abhaya foundation
-
Abhaya Foundation: పేదలకు అభయం బాలచంద్రుని ఆనంద నిలయం
పరాన్న జీవులుగా కాదు.. పరమాత్మ జీవులుగా మనమంతా ఎదగాలి’ అంటారు సుంకు బాలచంద్ర. పదిహేడేళ్లుగా సేవారంగంలో వేలాది మందికి అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న యాభై ఏళ్ల బాలచంద్ర. అభయ ఆనంద నిలయం పేరుతో నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతూ మొదలుపెట్టిన సేవామార్గం ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అనాథ వృద్ధులను చేరదీస్తూ, విద్యార్థుల చదువుకు అవసరాలను సమకూరుస్తూ, రోగులకు వైద్యచికిత్సను అందజేస్తూ, నిరుద్యోగుల ఉపాధికి కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను కలుస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పది వేల రూపాయలతో మొదలుపెట్టిన సేవా మార్గం నేడు ఎంత మందికి చేరవయ్యిందో తెలియజేస్తూ మనం తలుచుకుంటే సమాజంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు లేకుండా చేయచ్చు అని వివరిస్తున్నారు. పద్దెనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తన సేవా ప్రస్థానాన్ని ఇలా ముందుంచారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు నాగర్‌కర్నూలు నుంచి ఫోన్ వస్తే అక్కడకు వెళ్లాను. ఎనభై ఏళ్ల ముసలాయన బాగోగులు చూడలేక వారి పిల్లలు ఇంటి నుంచి అతన్ని రోడ్డు మీదకు తోసేస్తే కొన్ని రోజులుగా చెత్త కుప్ప వద్ద ఉన్నాడు. అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చిన ఆరునెలలకు ఆయన భార్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎనిమిదేళ్లపాటు నాతోనే ఉన్నారు. నాకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే ఆవిడ బెంబేలెత్తిపోయి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు, కమ్మలు ఇచ్చి ‘అమ్మి, ఆ బాబును బతికించడయ్యా’ అని వేడుకుంది. కోలుకుని వచ్చాక విషయం తెలిసి కళ్ల నీళ్లు వచ్చాయి. పన్నెండేళ్ల క్రితం పాతికేళ్లమ్మాయి రోడ్డు ప్రమాదంలో హిప్బాల్ దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యింది. హైదరాబాద్ గాంధీ నగర్లో ఉండే ఆమెను గుండె నొప్పితో బాధపడే తల్లి తప్ప చూసుకునేవారు ఎవరూ లేరు. నాలుౖగైదేళ్లు ఆ అమ్మాయి బెడ్‌మీదే ఉండిపోయింది. ఆమెకు పలుమార్లు ఆపరేషన్ చేయిస్తే ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. డాక్టర్ కావాలన్నది తన కల. కానీ, చదివించే స్థోమత మాకు లేదని బాధపడుతూ వచ్చారు ఒకమ్మాయి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఈ రోజు డాక్టర్ అయి పేదలకు సేవలందిస్తోంది. ఈ పదిహేడేళ్లలో ఇలాంటి కథనాలు ఎన్నో... స్వచ్ఛందంగా ఎంతో మంది కదిలివచ్చి ‘అభయ ఫౌండేషన్’తో చేయీ చేయీ కలిపారు. ఉపనయనం డబ్బులతో... పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. ఇరవై నాలుగేళ్ల క్రితం నాకు ఉపనయనం చేసినప్పుడు బంధువుల ద్వారా పది వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నలుగురికి మేలు కలిగే పని చేయాలనుకుంటున్నాను అని మా కుటుంబంలో అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నాను. వారందరి మధ్యనే ‘అభయ’ అనే పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాను అని, తమకు తోచిన సాయం అందిస్తూ ఉండమని కోరాను. అక్కణ్ణుంచి హైదరాబాద్ వచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. నా ఖర్చులకు పోను మిగతా జీతం డబ్బులు, బంధుమిత్రులు ఇచ్చినదానితో ఫుట్‌పాత్‌ల మీద ఉండే నిరాశ్రయులకు సాయం చేస్తూ ఉండేవాణ్ణి. నైపుణ్యాల వెలికితీత.. ఏ మనిషి అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా బతకాలి. అందుకు తగిన నైపుణ్యం కూడా ఉండాలి. దీంతో వారాంతాలు స్కిల్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తుండేవాడిని. చదువుకున్న రోజుల్లో నేను మా బంధువుల నుంచి పుస్తకాలు, ఫీజులు, బట్టల రూపంలో సాయం పొందాను. వారందరిలోనూ ఒక ఎఫెక్షన్ చూశాను. నాలాగే ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు అనే ఆలోచనతో విద్యార్థుల చదువుకు ఊతంగా ఉండాలనుకున్నాను. పుట్టి పెరిగిన జిల్లాతో పాటు ఇప్పుడు దాదాపు 17 రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో 12 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇస్తున్నాం. వీరిలో మహిళలూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో నాదస్వరం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఏ వృత్తుల వారికి ఆ వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయంగా ఉంటున్నాం. సేవకు చేయూత ఒక మంచి పని చేస్తే ఎంత దూరమున్నవారినైనా ఆకట్టుకుంటుందని ఓ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడకు 75 ఏళ్ల ఆవిడ వచ్చి ‘నేనూ మీ సేవలో పాలు పంచుకుంటాను, నెలకు 5వేల రూపాయలు ఇవ్వగలను’ అంది. ఆశ్చర్యంగా చూస్తే ‘నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను. 20 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు సేవకు నా జమ’ అంది. నోటమాటరాలేదు. ఎక్కడ సేవ రూపంలో వెళితే అక్కడకు పది, వంద రూపాయలు సాయం అందించినవారున్నారు. ఇంతమందిలో మానవత్వం ఉంటే ఇక మనకు కొరతేముంది అనుకున్నాను. ఎవరికి సాయం అందిందో తిరిగి వాళ్లు ఎంతో కొంత సాయం అందిస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా సాయంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు.. నేపాల్ కరువైనా, ఉత్తరాఖండ్ వరదలైనా, ఆంధ్ర, తమిళనాడు, కేరళలలో అకాల వర్షాలు ముంచెత్తినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాయం అవసరమున్నవారికి అండగా ఉంటే చాలు అన్న తపన నన్ను చాలా మందికి చేరువ చేసింది. నాతో పాటు ఎలాంటి స్టాఫ్ లేదు. ప్రత్యేకించి ఆఫీసు లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ చేయూతను ఇస్తున్నారు. దీనికి నేను చేస్తున్నదల్లా సాయం చేసే చేతులను కలపడం. ఈ సేవా ప్రస్థానంలో ఇప్పుడు వేల మంది జమ కూడారు. అంతా నా కుటుంబమే! సేవ మార్గమే నా ప్రయాణం కాబట్టి, పెళ్లి, కుటుంబం వద్దనుకున్నాను. హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంది. ఇటీవల ఆ ఇంటిని అభయ ఫౌండేషన్‌కు ఇచ్చేశాను. ఆరేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో వృద్ధులకు, వైద్య సాయం అవసరమైన పేదలకు అభయ ఆనంద నిలయం ఏర్పాటు చేశాను. నేను మరణించేదాకా, మరణించాక కూడా నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలన్నది తపన. ఈ ప్రయాణంలో ఎన్నో ఆవేదనలు చుట్టుముట్టాయి. ఎందరి కష్టాలనో దగ్గరుండి చూసి, దుఃఖం కలిగేది. చేసే ప్రతి పనినీ దైవాంశగా భావిస్తూ వచ్చాను. పిల్లల కోసం కంపాస్ రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకే, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు మన దేశ నాయకుల గురించి, సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ‘కంపాస్’అనే పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రోజూ ఉదయం నుంచి 10 వేల మందికి టచ్‌లో ఉంటాం. నేను కోరేది ఒక్కటే ... వాలంటీర్లుగా వారంలో ఒక్క రోజు మాకివ్వండి. సేవా మార్గంలో తోడవ్వండి. అంకితభావంతో ఉన్న యువత ఇలాంటి సంస్థలలో పనిచేయడం వల్ల వారిలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజం బాగుండాలంటే యువత చేతులు ఏకమవ్వాలి’’ అని తెలియజేస్తున్నారు బాలచంద్ర. – నిర్మలారెడ్డి -
మహిళలు ఇక అభయంగా ప్రయాణించవచ్చు..
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత రవాణా శాఖ ‘అభయ యాప్’ను రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. ఇట్టే తెలుసుకోవచ్చు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణాశాఖలకు సమాచారం చేరవేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. వాహనాలకు ఐఓటీ బాక్సులు అమర్చాలి రాష్ట్రంలో 5.49 లక్షల వివిధ రకాల వాహనాలు ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిలో 4.50 లక్షల వరకు ఆటోలున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో క్యాబ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకు 79 వేల క్యాబ్‌లు రాష్ట్రంలో నమోదైనట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాల్సి ఉంటుంది. మహిళలకు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నెంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. రవాణా శాఖ రూపొందించిన ‘అభయ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని రవాణా అధికారులు పేర్కొంటున్నారు. రూ. 138 కోట్ల ఖర్చు.. విశాఖపట్నం, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రాష్ట్ర రవాణా శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రూ.138 కోట్లు ఖర్చు చేయనుంది. ఐఓటీ బాక్సులు రవాణా శాఖే సమకూర్చనుంది. బాక్సులు అమర్చకపోతే తనిఖీలు చేపట్టి జరిమానా విధించాలని యోచిస్తోంది. -
రాజీలేని హైదరాబాద్ సాహసి..!!
హైదరాబాద్: ‘ఎవరెస్టంత’ ఆత్మవిశ్వాసమే పునాదిగా... వనితా లోకానికే వన్నె తెచ్చేలా సాహసయాత్రకు సిద్ధమవుతోంది సిటీకి చెందిన ఓ మహిళ. ఆరంతస్తుల మేడ ఎక్కేందుకు ఆపసోపాలు పడే ఈ రోజుల్లో.. ప్రపంచంలోని ఎత్తైన సప్త శిఖరాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పానికి పూనుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో (19,341 అడుగులు)ను అధిరోహించి మువ్వన్నెల పతాకను రెపరెపలాడించింది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (29,029 అడుగులు) అధిరోహణకు అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. భార్యగా.. మాతృమూర్తిగా... సామాజిక కార్యకర్తగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూనే చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్నే ఊపిరిగా చేసుకుని మౌంట్ ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని ముద్దాడేందుకు ముందుడుగు వేస్తోంది రాజీ తమ్మినేని. ఇదీ నేపథ్యం... కర్నూలుకు చెందిన నాగరాజు, సుశీల దంపతులకు కుమార్తె రాజీ తమ్మినేని. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. నగరంలోని ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమెకు సీహెచ్.వెంకటకృష్ణతో వివాహం జరగ్గా తమ ఐదేళ్ళ కుమారుడితో కలిసి నాగారంలో నివాసం ఉంటున్నారు. చిన్నతనంలో చెట్లు, పుట్టలు, కొండలు ఎక్కడం అంటే రాజీకి ఎంతో సరదా. అదే ఇప్పుడు ఆమె జీవితాశయంగా మారింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరి, కుటుంబ బాధ్యతలను స్వీకరించినప్పటికీ చిన్నప్పటి నుంచి తనలో దాగిఉన్న పర్వతారోహణ ఆశయాన్ని చంపుకోలేకపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ..లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగం, ఇటు కుటుంబం చూస్తూనే తరుచూ పర్వతారోహణ టూర్లకు వెళ్తుండేది. పూర్తిస్థాయిలో మౌంటెనింగ్‌కు సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్‌లోని హిమాలయ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఎన్నో విజయాలు... ⇒ 2015 ఆగస్టు 23న సౌతాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారోను రాజీ అధిరోహించారు. ⇒2015 మే 25న వెస్ట్ సిక్కింలోని రినోక్ శిఖరాగ్రానికి చేరుకుని తెలుగువారి కీర్తిని చాటారు. ⇒తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులకు పర్వతారోహణలో మెలకువలు నేర్పించి 2016 ఆగస్టు 15న వారితో కలిసి మరోసారి కిలిమంజారో శిఖరానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ⇒హిమాలయ ప్రాంతంతో పాటు వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతాల్లోని మరెన్నో పర్వతాలను అధిరోహించి తనలోని అభిలాషను చాటడమే కాకుండా సాహసానికి మరోపేరుగా నిలిచారు. సప్త శిఖరాగ్రాలకు చేరడమే లక్ష్యంగా... ప్రపంచంలో ఏడు ఖండాల్లో విస్తరించిన ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే దృఢమైన కోరికను మది నిండా నింపుకుంది రాజీ. ఇప్పటికే కిలిమంజారో శిఖర లక్ష్యాన్ని పూర్తి చేయగా...ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని అందుకునేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్‌బాబు వద్ద మెళకువలను నేర్చుకుంటూ ఫిట్నెస్పరంగా చక్రిపురంలోని సాయీస్ ఫిట్నెస్ సెంటర్లో తర్ఫీదు పొందుతున్నారు. ఏడు శిఖరాలను చేరుకునే వరకు తన లక్ష్యాన్ని వీడబోనని ఈ సందర్భంగా రాజీ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆమెలోని పట్టుదల, తపన,విజయ ‘శిఖరా’లకు చేరుస్తోందని మెంటర్ గా వ్యవహరిస్తోన్న బాలచంద్ర పేర్కొన్నారు. అభయ ఫౌండేషన్ సహకారం... మౌంటెనీరింగ్‌లో రాజీ అభిరుచిని గమనించి అభయ ఫౌండేషన్ ఆమెకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అభయ ఫౌండేషన్లోనే వాలంటీర్‌గా పనిచేస్తోన్న రాజీకి... శిక్షణ ఇప్పించడంతో పాటు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించేందుకు ఇప్పటివరకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రావాలంటే దాదాపు 25 లక్షల పైగా ఖర్చువుతోంది. అభయ ఫౌండేషన్ తరుపున ఐదు లక్షల మేర సమకూరుస్తుండగా మిగిలిన మొత్తం సమకూర్చుకునే విషయంపై రాజీ తర్జనభర్జన పడుతున్నారు. దాతలు ఎవరైనా ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తారేమోనని ఎదురుచూస్తోంది. ప్రభుత్వమైనా స్పందించి తనకు ఆర్థిక సహాయం చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానని రాజీ పేర్కొంటోంది. అభయ ఫౌండేషన్ తరుపున రూ.5 లక్షలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, మరో పది లక్షల వరకు సమకూర్చుకున్నా...మిగిలిన మొత్తాన్ని శిక్షకుడు శేఖర్‌బాబు చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాజీ చెప్పారు. దాతలు ఎవరైనా స్పందించాలనుకుంటే 9963002727, 9032818284 నెంబర్లలో సంప్రదించవచ్చు. కాగా ఏప్రిల్‌లో జరిగే మిషన్ ఎవరెస్ట్–17కు ఈ నెలాఖరు లోగానే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
పరిమళించిన మానవత్వం
‘రోడ్డున పడ్డ బంధం’ కథనానికి విశేష స్పందన వృద్ధురాలిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మానవతామూర్తులు ఆశ్రయమిస్తామన్న అభయ ఫౌండేషన్ చేయూతనిస్తానన్న పూరి జగన్నాథ్ సతీమణి సుందరయ్య విజ్ఞానకేంద్రం: ‘రోడ్డున పడ్డ బంధం’ పేరుతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వృద్ధురాలి కథనంపై మానవతావాదులు విశేషంగా స్పందించారు. వృద్ధురాలిని ఆదుకునేం దుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. సమాజంలో ఇంకా కొంతమంది మానవతామూర్తులున్నారని రుజువు చేశారు. కథనానికి స్పందించిన అభయ ఫౌండేషన్ చైర్మన్ మేడ నర్సింహులు వెంటనే ఫౌండేషన్ కార్యదర్శి బాలచంద్ర, కిరణ్‌కుమార్‌లకు ఫోన్ చేసి ఆమెను చేరదీయాలని చెప్పడంతో.. ఫౌండేషన్ సభ్యులు సుందరయ్య విజ్ఞానకేంద్రానికి సాక్షి దినపత్రికను పట్టుకొని ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. వృద్ధురాలిని తమ వెంట రావాలని కోరుతున్న తరుణంలోనే.. ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య సైతం ఆమెను ఆదుకోవడానికి అదే సమయంలో అక్కడికి వచ్చారు. దీంతో అభయ ఫౌండేషన్ సభ్యులు, లావణ్య కలిసి వృద్ధురాలు దుర్గమ్మను ఇబ్రహీంపట్నంలోని ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అయితే లావణ్య ఆమెకయ్యే ఖర్చులను తాను భరిస్తానని, 50 వేల రూపాయలను ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు ప్రతి నెలా ఆమెకయ్యే ఖర్చును తాను భరిస్తానన్నారు. ఇదిలా ఉండగా కృష్ణానగర్‌లో నివసించే దుర్గమ్మ కూతురైన సుబ్బలక్ష్మి, అల్లుడు రాజేష్ కుమార్ ‘సాక్షి’లో వచ్చిన దుర్గమ్మ కథనాన్ని చూసి తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా దుర్గమ్మను వెతకడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆమెను అభయ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారని తెలుసుకొని, ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి మెహిదీపట్నంలోని ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ఐదు నెలల క్రితం తన తల్లి దుర్గమ్మ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిందని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. అయితే అదే సమయంలో తన కూతురు పెళ్లి కావడంతోపాటు తన భర్త రామారావుకు యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాల పాలు కావడంతో కొంత అశ్రద్ధ చేశామన్నారు. తన తల్లి గత 20 ఏళ్ల నుంచి తన దగ్గరే ఉంటుందని, ఇక నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని, కన్నీటి పర్వమయ్యారు. ఫౌండేషన్ సభ్యులు దుర్గమ్మ కూతురుతో హామీపత్రం రాయించుకొని ఆమెతో పంపడానికి అంగీకరించారు. అయితే పూరి జగన్నాథ్ భార్య లావణ్య స్వయాన తన కారులో ఇబ్రహీంపట్నంలోని ఆశ్రమానికి కారును పంపించి వృద్ధురాలు దుర్గమ్మను కృష్ణానగర్‌లోని సుబ్బలక్ష్మి ఇంట్లో దించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ భార్య లావణ్య మాట్లాడుతూ.. తనకు సమాజ సేవ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని, తన భర్త ప్రోత్సాహంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నానన్నారు.