చరిత్ర వలెనె సాహిత్య చరిత్ర కూడా ఎప్పటికప్పుడు ఉపాంతీకరణకు గురైన భిన్న సామాజిక వర్గాల క్రియాశీల శక్తి సామ ర్థ్యాలనూ, సృజన విమర్శ శక్తులనూ సమీకరించి, చేర్చుకొంటూ సమగ్రం కావాల్సిందే. అలా తెలుగు సాహిత్య చరిత్ర స్త్రీల, దళిత బహుజనుల, ముస్లిముల సాహిత్యంతో 1980ల నుండి చెతన్యవంతంగా సంపద్వంత మవుతూనే ఉంది. ఈ చరిత్రలో భాగంగానే ‘విరసం’ ఇప్పుడు ‘వియ్యుక్క’ అనే పేరుతో ఆరు కథా సంకలనాలు ప్రచురిస్తున్నది. ‘‘ఈ సంకలనాల్లో చేరిన కథలు అజ్ఞాత మావోయిస్టు ఉద్యమంలో పని చేసి అమరులైనవారూ, కొనసాగుతున్నవారూ, అరెస్టయినవారూ, ఏ ఇతర కారణాల వల్లనైనా కొంత కాలం పని చేసి బయట ఉన్నవారూ రాసిన కథలు’’ అంటారు సంకలనాల సంపాదకు రాలు బి. అనురాధ. ఆ రకంగా అటు విప్లవ సాహిత్యంలోనూ ఇటు స్త్రీల సాహిత్యంలోనూ ఇది ఒక చారిత్రక ఘట్టం.
2007 నుండి అజ్ఞాత రచయిత్రుల కథల సేకరణ చేస్తూ వచ్చిన అనురాధ స్త్రీల పేర్లతో ఉన్న కథలు అన్నీ స్త్రీలు రాసినవో కావో నిర్ధారించుకొనటానికి, ఒక రచయిత్రి ఎన్ని కలం పేర్లతో రాసిందో గుర్తించిఒక పేరును ఖరారు చెయ్యటానికి అనుసరించిన పద్ధతులు చాలాఆసక్తికరమైనవి. మహిళా ఉద్యమంతో తనకు ఉన్న సంబంధంతో పాటు, ఈ కథల గురించి విరసం ప్రకటనకు ఆ రచయిత్రులుస్పందించి పత్రికా ముఖంగా ఇచ్చిన వివరాలు కూడా ఈ పనికి ఉపకరించాయి అంటుందామె. ‘వియ్యుక్క’ గోండీ భాషాపదం. వేగుచుక్క అని దాని అర్థం.ఇందులోని 282 కథలు 52 మంది మహిళా విప్లవకారులు రాసినవి.
స్త్రీల కథాసంకలనాలు ఎన్నో వచ్చాయి గానీ ఒక రాజకీయార్థిక సామాజిక అవగాహన కలిగిన 52 మంది స్త్రీల సంకలనాలు మాత్రం ఇప్పటికి ఇవే. వ్యక్తులుగా ఎవరు ఎన్ని కథలు రాశారన్నది చెప్పటం ఈ సంకలనాల ఉద్దేశం కాదు. ఒకటి రెండు కథలు రాసినవాళ్లు కూడా ఇందులో ఉన్నారు. విప్లవ జీవితం అందరికీ సమష్టి అనుభవం. ఆ అవగాహన నుండే విప్లవోద్యమంలో వచ్చిన పరిణామాన్ని స్త్రీల అనుభవ కోణం నుండి నమోదు చేయటం ఈ సంకలనాలకు లక్ష్యం. ఆరు సంకలనాలలో మొదటి మూడు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మొత్తం ఈ 146 కథలకు విప్లవోద్యమమే వస్తువు.
సొంత కుటుంబాలు, ఆస్తులు, పేర్లు – అన్నీ వదులుకొని శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం, ఉత్పత్తి సంబంధాలలో మార్పు కోసం, ఉన్నత మానవీయ విలువలతో నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళ అనుభవ కథనాలు ఇవి. ఈ కథలకు వస్తువైన జీవిత సందర్భాలు, శకలాలు భిన్నం కావచ్చు. కానీ సాధారణ ప్రజల అసాధారణ ధిక్కారం ఈ అన్ని కథలకూ అంతః సూత్రం. ఆచారాలు, రివాజులు, దోపిడీ, పీడన, రాజ్యం, దాని అణచివేత, సామ్రాజ్యవాద చొరబాటు వంటివన్నీ ఈ కథల సాధారణ అంశం. దాని సారం క్రియాశీల సౌందర్యం. ప్రాణాలు పణం పెట్టే సంసిద్ధత, మృత్యువుతో క్రీడలు, వీటన్నిటి దుఃఖోద్వేగాలు ఈ కథల ప్రత్యేకత.
ఇవన్నీ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వ ప్రేమగా ఈ కథలలో ఆవిష్కృతమయ్యాయి. గనుల తవ్వకాలకు అడవులను ఆక్రమిస్తున్న బహుళ జాతి కంపెనీ లకు మద్దతును ఇచ్చే ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు ఆదివాసీల నిర్వాసితత్వానికి ఉన్న సంబంధాన్ని మానవ సంబంధాలలో భాగంగా అర్థం చేయించే సోయి, ‘సీతాబాయి గెలుపు’, ‘లక్ష్మణరేఖ’ వంటి కథలు ఎన్నో ఇందులో ఉన్నాయి. విప్లవోద్యమం మనుషులను అన్య వర్గ, ఆధిక్య భావన నుండి విముక్తం చేసి కొత్త మనుషులుగా మారు స్తుందని ‘చాయ్ గ్లాస్’ (2012) కథ చెప్తుంది. అహంకారాన్నీ, అధికా రాన్నీ వదులుకొంటూ ఎదుటివాళ్లను వినగలిగిన, వాళ్ళ నుండి నేర్చు కొనగలిగిన సంసిద్ధత విప్లవ సాంస్కృతిక పర్యావరణంలోనే సాధ్య మని ‘ఇద్దరు శస్త్రకారులు’ కథ నిరూపిస్తుంది.
ఎన్‌కౌంటర్ అయిన పిల్లల శవాల కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లులు... మరణించిన బిడ్డలందరి కోసం తల్లులందరి గర్భశోకాన్ని మోసేవాళ్ళు కావటం, ఆ బిడ్డలకు అంత్యక్రియలు గౌరవకరంగా జరగాలనుకొని తమ కడుపున పుట్టకపోయినా ఒడిలోకి తీసుకొని బిడ్డలుగా ప్రకటించే చైతన్యవంతులు కావటం అత్యంత సహజంగా చిత్రితమైన కథలు ‘ఈ శోకం ఎందరిది’, ‘నాబిడ్డనే’, ‘ముగ్గురు తల్లులు’. వాళ్ళు విప్లవ విశ్వమాతలుగా ఎదిగినవాళ్లు. మాతృత్వం విప్లవ మాతృత్వంగా ఆకాశమే హద్దుగా వ్యాపించటం ఈ కథల విశిష్టత. మావోయిస్టుల కార్యకలాపాల గురించీ, దళ జీవితం గురించీ, గిరిజనులకు వాళ్లకు ఉండే సంబంధాల గురించీ పత్రికలలో వచ్చే పాక్షిక కథనాలూ, వక్రీకరణలూ, వాటి వల్ల కలిగే దురభి ప్రాయాలనూ దాటి ఇతిహాసపు చీకటి కోణం అడుగున పడి కనిపించని వాస్తవాల వైపు మన చూపు తిప్పే ఈ కథలు తప్పక చదవవలసినవి.
వ్యాసకర్త ప్రరవే కార్యదర్శి, తెలంగాణ
(ఈ 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో ‘వియ్యుక్క’ కథా సంకలనాల ఆవిష్కరణ)
Comments
Please login to add a commentAdd a comment