
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఇవ్వడం లేదంటున్న రోగులు
జలుబు, ఒళ్లు నొప్పులు తదితర సాధారణ మందులూ బయట కొనుక్కోవాల్సిందే
కొన్నిచోట్ల నెల రోజుల కోర్సుకు 10 రోజుల వరకే ఇచ్చి సరిపెడుతున్న వైనం
చిన్న పిల్లలకు ఇచ్చే విటమిన్–ఏ సిరప్ రాష్ట్రవ్యాప్తంగా షార్టేజ్
మందులు పంపిస్తున్నాం.. కొరత లేదంటున్న టీజీఎంఐడీసీ ఎండీ
క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు..
ప్రభుత్వం స్పందించి తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు
ఆస్పత్రిలో మందుల్లేక..బయట కొనలేక!
ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు మాశమ్మ. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగనూల్ గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ మందులు రాశారు. అయితే ఆ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేటులో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టి ప్రైవేట్ దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాశమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పీహెచ్‌సీలు) పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, ఎంఎన్‌జే, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
జ్వరానికి వాడే పారాసెటమాల్, జలుబుకు ఉపయోగించే సిటిరిజైన్ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2 లేదా 3 బయట కొనుక్కోక తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయితే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అవసరమైన మందుల నిల్వలు తమ వద్ద ఉన్నాయని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ చెపుతున్నారు. అలాగే జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో కూడా మందుల నిల్వలు ఉన్నాయని ఆయా జిల్లాల డీఎంహెచ్‌ఓలు చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలాచోట్ల అవసరమైన మందుల కోసం ఇండెంట్లు పెట్టేవారే లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్‌ఐడీసీకి నిధుల కొరత సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సాధారణ మందులకూ తిప్పలు
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులు, బోధన కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పీహెచ్‌సీలకు అక్కడి నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు మందులు సరఫరా అవుతుంటాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు అందుతుంటాయి. ఈ విధంగా పలు ఆస్పత్రులు ఇండెంట్‌లు పంపినా కొన్ని మందులు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరానికి వాడే పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతి ఆసుపత్రిలో తప్పక ఉండాలి.
కానీ పెద్దపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీల్లో ఈ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు రోగులు చెపుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం వ్యాధి నిరోధక టీకాలకు అనుబంధంగా అందించే విటమిన్ –ఏ సిరప్ కొరత దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉంది. నెల రోజులుగా ఈ సిరప్ నిల్వలు నిండుకోగా.. జిల్లా ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కేవలం టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులే చెపుతున్నారు.
అలాగే సర్వ సాధారణ మందులైన రాన్‌టాక్, పాన్‌టాప్, జోఫర్, డైసైక్లోమిన్, ఎవిల్, ఫెరజోడిన్, సిటిరిజైన్, మెట్రోజిల్, బెటాడిన్ ఆయింట్‌మెంట్, డైక్లో, స్రైబీష్ లోషన్ వంటివి కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు. పీహెచ్‌సీల్లో బీపీ, షుగర్‌కు సంబంధించి నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వాల్సి ఉండగా, గత కొంతకాలంగా 10 రోజులకే పరిమితం చేస్తున్న పీహెచ్‌సీలు చాలా ఉన్నాయి. జింక్, యాంటి బయోటిక్, ఐరన్ గోలీలతో పాటు ఐవీ సెట్లు కూడా చాలా పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవని, బయట కొనుక్కోమంటున్నారని రోగులు చెపుతున్నారు.
ప్రముఖ ఆసుపత్రుల్లోనూ...
ఉస్మానియా, గాందీ, నీలోఫర్, ఎంజీఎం, ఎంఎన్‌జే ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణనలోకి తీసుకుని టీజీఎంఎస్‌ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే వస్తుండగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ 20 శాతం మందుల కొనుగోలుకు సంబంధించి 8 నెలలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు కారణమవుతోంది.
ఉస్మానియా ఆసుపత్రిలో 1,100 పడకల వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 1000 పడకలకు గానూ 1,500కు పైనే రోగుల తాకిడి ఉంటోంది. కొన్నిసార్లు (సీజన్) ఈ రెండు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉంటోంది. దీంతో గాం«దీ, ఉస్మానియా ఆసుపత్రుల ఆవరణల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు మెడికల్ దుకాణాలు 24 గంటలు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. వరంగల్ ఎంజీఎంలో 2,500 నుంచి 3,000 వరకు రోగులు నమోదవుతున్నారు. కాగా మందుల కొరత నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు, మండలాలు, పట్టణ కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల పక్కనే ఉంటున్న ప్రైవేటు మెడికల్ షాపులే రోగులకు గతవుతున్నాయి.
293 మందులకు 100 కూడా ఉండటం లేదు..
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌లో మందులు, సిరప్‌లు, ఇంజెక్షన్లు, ఆయింట్‌మెంట్లు, లోషన్లు, యాంటి బయాటిక్స్, ఐవీ సెట్లు మొదలైనవన్నీ కలిపి 293 కేటగిరీల మందులు ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే రోగులు మొదలుకొని ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, బీపీతో వచ్చే వారికి, చర్మ వ్యాధులు, పాము కాట్లు, పురుగు మందులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిచిన వారికి ఉపయోగపడే మందుల వరకు ప్రతి ఒక్కటీ పీహెచ్‌సీల్లో ఉండాలి.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ పీహెచ్‌సీలు, 4,693 ఉప ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల 50 నుంచి 100 లోపు కేటగిరీల్లోనే మందులు ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. పాముకాటుకు గురై పీహెచ్‌సీలకు వచ్చే వారికి ‘పాం’ ఇంజక్షన్ అందుబాటులో ఉండడం లేదు. కుక్కకాటుకు కూడా ఇంజెక్షన్ అందుబాటులో ఉండాలని ఎన్‌హెచ్‌ఎం చెపుతుండటం గమనార్హం.
మందుల కొరత లేదు..
టీజీఎంఐడీసీ ద్వారా 568 రకాల మందులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు పంపిస్తున్నాం. ఇందులో ఒక కేటగిరీ కింద 293 రకాల మందులు, మరో కేటగిరీలో 100 రకాల మందులు అవసరానికి అనుగుణంగా పంపిస్తాం.
ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాం«దీ, ఎంఎన్‌జే, నీలోఫర్, ఎంజీఎం ఆసుపత్రులను వారానికోసారి సంప్రదించి ఇండెంట్ ద్వారా వారికి అవసరమైన మందులను పంపిస్తాం. అలాగే జిల్లాల్లోని సీడీఎస్‌లకు కూడా వారు పంపే ఇండెంట్లను బట్టి మందులు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. ఎక్కడైనా ఉన్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాం. – హేమంత్ (టీజీఎంఐడీసీ ఎండీ)
పాముకాటు మందు కోసం 17 కి.మీ ప్రయాణం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను కొన్నిరోజుల క్రితం ఓ ఇంటి దగ్గర ఉదయం వేళ పనిచేస్తుండగా, కట్టెల కింద పడుకున్న విషపు పాము చేతిపై కాటేసింది. అక్కడే ఉన్న శ్రీను బావ తాడుతో చేయికి కట్టుకట్టి, బైక్‌పైన గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ పాము కాటుకు వేసే మందు ‘పాం’ అందుబాటులో లేదు. కరీంనగర్ వెళ్లాలని సిబ్బంది సూచించారు. దాంతో బైక్ పైనే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పెద్దాసుపత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment