కుమావ్ పర్వతాలని ఆధారంగా చేసుకుని, నమితా గోఖలే రాసిన హిమాలయన్ ట్రయోలొజీకి ఆఖరి భాగం అయిన నవల, ‘థింగ్స్ టు లీవ్ బిహైండ్’. ఇది మూడు తరాల బ్రిటిష్ పాలకుల గురించీ, స్థానికుల గురించీ రాసినది. కథాకాలం 1840–1912.
మొదటి ప్రపంచ యుద్ధమప్పటి తిరుగుబాటు కాలం గురించి చెప్తూనే, ఒక చిన్న అస్పష్టమైన కథలాంటిది కూడా అల్లుతారు రచయిత్రి. ప్రధాన పాత్రల్లో ఒకరైన తిలోత్తమ(తిల్లీ)కి బంధువైన బద్రీ దత్ 1857 విద్రోహంలో ఉరితీయబడతాడు. తల్లి మరణిస్తుంది. ఈ రెండు కారణాల వల్లా తిల్లీకి 19 ఏళ్ళు వచ్చేవరకూ పెళ్ళి అవదు. దాంతో వెసులుబాటు దొరికి కొంచం చదువు అబ్బుతుంది. ఈ పాత్ర ద్వారా, 19వ శతాబ్దంలో స్వతంత్రంగా ఆలోచించే స్త్రీల కష్టాలని రచయిత్రి చూపిస్తారు. నైన్ చంద్‌తో పెళ్ళయ్యాక, తిల్లీ ఇంటిపనులు చేయడానికి ఇష్టపడదు. బద్రీ దత్ చెప్తూ ఉండే, ‘ఎప్పుడూ భయపడకు. నీకిష్టం అయినది కాక, నీక్కావలిసినది చెయ్యి’ అన్న సలహానే పాటిస్తుంటుంది.
తిల్లీ గర్భవతి అయినప్పుడు ఇంగ్లిష్ నేర్చుకోవడం వంటి పనులతో ఖాళీ లేకుండా ఉంటుంది. బొల్లితో పుట్టిన కూతురు దియొకీని తన కజిన్ తరిణికి దత్తతకిస్తుంది. భర్తకి రహస్య ప్రేమిక దొరుకుతుంది.
ఆధునిక ఆలోచనలూ, బ్రిటిష్ అమ్మాయి రోస్ మేరీ పట్ల ప్రేమా ఉన్న జయేష్ చంద్ పంత్‌తో దియొకికి పెళ్ళవుతుంది. అతను క్రైస్తవం పుచ్చుకుని, జయేశ్ జోనాస్ పంత్‌గా పేరు మార్చుకుంటాడు. బ్రాహ్మణురాలైన తిల్లీ, కూతురి చేతుల్లో బైబిల్ కుక్కి, దియొకిని డియానాగా మార్చి, అల్లుడి వద్ద వదిలిపెడుతుంది. దేశంలాగానే కుమావ్ కూడా కల్లోలానికి గురయినప్పటి కాలంలో, అప్పటి కుమావనీ సూక్ష్మప్రపంచం కనబడుతుంది పుస్తకంలో. స్థానికులు– బ్రిటన్నీ భారతదేశాన్నీ వేర్వేరుగా చూసినప్పటికీ, వలసదారుల చపలత్వం పట్ల మాత్రం విధేయతతో ఉంటారు. ‘యూరోపియన్ల కోసమూ, గుర్రాల కోసమూ మీది మాల్ రోడ్డూ, కుక్కలకీ, నౌకర్లకీ, ఇతర భారతీయులకీ కేటాయించినది కింది మాల్ రోడ్డూ్డ’ అన్న నియమాన్ని ప్రశ్నించరు.
కథ ‘బ్రిటిష్ రాజ్’ కాలాన్ని కళ్లకి కట్టేలా చూపిస్తుంది. అప్పుడున్న కుల వ్యవస్థా, తెల్లవారికీ స్థానికులకీ మధ్యనుండే పరస్పర వైరాలూ, బ్రిటిష్ వారి జాత్యహంకారం, ఆ కాలంలో స్త్రీల పరిస్థితీ, గుడ్డినమ్మకాలూ, స్వాతంత్య్ర పోరాటం గురించీ రాసిన ఈ నవల ఆసక్తికరంగా సాగుతుంది. బ్రిటిష్ కాలవ్యవధిని అనుసరిస్తూ– విషయాలకి ఒక ప్రామాణిక అర్థాన్నీ, చారిత్రకతనీ ఆపాదించడానికి నమితా గోఖలే– పదాల, స్థలాల అక్షర క్రమాలని అలాగే ఉంచారు. ఉదా: ‘నైనీతాల్’.
ఇది చారిత్రక రూపంలో ఉన్న కాల్పనిక నవల. పుస్తకపు రెండవ భాగం ‘మోడర్న్ టైమ్స్’లో మరింత ఉత్తరదేశపు చరిత్ర ఉంటుంది. ఈ భాగానికీ, ఆఖరిదైన మూడవ భాగానికీ మధ్యన–అనవసరమైన పాత్రలూ, వివరాలూ, పిట్టకథలూ అస్తవ్యస్తంగా పరిచయం చేయబడతాయి. ఈ పుస్తకం వచ్చినది నవంబర్ 2016లో. అక్టోబర్ 2017లో రచయిత్రికి అసోమ్ సాహిత్య సభలో మొట్టమొదటి ‘సెంటినరీ అవార్డ్ ఫర్ లిటరేచర్’ అవార్డ్ ప్రదానం చేశారు.
- క్రిష్ణవేణి
Comments
Please login to add a commentAdd a comment