సేమ్యా ఐస్‌...  ఆరంజీ సోడా... | summer vacation helps in easing their mental stress for kids | Sakshi
Sakshi News home page

సేమ్యా ఐస్‌...  ఆరంజీ సోడా...

Published Sun, Apr 13 2025 12:47 AM | Last Updated on Sun, Apr 13 2025 12:47 AM

summer vacation helps in easing their mental stress for kids

నోస్టాల్జియా

వేసవి అలాగే ఉంది.. సూరిబాబు కూడా ఏం మార్లేదు.కాని రోజులే మారిపోయాయి.  అలనాటి వేసవికి ఇప్పటి వేసవికి సేమ్యా ఐస్‌కు క్రీమ్‌ స్టోన్ కు ఉన్నంత తేడా ఉంది. ఊళ్లకు వెళ్లడం బంధువుల పిల్లలతో గడపడం ఇప్పుడు ఏడ? పరీక్ష... పరీక్ష తర్వాత ఎంట్రన్స్... లేదా బ్రిడ్జ్‌ కోర్స్‌... కాకుంటే స్పెషల్‌ ఇంగ్లిష్‌... ఓహ్‌.. అలా చూడండి సీమచింత గుబ్బలు గుర్తు చేసుకోండి. మీ పిల్లలకు వేసవి హక్కులు ఇవ్వండి. వారి రాజ్యాంగాన్ని పరిరక్షించండి!

సెలవులొచ్చాయంటే పరీక్షలు అయిపోయినట్టు. లేదా పరీక్షలైపోయాయంటే సెలవులొచ్చినట్టు. సరిగా చెప్పాలంటే ఏప్రిల్, మే నెలలు వచ్చాయంటే పిల్లలకు పండుగ వచ్చినట్టు. ఆ నెలలు వారివి. ఆ నెలలకు రాజులు వారు. ఆ నెలలు వారికి ఆహ్లాదం పంచేందుకు వచ్చేవి. ఆటలు నేర్పేందుకు వచ్చేవి. సరదాలు తీర్చేందుకు వచ్చేవి. బస్సెక్కి వస్తావో రైలెక్కి వస్తావో అని... ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేందుకు, వెళ్లి ఉండేందుకు ఆ నెలలు వచ్చేవి.

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లల కోసం జ్ఞాపకాలు తెచ్చాయని అర్థం. కాని ఇవాళ? సెలవులైన వెంటనే ఐఐటి ఫౌండేషన్‌ అంటున్నారు. పై క్లాసులకు బ్రిడ్జ్‌ కోర్స్‌ అంటున్నారు. స్పెషల్‌ ఇంగ్లిష్‌ క్లాసుల్లో పెడుతున్నారు. ఎప్పుడో రాబోయే పరీక్షలకు ఇప్పటినుంచే ప్రిపేర్‌ చేయిస్తున్నారు. పరీక్షలు అయిపోయినా పరీక్షల బాధ తప్పడం లేదు. ఇలా బాధిస్తున్న తల్లిదండ్రులందరూ ఒకప్పుడు వేసవి సెలవుల్లో ఎంజాయ్‌ చేసిన వారే. వారికి దక్కింది పిల్లలకు కూడా దక్కాలని ఎందుకు కోరుకోవడం లేదు?

ఏ ఊరికి వెళుతున్నారు? 
పరీక్షలు మొదలైనప్పటి నుంచి పరీక్షలయ్యాక ఏ ఊరికి వెళ్లబోతున్నారో పిల్లలకు తెలిసేది. బాబాయి ఊరా? మేనత్త ఊరా? అమ్మమ్మ ఊరా? ఏ ఊరు వెళితే ఎవరు తోడుంటారు... వారితో ఎలాంటి ఆటలు ఆడొచ్చు. ఎగ్జయిట్‌మెంట్‌తో నిద్ర పట్టేది కాదు. పరీక్షలు ఎంత త్వరగా అవుతాయా అని ఎదురు చూపులు. నాన్న పర్మిషన్‌ దొరికితే అమ్మతోపాటు చలో ఊరు. వేసవి సెలవుల్లో ఊళ్లకు ఎందుకు వెళతారంటే వచ్చాక ఫ్రెండ్స్‌కు గొప్పలు చెప్పుకోవాలి గదా  మరి. 

మేం వెళ్లిన ఊళ్లో ఎన్ని సినిమా హాళ్లు ఉన్నాయో తెలుసా?  సెకండ్‌ షోలకు ఎలా వెళ్లామో తెలుసా? ఏం తిన్నాం ఏం తాగాం... ఏ స్టిక్కర్లు కొనుక్కున్నాం... ఎన్ని గోలీలు సేకరించాం... క్రికెట్‌ ఆడితే బంతి ఎన్నిసార్లు కనపడనంత దూరం వెళ్లి మాయమైంది... పొలాలు చూడటం... తాటి ముంజలు తినడం... సముద్ర స్నానంలో జేబుల్లో నిండిన ఇసుక... నది ఒడ్డున జలకాలాట... ఎడ్లబండి సవారీ... ఆరుబయట పక్కలేసుకుని నిద్ర.... ఎన్నని! వింటున్న స్నేహితులు కుళ్లుకుంటే ఆనందం. కాని నేడు? వేసవి సెలవుల్లో పిల్లల్ని ఇల్లు కదలనీకుండా చేయడం వల్ల తెల్లమొహాలేసుకుని తర్వాతి క్లాసుకు వెళుతున్నారంతే.

మేసే నోళ్లు... సీజన్‌ చిరుతిళ్లు
ప్రతి సీజన్‌కు చిరుతిళ్లు ఉంటాయి. వేసవి చిరుతిళ్లు మాత్రం పిల్లల కోసమే తయారవుతాయి. ఐస్‌బండ్లు గంట గణగణలాడిస్తూ ఊళ్లలో తిరుగుతాయి. ఆరంజ్‌ ఐస్, ద్రాక్షా ఐస్, బాదం ఐస్, పాల ఐస్, సేమ్యా ఐస్‌.... ఐస్‌ చప్పరించడం కూడా కళే. విరిగి కింద పడకుండా పుల్ల మిగిలేలా ఐస్‌ తిన్నవాడే మొనగాడు. ఇవిగాక ముద్ద ఐస్‌. అంటే ఐస్‌ గోలా. ఐస్‌ను పిండి పిండి చేసి ఒక పుల్లకు ముద్దలా అదిమి దాని మీద రంగు రంగుల ఎసెన్స్‌ పోసి ఇస్తారు. ఈ ముద్ద ఐస్‌ను జుర్రుకుంటూ ఉంటే నా సామిరంగా. ఇవేనా? ఐస్‌సోడా... సుగంధ... మసాలా మజ్జిగ.... పుదీనా నీరు... చెరకు రసం... కొబ్బరి నీళ్లు... ప్రతి ఇంట్లో రస్నా కొన్నాళ్లు రాజ్యం ఏలింది.... బెంగళూరు మామిడిని పలుచగా కోసి ఉప్పు కారంతో పాటుగా అమ్ముతారు... వహ్వా... జీడిమామిడి కాయలు అమ్ముతారు... సీమచింత గుబ్బలు అమ్ముతారు.... పిల్లలు బకాసురులవుతారు. సెలవుల్లో ఖర్చు పెట్టడానికి దాచిన మట్టి కుండీలను పగుల గొడతారు.

ఆటలో ఆటలు
రాబోయే విద్యా సంవత్సరానికి సరిపడా శారీరక బలం, దృఢత్వం వేసవిలో పిల్లలకు వస్తుంది. అలాంటి ఆటల డిజైన్‌ మనకు ఉంది. కుందుడు గుమ్మ, ఒంగుళ్లు దూకుళ్లు, దాగుడుమూతలు, కోతి కొమ్మచ్చి, నేలా మిట్ట, దొంగ పోలీస్, ఐస్‌బాయ్, గోలీలాట, బిళ్లంగోడు... ఇవన్నీ శరీరానికి తర్ఫీదు ఇస్తే, కూచుని ఆడే ఆటలు పరమపద సోపానపటం, చుక్కుచుక్కుపుల్ల, పులిజూదం, గవ్వలాట, సీతారాములు... ఇవన్నీ బుద్ధిని పదును పెడతాయి. కొత్త ఊళ్లో కొత్త స్నేహితులవుతారు. మళ్లీ వేసవికి తప్పకుండా రావాలని వీరు మాట తీసుకుంటారు.

అనుబంధాల కాలం
వేసవి సెలవులొచ్చేది అనుబంధాలు పెనవేయడానికి... బంధాలు నిలబెట్టడానికి. తల్లి తరఫువారు తండ్రి తరుపు వారు ఎవరు ఎవరో పిల్లలకు ఈ సీజన్‌లో తెలుస్తుంది. వారి పిల్లలు తెలుస్తారు. వీరంతా మనవారన్నమాట అనే భావం వారికి ఆనందం ఇస్తుంది. వారిలో వారు పార్టీలు కట్టుకుంటారు. పెద్దవాళ్లు పిల్లలను దగ్గరకు తీస్తారు. బట్టలు కుట్టిస్తారు. కానుకలు కొనిపెడతారు. ముద్దు చేస్తారు. అమ్మా నాన్న కాకుండా మనల్ని ముద్దు చేసే వారు వేరే ఉన్నారన్న భావన కూడా పిల్లలకు చాలా బాగుంటుంది. కొందరికి మేనత్త నచ్చుతుంది. కొందరు బాబాయికి అంటుకు పోతారు. కొందరు పెదనాన్న పార్టీ. కొందరు పెద్దమ్మలకు ఫ్యాన్స్‌ అవుతారు. తాతయ్య ఎన్నో కబుర్లు చెబుతాడు. ఆకాశం కింద పక్కలు వేసి నానమ్మ చెప్పే కథలు జీవితాంతం తోడుంటాయి.

ఏవీ ఆ నిరుడు కురిసిన హిమ సమూహాలు?
ఆలోచించి చూడాలి. పిల్లలు ఏం పొందుతున్నారు. జీవితంలో ఏ జ్ఞాపకాలు దాచుకుంటున్నారు. ఏ బంధాలను బలపరుచుకుంటున్నారు. వారిని ఈ జీవన ధోరణి ఒంటరిని చేస్తూ పోతోందా లేదా తనవాళ్లతో బలపడేలా చేస్తోందా? ఇవాళ పిల్లలు ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులతో చెప్పుకోలేక ఏ అత్తయ్యకో, బాబాయికో చెప్పుకోవాలనుకుంటే అలాంటి బంధాలను ఈ వేసవిలోనే కదా పాదువేయాలి. పొదువుకునేలా చేయాలి. కజిన్స్‌ బలం లేకుండా పోయిన పిల్లలు ఎందుకు పెరుగుతున్నారు. 

పెద్దల మధ్య తగాదాలు పిల్లల మధ్య వరకూ ఎందుకొస్తున్నాయి. మన సొంత మనుషులే లేకపోతే బయట వారు జీవితంలో ఎందుకు తోడు నిలబడతారు? వేసవి ఎండల్ని కాదు. సందేశాలను తీసుకువస్తుంది. వేసవి సెలవులు సంవత్సరం మొత్తానికి అవసరమైన రిపేర్లు చేసుకోమని చెప్పడానికి వస్తుంది. పిల్లలకు హక్కులు వున్నాయి. వేసవి సెలవులు అయినవారితో గడపడం వారి హక్కు. ఆ హక్కును వారికి ఇవ్వండి. వాటిని కోల్పోయేలా చేస్తే వారు పెద్దయ్యాక మనం మరేదో కోల్పోయేలా చేస్తారు.

– కె 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement