శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోస వ్యాధులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్‌లో రుచితో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిశె, నువ్వుల లడ్డు. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు, నువ్వుల లడ్డూ(Flax Seeds And Sesame Seeds Laddu) ఎలా తయారు చేయాలో చూద్దాం.
ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇక అవిశె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. పోషకాలకు శక్తివంతమైనది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి , సేంద్రీయ బెల్లంతో కలిసి లడ్డూలను తయారు చేసుకుంటే అది సూపర్ ఫుడ్ కాక ఏమవుతుంది.
అవిశె గింజలు - నువ్వుల లడ్డు తయారీ
కావాల్సిన పదార్థాలు
నువ్వులు, అవిశెగింజలు, బెల్లం, కొద్దిగా బాదం, జీడింపప్పులు, బెల్లం, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడి
ముందుగా రెండు కప్పుల అవిశె గింజలు( Flax Seeds) దోరగా వేయించిన, అలాగే ఒక కప్పు నువ్వులను కూడా దోరంగా వేయించుకోవాలి. దీంతోపాటు బాదం, జీడి పప్పులను కూడా నూనె లేదా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ,రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి (Ghee) ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చినాక, ముందుగా పొడి చేసిపెట్టుకున్న అవిశె, నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడ్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిసేపాక దింపేసుకుని కొంచెం వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూ వలన ఎముకలు బలోపేతమవుతాయి.
ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే
అవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలు
శీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.
క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది.
కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీవక్రియను కూడా పెంచుతుంది.
ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,మంచి కొలెస్ట్రాల్ ( HDL)ను పెంచడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.
ఎముకలు ,కండరాలను బలపరుస్తుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .నిద్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.
అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.
అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇంకా మోకాళ్లు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ళ నొప్పులు(Knee Pain) వేధిస్తున్నాయి. అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది.
(37 కిలోలు తగ్గి, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన గృహిణి)
నోట్: వయసుతోపాటు వచ్చే మోకాళ్ల నొప్పులకు జీవన శైలిమార్పులు, కండరాలను బలోపేతం చేసే కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. దీంతోపాటు వైద్యుల సలహా ప్రకారం అవసరమైతే కొన్ని మందులను వాడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment