ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి...లేకపోతే... ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సూక్తిలో గొప్ప ఆరోగ్య హెచ్చరిక దాగి ఉంది. ఆహారంతోనే ఆరోగ్యం... అంటుంది వైద్యరంగం. ఆహారంలోని ఔషధాన్ని వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది? త్రిపుర చేస్తున్న ప్రయత్నమూ అదే.
‘ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం ఒక సమూహాన్ని సంఘటితం చేస్తున్నాను’ అంటున్నారు లక్కీ 4 యూ న్యూట్రాస్యుటికల్స్ ప్రతినిధి త్రిపుర. ‘ఆహారం అంటే కంటికి ఇంపుగా కనిపించినది, నాలుకకు రుచిగా అనిపించినది తినడం కాదు. దేహానికి ఏమి కావాలో, ఏది వద్దో తెలుసుకుని తినడం. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చేటప్పటికే నా జీవితం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పీసీఓడీ, ఒబేసిటీ వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యమైంది.
కోవిడ్ సమయంలో వ్యాక్సిన్‌లు వేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. మా వారికి రక్తం మరీ చిక్కబడడం, బ్లడ్ థిన్నర్స్ వాడినా ఫలితం కనిపించక బ్రెయిన్ స్ట్రోక్ ఆయనను తీసుకెళ్లి పోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. జీవితం అగమ్యగోచరమైంది. ఆ షాక్‌లో ఉన్న నాకు ఒక వ్యాపకం ఉండాలని మా అన్నయ్య చేసిన ప్రయత్నమే ఇది’ అంటూ తాను పరిశ్రమ నిర్వహకురాలిగా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు త్రిపుర సుందరి.
ఇంటర్నెట్ నేర్పించింది!
‘‘నేను పుట్టింది, పెరిగింది విజయవాడలో. సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఏ చేశాను. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా సౌకర్యవంతంగా ఉన్న సమయంలో జీవితం పరీక్ష పెట్టింది. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా అన్నయ్య తిరుపతికి తీసుకెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి తిరుపతిలో న్యూట్రాస్యూటికల్స్ ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఫార్మారంగంలో పనిచేయమని ప్రోత్సహించాడు. నేను చదివింది ఆర్ట్స్ గ్రూపు. ఫార్మా పట్ల ఆసక్తి లేదనడం కంటే అసలేమీ తెలియదనే చెప్పాలి. కలినరీ సైన్స్ (పాకశాస్త్రం) ఇష్టమని చెప్పాను.
ఆ సమయంలో నా మాటల్లో తరచూ మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావం చూపిస్తుందోననే విషయం వస్తుండేది. మేము ఎదుర్కొన్న అనారోగ్యాలన్నీ ఆహారం పట్ల గమనింపు లేకపోవడంతో వచ్చినవే కావడంతో నా మెదడులో అవే తిరుగుతుండేవి. నాకు అప్పటికి ప్రోటీన్ ఏంటి, విటమిన్ ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రంగంలో పని చేయాలనుకున్నాను. బ్రాండ్ రిజిస్ట్రేషన్ నుంచి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసి పెట్టాడు.
ఈ రంగం గురించిన వ్యాసాలనిచ్చి చదవడమనేవాడు. ఆ తర్వాత నేను ఇంటర్నెట్‌ను కాచి వడపోశాననే చెప్పాలి. ఇప్పుడు సీవోటూ ఎక్స్‌ట్రాక్షన్ ప్రొసీజర్స్ నుంచి కాంబినేషన్‌ల వరకు క్షుణ్నంగా తెలుసుకున్నాను. నాకు సబ్జెక్టు తెలిసినప్పటికీ సర్టిఫైడ్ పర్సన్ తప్పని సరి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ముగ్గురు ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లను తీసుకున్నాను.
తేనెతోపాటు ఇంకా...
ఫలానా ఆరోగ్య సమస్యకు ఉదయాన్నే తేనెలో అల్లం రసం కలిపి తినాలి, తేనెతో లవంగం లేదా దాల్చినచెక్క పొడి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఉదయం ఆహారంగా తినాలి... ఇవన్నీ ఆరోగ్యకరం అని తెలిసినప్పటికీ ఈ రోజుల్లో వాటిని రోజూ చేసుకునే టైమ్ లేని వాళ్లే ఎక్కువ. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ అంతలా డీలా పడిపోవడానికి కారణం దేహంలో పోషకాల నిల్వలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమే. అందుకే ఇన్‌ఫ్యూజ్‌డ్ హనీ తయారు చేశాం.
అలాగే స్ప్రౌట్స్ తినే వారికి ఉద్యోగరీత్యా క్యాంప్‌లకెళ్లినప్పుడు కుదరదు కాబట్టి డీ హైడ్రేటెడ్ స్ప్రౌట్స్ తీసుకువచ్చాను. ఇలా ప్రతి ఉత్పత్తినీ ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మోతాదులు పాటిస్తూ నేను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ముంబయిలో ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ఎఫ్ ఐ ఇండియా’ సదస్సులో నా అనుభవాలను పంచుకుంటూ ప్రసంగించనున్నాను.
దుబాయ్‌లో జరిగే ఎగ్జిబిషన్‌లో కూడా అన్ని దేశాల వాళ్లు స్టాల్ పెడుతుంటారు. గత ఏడాది తెలుసుకోవడం కోసమే వెళ్లాను. నా యూనిట్‌ని ఇంకా ఎలా విస్తరించవచ్చనే స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివరలో దుబాయ్ ఎగ్జిబిషన్ ద్వారా అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను’’ అని వివరించారు త్రిపుర.
ఇష్టంగా పనిచేశాను!
నా యూనిట్‌ని మా అన్నయ్య యూనిట్‌కు అనుబంధంగా నిర్మించాం, కాబట్టి ప్రతిదీ తొలి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్లాంట్ నిర్మాణం నుంచి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పడంతో రోజుకు పదమూడు గంటలు పని చేశాను. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పని జరుగుతోంది. యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవిధమైన ఆందోళన వాతావరణమే ఉండేది.
ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అనే సందేహం నాతోపాటు అందరిలోనూ ఉండింది. మా అన్నయ్య మాత్రం ‘ఏదయితే అదవుతుంది, నువ్వు ముందుకెళ్లు’ అనేవాడు. నేను చేస్తున్న పని మీద ఇష్టం పెరగడంతో అదే నా లోకం అన్నట్లు పని చేశాను. మా ఉత్పత్తులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, జీఎమ్‌పీ, ఐఎస్‌ఓ వంటి దేశీయ విదేశీ సర్టిఫికేట్‌లు వచ్చాయి. కానీ నేను మా ఉత్పత్తుల అవసరం ఉన్న అసలైన వాళ్లకు పరిచయమైంది మాత్రం ఈ నెల మొదటి వారంలో జరిగిన ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’తోనే.
– ఎం. త్రిపుర, ఆపరేషనల్ మేనేజర్, లక్కీ 4 యూ
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!)
Comments
Please login to add a commentAdd a comment