Home Food: హోమ్‌ ఫుడ్స్‌లో షీరో.. | Growing popularity of home food | Sakshi
Sakshi News home page

Home Food: హోమ్‌ ఫుడ్స్‌లో షీరో..

Published Mon, Jul 1 2024 8:26 AM | Last Updated on Mon, Jul 1 2024 8:29 AM

Growing popularity of home food

ఆన్‌లైన్‌లో అమ్మకాల జోష్‌ 

లక్షలు సంపాదిస్తున్న మహిళలు 

స్వయం ఉపాధిగా శిక్షణా తరగతులు 

షీరో హోమ్‌ ఫుడ్స్‌ కొత్త ప్రయత్నం 

వంటగది నుంచే వ్యాపారం

మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు మహిళలు వివిధ కారణాల రీత్యా ఇంటిగడప దాటలేని పరిస్థితి. కానీ ఏదో ఒక్కటి చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమకు తెలిసిన వంటలతో ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలని ఎందరో ఆలోచిస్తుంటారు. కానీ వాటిని ఎక్కడ? ఎలా? అమ్మాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అటువంటి మహిళలకు మేము ప్రోత్సాహం అందిస్తామంటూ నాలుగు సంవత్సరాల క్రితం ముందుకొచి్చన సంస్థే షీరో హోమ్‌ ఫుడ్స్‌. దీని పనేంటి? మహిళలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది? ఎలాంటి మెళకువలు నేర్పిస్తుంది? తెలుసుకుందాం.. 

తమ వంట గది నుండే మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేలా షీరో హోమ్‌ ఫుడ్‌ సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రతి మహిళ తాము చేసే వంట రుచికరంగా ఉండాలనే తపన పడుతుంది. అయితే వారు చేసే వంట అమీర్‌పేటలో చేసినా, అనకాపల్లిలో చేసినా, అమెరికాలో చేసినా ఒకే రంగు.. ఒకే రుచితో పాటు.. ఒకేలా కనబడేలా ఉండేందుకు అన్ని రకాల వంటకాలకూ షీరో హోమ్‌ ఫుడ్స్‌ ఉచిత శిక్షణను అందిస్తోంది. దీంతో మహిళలు ప్రతి నెలా ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.10వేల నుండి లక్ష రూపాయల పైబడి సంపాదిస్తున్నారు.  

చెన్నై కేంద్రంగా ప్రారంభం 
ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్‌ విస్తరిస్తున్న సమయంలో ప్రజలకు ఆన్‌లైన్‌ ద్వారా మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో తిలక్‌ వెంకటస్వామి, జయశ్రీ తిలక్‌ దంపతులు చెన్నైలో 2019లో షీరో హోమ్‌ ఫుడ్స్‌ సంస్థను ప్రారంభించారు. మహిళలు తమకు తెలిసిన వంట నైపుణ్యానికి షీరో సంస్థ అందించే మెళకువలను జోడించి దక్షిణ, ఉత్తరాది వంటకాలను రుచికరంగా, శుచికరంగా తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు.

అందుబాటులో అనేక వంటకాలు
తెలుగు వంటకాలే కాకుండా తమిళనాడు, కేరళ, ఉత్తరాది రుచులతో 150 రకాలకు పైగా వంటలను అవలీలగా నిర్ణీత సమయంలో చేసేలా తరీ్ఫదుని ఇస్తోంది. అంతే కాకుండా వారు చేసిన వంటకాలని తమ వెబ్‌సైట్, యాప్‌తో పాటు స్విగ్గీ, జొమాటో, వాయు, ఓఎన్‌డిసీ వంటి అనేక ఫుడ్‌ డెలివరీ పార్టనర్స్‌తో భాగస్వామ్యాన్ని కల్పించి, చక్కని ఆదాయాన్ని పొందేలా షీరో హోమ్‌ ఫుడ్స్‌ మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. పప్పు, పచ్చడి, సాంబారు వంటి ఇంటి భోజన వంటకాలనే కాకుండా, వారు నిష్ణాతులుగా ఉన్న తినుబండారాలు, ఇతర అనేక వంటకాలు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విక్రయించుకుని స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తోంది.

స్వయంశక్తితో ఎదుగుతున్న మహిళలు 
షీరోలో చేరి ఎందరో మహిళలు తమ స్వయం శక్తితో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు. పిల్లల ఫంక్షన్లు గర్వంగా చేసుకుంటున్నారు. దీంతోపాటు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండగలిగే స్థాయిలో నిలుస్తున్నారు. నలుగురిలో తాము భిన్నమని నిరూపిస్తూ గర్వపడుతున్నారు. మా ఇంట్లో నాన్న హీరో అయితే అమ్మ షీరో అని పిల్లలు తలెత్తుకుని చెప్పేలా చేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల మంది మహిళలకు చేయూతగా నిలిచిన షీరో హోమ్‌ ఫుడ్స్‌ సంస్థ కొద్ది సంవత్సరాల్లోనే పది లక్షల మంది మహిళలకు చేయూతగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఉచిత సెమినార్‌ వివరాలు.. 
ఆసక్తి గల మహిళలు ఉచిత సెమినార్‌లో పాల్గొనేందుకు సెల్‌ : 6309527444లో తమ పేరు, ఏరియా, సిటీని వాట్సాప్‌ చేస్తే ఏ తేదీల్లో సెమినార్‌లో పాల్గొనాలో తెలియజేస్తామని ఆ సంస్థ కన్వీనర్‌ విజయ్‌ వర్మ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా ప్రధాన నగరాల మొదలు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ కిచెన్‌ని ప్రారంభించి మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చు.  

నగరంలో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యాలయం.. 
హైదరాబాద్, మెహిదీపట్నం, రేతి»ౌలిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యాలయం ఉంది. ప్రతి వారం మహిళలకు వంటలపై ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యాపార మెళకువలపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో 100 కిచెన్‌ పార్టనర్స్‌ ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 300 మంది కిచెన్‌ పార్టనర్స్‌ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మాస్టర్‌ ప్రాంచైజ్‌ ఓనర్‌గా సువర్ణదేవి పాకలపాటి ఉంటూ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

పెట్టుబడి లేకుండా... 
షీరో హోమ్‌ ఫుడ్స్‌ సంస్థ ప్రస్తుతం రెండు మోడల్స్‌గా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పెట్టుబడి లేకుండా ఇంట్లో వుండే స్టవ్, గిన్నెలతో వ్యాపారాన్ని ప్రారంభించే విధానం ఒకటి. ఈ మోడల్‌లో రూ.10 వేల నుంచి లక్ష వరకూ సంపాదించవచ్చు. కొద్దిపాటి పెట్టుబడితో నలుగురు లేదా ఐదుగురు మహిళలు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కమ్యూనిటీ కిచెన్‌ని ప్రారంభించి సంపూర్ణ వ్యాపార మోడల్‌ మరొకటి. సంపూర్ణ వ్యాపార మోడల్లో రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నవారికి ముందుగా ఓ సెమినార్‌ నిర్వహించి వ్యాపార నమూనాను వివరిస్తారు. తాము ఇందులో వ్యాపారం చేయగలం అని ముందుకొచ్చిన మహిళా మణులకు షీరో కుటుంబంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement