సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం.
ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్‌ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు.
అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి.
తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది.
18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్‌కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే.
‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం.
ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం.
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
(నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి)
Comments
Please login to add a commentAdd a comment