
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్‌గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...
‘‘ఈ రోజు గైనకాలజిస్ట్‌గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్‌గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్‌గా, గోడౌన్ ఇన్‌చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు.
‘అభయం’తో...
టెన్త్‌లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్‌సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను.
అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్‌లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్‌షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్‌మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్‌తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్‌లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.
సేవా మార్గం...
ఉంటున్న చోటనే డాక్టర్‌గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్‌లైన్ ద్వారా స్టూడెంట్స్‌కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.
నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి