వారంలో ఎనిమిది మంది శిశువులు మృతి
గాజాలో పిల్లల ప్రాణాలు తీస్తున్న చలి
యుద్ధంతో అతలాకుతమైన గాజాను ఇప్పుడు చలి పులి చంపేస్తోంది. ముఖ్యంగా చలి నుంచి దాచుకోవడానికి వెచ్చని దుస్తులు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్‌లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆహారం, ఇంధనం, మందులు, మౌలిక సదుపాయాలు లేక గాజాలోని కుటుంబాలు వణికిపోతున్నాయి. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
డెయిర్ అల్–బలాహ్: ఓవైపు యుద్ధంతో విధ్వంసమైన గాజాను ఇప్పుడు చలి వణికిస్తోంది. చలి తీవ్రత బాగా పెరగడంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు, దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని, ఇక్కడ చలికి పిల్లల ప్రాణాలు పోతున్నాయని తన నవజాత శివువును పోగొట్టుకున్న యహ్యా అల్–బత్రాన్ రోదిస్తున్నాడు.
కొద్దిరోజుల కిందే చనిపోయిన తన చిన్నారి దుస్తులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన బత్రాన్ కుటుంబం పదేపదే కొత్త ప్రాంతాలకు వలసపోతూ చివరకు డేర్ ఎల్–బాలాహ్‌లోని చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలతో చేసిన తాత్కాలిక గుడారానికి చేరింది. అతని భార్య నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది.
కవలల్లో ఒకరు జుమా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుండగా.. అలీ కొంత ఆరోగ్యంగా ఉండటంతో ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఖర్జూరం తోటలో నివసిస్తున్న వందలాది మంది మాదిరిగానే, వారు భారీ వర్షాలు, ఎనిమిది డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య పిల్లలను వెచ్చగా ఉంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
సరిపడా దుప్పట్లు లేవు. తగిన దుస్తులు లేవు. ‘‘చలికి తట్టుకోలేక నా బిడ్డ శరీరం మొత్తం గడ్డకట్టడం, అతని చర్మం నీలం రంగులోకి మారింది. నా కళ్లముందే చలిపులి అతని ప్రాణాలుతీసింది’’అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. వర్షంలో తడిసిన చాపపై కూర్చొని చిరిగిపోయిన దుప్పట్లును కప్పి దగ్గరకు పట్టుకుని తన ఇద్దరు పిల్లలను కాపాడుకుంటున్నాడు బత్రాన్. ఎండిపోయిన రొట్టె, స్టవ్ మీద చిన్న కుండలో ఉన్న వేడి నీళ్లు. ఒక రోజుకు వాళ్లకవే ఆహారం.
20 లక్షల మంది భద్రతకు ముప్పు
గాజా స్ట్రిప్‌లో వేలాది ఇతర కుటుంబాల ఆహారం, ఇంధనం, ఔషధాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉంటున్న మహమూద్ అల్–ఫాసిహ్ మూడు వారాల వయసున్న తన కూతురును కోల్పోయాడు. వారి కుటుంబం అల్–మవాసి బీచ్ సమీపంలోని చిన్న గుడారంలో ఉంటుండగా చలికి శిశువు గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు.
తీవ్రమైన హైపోథెరి్మయా వల్ల చిన్నారి గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని నాజర్ ఆసుపత్రి అత్యవసర, పిల్లల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. చలితో మరో 20 రోజుల పసికందు ఆయేషా అల్ ఖాస్సాస్ మృతి చెందింది.
‘‘మీరు ఇంకా గాజా స్ట్రిప్‌లో ఉన్నారంటే ఇజ్రాయెల్ బాంబుదాడులతో మరణించాలి లేదంటే ఆకలితోనో, చలికో చచ్చిపోతారు’’అంటూ దుఃఖిస్తున్నారు ఆయేషా తల్లిదండ్రులు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురిస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నిర్వాసితులైన 20 లక్షల మంది భద్రతకు ముప్పు. ఈ వాతావరణ తీవ్రతకు శిశువులు, వృద్ధులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ ఫరా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment