ఆన్‌లైన్‌ ఫుడ్‌ క్రేజ్‌..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే.. | India's Online Food Ordering Market Forecast Report And Company Analysis | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఫుడ్‌ క్రేజ్‌..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..

Published Sun, Mar 16 2025 11:51 AM | Last Updated on Sun, Mar 16 2025 12:07 PM

India's Online Food Ordering Market Forecast Report And Company Analysis

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం..  ఆన్‌లైన్‌ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం.  

నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్‌తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. 

ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్‌లైన్‌ ఫుడ్‌పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్‌లైన్‌ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గీ వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్‌ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్‌ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్‌లైన్‌ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది.   

విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం 
కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పెళైన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్‌లైన్‌ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 

మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్‌ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు.  

ఆన్‌లైన్‌ ఆర్డర్ల వైపు మొగ్గు 
కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్‌ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గడపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. 

ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గీ సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్‌లైన్‌ రేటింగ్‌ ఆధారంగా హోటల్‌ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. 

అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్‌ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్‌లైన్‌ ఆహారంతో గడిపేస్తున్నారు.  

హోటల్‌కు వెళ్లడం ఫ్యాషన్‌  
సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్‌లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. 

బ్యాచిల ర్లు రూమ్‌ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రోజూ హోటల్‌ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్‌ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ ఫుడ్‌ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది.   

ఆన్‌లైన్‌ ఆహారం వివరాలివీ.. 

మహిళా ఉద్యోగులు               12,875 
నూతన జంటలు                   2,140 
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన 
కుటుంబాల సంఖ్య                7,396 
బ్యాచులర్లు                         10,250 
విశ్రాంత ఉద్యోగులు                3,256 
ఒంటరి మహిళలు, పురుషులు    895 
వ్యాపారవేత్తలు                      1,276 
సందర్భం ఆధారంగా ఆన్‌లైన్‌ను 
ఆశ్రయిస్తున్నవారు                 2,564  

ఇంటి వంటతోనే ఆరోగ్యం 
మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. 

ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి.  
 –డాక్టర్‌ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి  

కొత్తగా పెళ్లి అయ్యింది..వంట సరిగ్గా రాదు  
మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్‌ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్‌లైన్‌ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. 
–సరళ,  ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి  

ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి 
మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్‌లైన్‌ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నారు.
–పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి   

(చదవండి: పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement