
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్‌మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకోవడానికి
ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...
నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్‌లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.
గట్టి దెబ్బే కొడుతుంది..
దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.
ముందు మనల్ని మనం..
ఈ ఫేజ్‌ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్‌నిస్తుందని. అందుకే ఎక్సర్‌సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను.
ఎందుకంటే అదే ఇన్‌కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్‌లో డీల్ చేయడమూ తేలికవుతుంది.
సందర్భం దొరికినప్పుడు..
ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్‌హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది.
నార్మలైజ్ చేయాలి
‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’
– లారా దత్తా, బాలీవుడ్ నటి.
– శిరీష చల్లపల్లి