్లేరు కాడలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ ముక్కల్లో పల్లీల మిశ్రమం, చింతపండు, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి ఈ పచ్చడిని పోపు పెట్టాలి. దీన్ని ఒక నిమిషం పాటు ఆ నూనెలో మగ్గనిచ్చి తాజాగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో, రవ్వంత నెయ్యి వేసుకుని తింటే జిహ్వకు భలే ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లో ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. (మురారి మోపెడ్ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్ చేస్తే!)లాభాలునల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చునల్లేరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారంనల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.నోట్ : మోకాలి నొప్పికి కారణాలను నిపుణులైన వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. వారి సలహా మేరకు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. శరీరంలో విటమిన్ డీ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. -
Nobel Prize 2024: జన్యు నియంత్రణ గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోం: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల సందడి మొదలైంది. 2024కు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ వర్సిటీ సోమవారం ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిశోధించింది. జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచి్చందంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలికాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పస్తుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులార్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిరీ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. ‘‘ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలావరకు కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలాగాక మైక్రో ఆర్ఎన్ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి’’ అని వివరించారు. ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రువ్కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.ఏమిటీ మైక్రో ఆర్ఎన్ఏ? ఆంబ్రోస్, రువ్కున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒకవిధంగా ఇది కణజాల స్విచ్చుగా పని చేస్తుంది. కణాలన్నింట్లోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే. అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణే కారకంగా నిలుస్తుంది. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రోస్, రువ్కువ్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ తాలూకు సంతులనంలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. ‘‘కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువు, లేదా జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది. సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో ఆర్ఎన్ఏను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు’’ అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ ఆర్ఎన్ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్, రువ్కున్ ఆవిష్కరణకు ఎనలేని ప్రాధాన్యముందన్నారు. -
మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్
2024 సంవత్సరానికిగానూ మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ సోమవారం వెల్లడించింది.స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో విజేతను ప్రకటించింది. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్తకు నోబెల్ పురస్కారం వచ్చింది. BREAKING NEWSThe 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జ డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్‌ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
సాక్షి, వరంగల్/నర్సంపేట: ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం ఉండాలి.. అవి అమలు చేసేదిశగా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.183 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలను గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మెడికల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేశామని వెల్లడించారు. 7 వేల మందికి నర్సింగ్ పోస్టింగ్‌లు ఇచ్చామని, త్వరలో ఇంకో 2,500 మందికి పోస్టింగ్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ‘సామాన్యులకు ఎక్కడి నుంచైనా 20 నుంచి 45 నిమిషాల్లో వైద్యచికిత్స అందేవిధంగా ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆస్పత్రులను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా 108, 104, 102 ఆరోగ్యశ్రీ ట్రస్టు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2004 నుంచి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ప్రొసీజర్ చార్జెస్ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 శాతం పెంచింది. దానికోసం రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చు చేశాం’అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందించే విధంగా తెలంగాణవ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని, రూ.46వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా, 53 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన విషయాలు వెలుగు చూశాయని వెల్లడించారు. ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి పాల్గొన్నారు. మంత్రుల నోట వైఎస్ అభివృద్ధి మాట దేశ చరిత్రలోనే పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ కొనియాడారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ సేవలు మరచిపోలేమన్నారు. -
గ్యారంటీల అమలుకు గంజాయి సాగు.. కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ మద్దతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడంలో భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లో గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది.అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.ఇక.. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పుకొచ్చారు.ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్‌లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు.వైద్యంలో గంజాయి వాడకం..గంజాయిని కేవలం మాదక ద్రవ్యంగా సేవించడమే కాకుండా పలు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు. ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్‌సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్‌సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు. కాన్నబిడాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు. నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్ఎస్డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం. ఈ యాక్ట్‌లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.అయితే, గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది. దేశంలో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. యూపీ, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది. గంజాయి పంటను ఏడాదిలో రెండు సార్లు పండించవచ్చు.అమెరికాలో ఇలా.. ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు. తాజాగా బైడెన్ హయాంలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి చేర్చుతున్నారు. -
70 ఏళ్ల వయసులో మెడికల్ గ్రాడ్యుయేట్‌గా
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించేందుకు వయసు ఏమాత్రం అడ్డురాదని మలేసియాకు చెందిన 70 ఏళ్ల తోహ్ హాంగ్‌కెంగ్ నిరూపించారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన తోహ్ ఇటీవల మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఔరా అనిపించారు. 70 ఏళ్ల వయసులో మెడిసిన్ చేసి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్ చేసిన వారిలో ఒకరిగా తోహ్ రికార్డ్ సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తుందా..! చిరంజీవి స్టైల్‌గా క్లాస్‌లోకి వస్తుంటే అందరూ ఆయనను ప్రొఫెసర్ అని పొరబడతారు. ఫిలిప్పీన్స్‌లోని సెబులో ఉన్న సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ పీహెచ్ ఎంఏ విద్యార్థులు సైతం తోహ్ మొదటిసారి క్లాసులో అడుగుపెట్టినప్పుడు అలాగే అనుకున్నారు. కానీ తోటి విద్యార్థి అని తర్వాత తెల్సుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయనను ‘సర్ తోహ్’అంటూ గౌరవంగా పిలుచుకుంటున్నారు. అయితే ఆయన చిన్నతనం నుంచే డాక్టర్ కావాలనేమీ కలలు కనలేదు. అప్పటికే ఆర్థికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఎల్రక్టానిక్ ఇంజనీరింగ్ చదివేశారు. తర్వాత ఆయన మనసు మెడిసిన్ వైపు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్ విహారయాత్రలో ఉండగా ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులను కలిశారు. ఆ పరిచయం ఆయనను వైద్య విద్య పట్ల అమితాసక్తిని పెంచిందని తోహ్ చెప్పారు. 2019లో కార్పొరేట్ ప్రపంచం నుంచి పదవీ విరమణ పొందాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ అన్నిచోట్లా వైద్యవిద్య చదవడానికి వయోపరిమితి అడ్డుగా ఉందని తర్వాత అర్థమైంది. ఈ వయసులోనూ తనను మెడిసిన్ చదివేందుకు అనుమతించే కాలేజీ కోసం తెగ తిరిగారు. అయితే తమ పని మనిషి కూతురు చదివిన ఫిలిప్పీన్స్‌లోని వైద్య పాఠశాలలో వయోపరిమితి లేదని తెలుసుకుని ఎగిరి గంతేశారు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత సెలక్షన చకచకా జరిగిపోయాయి. పెట్టే బేడా సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి స్కూల్లో చేరారు. 2020లో కరోనా విజృంభించడంతో హాంకాంగ్‌కు మకాం మార్చేసి తన క్లాసులన్నీ ఆన్లైన్లో విన్నారు. కుటుంబం, సహాధ్యాయిల సహకారంతో గత జూలైలో మెడిసిన్ పట్టా అందుకున్నారు. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్డ్ డాక్టర్‌గా మారడానికి ఆయనకు మరో పదేళ్లు పట్టొచ్చు. విదేశీ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల కోసం.. మెడికల్ బోర్డు పరీక్ష కోసం ఏడాది పాటు ఇంటర్న్íÙప్, మరింత అధ్యయనం అవసరం. దానికి బదులుగా అతను హాంకాంగ్‌లో స్నేహితుడి సంస్థ అలెర్జీ అండ్ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేయాలని యోచిస్తున్నారు. త నలాగా మెడిసిన్ చేస్తున్న పేద పిల్లలకు సాయం చేద్దామని భావించారు. ట్యూషన్ ఫీ చెల్లించడానికి కష్టపడే విదేశీ వైద్య విద్యార్థుల కోసం స్కాలర్íÙప్ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ ప్రకారం అమెరికాలో ప్రభుత్వ వైద్య పాఠశాలలలో స్థానిక విద్యార్థులకు సంవత్సరానికి సగటు ట్యూషన్ ఫీజు సుమారు 60,000 డాలర్లు. విదేశీ విద్యార్థు లకు 95,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రైవేటు వైద్య పాఠశాలల్లో విదేశీయులకు ట్యూషన్, ఫీజులు 70 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఫిలిప్పీన్స్‌లో ట్యూషన్ ఫీజులు అంత ఎక్కువగా లేవు. తోహ్ సౌత్ వెస్ట్రన్ వర్సిటీ ఏడాదికి దాదాపు 5,000 డాలర్లు ఖర్చు చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఇది పెద్దమొత్తమే. ఇలాంటివారికి ఆ నిధిని ఖర్చు చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మందులు ఇవ్వండి మహాప్రభో
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: వరదలో చిక్కుకున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు వైద్య సేవలు, మందులు అందక అగచాట్లు పడుతున్నారు. కావాల్సిన ఆహారం, మందులు బయటకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితులు లేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వద్దామంటే ప్రభుత్వం కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైద్య శాఖ మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పినప్పటికీ వరదల్లో చిక్కుకుపోయిన వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. వరద ప్రాంతాల్లో అనారోగ్య సమస్యల బారినపడిన వారు వేసుకోవాల్సిన మందులపై వైద్య శాఖ సోమవారం ప్రి్రస్కిప్షన్ను జారీ చేసింది. మందులు ఇవ్వకుండా ఈ ప్రి్రస్కిప్షన్ జారీ చేసి ఏం ప్రయోజనం అని బాధితులు మండిపడుతున్నారు. మా కష్టం పగవాడికి కూడా రాకూడదు నాకు రెండు కాళ్లు లేవు. పైగా గర్భిణిని కూడా. దీనికి తోడు మా అమ్మ మెదడు సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. ఇద్దరం నిస్సహాయులం. ఎవరైనా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తారని చాలా ఎదురుచూశాం. కానీ ఎవరు రాలేదు. రెండు రోజులుగా నాకు, మా అమ్మకు ఆహారం లేదు. మాకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. – ఎస్కె. తాహిరున్నిసా, డాబాకొట్లు సెంటర్, సింగ్నగర్ఇదో విషమ ‘పరీక్ష’విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి, ప్రతినిధి : కుమార్తెలు ఐఐటీ మద్రాస్‌లో చదవాలన్న సంకల్పానికి వరద ముంపు విషమ పరీక్ష పెడితే.. ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇద్దరు ఆడ బిడ్డలతో ఊరుకాని ఊర్లో.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాడు. పలకరించిన నాథుడు లేడు. తిన్నావా అని అడిగే దిక్కులేదు. కళ్ల ముందు బోట్లు తిరుగుతున్నా.. ఎక్కించుకునే వాడే లేడు. భీమవరానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్.. ఇద్దరు బిడ్డలతో కండ్రిగలోని ఓ పరీక్ష కేంద్రంలో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ ప్రవేశానికి సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష కోసం ఆదివారం ఉదయం వచ్చారు. పరీక్ష కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. అయితే వరద ఉధృతి పెరగడంతో ఆకస్మాత్తుగా పరీక్ష రద్దయ్యింది. అప్పటికే ఆ ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. అక్కడి నుంచి బయట పడేందుకు ట్రాక్టర్ ఎక్కితే.. డ్రైవర్ మధ్యలో దించేశాడు. ఇక అంతే.. సోమవారం ఉదయం 11 గంటలకు వరకూ తిండీతిప్పల్లేకుండా నీళ్లలో ఇద్దరు ఆడ బిడ్డలతో ఉండిపోయారు. ప్రాణాల కోసం ఆరాటం.. ఆకలితో పోరాటం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘చిన్నా’ కన్నవారి కోసం పడిన ఆవేదన వర్ణనాతీతం. సింగ్‌నగర్‌లోని డాబాకొట్లు సెంటర్లో మనిషి ఎత్తు లోతులో నీళ్లు చేరాయి. చిన్నా నివాసం ఉంటున్న ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున కట్టుబట్టలతో ఇంటి మేడపైకి చేరుకున్నారు. వర్షం వచి్చనా తడుస్తూనే అక్కడే ఉండిపోయారు. ఇంటిలో వంట సామగ్రి మొత్తం తడిచిపోయింది. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. సోమవారం ఉదయం 11 గంటలకు పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లయ్ఓవర్పైకి చేరుకున్నాడు. ఆహారం కోసం వెతుకులాట తప్ప దక్కిందేమీ లేదు. కనుచూపు మేరలో వరద నీళ్లు తప్ప.. తాగడానికి నీళ్లు దొరకలేదు. చివరికి దాతలు ఇచ్చిన పాల ప్యాకెట్లతో కన్నవారి కోసం మళ్లీ నీటిలో నడక ప్రయాణం ప్రారంభించాడు.’’ జీవితం ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్ పడవలు షో కోసమే నీళ్లలో తిరుగుతున్నట్టు ఉంది. మాలో ఏ ఒక్కరినీ వాళ్లు ఒడ్డుకు తీసుకురాలేదు. ఇంకెన్నీ రోజులు చస్తూ బతకాలో తెలియడం లేదు – చిన్నా. దెబ్బతిన్న విద్యుత్ సరఫరాసాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దెబ్బతిన్న వ్యవస్థను సరిచేయడానికి 356 మంది సిబ్బందిని 102 బృందాలుగా నియమించినట్లు ఇంధనశాఖ తెలిపింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీటీపీఎస్‌లోకి బుడమేరు బ్యాక్ వాటర్ భారీగా రావడంతో ఒక్కోటీ 210 మెగావాట్ల సామర్థ్యం గల 6 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. -
156 ఔషధాలపై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: రోగుల ఆరోగ్యానికి హాని కలిగంచే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషనల్‌ను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఈ మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది.ఈ 156 ఎఫ్డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ+ పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్+ ఫినైల్ఫ్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి ఉన్నాయి. -
విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!
పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహా వ్యవస్థాపకులు, యోగా గురువు బాబా రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారతదేశంలో లక్షల మంది సింథటిక్ డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారని చెప్పారు. విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు హానికరమైన మందులు తయారు చేసి వాటిపై ఆధారపడేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో అల్లోపతి మందుల వాడకం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విదేశీ ఫార్మా కంపెనీలు సింథటిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నాయి. ప్రజలకు తెలియకుండానే ఆ విషపూరిత మందులకు అలవాటు పడేలా చేస్తున్నాయి. ‘పతంజలి స్వదేశీ ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలి. స్వదేశీ, సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పదోవ పట్టించేలా ఉన్నాయని గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడంతో కోర్టు వాటిని అంగీకరించింది. -
ఒక్క మెడిసిన్ రిజెక్ట్.. 75% ఉద్యోగుల తొలగింపు
ఒక్క మెడిసిన్ రిజెక్ట్ అయినందుకు ఏకంగా 75% ఉద్యోగులను తొలగించింది ఓ అమెరికన్ ఔషధ సంస్థ. లైకోస్ థెరప్యూటిక్స్ అనే కంపెనీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ చికిత్సలో ఉపయోగించే సైకోథెరపీ డ్రగ్ ఎండీఎంఏను తయారు చేసింది. దీన్ని యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదానికి పంపగా తిరస్కరించింది.ఎఫ్‌డీఏ ఎండీఎంఏ ఔషధాన్ని తిరస్కరించిన వారం రోజుల్లోనే తమ సిబ్బందిలో 75% మందిని తొలగిస్తున్నట్లు, కంపెనీ వ్యవస్థాపకుడు బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు లైకోస్ థెరప్యూటిక్స్ ప్రకటించింది. "మేము ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సరికొత్త ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత కృషి చేస్తాం" అని బోర్డు ఛైర్మన్ జెఫ్ జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎఫ్‌డీఏ తిరస్కరణ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకున్న కంపెనీ తమ ఔషధానికి మళ్లీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందేలా తీవ్ర ప్రయత్నాలను చేపట్టింది. క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏజెన్సీతో సమన్వయం సహా ఆ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి జాన్సన్ & జాన్సన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ హగ్‌ని నియమించింది. ఇప్పుడు లైకోస్లో సీనియర్ మెడికల్ అడ్వైజర్ అయిన హగ్, 17 ఏళ్లకు పైగా జాన్సన్ & జాన్సన్లో ఉన్నారు.ఎఫ్‌డీఏ ఆమోదం కోసం తమ ఎండీఎంఏ ఔషధాన్ని మళ్లీ సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైకోస్ తెలిపింది. అయితే ఇది ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేదు. మరొక ఫేజ్ 3 అధ్యయనాన్ని నిర్వహించాలని ఎఫ్‌డీఏ కోరిందని కంపెనీ గతంలో చెప్పింది. సాధారణంగా ఇది పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకారం, 2020లో దాదాపు 13 మిలియన్ల అమెరికన్లు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను కలిగి ఉన్నారు. దీని చికిత్స కోసం అతి తక్కువ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన రెండు మందులు ఉన్నప్పటికీ కొంత మంది రోగులకు అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. -
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో.. మందుల మహా మాంత్రికుడు!
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315 -
ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?
చాలామంది తమ ఉదయాన్ని కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు మార్నింగ్ కాఫీతోనే పరగడుపు మాత్రలు తీసుకుంటుంటారు. చాలావరకు కప్పు కాఫీతో మందులు మిక్స్ చేసి తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం మంచిది కాదని, వివిధ దుష్ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏఏ మందులు కాఫీతో కలిపి తీసుకోకూడదో సవివరంగా తెలుసుకుందామా..!కాఫీ కడుపుని ప్రేరేపించి జీర్ణవ్యవస్థ ఆహారాన్ని తీసుకునే సమయాన్ని మారుస్తుంది. మందులు మింగే వారికి ఈ కాఫీ వాటితో రియాక్షన్ చెంది రక్తప్రవహంలోకి శోషించటానికి ఎక్కువ వ్వవధి తీసుకునేలా చేస్తుంది. ఇది మానువుల జీవక్రియ, విసర్జనపై గణనీయమైన ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాఫీతో తీసుకోవడం నివారించాల్సిన మందులు..యాంటీబయాటిక్స్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని నిరోధించడంలో సహాయపడతాయి. ఇక్కడ కాఫీ కూడా ఒక ఉద్దీపన కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అశాంతి, నిద్రలేమి దారితీస్తుంది లేదా దీర్ఘకాలంలో నిద్రలేమికి కారణమవుతుంది.ఫెక్సోఫెనాడిన్ వంటి అనేక ఇతర అలెర్జీ ఔషధాలను కాఫీతో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ కేంద్ర నాడీ వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపిస్తుంది - విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలను పెంచుతుంది.థైరాయిడ్ మందులుహైపో థైరాయిడిజం ఉన్నవారికి - తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి అవ్వదు. దీంతో బరువు పెరగడం, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన జుట్టు రాలడం మహిళల్లో క్రమరహిత రుతుక్రమాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, హార్మోన్లను సమతుల్యం చేయడం కోసం థైరాయిడ్ మందులు తీసుకునేవారు కాఫీతో తీసుకుంటే గనుకు ఆ మందులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.ఆస్తమా మందులుఆస్తమా మందులు ఊపిరితిత్తులలోని కండరాలను సడలించి, వాయు వాయుమార్గాలను విస్తరించేలా చేసి..సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తాయి. ఇక్కడ కెఫీన్ ఒక తేలికపాటి బ్రోంకోడైలేటర్. ఇది ఈ ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేగాదు ఈ బ్రోంకోడైలేటర్లను మందులతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి, చిరాకు వంటివి కూడా ముఖ్యంగా పిల్లలలో కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.మధుమేహం మందులుకాఫీని చక్కెర లేదా పాలతో కలపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. అందువల్ల మధుమేహం మందులు అంతబాగా ప్రభావితంగా పనిచెయ్యవు. పైగా మధుమేహం ఉన్నవారికి కెఫీన్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.అల్జీమర్స్ ఔషధంఅల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఒకరకమైన మెదడు రుగ్మత లేదా అభిజ్ఞా పనితీరును కోల్పోవడం. దీనివల్ల రోజువారీ పనులను ఆలోచించడం, గుర్తుంచుకోవడం లేదా చేయడం చాలా కష్టం.అల్జీమర్స్‌తో నివసించే మిలియన్ల మంది ప్రజలు ఈ పరిస్థితికి మందులు తీసుకుంటారు. అయినప్పటికీ, డోపెజిల్, రివాస్టిగ్మైన్, గెలాంటమైన్ వంటి మందులు కెఫిన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ రక్తం, మెదడు మధ్య అవరోధాన్ని బిగించి, ఔషధ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ అల్జీమర్స్ మందులు న్యూరోట్రాన్స్మిటర్, ఎసిటైల్కోలిన్ను రక్షించడం ద్వారా పని చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటామో అప్పుడు ఈ కెఫీన్ ఆ రక్షణ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలిందని వివరించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మార్నింగ్ టైం అనేక అలారాలు సెట్ చేస్తున్నారా?) -
బ్రాహ్మి: ఇది.. మీ మెదడుకు మేతలాంటిది!
బ్రాహ్మి ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తోందని ‘జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్’ వెల్లడించింది. బ్రాహ్మితోపాటు మరో నాలుగింటిని కూడా తెలిపింది. బ్రాహ్మిని క్యాప్సూల్ రూపంలో, పౌడర్‌గానూ, నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. ఇది దెబ్బతిన్న న్యూరాన్లను ఆరోగ్యవంతం చేసి నాడీ వ్యవస్థ నుంచి సాగాల్సిన సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.– అశ్వగంధ: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాల నుంచి స్వస్థత పరిచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్’ అధ్యయనంలో వెల్లడైంది. కార్టిసోల్ స్థాయులు పెరగడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అశ్వగంధ కార్టిసోల్ స్థాయులను తగ్గించి మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. సమాచారాన్ని అందుకున్న తర్వాత మెడదు వేగంగా స్పందించి చేయాల్సిన పని మీద శ్రద్ధ, కార్యనిర్వహణ సమర్థతను మెరుగుపడుతుంది. అయోమయానికి గురికావడం తగ్గి ఆలోచనల్లో స్పష్టత చేకూరుతుంది. ఇది టాబ్లెట్, పౌడర్‌గా దొరుకుతుంది. నిద్ర΄ోయే ముందు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.– పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలుంటాయి. యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ని కూడా మెరుగు పరుస్తుందని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ జీరియాట్రిక్ సైకియాట్రీ’ పేర్కొన్నది. దీనిని కూరల్లో వేసుకోవడం, జలుబు చేసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగడం తెలిసిందే. నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జీవక్రియలు మెరుగుపడతాయి.– గోతుకోలా: దీనిని సెంట్రెల్లా ఏషియాటికా అంటారు. ఈ ఆకును ఆసియాలోని చాలా దేశాల్లో సలాడ్, సూప్, కూరల్లో వేసుకుంటారు. ఈ ఆకును నీటిలో మరిగించి టీ తాగవచ్చు. క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎదురయ్యే జ్ఞాపకశక్తి లోపం నివారణ అవుతుందని ‘జర్నల్ ఆఫ్ ఎథ్నోపార్మకాలజీ’ చెప్పింది. మధ్య వయసు నుంచి దీనిని వాడడం మంచిది.– గింకో బిలోబా: దీనిని చైనా వాళ్లు మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్ధక్యంలో ఎదురయ్యే మతిమరుపు (డిమెన్షియా) ను నివారిస్తుందని ‘కోష్రానే డాటాబేస్ ఆఫ్ సిస్టమిక్ రివ్యూస్’ తెలియ చేసింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ్రపాపర్టీస్ మెదడు కణాల క్షీణతను అరికడతాయి. ఇవి కూడా మాత్రలు, పొడి రూపంలో దొరుకుతాయి. రోజూ ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే వయసు మీరుతున్నా సరే మతిమరుపు సమస్య దరి చేరదు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!
దేశీయ ఫార్మా కాంట్రాక్ట్ తయారీ వ్యాపార విభాగం త్వరలోనే రెట్టింపు అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు చైనా ఫార్మా కంపెనీల కొనుగోళ్లు జరపకుండా అమెరికా బయోసెక్యూర్ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. చైనా నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా భారత్‌కు మళ్లుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ తయారీ సెగ్మెంట్ వచ్చే మూడేళ్లలో రెండింతలు కాగలదని, అలాగే కాంట్రాక్ట్ రీసెర్చ్ సెగ్మెంట్ మూడు రెట్లు వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు మోర్డోర్ ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో అంతర్జాతీయంగా కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సెగ్మెంట్ (సీడీఎంవో) 22.51 బిలియన్ డాలర్లు(రూ.1.8 లక్షల కోట్లు)గా ఉంది. ఇది ఏటా 14.67 శాతం వృద్ధితో 2029 నాటికి 44.63 బిలియన్ డాలర్ల(రూ.3.7 లక్షల కోట్లు)కు చేరనుంది. ఫార్మా విభాగం గణాంకాల ప్రకారం దేశీయంగా కాంట్రాక్ట్ రీసెర్చ్ (సీఆర్వో) సెగ్మెంట్ వార్షికంగా 10.75 శాతం వృద్ధితో 2030 నాటికి 2.5 బిలియన్ డాలర్ల(రూ.20 వేలకోట్లు)కు చేరనుంది. భారతీయ సీడీఎంఏ సెగ్మెంట్ ఇప్పటికే అభివృద్ధి చెందినా, బయోసెక్యూర్ చట్టం అమల చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది.ప్రస్తుతం చైనా సీడీఎంవో పరిశ్రమకు అంతర్జాతీయంగా 8 శాతం మార్కెట్ వాటా ఉండగా, భారత్‌కు 2.7 శాతం వాటా ఉంది. చైనా వాటాను కొల్లగొట్టడానికి ఈ చట్టం భారత్‌కు బాగా ఉపకరించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు అమెరికన్ సంస్థలు ఉత్పత్తి కొనుగోళ్ల కోసం పలు భారతీయ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు వివరించాయి. సుమారు 60 శాతం భారతీయ ఫార్మా కంపెనీలు కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీపోటీ కూడా ఉంది..బయోసెక్యూర్ చట్టంతో ఉపయోగాలు ఉన్నప్పటికీ మన ఫార్మా కంపెనీలకు వెంటనే ప్రయోజనాలు లభించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఐర్లాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి మన కంపెనీలకు గట్టి పోటీ ఉండొచ్చని వివరించాయి. అమెరికాలో ప్రస్తుతం 120 ఔషధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా తోడ్పాటు ఉన్న ఈ ప్రాజెక్టులు మన వైపు మళ్లేందుకు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుత ఒప్పందాలను మరికొంత కాలం కొనసాగించుకునేందుకు వీలు కల్పించే నిబంధనల వల్ల తక్షణం ఆర్థిక లబ్ధి చేకూరకపోవచ్చని వివరించాయి. అయితే, భారతీయ కంపెనీలకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సిప్లా, సింజీన్ వంటి సీడీఎంవోలు తక్కువ వ్యయాలతో ఔషధాలు తయారు చేయగలవు. అలాగే వాటికి సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రాంట్లు, రుణాలు కూడా అందిస్తోంది. మొత్తం మీద బయోసెక్యూర్ చట్టమనేది భారతీయ సీడీఎంవో విభాగానికి గేమ్ చేంజర్‌గా ఉండగలదని విశ్లేషకులు తెలిపారు.