పరిమళించిన మానవత్వం
- ‘రోడ్డున పడ్డ బంధం’ కథనానికి విశేష స్పందన
- వృద్ధురాలిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మానవతామూర్తులు
- ఆశ్రయమిస్తామన్న అభయ ఫౌండేషన్
- చేయూతనిస్తానన్న పూరి జగన్నాథ్ సతీమణి
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ‘రోడ్డున పడ్డ బంధం’ పేరుతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వృద్ధురాలి కథనంపై మానవతావాదులు విశేషంగా స్పందించారు. వృద్ధురాలిని ఆదుకునేం దుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. సమాజంలో ఇంకా కొంతమంది మానవతామూర్తులున్నారని రుజువు చేశారు. కథనానికి స్పందించిన అభయ ఫౌండేషన్ చైర్మన్ మేడ నర్సింహులు వెంటనే ఫౌండేషన్ కార్యదర్శి బాలచంద్ర, కిరణ్‌కుమార్‌లకు ఫోన్ చేసి ఆమెను చేరదీయాలని చెప్పడంతో.. ఫౌండేషన్ సభ్యులు సుందరయ్య విజ్ఞానకేంద్రానికి సాక్షి దినపత్రికను పట్టుకొని ఆమెను వెతుక్కుంటూ వచ్చారు.
వృద్ధురాలిని తమ వెంట రావాలని కోరుతున్న తరుణంలోనే.. ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య సైతం ఆమెను ఆదుకోవడానికి అదే సమయంలో అక్కడికి వచ్చారు. దీంతో అభయ ఫౌండేషన్ సభ్యులు, లావణ్య కలిసి వృద్ధురాలు దుర్గమ్మను ఇబ్రహీంపట్నంలోని ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అయితే లావణ్య ఆమెకయ్యే ఖర్చులను తాను భరిస్తానని, 50 వేల రూపాయలను ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు.
అంతేకాదు ప్రతి నెలా ఆమెకయ్యే ఖర్చును తాను భరిస్తానన్నారు. ఇదిలా ఉండగా కృష్ణానగర్‌లో నివసించే దుర్గమ్మ కూతురైన సుబ్బలక్ష్మి, అల్లుడు రాజేష్ కుమార్ ‘సాక్షి’లో వచ్చిన దుర్గమ్మ కథనాన్ని చూసి తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా దుర్గమ్మను వెతకడం ప్రారంభించారు. అయితే అప్పటికే ఆమెను అభయ ఫౌండేషన్‌కు తీసుకొచ్చారని తెలుసుకొని, ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి మెహిదీపట్నంలోని ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లారు.
ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ఐదు నెలల క్రితం తన తల్లి దుర్గమ్మ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిందని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని తెలిపారు. అయితే అదే సమయంలో తన కూతురు పెళ్లి కావడంతోపాటు తన భర్త రామారావుకు యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాల పాలు కావడంతో కొంత అశ్రద్ధ చేశామన్నారు. తన తల్లి గత 20 ఏళ్ల నుంచి తన దగ్గరే ఉంటుందని, ఇక నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని, కన్నీటి పర్వమయ్యారు.
ఫౌండేషన్ సభ్యులు దుర్గమ్మ కూతురుతో హామీపత్రం రాయించుకొని ఆమెతో పంపడానికి అంగీకరించారు. అయితే పూరి జగన్నాథ్ భార్య లావణ్య స్వయాన తన కారులో ఇబ్రహీంపట్నంలోని ఆశ్రమానికి కారును పంపించి వృద్ధురాలు దుర్గమ్మను కృష్ణానగర్‌లోని సుబ్బలక్ష్మి ఇంట్లో దించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ భార్య లావణ్య మాట్లాడుతూ.. తనకు సమాజ సేవ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమని, తన భర్త ప్రోత్సాహంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నానన్నారు.