సాక్షి, అమరావతి : విశ్వసనీయతకు నిలువెత్తురూపం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆలోచనల్లో నిబద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆచరణలో ఎంతటి కష్టం, నష్టం ఉన్నా వెనక్కి తగ్గని గుణం ఆయన సొంతం. జీవనశైలి అత్యంత సాదాసీదాగా ఉంటుంది. మితాహారం ఆయనకు ఇష్టం. నిద్ర కూడా పరిమితమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అధికారంలో ఉన్నప్పుడూ అంతే నిరాడంబరత ఆయనలో కనిపిస్తుంది. మాట, భాష, వ్యవహార శైలే దీనికి నిదర్శనం. రోజురోజుకూ ఆయనలో ఓపిక, సహనం పెరుగుతూనే ఉన్నాయి. ఎంతమందితో మాట్లాడినా, ఎన్ని గంటలు చర్చించినా ముఖంలో చిరునవ్వు అలాగే కనిపిస్తుంది.
మితాహారం
మితాహారం తీసుకోవడం, అదే సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఆయన లేచిన తర్వాత రెండు కప్పుల టీ, తర్వాత గ్లాసుడు జ్యూస్ మాత్రమే ఉదయం తీసుకుంటారు. లంచ్‌కు ముందు కప్పు కాఫీ, లంచ్‌లో వెజిటబుల్ సలాడ్, పన్నీర్, తక్కువ మొత్తంలో ఫిష్ లేదా సంబంధిత ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. సాయంత్రం కూడా ఒక కప్పు కాఫీ తాగుతారు.
రాత్రికి పుల్కా లేదా, రోటీతో కూరగాయలు తీసుకుంటారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పరిమితమైన ఆహారం, వ్యాయామం విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. స్వీట్లు లాంటి పదార్థాలకు దూరంగా ఉంటారు. ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు.
ఆపన్నులకు అండ
వైఎస్ జగన్.. అనే పేరు వింటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఒక నమ్మకం. ఆయన ఉన్నాడు.. మనల్ని చూసుకుంటాడనే భరోసా కనిపిస్తుంది. ఇంతటి విశ్వాసం పొందడానికి ఆయన అనుసరిస్తున్న మార్గాలు కూడా స్ఫూర్తిదాయకం. ఒక నాయకుడిగా తాను నడవటమే కాదు పది మందినీ నడిపించే ప్రేరణతో కూడిన శక్తి ఆయన సొంతం. రుజువర్తన, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల, అవి నేరవేరే దాకా చెక్కుచెదరని సంకల్పం, అన్నింటికీ మించి క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. గొంతు విప్పలేని వర్గాలకు ఒక స్వరమై, ఆపన్నులకు ఆపద్భాంధవుడై ఆయన నిలవడం వెనుక ఈ వ్యక్తిత్వమే కారణం.
దినచర్య ఇలా..
సమయాన్ని అత్యంత విలువైనదిగా జగన్ భావిస్తారు. అందుకనే రోజువారీ ప్రణాళిక విషయంలో షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతారు. తెల్లవారక ముందే నిద్రలేచే అలవాటును అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ వదులుకోలేదు. ఉదయం 4గంటలకు ఆయన దినచర్య ప్రారంభం అవుతుంది. ఆరోజు దినపత్రికలను ఒకసారి పరిశీలిస్తారు. స్పందించదగ్గ విషయాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి ఆదేశాలు ఇస్తారు. గంటకు పైగా వ్యాయామం ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇంగ్లిషు ఛానల్స్, లేదా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, పాలనా రంగాల్లో వస్తున్న అంశాలపై నిపుణులు చేసిన పోడ్‌కాస్ట్ వింటారు.
ఇందులో స్వీకరించదగ్గ అంశాలను గుర్తు పెట్టుకుని ఒక పేపర్‌పై రాసుకుంటారు. రాష్ట్రానికి అవసరమైన అంశాల విషయంలో అవి ఎంత వరకు మేలు చేస్తాయనే విషయాన్ని ఆలోచించి వాటిని అమలు చేస్తారు. వ్యాయామం ముగిసిన తర్వాత తన కార్యాలయానికి రెడీ అవుతారు. సాధారణంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయంలోనే ఉంటారు. అధికారులతో సమీక్షలు, పాలనా పరమైన వ్యవహారాలు, పార్టీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత మొదట సీఎంఓ అధికారులతో సీఎం ప్రతి రోజూ సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలపై చర్చ ఉంటుంది.
ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలు, అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎవరినైనా ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అన్నదానిపై ప్రధానంగా చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల నుంచే ఆయన అధికారులతో నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు. ‘నేను అయినా, మీరు అయినా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. దాపరికంతో ఉన్నా, మీ ముందు నేను మనసు విప్పి ఓపెన్‌గా మాట్లాడకపోయినా ఈ సమావేశానికి అర్థం ఉండదు. ఏ అంశంపైనైనా మీ అభిప్రాయాలను సంకోచం లేకుండా చెప్పొచ్చు.
అప్పుడే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం’ అని పలుమార్లు చెప్పారు. వ్యతిరేకులు చెప్పిన విషయాల్లో కూడా తీసుకోదగ్గవి ఉంటే మనస్ఫూర్తిగా స్వీకరించాలని, వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలని అధికారులకు సూచించడం.. ఆయన వ్యవహార శైలిలో భాగం. విపత్తు సమయాల్లో అసహాయులైన వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా సీఎం మెరుపు వేగంతో స్పందించడం గురించి పలుమార్లు అధికారులు గుర్తు చేస్తుంటారు.
ఒంటరిగా భోజనం చేయడం అరుదు
మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా ఆ సమయం వృథా కాకుండా సీనియర్ అధికారులతోనో లేదా పారీ్టకి చెందిన నాయకులతోనో కలిసి భోజనం చేస్తూ అనేక విషయాల మీద మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకల్లా కార్యాలయానికి వచ్చి.. పాలనా విధుల్లో నిమగ్నమవుతారు. సాయంత్రం దాదాపు 7 గంటల వరకూ కార్యాలయంలో ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్లిన సందర్భంలో కూడా ఒకరిద్దరు కార్యదర్శులు, సీనియర్ అధికారులు వెంటవెళ్తారు.
ఈ సమయంలో మరో గంటన్నరసేపు ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చలు ఉంటాయి. రోజు వారీ విధులు ముగించిన తర్వాత ఒక ఆలోచన వచ్చినా, లేక టీవీల్లో రాష్ట్రానికి సంబంధించి ఏదైనా వార్తను చూసినా, ఇంగ్లిషు ఛానళ్లలో కొత్త అంశాలు వచ్చినా.. అప్పటికప్పుడు స్పందించి ఆయన అధికారులకు, పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తారు. తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తారు. రాత్రి ఎంత లేటైనా, ఎంత అలసట ఉన్నా తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు ఆయన దినచర్య ప్రారంభిస్తారు.
ప్రభుత్వానికి మనసు ఉండాలి
ప్రభుత్వానికి మనసు ఉండాలని అధికారులకు పదేపదే చెప్తారు ముఖ్యమంత్రి. అలాంటి మనసుతో ఆలోచించినప్పుడే పేదల కష్టాలను తీర్చగలమని తరచుగా అంటుంటారు. ఈ ప్రభుత్వ పాలనకు ప్రధానమైన పునాది ఉందంటే అది మానవత్వమేనంటూ అధికారుల్లో నిరంతరం స్ఫూర్తి నింపుతారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక బాలుడికి జీన్ థెరపీ అవసరం అని, దానికోసం కనీసంగా రూ.50 లక్షలు ఖర్చు చేయాలని అధికారులు ప్రతిపాదించినప్పుడు ఏం చేద్దామని ఆయన ప్రశ్నించినప్పుడు.. అంత ఇవ్వలేమని అధికారులు బదులిచ్చారు.
ప్రజలచేత ఎన్నుకోబడ్డ మనం ప్రజలకు అంత కష్టం వచ్చినప్పుడు, ఆలోచిస్తూ నిబంధనల సాకు చూపించడం అత్యంత అమానవీయం అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వంగా మనం తప్పక సహాయం చేయాలని నిర్దేశించారు. అటు విశాఖలో పాలిమర్స్ ఘటన అయినా, బోటు ప్రమాదాలు అయినా, ప్రమాదాలు సంభవించినా, చివరకు మొన్నటి తుపానులో కానిస్టేబుల్ విధి నిర్వహణలో మరణించినా.. వైఎస్ జగన్ అత్యంత మానవీయతను చూపిస్తూనే ఉన్నారు. పేదల బాగు కోసం ఉన్న వ్యవస్థలను మార్చడానికైనా, బడ్జెట్లు దాటడానికైనా, నిబంధనలను తిరిగి రాయడానికైనా వెనుకాడని తత్వం ఆయన సొంతం.
నాన్చడం తెలియదు
జగన్ పరిపాలనా వ్యవహారాలను దగ్గరగా చూస్తే కొన్ని అంశాల్లో వినూత్నత కనిపిస్తుంది. సాధారణ రాజకీయ నాయకుడు మాదిరిగా ప్రతి అంశాన్ని నాన్చి మూలన పడేసే తత్వానికి ఆయన చాలా దూరం. ఏ విషయం మీద కూర్చున్నా దాని మూలాల వరకూ వెళ్తారు. అవసరమైతే మరింత ఆలోచన కోసం మరి కొంత సమయం వెచ్చిస్తారు. తన ఆలోచన మీద సంబంధిత అధికారులు, నిపుణులతో లోతైన చర్చ చేస్తారు. పూర్తిగా అవగతమైన తర్వాత కార్యాచరణకు దిగుతారు. అమలులో ఇబ్బందులొస్తే వెనక్కి తగ్గడం, వాయిదా వేయడం చేయకుండా, మరింత పట్టుదలతో ముందడుగు వేయడం ఆయన నైజం.
విద్య, వైద్యం ప్రజలకు నాణ్యంగా అందించాలని తపన
విద్యలో నాణ్యత, ప్రజలకు అందించే వైద్య సేవల్లో నాణ్యత ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడిన తపనను అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈ రెండు రంగాల్లో నాడు–నేడు అలా పుట్టుకొచ్చిన కార్యక్రమాలే. అత్యంత భారంగా మారిన విద్య, వైద్యాన్ని విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రజలకు ఒక హక్కుగా అందించడంతోపాటు, జనాభాలో మెజార్టీ ప్రజలు ఆధారపడే వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు, పారిశ్రామిక–ఉపాధి రంగాన్ని పటిష్టం చేయడానికి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సీఎం ఒక యజ్ఞమే చేశారు. జిల్లాల్లో పర్యటనలు లేని సమయంలో ఎక్కువ సమయం ఈ అంశాలకు సంబంధించిన వ్యవస్థలను పరుగులెత్తించడంపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.
క్రమం తప్పకుండా ఆయా శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, వారికి లక్ష్యాలు నిర్దేశించడం, మరుసటి సమీక్షా సమావేశాలకల్లా వాటిలో ప్రగతిని సమీక్షించడం సీఎం ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. కాబట్టే ఈ నాలుగున్నరేళ్లు సాగిన సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కూడా జరిగాయి. ప్రతి సమీక్ష ఒక సమస్యకు పరిష్కారాన్ని సాధించేలా సాగింది. తాను చేయాల్సిన పనులు, దృష్టి పెట్టాల్సిన అంశాలు కూడా తన జేబులో ఉన్న చిన్న పుస్తకంలో సీఎం ఇప్పటికీ రాసుకుంటారు. వాటిని తప్పనిసరిగా ఫాలో అప్‌చేసి ఫలితాలు సాధించే వరకూ ఆయన నిద్రపోరు. హడావిడి లేకుండా సాఫీగా, సజావుగా సత్వర ఫలితాలను సాధించాలనే శైలి ఆయనది.
ఆదేశాల్లో స్పష్టత
అధికారులకు స్థిరమైన బాధ్యతలు అప్పగించడం, అందులో కూడా స్పష్టత ఉండడం ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుకు అద్దం పడుతుంది. అధికారులు ఎవరైనా వారిలో పూర్తి సామర్థ్యాలను వెలికితీసి, లక్ష్యాల దిశగా అడుగులు వేయించడం సాధ్యమవుతుందని ఆయన బలంగా విశ్వసిస్తారు. నాయకుడిగా ఆయనకున్న వ్యక్తిత్వం అధికారుల నుంచి ఉత్తమ పనితీరును రాబట్టుకోగలిగింది.
ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం, వారి అభిప్రాయాలను పూర్తిగా వినడం, బాధ్యతలను పూర్తిగా అప్పగించడం, సమిష్టి తత్వాన్ని పెంపొందించడం.. ఇలా అధికారుల పట్ల ఆయన వ్యవహరించే తీరుకు ప్రశంసలు దక్కాయి. అందుకే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన శాఖాధిపతులు చాలా వరకు సుదీర్ఘకాలంగా అదే స్థానాల్లో ఉండి సేవలు
అందించారు. ఇప్పుడూ కొనసాగుతున్నారు.
కీలక ఘటనలు
02.09.2009: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం
09.04.2010: పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఓదార్పుయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్
29.11.2010: ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు రాజీనామా
12.03.2011: ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ పతాకం ఆవిష్కరణ.. పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటన
13.05.2011: కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ జగన్ 5,46,673 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయభేరి.
27.05.2012: టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను పిలిచి, అరెస్టు చేసిన సీబీఐ
14.06.2012: 19 శాసనసభ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 17 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయభేరి, ఒక లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయం
24.09.2013: అక్రమ కేసుల్లో జైలు నుంచి బెయిల్‌పై వైఎస్ జగన్ విడుదల
05.10.2013: రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. సమైక్య రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ లోటస్ పాండ్‌లో ఆమరణ దీక్ష
18.12.2013: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం
16.5.2014: సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన.. 67 శాసనసభ స్థానాల్లో.. 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం
20.06.2014: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కు గుర్తింపు
25.10.2017: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్
06.11.2017: ఇడుపులపాయలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం
09.01.2019: 3,648 కి.మీ.లు సాగిన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగింపు
23.05.2019: రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం
30.05.2019: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment