Literature News
-
దేవభూమి
గతేడాది డిసెంబర్ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్ నాయర్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్ నాయర్‌కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్ నాయర్ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్స్కీ లాంటి రష్యన్ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో! ‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19ని అక్కడ ‘రీడింగ్ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్‌లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్ రూములు ఉన్నాయి. వాసుదేవన్ నాయర్, వైకోం మహమ్మద్ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! -
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
జీవితపు తాళంచెవి
‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలో ‘స్ఫింక్స్’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! ‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! -
యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్‌గా యంగ్ రైటర్స్
రచన, సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకుంటే చాలు.. మన భవిష్యత్ ప్రయాణ మార్గాన్ని, అత్యుత్తమ లక్ష్యాలకు అదే చేర్చుతుందని ప్రముఖ సాహిత్యకారులు చెప్పే మాట. ఆనాటి తరం యువ రచయితలకు సాహిత్యాభిలాష ఎంత వరకూ తోడ్పాటునందించిందో అటుంచితే.. ఈ తరం యువ రచయితలకు మాత్రం గౌరవ ప్రస్తానాన్ని ప్రసాదిస్తోంది. ఈ తరం యువత సాహిత్యంలో విశేషంగా రాణించడమే దీనికి నిదర్శనం. అధునాతన పంథాతో, వినూత్న ఆలోచనలతో, సామాజిక అంశాలను ప్రస్తుత భాషా అనుకరణ పరిమితుల్లో రచిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువ రచనలకు ఈ దశాబ్ద కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదీ యువ రచయితల కొత్త పుస్తకాలు, నవలలు, కథానికలు, కవిత్వ సంపుటిలు విరివిగా ప్రచురితమవుతున్నాయి. ఇందులోనూ వినూతనత్వం ఏంటంటే.. ఈ అభిరుచి ఉన్న యువ ఔత్సాహికులకు అటు సినిమా రంగంలో, ఇటు కంటెంట్ డెవలప్మెంట్ వేదికల్లో ప్రధాన్యత పెరగడం. ఈ సందర్భంగా వీరంతా సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. హైదరాబాద్ నగరం వేదికగా కొనసాగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్(National Book Fair) నేపథ్యంలో అటువంటి యువ సాహిత్య కారులను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రశ్నించే గొంతుకగా ఉండాలని..ర చన, సాహిత్యం అనేది నా ఆలోచనలను ప్రతిబింబించే సామాజిక వేదికలుగా భావిస్తాను. రాసే కథ అయినా, నవల అయినా సమాజహితమై, అసమానతలను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని భావిస్తాను. అందులో భాగంగానే ఎర్రమల్లెలు అనే పుస్తకం రాశాను. మ్యారిటల్ రేప్‌ల పై ఈ రచన రాశాను. సాధారణంగా మల్లెలు తెల్లగా ఉంటాయి. కానీ అవి ఎందకు ఎర్రగా మారాయనే నిజజీవిత సామాజిక అంశాన్ని ప్రస్తావించాను. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత అందరి ఆడవారి జీవితాలూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన లేకపోవడం దీనికి కారణం. నా పుస్తకానికి అన్ని వయసుల ఆడవారు, ముఖ్యంగా మగవారి నుంచి స్పందన లభిస్తోంది. నిజ జీవితంలో భార్యల విషయంలో భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంలో చాలా మంది రియలైజ్ అయ్యామని స్పందించడం చాలా సంతోషాన్నిచ్చింది. నేను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాను. ఆల్ ఇండియా రేడియోలో డ్రామాలు రాస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని కథలు, నవలలు రాయనున్నాను. – రోజా రాణి దాసరి స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో..మనుషుల్లోని సున్నితమైన భావోద్వేగాలైన ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి అంశాల్ని స్పృశిస్తూ రచనలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం ఈ ప్రపంచానికి వీటి అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగానే ‘సరిజోడి’ అనే స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఒక నవల రాశాను. సిటీలో కొనసాగుతున్న బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పాకిస్తానీ ముస్లిం అమ్మాయికి, హైదరాబాదీ వ్యాపారవేత్తకి మధ్య జరిగిన హృద్యమైన ప్రేమ కావ్యం. ఇది నా మొదటి నవల. భవిష్యత్తులో స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం నగరంలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఫిల్మ్ స్టడీస్ పై పీహెచ్డీ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో యువ రచయితల పుస్తకాలు పెరగడం సంతోషాన్ని ఇవ్వడంతో పాటు, పోటీతత్వాన్ని పెంచుతోంది. ఇందులో బాధ్యతాయుతమైన రచనలు, భాషను, సామాజిక, మానసిక విలువలను స్పృశించే రచనలు కూడా ఉండటం శుభపరిణామం. – దిలీప్. స్నేహితుల సహకారంతో..రచనల పరంగా 2012లో మొదలైన నా ప్రయాణం కేంద్ర యువ సాహిత్య అకాడమీ అవార్డు పొందే వరకూ సాగింది. మొదట్లో ఈ రచనా రంగంలోని స్నేహితుల సహకారంతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తరువాత ఆ కష్టాలను దాటుకుని అస్థిత్వం, కుల వృత్తులను, సామాజిక అంశాలను ప్రతిబింబించే కవిత్యం, కథలు రాశాను. నా రచనలు హిందీ, తమిళం, అస్సామీ, బంగ్లా వంటి భాషలతో పాటు ఫ్రెంచ్, స్పేయిన్ వంటి భాషల్లోకి తర్జుమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం సిలబస్ చేర్చడం కూడా మరింత సంతృప్తినిచ్చింది. ఈ ప్రయాణంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 లిటరరీ ఫెస్టివల్స్‌లో వేదిక పంచుకోవడం, ఈ వేదికల పైన జాతీయ, అంతర్జాతీయ సాహిత్యకారులను కలుసుకోవడం, వారి అనుభవాలను ఆలోచనలను పంచుకోవడం నా విజయాలుగా భావిస్తాను. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లిష్ కవిత్వం, కవిత్వ అనువాదం, మరో సంపాదకత్వంతో రానున్నాను. – రమేష్ కార్తీక్ మహిళా సాధికారత దిశగా..నా వృత్తి ప్రభుత్వ రంగ సంస్థలో మహిళా సాధికారత కోసం కృషి చేయడం. నా వృత్తిలో ఎదురైన అనుభవాలను ప్రవృత్తి అయినటువంటి రచనల ద్వారా సమాజానికి చేరువ చేస్తున్నాను. మొదటి సామాజిక సమస్యలపై కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం ఇసుక అద్దం. ఇది నా ప్రయాణానికి మంచి బాట వేసింది. ఈ మధ్యనే విడుదల చేసిన 2వ కథల పుస్తకం బల్కావ్ కూడా నా సామాజిక బాధ్యతను అక్షరాలుగా, పదాలుగా వివరిస్తుంది. ఒక సామాజిక అంశంపై లోతుగా పరిశోధించాకే, అందులోని నిజాలను నిక్కచ్చిగా చెప్పడానికే నా కలాన్ని వాడతాను. నా రచనలు నాకు సంతృప్తితో పాటు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురస్కారంతో పాటు, వాయిస్ ఆఫ్ తెలంగాణ వంటి అవార్డులు సైతం లభించాయి. ముఖ్యంగా 50 ఇన్స్పైరింగ్ ఉమెన్స్‌లో నాకు అవార్డు రావడం, దీని కోసం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకంలో నా గురించి ప్రచురించారు. మరికొన్ని అద్భుతమైన కథలతో రానున్నాను. – శ్రీ ఊహ(చదవండి: వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..? వింటే వెన్నులో వణుకురావాల్సిందే..!) -
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. సదస్సు ప్రారంభ సూచికగా మోహన రాగంలో త్యాగరాయ కృతి 'రామా నన్ను బ్రోవరా' కీర్తనను చిరంజీవి సమన్విత మాడా తన మధుర కంఠంతో పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ముందుగా దివంగతులైన టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు లావు రామకృష్ణ గారికి సభ్యులందరూ ఒక నిముషము మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.స్వాగతోపన్యాసం చేసిన పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సాహిత్య వేదికను ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డి పి అనురాధ గారి జీవిత విశేషాలను,అ ఖండ తెలుగుజాతి పూర్వాపరాలను తెలుసుకోవడానికి వారు చేస్తున్నఎనలేని కృషిని చక్కగా వివరించారు. ఇక సీనియర్ పాత్రికేయులు డి పి అనురాధ మాట్లాడుతూజజ తెలుగు జాతి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చదివిన తాను తన గురువు తల్లాప్రగడ సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలోనూ తన అత్తమామల ప్రోత్సాహంతోనూ దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి నేటివరకూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు జాతి వారి మూలాలను అన్వేషిస్తూ పరిశోధక దృష్టితో అనేక దేశాలు పర్యటించినట్లు తెలియచేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన తెలుగుజాతివారిని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు వారి భాషాభిమానం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం ఈ రోజుకి ఎలా గుబాళిస్తోందో తనదైన శైలిలో చక్కగా వివరించారు. శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా,ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు తిరిగిన తాను ఆయా ప్రదేశాల్లో తెలుగు వారి అడుగుజాడలను పరిశీలంచిన వైనాన్ని చక్కగా విశదీకరించారు. ఆయాదేశాల చారిత్రక స్థలాలలోనున్న స్థూపాలు, శాసనాలు పరిశీలించి, వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను, విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరించి అన్వయించి చెప్పారు. అలాగే వారి పూర్వీకులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి బతుకుతెరువు కోసం తప్పనిసరై ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వారి పూర్వీకులు కట్టిన గుడి గోపురాలు కట్టిన విధానం, వారి వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధృక్పథం తాను పరిశీలించడం జరిగిందన్నారు. వారి ఆచార వ్యవహారాల్లోనూ జీవన వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం మనం స్పష్టంగా చూడ వచ్చునన్నారు. ‘మన్’జాతిలో మనవాళ్ళను, థాయ్‌లాండ్ ‘చిమ్మయి’ పిల్లను,, ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకుల విశేషాలను, తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’ చంపాలో ‘భద్రేశ్వరుని’, అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి వారి పూర్వీకుల తపనల స్వరూప విశేషాలను అనూరాధ గారు వివరించారు. శ్రీలంకకు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చక్కగా వివరిస్తూ కొన్ని చోట్ల తాను ''మీరెవరు'' అని పలకరించిన వెంటనే ప్రతివారు తమ సమాధానంగా ''అక్కా ''అంటూ ప్రతిస్పందించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయాప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న తెలుగు వారు తమ భాషా సంస్కృతిని కాపాడుకొంటూ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు ఆంధ్రా ప్రాంతమునుంచి ''తలైవా '' అంటే ''తెలుగు మాట్లాడే గౌరవప్రదమైన నాయకుడు'' తప్పకుండా వస్తారనీ వారు తమ ఉనికిని గుర్తిస్తారనే ఆశతో బ్రతుకుతునారని వారి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు. తమిళ జాతి వారితో కలిసి మన తెలుగు వారు నివసిస్తున్న చోట్ల సింహ పురి, దంతపురి పేర్లతో పిలువ బడే నగరాలుండేవని పేర్కొన్నారు. అలాగే ,''విమల''''విజయ''అనే పేరుతో పిలువబడేవారు.. చాలా చోట్ల కనిపించారని, కొన్ని చోట్ల మన తెలుగువారు తమ వారిని ఇంటిలో తెలుగు పేరుతోనూ బయట పని చేసేచోట తమిళ పేరుతోనూ పిలుచుకుంటున్నట్లు చెప్పారు. ఈ విధానాన్ని పాటిస్తున్న వైనం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో తెలుగు వెలుగుని దేదీప్యమానం చేసే అఖండ తెలుగుజాతి విశేషాలను తాను శోధించిన పలు అంశాలను అనూరాధ గారు సోదాహరణంగా వివరించి సాహితీప్రియుల నుండి విశేష అభినందనలు అందుకొన్నారు.గత 79 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ''మన తెలుగు సిరి సంపదలు''శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. తర్వాత ప్రముఖ సాహితీ విమర్శకులు లెనిన్ వేముల పలనాడు జిల్లా మాచర్ల కేంద్రంగా జన చైతన్య సాహిత్య విస్తృతికి విశేషంగా పాటుపడి, పౌరహక్కుల ఉద్యమాలకు 70వ దశకం నుండి 30 యేళ్ళ సుదీర్ఘ కాలంగా వెన్నంటి నిలిచి, చివరి వరకూ నమ్మిన విలువలకు కట్టుబడి జీవించి నాయకత్వ కుశలతతో ఎందరినో ఉత్తమ ఆశయాల వైపు ఆకర్షింపజేసి గతవారం కన్నుమూసిన కామ్రేడ్ రామినేని సాంబశివరావు కోసం అలనాటి విప్లవ గేయాలనెన్నో ఆలపించి అంజలి ఘటించారు.తరువాత సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా 2024 సంవత్సరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ మున్నెన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుల విశేషాలనూ ప్రధాన వక్తలైన ముఖ్య అతిథుల ప్రజ్ఞా పాటవాలను ''సింహావలోకనం''లో ఒక్కొక్క నెల వారీగా చక్కగా వివరించారుసంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిన్న సత్యం వీర్నాపు , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ బండ, మూలింటి రాజ శేఖర్ , మాధవి సుంకిరెడ్డి , భాను, కొల్లారపు ప్రకాశరావు శర్మ, గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు డి పి అనురాధ గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు సంస్థ పాలక మండలి సభ్యులు, సమన్వయ కర్త దయాకర్ మాడ ముఖ్య అతిథి డి పి అనురాధ గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డి పి అనురాధ తన ప్రతిస్పందనలో కృతజ్ఞతను వెలిబుచ్చారు.చివరగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు. (చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్..!
వింటర్ సీజన్ జైపూర్ లో ఉండటానికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఉదయం పొగమంచుతో, పగలంతా ఎండ, సాయంత్రం నగరం అందించే కళలను ఆస్వాదించడానికి తగినంత చల్లగా ఉంటుంది. అందుకు తగినవిధంగానే జైపూర్ ఈ వింటర్లో కళ, సంస్కృతి, వారసత్వ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ’కుంభ్ ఆఫ్ లిటరేచర్’గా పరిగణించబడే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో రచయితల సెషన్ కళాత్మకంగా జరుగుతుంది. ఇక జైపూర్ ఆర్ట్ వీక్‌లో ఎగ్జిబిట్లు, ఇన్స్టాలేషన్ల ద్వారా వర్ధమాన కళాకారుల తెలుసుకోవచ్చు. లిటరేచర్ ఫెస్టివల్ 2025టీమ్‌వర్క్ ఆర్ట్స్ రచయితలు, ఆలోచనాపరులు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, వినోదకులు, సాంస్కృతిక చిహ్నాల ఆసక్తిని పరిచయం చేస్తుంది. జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్లోని ఐదు రోజుల ఉత్సవంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. దేశ విదేశాలకు చెందిన రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా వివిధ కళారూ΄ాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రాంగణంలో జైపూర్ కళాకారులు చిత్రించిన కుండలు, అప్లిక్ ఎంబ్రాయిడరీ విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటి తయారీ కళ, వాస్తుశిల్పం, జైఘర్, రాజస్థాన్ కోటల చరిత్ర, జైపూర్ నగర దృశ్యాలు, వారసత్వం, భారతదేశ అసంఖ్యాక చరిత్రలు, ప్రశంసలు పొందిన వక్తలు, రచయితలు, చరిత్రకారులతో కూడిన సెషన్లో కళలను ఆస్వాదించవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. జానపద కళా రూపాలుఆవాజ్ స్టూడియోచే నిర్వహించే ఆర్ట్స్, డిజైన్ ఈవెంట్ ఏఐఊఖీ. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఎదుగుతున్న అట్టడుగు నేపథ్యాలను అన్వేషించే పాటలకు ప్రసిద్ధి చెందిన ఇండీ కళాకారుడు రాహ్గీర్ను ప్రదర్శించే మూడు రోజుల పండుగ. డిసెంబర్ 20న ్ర΄ారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో రాష్ట్రంలోని జానపద కథల పరిణామం ఇక్కడ చూడచ్చు. హ్యాండ్–బ్లాక్ ప్రింటింగ్, కుండల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ల, మూడు రోజులలో రాజస్థాన్ హస్తకళల సొగసును చూడచ్చు. మాస్టర్ కల్బెలియా కళాకారులచే 500 మందికి పైగా జానపద నృత్యంలో పాల్గొంటున్నారు. కళల ప్రదర్శనపబ్లిక్ ఆర్ట్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PAT)చే నిర్వహించే, ఒఅగి 4.0 వారం రోజులపాటు ఆర్ట్ వీర్ జరుగుతుంది. ఆ కార్యమ్రంలో ప్రదర్శనలు, వర్క్‌షాప్‌ల నిర్వహణ కోసం నగరంలోని వర్ధమాన కళాకారులు తమ చేయూతను అందిస్తున్నారు. దేవుళ్లు, రాక్షసులు, ఆలయ పెయింటింగ్‌లు, జానపద కథలను వీటిలో రూపొందించారు. ఆర్కిటెక్చరల్ ఆర్టిస్టుల బృందం ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో పెద్ద ఎత్తున ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌ను ఆవిష్కరిస్తుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ఆర్ట్ వీక్ జరుగుతుంది. వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్ -
గాయక సార్వభౌముడు
భారతీయ సంగీత పండితుల్లో ఒకరు. త్యాగరాజస్వామి శిష్యపరంపరలో మూడవ తరానికి చెందినవారు. సాక్షాత్తు త్యాగరాజస్వామి శిష్యుడూ, తంజావూరులోని మానాంబుచావడి గ్రామ నివాసీ అయిన ఆకుమడుల వెంకట సుబ్బయ్యకు శిష్యుడైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి శిష్యులే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. దక్షిణామూర్తి శాస్త్రి వద్ద తన సంగీత శిక్షణ కొనసాగించి గాయకుడిగా, వాయులీన విద్వాంసునిగా అసమాన ప్రతిభ గడించారు. తెలుగు నేలపై శాస్త్రీయ సంగీత పునరుజ్జీవనానికి మూలపురుషులయ్యారు.ఆయన 1882 డిసెంబర్ 5న కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో జన్మించారు. సంగీత సంప్రదాయాన్ని తన ఆసీస్వరాలతో మనసా, వాచా, కర్మణా... జాతి, కుల, మత వర్గ విభేదాల కతీతంగా శిష్యకోటికి ప్రసాదించారు. విజయవాడను కేంద్రబిందువుగా చేసుకొని శాస్త్రీయ సంగీత ప్రాచుర్యానికి పునాదులు వేశారు. శిష్యుల సంగీత అధ్యయనం, సాధనలతో నిత్యమూ గురుకులం కళకళలాడుతుండేది. అన్ని వర్గాలవారు ఈ గురుకులంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు అందుకొని శ్రద్ధగా సంగీతం నేర్చుకొని వృద్ధిలోకి వచ్చారు. పంతులుగారి శిష్యులు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గురువుగారి గురించి చెబుతూ ‘వారు పాఠం చెప్పే తీరు, పాడే తీరుకూడా నేర్చుకునేవారికి సుబోధకంగానూ, మార్గదర్శకంగానూ ఉండేది. వారు కచేరీలలో రాగం పాడినా, నెరవు చేసినా, స్వర ప్రస్తారం చేసినా ప్రతి విషయం నమూనాలుగా భాసించేవి’ అన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, నేతి శ్రీరామ శర్మ, టి.కె. యశోద దేవి, జి. వి. రామకుమారి వంటివారు ఆయన శిష్యులే. పారుపల్లివారు మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల సంఘంలో సభ్యుడుగా చాలాకాలం పనిచేశారు. తిరువాయూరులోని త్యాగబ్రహ్మ ఆరాధన ఉత్సవ కార్యక్రమ నిర్వాహక సభ్యునిగా ఉన్నారు. ఆ రోజులలో కొలంబియా గ్రామఫోన్ కంపెనీ అయన కార్యక్రమాలను రికార్డు చేసింది. పంతులుగారి కృషి, ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో ప్రప్రథమంగా ఆకాశవాణి కేంద్రం, తదుపరి సంగీత కళాశాల ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అనేక బిరుదులూ, పురస్కారాలు అందుకొన్నారు. 1915 ప్రాంతములో మద్రాసు గవర్నర్ లార్డ్ పెంట్లాండ్ తెనాలి వచ్చినప్పుడు పంతులుగారి వేణుగానాన్ని విని తన్మయత్వం చెంది సువర్ణపతకం బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్తు వారు ‘భారతీ తీర్థోపాధ్యాయ’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. 1951 జూలై 7న ఏకాదశి పర్వదినాన గురువులు దక్షిణామూర్తిశాస్త్రి ఆరాధనోత్సవాలు జరుపుతున్న వేళ సంగీత సరస్వతి ఒడికి చేరుకున్నారు. భారతీయ సంగీతం ఉన్నంత వరకూ ఆయన పేరు నిలిచి ఉంటుంది.– యనమండ్ర వేంకట కృష్ణయ్య ‘ 9849986679(విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి ఉత్సవాలు జరుగుతాయి.) -
దస్తాన్ హేమలత.. ఆవిష్కరణ
సాక్షి,ఢిల్లీ: ముప్పై ఎనిమిది భాషల్లో తన గాన మాధుర్యంతో సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని హేమలత జీవిత చరిత్రను ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ అరవింద్ యాదవ్ ‘దస్తాన్ హేమలత’ పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఆదివారం ఢిల్లీల్లో జరిగిన ‘సాహితీ ఆజ్‌తక్’ వేదికపై పలువురు ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.13 ఏళ్లకే తన గాత్రంతో అందరినీ మెప్పించిన హేమలత భాష,యాసతో సంబంధం లేకుండా భారతదేశంలోని అన్ని భాషల్లో పాటలు పాడి అందరిని మెప్పించారని డాక్టర్ అరవింద్‌యాదవ్ పుస్తకావిష్కరణ సభలో పేర్కొన్నారు. 1970–80 దశకంలో లతా మంగేష్కర్ లేదా హేమలత పాట లేనిదే సినిమాలు లేవని చెప్పారు. హేమలత సన్నిహితులకు కూడా తెలియని అనేక విషయంలో ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చని అన్నారు.ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో జన్మించిన హేమలత, తన బాల్యాన్ని కోల్‌కతాలో గడిపారు. ఆమె పాటలకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి. -
కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!
ఆవంత్స సోమసుందర్ స్వీయ చరిత్ర ‘కలలు–కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన రచన. ఎనిమిది దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంతో మమేకమైన ఒక మహాకవి మనసుతో వ్యక్తీకరిం చిన అరుదైన ఆత్మకథ. స్వాతంత్య్రోద్యమ పూర్వం నాటి పరిస్థి తులు మొదలుకొని ఆధునిక కాలంలో వెల్లువెత్తిన అనేక అభ్యుదయ ఉద్యమాలకు సోమసుందర్ ప్రత్యక్ష సాక్షి. అందుకేనేమో వజ్రాయుధ కవిగానే కాక విలక్షణమైన విమర్శకుడిగా, ‘కళాకేళి’ పత్రికా స్థాపకునిగా, కమ్యూనిస్టు ఉద్యమశీలిగా, అన్నింటినీ మించి నిరంతర స్వాప్నికుడిగా కలకాలం జీవించారు.కవులు జీవిత చరిత్రలు రాసి మెప్పించడం అరుదు. తెలుగులో ఆ సంఖ్య మరీ తక్కువ. అలాంటిది రెండు భాగాలుగా ఆత్మకథను రాసి... ముఖ్యంగా మొదటి భాగంలో అసాధారణ రచనా కౌశలాన్ని చూపిన ఘనత సోమసుందర్కే చెల్లుతుంది. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2005లో ‘కళాకేళి’ తరపున ప్రచురించిన ‘కలలు – కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా ఒక అద్భుతమైన అక్షర కళా శిల్పం.‘నాకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక... మొదటి జ్ఞాపకం మా అమ్మ... మలి జ్ఞాపకమూ మా అమ్మే. అందుకే మాతృవందనంతోనే దీన్ని ప్రారంభిస్తున్నాను. మా అమ్మే నిరంతర స్మృతి వీచిక... మా అమ్మ నన్ను విడిచి వెళ్ళకముందే నేను మా అమ్మను విడిచి వెళ్ళిపోయాను; దూరంగా... అనంతంగా... సుదీర్ఘమైన ఎడబాటుగా. బాట మారింది. ఉనికి మారింది. ఆశ్రయం మారింది. అమ్మా మారింది...’1924 నవంబరు 18న శంఖవరంలో పుట్టినప్పటికీ, బాల్యంలోనే దత్తునిగా పిఠాపురానికి వలస వచ్చిన పసి జ్ఞాపకాల్ని స్పృశిస్తూ ఆత్మకథలో సోమసుందర్ రాసిన ఆరంభ వాక్యాలు ఇవి. నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి ఎడబాటుకు లోనైన పసి హృదయం బహుశా ఆనాడే కార్చిన కన్నీటి ధారల్ని కవితా పంక్తులుగా మార్చే ప్రక్రియను అభ్యసించి ఉంటుంది. భవిష్యత్తులో శ్రామిక వర్గం తరఫున ప్రాతి నిధ్యం వహించే బలమైన వజ్రా యుధ కలం ఆవిర్భావానికి అంకురార్పణ ఆనాడే జరిగిందేమో!మూడొందల పుటల ‘కలలు–కన్నీళ్ళు’ ఆత్మకథ అంతా ఒకెత్తయితే, దీనికి సో.సు. రాసిన ఐదు పుటల ముందుమాట ఒకటీ ఒకెత్తు. రూసో మహాశయుడి మాట, ‘రెక్కల చేప కథ విప్పింది’అంటూ ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ కవులు, రచయి తలు, మేధావుల ఆత్మ కథలను స్థూలంగా పాఠకుడికి పరిచయం చేశారు. అలా చేస్తూనే స్వీయచరిత్ర రాయటం ఎంత కష్టమో వివరించారు. గాంధీ, నెహ్రూ వంటి నేతలు మొదలు వర్జీనియా ఉల్ఫ్, జీన్‌పాల్ సార్త్రే వంటి పాశ్చాత్య మేధావుల స్వీయ చరిత్రల్ని గురించి చెబుతారు. అవి కాక, ఏనుగుల వీరాస్వామి, కందుకూరి వీరేశలింగం, చలం వంటి వారి ఆత్మకథల గురించి కూడా తడుముతారు. ఇన్నింటిలోకీ సో.సు.ను ప్రభావితం చేసింది మాత్రం డామ్ మోరీస్ రాసిన ‘మై సన్స్ ఫాదర్’ అనే ఆత్మకథ. సోమసుందర్ అనితర సాధ్యమైన అధ్యయనశీలతకి ఈ మున్నుడే ఒక ప్రతీక. ముందు మాటకి ముగింపుగా సో.సు, ‘నా చేతిలోని లేఖినిని మృత్యువు తప్ప వేరెవ్వరూ అపహరించలేరని’ అంటారు. అలా అన్న మాటల్ని నిలుపుకొని 2016 ఆగష్టు 16న చివరి శ్వాస వరకూ విస్తృతమైన సారస్వత సేవ కావించిన అరుదైన ప్రజాకవి సోమసుందర్.అల్లూరి సీతారామరాజుకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబ నేపథ్యం నుండీ అల్లారు ముద్దుగా సంస్కృత శ్లోకాలు, సంగీత కచేరీలు, నాటకాలు, సినిమాలు, కౌమార ప్రేమ కలాపాలు... ఇలా ఒకటేమిటి ఎన్నో వర్ణాలు మనకి సో.సు. జీవితంలో కనబడతాయి. హైస్కూల్ విద్యార్థిగా స్టూడెంట్ యూనియన్ సభలకని కోల్ కతా వెళ్ళినప్పుడు హౌరా బ్రిడ్జి మీద చూసిన జీవచ్ఛవానికి కలత చెంది నవ యువకుడు పట్టిన కలం, కట్టిన కవిత తెలుగు నేలమీద దశాబ్దాల పాటు వెల్లువలా సాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నినాదమై రగిలింది. ‘హే నిజాం పాదుషా, ఖబడ్దార్ !’ అని హెచ్చరించింది. నిషేధానికి గురై చరిత్ర సృష్టించింది.చదవండి: గల్ఫ్ వలస జీవిత సారం‘కవిత్వమూ, కమ్యూనిజమూ తప్ప మరే ధ్యాసా నాకు లేదు’ అని తన ఆత్మకథలో ప్రకటించుకున్న సో.సు. జీవితాన్ని ఆ రెంటికే అంకితం చేశారు. సుమారు ముప్పై మూడు భాగాల్లో ఎన్నెన్నో అపురూప విషయాల్ని నమోదు చేశారు. పిఠాపురం సంస్థానంలో సాహిత్య వాతావరణం మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన అభ్యుదయ కవిత్వోద్యమం వరకూ ఎంతో హృద్యంగా చెప్పారు. హైదరాబాదు కవి మిత్రుల నుండీ మద్రాసు మేధాసాంస్కృతిక స్రవంతి దాక, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి వారితో అనుభవాలు, మిత్రులతో చేసిన ఉత్తర భారత యాత్రా విశేషాలు... ఒక్కటేమిటి తన జీవన చిత్రంలోని గాఢమైన రంగులన్నిటినీ ఆత్మకథ రూపంలో పాఠక లోకానికి అందించారు సో.సు. అయితే, ఎందుకనో తెలీదు కానీ సోమసుందర్ స్వీయచరిత్రకి రావాల్సిన గుర్తింపు సాహితీ లోకంలో సైతం రాలేదు.చదవండి: వెనక్కి నడవమంటున్నారా?విశాలమైన పచ్చిక బయళ్ళ పైన పిండార బోసినట్లు ‘నా జీవితంలో మంచిపనులు ఎన్ని చేశానో అంతకు మించిన చెడ్డ పనులు చేశాను. అందుకే మంచి పనులు సవిస్తరంగా ఏకరువు పెట్టలేదు. చెడ్డపనులు మచ్చుకు కొన్నే చెప్పకుండా విడిచిపెట్టనూలేదు. అసలు జీవితం అంటే ఏమిటి? చెడ్డ పనులు రహస్యంగా చేసు కుంటూ పోవడం. మంచి పనులు తక్కువే అయినా బహి రంగంగా చేయడం...’ అని చెప్పుకున్న సోమసుందర్ ధైర్యాన్ని, పారదర్శకతను చదివి అంగీకరించి, స్వీకరించేందుకు కూడా కొంత సాహసం కావాలేమో అనిపిస్తుంది. బహుశా అందుకనే వృద్ధాప్యంలో డిక్టేట్ చేసి రాయించిన సో.సు. స్వీయచరిత్ర రెండో భాగం ‘పూలు, ముళ్ళు’ అంతగా కదిలించదు. ఏదో భారంగా రాసినట్టు సాగుతుంది. ఇదంతా ఒకెత్తయితే ఏకకాలంలో కవిగా, కార్య కర్తగా కూడా మసిలిన ఆయన కార్యదీక్ష ఒక్కటీ ఒకెత్తు. స్వాతంత్య్రం వచ్చే నాటికి జైల్లో శిక్ష అనుభవిస్తూ కూడా ఈ దేశంలో సోషలిజం కోసం నిబద్ధతతో కృషి చేసిన సో.సు. తర్వాత కాలంలో పూర్తిస్థాయి సాహితీవేత్తగా మారారు.ప్రజా చైతన్యమే లక్ష్యంగా సకల సాహితీ ప్రక్రియలను ప్రయోగించారు. లిటరరీ ట్రస్ట్ స్థాపించి ఎందరో యువకవుల్నీ, రచయితల్నీ పురస్కారాలతో ప్రోత్సహించారు. శతాధిక గ్రంథాల్ని రచించి తెలుగులో ఎన్నదగిన అభ్యుదయ దిక్సూచిగా భాసించారు. ఆయన స్పూర్తిని అందుకుని కొనసాగించగలగడమే మహాకవి ఆవంత్స సోమసుందర్‌కు మనం ఇచ్చే అర్థవంతమైన ఆత్మీయ నివాళి.- గౌరవ్ సామాజిక కార్యకర్త (నేడు ఆవంత్స సోమసుందర్ శతజయంతి) -
శతకాలు : చూడచూడ రుచుల జాడ వేరు
పద్యం తెలుగువారి ఆస్తి. మరో భాషలో లేని ఈ సాహితీశిల్పాన్ని తెలుగువారు తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. పండితుల కోసం, శిష్ట పాఠకుల కోసం ఛందోబద్ధ పద్యాలు ఉంటే పిల్లలూ పామరులూ చెప్పుకోవడానికి శతకాలు ఉపయోగపడ్డాయి. సులభంగా, సరళంగా ఉండే శతక పద్యాలు కాలక్రమంలో ఇంటింటి పద్యాలుగా మారి జీవన మార్గదర్శకాలు అయ్యాయి. వేమన పద్యం రాని తెలుగువాడు లేడన్నది నిన్నటి వరకూ నిత్యసత్యం.‘శతకం’ అంటే వంద అనే అర్థం. అలాగని శతకంలో కచ్చితంగా వంద పద్యాలే ఉండాలని లేదు. అంతకు మించి కూడా రాశారు. పద్యం చివర్లో ‘మకుటం’ ఉండడమే శతకాల విశిష్టత. ‘మకుటం’ అంటే కిరీటం. శతక పద్యంలో దీని స్థానం శిఖరాయమానం. పూర్వ మహాకవులే కాదు, ఇప్పటికీ ఎందరెందరో శతకాలు రాస్తూనే వున్నారు. తమ జీవితంలోని అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి, ఇష్టదైవాల గురించి, ప్రియమైన వ్యక్తుల గురించి, భావోద్వేగాల నుంచి వందల కొద్దీ శతకాలు పుట్టిస్తున్నారు.శతక పద్యాలకు నన్నయ ఆద్యుడంటారు. ‘బహువన పాదపాబ్ది... అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే పద్యాలు నన్నయగారి భారతంలోని ‘ఉదంకోపాఖ్యానం’లో ఉంటాయి. ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు ముగుస్తాయి. ఈ పద్యాలన్నీ వరుసగా ఉంటాయి. అలా పద్యంలో ‘మకుటం’ పురుడు పోసుకుందని చెబుతారు. శతక పద్యాలకు ఎవరు ఆద్యులు అనేది పక్కనపెడితే నన్నయ నుంచి నేటి వరకూ వందల సంవత్సరాల నుంచి శతకాలు బతుకుతూనే ఉన్నాయి, బతికిస్తూనే ఉన్నాయి.తెలుగు నేలపై ఎన్నో శతక పద్యాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ వేమన పద్యాలే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. బద్దెన కూడా అంతే ప్రసిద్ధుడు. ఆయన రాసిన సుమతీ శతకం తెలుగువారికి సుపరిచయం. అలాగే భర్తృహరి సుభాషితాలు సుప్రసిద్ధం. ‘సుభాషితాలు’ అంటే మంచి వాక్కులు అని అర్థం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని తెనిగించి మనకు అందించిన మహనీయులు ముగ్గురు. వారు ఏనుగు లక్ష్మణకవి, ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇక భక్త రామదాసు రాసిన దాశరథీ శతకం, మారన కవి రాసిన భాస్కర శతకం, ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, నృసింహకవి కలం నుంచి జాలువారిన శ్రీకృష్ణ శతకం, శేషప్పకవి రాసిన నరసింహ శతకం, కుమార శతకం, కాసుల పురుషోత్తమకవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం... ఇలా ఎన్నెన్నో శతకాలను, శతకకారులను చెప్పుకోవచ్చు. అన్నీ మణిమాణిక్యాలే, జీవితాలను చక్కదిద్దే రసగుళికలే.శతకాలు ఎందుకు నిలబడ్డాయి? అలతి అలతి పదాలతో లోకహితమైన సాహిత్య సృష్టి వాటిలో జరిగింది కనుక. సమాజంలోని దురాచారాలను, చాదస్తాలను, మూఢవిశ్వాసాలను మూకుమ్మడిగా ఖండిస్తూ జనానికి వాటిలో జ్ఞానబోధ జరిగింది కనుక. మానవ నైజంలోని విభిన్న రూపాల ఆవిష్కరణ జరిగి తద్వారా మేలుకొల్పు కలిగింది కనుక. ఫలితంగా సద్భక్తి భావనలు కలిగి, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యెడ మనుషులకు గౌరవ మర్యాదలు పెరిగాయి కనుక. నీతులు, లోకరీతులు తెలిశాయి కనుక. అందువల్లే జనులు వాటిని చేరదీశారు. తోడు చేసుకున్నారు. ఇలాంటి పద్యాలు మానసికంగా, శారీరకంగా వికసించే బాల్యంలో పిల్లలకు ఎంతో అవసరమని పెద్దలు భావించారు కాబట్టి శతకాలు నాటి కాలంలో బట్టీ వేయించేవారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య వేరయావిశ్వదాభిరామ వినుర వేమ – (వేమన )తాత్పర్యం : చూడడానికి ఉప్పు, కర్పూరం ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు. అట్లే, మనుషులంతా ఒకేరకంగా వున్నా, అందులో పుణ్యపురుషులు అంటే గొప్పవారు వేరు.అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్వడి గల యెద్దుల కట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ– (బద్దెన)తాత్పర్యం: మంచి జీతం ఇవ్వని యజమానిని నమ్ముకొని కష్టాలు పడేకంటే మంచి ఎద్దులను నమ్ముకొని పొలం దున్నుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకవచ్చు.ఇలా ఎన్నో పద్యాలను తలచుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే శతక పద్యాలు చదువుకోవాలి. శతకాలను బతికించుకుంటే అవి మనల్ని బతికిస్తాయి.– మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
సాహిత్య సందడి
సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్ మీట్ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావిడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్ ఫెస్టివల్స్ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్ ఫోకస్ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కుకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్ పురస్కార ప్రకటన. అక్టోబర్ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్ ఏసియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ‘ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్’ జరిగింది. గెస్ట్ ఆఫ్ హానర్: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్‌లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్ కోసం ఐదు నవలల షార్ట్ లిస్ట్ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి.పురస్కార ప్రకటన నవంబర్ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ ప్రకటించింది. విజేతలను డిసెంబర్ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్‌లో ‘ద డెహ్రడూన్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆరవ ఎడిషన్ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్ కపూర్, సల్మాన్ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.ఇక, ‘ముంబయి లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్’ను ఫోకస్ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది.‘ద మెటమార్ఫసిస్’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్ అమెరికా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్‌కు డిజిటల్ రిక్రియేషన్ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్ లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు డె్రçహాడూన్లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్ ఝా, సుజయ్ ఘోష్, హుస్సేన్ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు. లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్‌స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్ ఫెయిర్’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు. -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్ కమిటి గురువారం నోబెల్ పురష్కారాన్ని ప్రకటించింది. ఉత్తర కొరియా నుంచి సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్న తొలి మహిళ హాన్ కాంగ్.BREAKING NEWSThe 2024 #NobelPrize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.” pic.twitter.com/dAQiXnm11z— The Nobel Prize (@NobelPrize) October 10, 2024 హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. ఆమెకు సాహిత్య నేపథ్యం ఉంది. ఆమె తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. హాన్ కాంగ్ 1993లో మున్హాక్-గ్వా-సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. దీని ద్వారా కవయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేశారు. అనంతరం నవలా రచయిత్రిగా తన కెరీర్‌ను ప్రారంభించారామె. -
చిన్నారులపై జచింత నెత్తుటేరుల అవార్డ్ నాకొద్దు
తన ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక జీవితం గురించి లోతుగా రాయడమే కాదు పిల్లల ప్రపంచం గురించి కూడా రాస్తోంది కవయిత్రి జసింతా కెర్కెట్టా. ఎక్కడ చూస్తే అక్కడ వారై – విశ్వరూపమున విహరిస్తున్న ఈ కాలంలో పిల్లల కోసం జసింత రాసిన ‘జిర్హుల్’ అనే పుస్తకానికి ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్–2024’ అవార్డ్ ప్రకటించారు. పాలస్తీనాలో బాంబు దాడుల్లో మరణించిన, హింసకు గురవుతున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డ్‌ను జసింత తిరస్కరించింది.‘రూమ్ టు రీడ్ ఇండియా’ అనేది అక్షరాస్యత, లింగసమానత్వం... మొదలైన వాటిపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు ఏరోస్పేస్ దిగ్గజం ‘బోయింగ్’తో సంబంధం ఉంది అని ఆరోపిస్తూ తనకు ప్రకటించిన అవార్డ్‌ను జసింత కెర్కెట్టా తిరస్కరించింది. ‘బోయింగ్‌కు ఇజ్రాయెల్ సైన్యంతో 75 ఏళ్లుగా సంబంధం ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు ఆయుధాలను సరాఫరా చేసే కీలక సంస్థ అయిన బోయింగ్ ‘రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్’కు నిధులు అందజేస్తుంది’ అని జసింత తన తిరస్కరణ కారణాలపై ఆ ట్రస్ట్‌కు లేఖ రాసింది.‘ఆయుధాలతో పిల్లల ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు ఆయుధాల వ్యాపారం, పిల్లల సంరక్షణ ఏకకాలంలో ఎలా కొనసాగుతాయి?’ అని ఆ లేఖలో ప్రశ్నించింది జసింత.‘సాహిత్యంలో వైవిధ్యమైన, పిల్లల కోసం రాస్తే పుస్తకాలు తక్కువగా వస్తున్నాయి. బాల సాహిత్యానికి సంబంధించిన జిర్హుల్ పుస్తకానికి అవార్డ్ రావడం సరిౖయెనదే అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అవార్డ్‌ను స్వీకరించలేను’ అని చెప్పింది.ఈ తిరస్కరణ మాట ఎలా ఉన్నా ‘సాహిత్యానికి జసింత కెర్కెట్టా చేసిన కృషి విలువైనదిగా భావిస్తున్నాం’ అని స్పందించింది ‘రూమ్ టు రీడ్ ఇండియా’ ట్రస్ట్. ఇప్పుడు మాత్రమే కాదు సామాజిక కారణాలతో తనకు వచ్చిన కొన్ని అవార్డ్‌లను గతంలోనూ తిరస్కరించింది జసింత.ఉద్యమ నేపథ్యం...ఝార్ఖండ్‌లోని ఖుద΄ోష్ గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన జసింత మాస్ కమ్యూనికేషన్, వీడియో ్ర΄పొడక్షన్లో డిగ్రీ చేసింది. రాంచీలోని ఒక ప్రముఖ దినపత్రికలో పని చేసింది. కెరీర్ పరంగా ఎంత ముందుకు వెళ్లినా తన మూలాలను మాత్రం మరవలేదు. ‘ఆదివాసీ అండ్ మైనింగ్ ఇన్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఝార్ఖండ్’ పేరుతో అధ్యయన పత్రాన్ని వెలువరించింది.‘ఇండిజినస్ వాయిస్ ఆఫ్ ఆసియా’ అనే పరిశోధన పత్రానికి ఇండిజినస్ పీపుల్స్ ఫ్యాక్ట్ అవార్డు లభించింది. జర్నలిస్ట్‌గానే కాదు కవిత్వానికి సంబంధించి సృజనాత్మక రచనలతోనూ ఎన్నో అవార్డ్లు అందుకుంది. తన కవిత్వం విషయానికి వస్తే అది ఆకాశపల్లకిలో ఊరేగదు. జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఉంటుంది. గాయాలను గుర్తు తెచ్చుకునేలా ఉంటుంది. బూటకపు అభివృద్ధిని ప్రశ్నించేలా ఉంటుంది.జసింత మనోహర్‌పూర్‌లోని మిషినరీ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో తల్లి పుష్ప అనిమ తండ్రి చేతిలో తరచు హింసకు గురయ్యేది. మరచి΄ోలేని ఆ హింసాత్మక దృశ్యాలు తన కవిత్వంలో కనిపిస్తాయి. వ్యక్తిగత చేదు అనుభవాలే కాదు అభివృద్ధి పేరుతో ఆదివాసీ గ్రామాల్లో జరుగుతున్న విధ్వంసం కూడా జసింత కవిత్వంలో కనిపిస్తుంది.జసింత కెర్కెట్టా జర్నలిస్ట్ మాత్రమే కాదు సోషల్ యాక్టివిస్ట్ కూడా. బాలికల విద్యకు సంబంధించి ఎన్నో ఆదివాíసీ గ్రామాల్లో పనిచేసింది. ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ 20 సెల్ప్మేడ్ ఉమెన్’లో ఒకరిగా ఎంపిక అయింది.పిల్లల్లో సామాజిక చైతన్యం‘పిల్లలూ... మీరు ఎన్ని పువ్వుల గురించి విన్నారు? పూలన్నింటి గురించి తెలియనప్పుడు, కొన్ని పువ్వుల గురించి మాత్రమే తెలిసినప్పుడు... అవి మాత్రమే గొప్ప పుష్పాలూ, ప్రత్యేకమైన పుష్పాలూ ఎలా అవుతాయి? ఇవి మాత్రమే కాదు జిరాహుల్, జతంగి, సోనార్టి, సరాయ్, కోయినార్, సనాయ్ లాంటి ఎన్నో పూలు ఉన్నాయి’ అంటూ పది పువ్వుల గురించి జసింత కవిత్వం రాసింది. ఈ పువ్వుల గురించి ఎప్పుడూ వినని, ఎప్పుడూ చూడని పిల్లలు కూడా జసింత రాసిన కవిత్వం చదివి, పక్కన ఉన్న బొమ్మలు చూస్తే ఎక్కడ ఏ పువ్వు కనిపించినా ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈశ్వర్ ఔర్ బజార్, జసింతా కీ డైరీ, ల్యాండ్ ఆఫ్ ది రూట్స్‌తో సహా ఏడు పుస్తకాలు రాసింది. ‘జిర్హుల్’లో పువ్వుల ప్రపంచం కనిపించిన్పటికీ అది అణగారిన వర్గాల కోసం ప్రతీకాత్మకంగా రాసిన పుస్తకం. ఆదివాసీ సంస్కృతి ఆధారంగా చేసుకొని పిల్లల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెం΄పొందించడమే ఈ పుస్తక లక్ష్యం. గాజాలో పదహారువేల మందికి పైగా చిన్నారులు మరణించారు. నెత్తుటేరులు పారాయి. ఈ నేపథ్యంలో ‘రూమ్ టు రీడ్ యంగ్ రైటర్’ అవార్డ్‌ను జసింత తిరస్కరించింది. -
కృత్రిమ సంక్షిప్తం
పుస్తకం మొత్తం చదవనక్కరలేకుండా కేవలం అట్టల వెనుక ఉన్నది చదివి కూడా ‘సమీక్ష’ రాయొచ్చునని... సాహిత్య ప్రపంచంలో ఒక జోక్. చదవడానికి బద్దకించడం అనేది సర్వ మానవ సమస్య. మన సినిమా రూపొందుతున్నది దీని ఆధారంగానే కాబట్టి దీన్నొకసారి చదవమని ‘ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ’లో సినిమా నటుడి పాత్రధారికి దర్శకుడి పాత్రధారి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ నూరు పేజీల భారీ పుస్తకాన్ని చదవలేక, అందులోని సారాంశం ఏమిటో తన భార్యను చెప్పమంటాడు నటుడు. అలాంటివాళ్ల కోసమే కాబోలు, పుస్తకాలు సంక్షిప్తంగా రావడం మొదలైంది.కాలం తెచ్చిన మార్పుల్లో వేగం ఒకటి. దేనిమీదా ఎక్కువసేపు ఎవరూ నిలబడటం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. ప్రయాణ సాధనాలు పెరిగి జీవితం వేగవంతం కావడానికీ, పాఠకులు చదవడం తగ్గిపోవడానికీ సంబంధం ఉంది. ఆ పెరిగిన వేగానికి తగినట్టుగా పాఠకులను శ్రోతలుగా మార్చడానికి ఆడియో బుక్స్ మార్కెట్ ప్రయత్నించింది. గంటల తరబడి ఉండే నవలలు యథాతథంగా రికార్డు చేస్తే ఖర్చుతో పాటు అసలుకే మోసం రావొచ్చు. అలా పుట్టినవే అబ్రిడ్జ్డ్ ఆడియో బుక్స్. హెలెన్ కెల్లెర్, ఎడ్గార్ అలెన్ పో, డైలాన్ థామస్ లాంటివారి రచనలు అమెరికాలో తొలుదొలుత ఆడియో బుక్స్‌గా వచ్చాయి. అలాగే అచ్చు పుస్తకాలు ఎన్నో కుదించుకుని అందుబాటులోకి వచ్చాయి. అలా కుదించడం వల్ల కొత్త పాఠకులు సాహిత్యంలో అందుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఇలా వచ్చిన ‘ఏడు తరాలు’, ‘గాన్ విత్ ద విండ్’ లాంటి నవలల అనువాదాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి. ఎన్నో మేలిమి రచనలను ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రత్యేకించి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించింది. సచిత్ర బొమ్మల భారతం, సచిత్ర బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు మనకు తెలియనివి కాదు. పిల్లల కోసం, పిల్లలంత ఓపిక మాత్రమే ఉన్న పెద్దల కోసం ఎన్నో పుస్తకాలు ఇలా పొట్టిరూపాల్లో వచ్చాయి.పుస్తకాలను సంక్షిప్తం చేయడం దానికదే ఒక ఎడిటింగ్ స్కిల్. సారం చెడకుండా, టోన్ మారకుండా, ‘అనవసర’ వివరాలు లేకుండా కుదించడం చిన్న విషయమేమీ కాదు. రచయిత ఒక పదం వాడటానికి ఎంతగా ఆలోచిస్తాడో, దాన్ని తొలగించడానికి సంక్షిప్తకుడు అంతే గింజుకుంటాడు. అలాంటి రంగంలోకి కృత్రిమ మేధ జొరబడటమే ఇప్పుడు సాహిత్య లోకంలో సంచలనమైంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం జూలై నుంచి కొత్త ఏఐ యాప్ ‘మాజిబుక్’ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల క్లాసిక్ రచనలను కుదించడం ఈ యాప్ ప్రత్యేకత. మాబీ డిక్, ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో, క్రైమ్ అండ్ పనిష్మెంట్, డ్రాకులా, రాబిన్సన్ క్రూసో, ద త్రీ మస్కటీర్స్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద గ్రేట్ గాట్స్బీ లాంటి రచనలు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికం తెలుగులోకి అనువాదమైనవే. ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ ప్రారంభ వాక్యాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. ‘ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ద వరస్ట్ ఆఫ్ టైమ్స్.’ (‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’; రెండు మహానగరాలు– తెన్నేటి సూరి అనువాదం.) వీటిని, ‘ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ థింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాడ్’ (‘అదొక చాలా మంచి చాలా చెడ్డల కాలం’) అని ఏఐ కుదించిందని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు. సంక్లిష్టమైన వాక్య సంచయనానికి లోనుకావడం బౌద్ధిక వృద్ధికి కీలకం అంటారు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ కసాండ్రా జాకబ్స్. రచయితలు తమ పదాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటారనీ, ఏఐ సరళీకృతం చేయడంలో అవి నష్టపోతామనీ ఆమె చెబుతారు. కథకు సంబంధించిన అసలైన అంతరార్థం పోయి, అది తప్పుడు భావనకు దారితీయవచ్చని హెచ్చరిస్తారు. మరో రకమైన విమర్శ భాషకు సంబంధించినది. పొలిటికల్ కరెక్ట్‌నెస్, తటస్థ మాటల వాడుక పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే శిక్షణ పొందివుండే ఏఐ ‘సహజంగానే’ రచనలోని అసలు మాటల స్థానంలో బోలు మాటలు చేర్చవచ్చు. కొన్నింటిని వివాదాస్పదమైన అంశాలుగా అది చూడవచ్చు. దాంతో రచనలోని భావోద్వేగ తీవ్రతకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అయితే, ‘పుస్తకాలను, వాటి ఆలోచనలను ప్రజాస్వామీకరించడమే’ తమ మిషన్ అని మాజిబుక్ సమర్థించుకుంటోంది. ఆంగ్లం నేర్చుకుంటున్నవారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా డిస్లెక్సియా, తీవ్ర ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఇవి ఉపకరిస్తాయని చెబుతోంది.‘రోబో’ సినిమాలో ‘చిట్టి రోబో’ వందల పుస్తకాలను ఇట్టే స్కాన్ చేయగలుగుతాడు. పుస్తకాలు చదవాలి అనుకుంటూనే చదవలేకపోయే అందరి కల అది. తలగడగా పెట్టుకుంటే వాటికవే అక్షరాలు తలలోకి వెళ్లిపోతే బాగుంటుందని చిన్నతనంలో అనుకోనివాళ్లెవరు? అదంతా ‘కృత్రిమ’ ప్రపంచం. సహజ ప్రపంచంలో మనమే చదువుకోవాలి. సహజంగా చదవలేనప్పుడే కృత్రిమ సాయం అవసరం అవుతుంది. అయితే, రామాయణాన్ని ఆసాంతం చదవనూవచ్చు. కట్టె కొట్టె తెచ్చె అనేలా విషయమేమిటో తెలుసుకోనూవచ్చు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవడంలో అసలు విషయం మొత్తం రాదనేది రసజ్ఞులందరికీ తెలుసు. విందు భోజనం విందు భోజనమే, రుచి చూడటం రుచి చూడటమే! ఏది కావాలి అనేది మన మేధో కడుపును బట్టి నిర్ణయించుకోవడమే. కానీ ఓసారంటూ రుచి చూడటం కూడా విందు భోజనానికి ఉపక్రమించేలా చేస్తుందేమో! కాకపోతే ఆ రుచి ఆ విందుకు దీటుగా ఉండాలి. -
తొలి సాహిత్య నగరం కోజికోడ్.. యునెస్కో గుర్తింపు
దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్‌ను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. అక్టోబర్ 2023లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ (యూసీసీఎన్)కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.కేరళలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎంబి రాజేష్.. కోజికోడ్ సాధించిన విజయాన్ని ప్రకటించారు. కోల్‌కతా వంటి ఘనమైన సాంస్కృతిక చరిత్ర కలిగిన నగరాలను పక్కకునెట్టి, యునెస్కో నుండి కోజికోడ్ ‘సిటీ ఆఫ్ లిటరేచర్’ బిరుదును దక్కించుకుందని మంత్రి తెలిపారు.కోజికోడ్‌లో 500కుపైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కోజికోడ్‌లో ఉంటూ సాహిత్యరంగానికి ఎనలేని సేవలు అందించారు. యూసీసీఎన్‌లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశానికి చెందిన గ్వాలియర్, కోజికోడ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సంగీత విభాగంలో ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించుకోగా, కోజికోడ్ సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.యునెస్కో నుండి ఈ ఘనతను అందుకున్న ఇతర నగరాల్లో బుఖారా ‘క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్’ విభాగంలో, కాసాబ్లాంకా ‘మీడియా ఆర్ట్స్’ విభాగంలో, చాంగ్కింగ్ డిజైన్ విభాగంలో, ఖాట్మండు ఫిల్మ్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి. -
వాన జ్ఞానం
ప్రపంచమంతటా సృష్టిగాథలు ఒక్కలానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకనీ? వర్షాలు... క్షణం తెరిపివ్వని వర్షాలు... బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతర ధారాపాతాలు... ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ పుట్టాయి. భూమి పైకి తేలింది. జీవి పుట్టింది. మనిషితో సహా రకరకాల రూపాల్లోకి పరిణామం చెందింది. వర్షం పడుతూనే ఉంది కానీ, నిర్విరామం నుంచి విరామానికి మారింది. చెప్పొచ్చేదేమిటంటే, వర్షం సృష్టి అంత ప్రాచీనం; ప్రకృతి అంత పురాతనం. మనిషి పుట్టిన చోటనే ఎప్పుడూ లేడు కనుక భ్రమణజీవి; అంతకన్నా ఎక్కువగా భ్రమలజీవి. తను ప్రకృతిలో భాగమన్న సంగతి మరచి; తన జీవితానికి, తన నిర్ణయాలకు తనే కర్తనన్న భ్రమ వాటిలో ఒకటి. శీతోష్ణాలను మించి ఆ భ్రమను పటాపంచలు చేయగలిగింది వర్షాలే. మనం బయటికి వెళ్లడానికి సిద్ధమవుతాం. ఆకాశం మబ్బు పట్టి ఉన్నా వర్షం రాదులే అన్న భ్రమతో గడప దాటుతాం. చినుకుతో మొదలై చూస్తుండగానే ఆకాశానికి చిల్లిపడిందా అన్నంత ఉధృతితో వర్షం ముంచెత్తుతుంది. చెట్టు కిందికో, చూరు కిందికో, మరో కప్పు కిందికో పరుగుతీస్తాం. వర్షనిర్బంధం నుంచి బయటపడడానికి నిలువుకాళ్ళ తపస్సు చేస్తాం. మనలానే, మనపక్కకి ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరతారు. మాటలు కలుస్తాయి, ముచ్చట్లుగా మారతాయి, స్నేహాలను అల్లుకుంటాయి, ప్రేమలు మొలకెత్తుతాయి, అవి పెళ్లిళ్లకూ దారితీయవచ్చు. ఒక్కోసారి ఒకే ఒక్క వర్షం ఊహించని సన్నివేశాలను కల్పించి జీవితాలను పెద్దమలుపు తిప్పచ్చు. ప్రపంచ సాహిత్యంలో వర్షానుభవాన్ని చిత్రించని కథా, కావ్యం, నవలా దాదాపు ఉండవు. మనిషి బుద్ధిని బంకలా పట్టుకున్న మృగత్వం, కులమతాల భేదాలు, ధనిక, నిర్ధనిక తారతమ్యాలు, చదువు, అధికారంతో పుట్టే దుర్గర్వాలు సహా అన్ని రకాల మురికినీ, మకిలినీ కడిగి శుభ్రం చేసి మళ్ళీ మనిషిని చేయగల మంత్రజలం వర్షం. సమాజం గురించి మనుషుల గురించి నిశ్చితాభిప్రాయాల ఇరుకులో కరకుదేరిన అడ్వొకేట్ రావునూ, అతను చీదరించుకున్న బిచ్చగత్తెనూ ఒకచోటికి చేర్చిన పాలగుమ్మి పద్మరాజు కథ ‘గాలివాన’నే చూడండి. ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆ బిచ్చగత్తె ఆలింగనపు వెచ్చదనం అందించి అతనిలోని అరవయ్యేళ్ళ అజ్ఞానాహంకారాల జడలమర్రిని ఒక్క గాలివాన కూకటివేళ్ళతో కుప్పకూల్చింది. అతని బతుకు పలకను స్వచ్ఛజలాలతో పూర్తిగా ప్రక్షాళించి మానవత్వపు కొత్త ఓనమాలు దిద్దించింది. దాశరథి రంగాచార్య కథ ‘తామరపూలు’లో చిట్టిపంతులికి తామరలే లోకం. ఋతుభ్రమణం గురించిన జ్ఞానం లేని ఆ అబ్బాయి ఎండాకాలంలో అవి కనిపించకపోయేటప్పటికి కలవరపడిపోయాడు. వానలు పడి తిరిగి కనిపించేవరకూ వాటికోసం ఒక జీవితకాలపు నిరీక్షణ. అలా ప్రకృతిపాఠాల బోధనలో వాన జ్ఞానకళిక అయింది. సొగసుతోపాటు ప్రకృతిలోని లయను, సమవర్తనను, ఒక్కోసారి అవి కలిగించే విషాదం గురించిన ఎరుకను తట్టిలేపే కథ మహేంద్ర రచించిన ‘హొగినేకల్’. ఓ కుటుంబం ఆ కావేరి జలపాతాన్ని చూడడానికి చిన్న పాపను తీసుకుని వానను వెంటబెట్టుకుని వెళ్లింది. కావేరికి వరదెత్తి ఆ వరదలో పాప కొట్టుకుపోయింది. జీర్ణించుకోవడం కష్టమే కానీ; ‘ఇదే ప్రకృతి. ఇదే ప్రకృతిధర్మం. అది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు; దాని దృష్టిలో అన్నీ సమానం. సృష్టిని అంగీకరించే మనిషి, లయను కూడా అంగీకరిస్తే పెనుగులాట ఉండ’దంటుందీ కథ. వాన మన వ్యక్తిత్వాలకు, ఆలోచనలకు ఒక స్పష్టతనివ్వడానికి కూడా ఎలా నేపథ్యమవుతుందో కుప్పిలి పద్మ కథ ‘గోడ’ చెబుతుంది. ‘వాన. తూర్పు సముద్రపు కెరటాల నురగల మీద వాన. యారాడ కొండల గరిక మీద వాన. రుషికొండ ఎగుడుదిగుడుల మీద వాన...’ అని మొదలయ్యే ఈ కథలో స్వతంత్రభావాలు కలిగిన ఒక అమ్మాయి తనతో చదువుకున్న ఒక అబ్బాయి గదిలో ఆ వర్షపురాత్రిని గడపాల్సివస్తుంది. అతనిలో మగాడు నిద్రలేచి హద్దుమీరబోతే ఆ అమ్మాయి వారించి గట్టిగా బుద్ధి చెబుతుంది. మహమ్మద్ ఖదీర్ బాబు అద్భుతంగా పునఃకథనం చేసి సవ్యాఖ్యానంగా సంకలనం చేసిన ‘నూరేళ్ళ తెలుగు కథ’లో ఈ నాలుగు కథలూ చేరాయి. సహస్ర బాహువులతో జలఖడ్గాలు దూసి, ఉరుముల పెనుగర్జనలతో, మెరుపుల మిరుమిట్లతో వర్షం ఊరూవాడా ఆక్రమించుకుని జనాన్ని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు ఇంకెన్ని చిత్రవిచిత్ర సన్నివేశాలు ఏర్పడగలవో తిలక్ కథ ‘ఊరి చివరి ఇల్లు’ చెబుతుంది. అలాంటి ఓ వర్షపురాత్రి ఒక ఆగంతక యువకుని రాక దుఃఖపూరితమైన ఒక యువతి జీవితంలో కొత్త ఆశా, ఉత్సాహాల జడివానగా మారి తెల్లవారేసరికి వానతోపాటే అదీ వెలసి అయ్యో అని పిస్తుంది. వర్షం కలిగించే అలజడి సరే, అంతకన్నా ఎక్కువగా వర్షాభావం సృష్టించే కన్నీటి జలపాతాల సంగతేమిటి? తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి ‘ఆమె దనంతపురం’, ‘పిచ్చి లచ్చమ్మ’, ‘కదిరమ్మ పేరంటాలు’ కథలు ఆ విషాద పార్శా్వన్ని అనితరసాధ్యంగా అక్షరబద్ధం చేస్తాయి. మరిన్నికొత్త అనుభవాలను మబ్బులతో మూటగట్టి మళ్ళీ వర్షరుతువు వస్తోంది. అవి తీపినే నింపాలని కోరుకుంటూ హర్షోల్లాసాలతో పునఃస్వాగతం చెబుదాం. -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్‌లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
ఉచితంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్ ఇంగ్లీష్
సాక్షి, హైదరాబాద్: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ వ్యవస్థాపకుడు, చీఫ్ కోచ్ డాక్టర్ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్‌ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్లైన్ మాడ్యూల్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్‌కు లింకును పంపిస్తాం". అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్ ద్వారా స్పొకెన్ ఇంగ్లీష్ తరగతులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్‌పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్‌నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్లైన్ పద్దతిలో లైవ్‌లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్‌లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు. ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
కేంద్ర సాహిత్య అకాడెమికి ఘన గౌరవం!
అవును,మనం వింటున్నది నిజమే!ఈ ఉత్సవం పెద్ద చరిత్ర సృష్టించింది, రికార్డుల పంట పండించింది, భారతదేశానికి,కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు మునుపెన్నడు లేని పెద్ద ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. ఇది చిన్న ఉత్సవం కాదు, మహోత్సవం,సారస్వత మహాయజ్ఞం. ఈ మహాయగాన్ని నిర్వహించింది 'కేంద్ర సాహిత్య అకాడెమి'. దీనిని నడిపింది ఆ సంస్థ కార్యదర్శి కె.శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ పదహారణాల మన తెలుగువాడు. కృష్ణా తీరంవాడు, దివిసీమవాడు,కవిసీమవాడు. దశాబ్దాల కేంద్ర సాహిత్య అకాడెమి చరిత్రలో కార్యదర్శి హోదాను పొందిన మొట్టమొదటి తెలుగువాడు శ్రీనివాస్. అకాడెమి ప్రయాణంలో ఈ స్థాయిలో సాహిత్య మహోత్సవాలు జరగడం గొప్ప చరిత్ర. 'ప్రపంచ అతి పెద్ద సాహిత్య మహోత్సవం ' పేరుతో దిల్లీలో, కేంద్ర సాహిత్య అకాడెమి ప్రాంగణంలో,రవీంద్ర భవన్ లో ఈ మార్చి 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకూ వేడుకలు ఘనంగా జరిగాయి.పోయిన ఏడాది కూడా జరిగాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే? 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్', దుబాయ్, 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్',లండన్ నుంచి ఘనమైన గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడెమి సంస్థకు,అధిపతి కె.శ్రీనివాస్‌కు కూడా విశేషమైన అభినందనలు అందాయి. ఒక్కరోజులోనే, అతిపెద్ద సంఖ్యలో, అనేక భాషలవారు వివిధమైన సారస్వతాన్ని వినిపించినందుకు 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ ', లండన్ గొప్ప రికార్డుగా నమోదు చేస్తూ సర్టిఫికెట్ పంపించింది. 1100 మంది ప్రతినిధులు 175 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ,190 సెషన్స్ గా, వరుసగా 6రోజుల పాటు సారస్వత మహోత్సవంలో పాల్గొనడాన్ని అపూర్వమైన విశేషంగా అభివర్ణిస్తూ దుబాయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మకమైన సంస్థ 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్ ' ఈ ఉత్సవాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతమైన విషయంగా భావిస్తూ సర్టిఫికెట్స్ అందజేసింది.భాషా,సాహిత్య, సాంస్కృతిక ప్రేమికులకు గొప్ప ఆనందాన్నిచ్చే గొప్ప సందర్భం, సంరంభం మన దేశరాజధానిలో వెల్లివిరిసాయి. 'సామాజిక న్యాయం' అనే మాట ఈమధ్య మనం తరచుగా వింటున్నాం. సామాజిక న్యాయంతో పాటు సాహిత్యానికి కూడా ఈ మహోత్సవంలో గొప్ప న్యాయం జరిగింది. ప్రతి ఏటా జరుగుతోంది, ఈ ఏడు మరింత విశేషంగా జరిగింది.సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలకు ప్రాతినిధ్యం కల్పించిన వేళ,ఆ యా రూపాలకు తత్ తుల్యమైన గౌరవం కూడా దక్కింది. దేశంలోని అనేక భాషల వాణి వినపడడమే కాక,లింగవివక్షకు తావులేకుండా అందరికీ సమ ప్రాతినిధ్యం లభించింది. కవితలు,కథలు,చిన్న కథలు, కళలు,సమీక్షలు,విమర్శలు,చర్చలు ఒకటేమిటి? ఈ ఆరురోజుల్లో ఎన్నో జరిగాయి. లబ్దప్రతిష్ఠులే కాక,మాన్యులు, సామాన్యులు,అతి సామాన్యులకు కూడా ఈ వేడుకలకు ఆహ్వానం అందింది. ఒక్కొక్క సభా వేదికకు ఒక్కొక్క మహనీయుని పేరు పెట్టి, ఆ మాననీయులకు నీరాజనం పలికారు. మహాకవి వాల్మీకి, వేదవ్యాసుడు,మీరాబాయి, కబీర్,శంకరదేవుడు,తులసీదాస్, తిరువాళ్వార్ వంటి మహానీయులను వేదికల ద్వారా తలచుకొని,తలపులలో నిలుపుకొని,నమస్కరించుకొనే సౌభాగ్యం కూడా ఈ వేదికల ద్వారా ప్రాప్తమైంది. కళలకు సాహిత్యం అవసరమా? మహిళాసాధికారికత, బాలసాహిత్యం,యువసాహితి, అనువాదం,అస్మిత,చదువరితనం, రచించే శక్తి,అభిరుచి, సమకాలీన సాహిత్య సరళులు, గిరిజన భాషా,సాహిత్య, సంస్కృతులు,నవల,నవలిక, నాట్యం,నాటకం, సారస్వత గమనంలో సవాళ్లు, భారతీయుల ఇంగ్లిష్ రచనా నిపుణత,ఈ -బుక్స్, ఆడియో బుక్స్, ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కవిత్వంలో స్త్రీ, సాహిత్యం అందించే ఆనందం, ప్రేరణ,ప్రభావం, సరిహద్దుల అవతల భారతీయ సాహిత్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన సారస్వత వారసత్వ వైభవం, విద్య అందించే సృజన, జనపదాలు, జానపదకథలు, కవిత్వ వ్యవసాయం, స్వాతంత్య్రానికి పూర్వం సాహిత్యం, భక్తి ఉద్యమ కవిత్వం, భావోద్వేగాలు, రచయితలతో ముఖాముఖీ, రామకథావిశేషాలు, మన ఘన సాంస్కృతిక వారసత్వం, మన మహాకావ్యాలు, మన తత్త్వ గ్రంథాలు, తాత్వికత,సైన్స్ ఫిక్షన్, సాహిత్యం సమకూర్చే విలువలు, ఆత్మకథలు,మీడియా, భిన్నత్వంలో ఏకత్వం, ఇతిహాసాలు,పురాణాలు, అణగారిన వర్గాల ఆలోచనా ధోరణులు,దళిత సాహిత్యం, వందేళ్ల భారత సాహిత్యం, భారతీయ భాషల సంరక్షణ, భిన్న స్వరాల్లో భారతీయ కవిత్వం, మౌఖిక సాహిత్యం, స్వాతంత్ర్యానంతర సాహిత్య సృష్టి... ఇలా ఎన్నో అంశాలను,రంగాలను స్పృశిస్తూ ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే వేదికలపై 'కేంద్ర సాహిత్య అకాడెమి -2023' అవార్డుల ప్రదానోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో 24 భాషీయులు పురస్కార ఘన గౌరవాన్ని అందుకున్నారు. అందులో మన తెలుగువారైన తల్లావఝల పతంజలిశాస్త్రి కూడా ఉండడం మనకు ముదావహం. సినిమా సాహిత్యంపై ప్రఖ్యాత ఉర్దూ కవి,రచయిత,గీతకారుడు గుల్జార్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో మాటవిడుపుగా మధ్య మధ్యలో సాగిన నృత్య,నాటక, సంగీత రూపక ప్రదర్శనలు కొంగ్రొత్త విందులను చిందించాయి. ఈ ఉత్సవాలతో పాటు గతంలో సిమ్లాలో,భోపాల్ లో నిర్వహించిన ' ఉన్మేష ఉత్సవాలు' రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆరు రోజుల ఉత్సవాలకు ఆహ్వానించిన ప్రతిఒక్కరికీ అన్ని ఖర్చులు,భోజన,వసతి,పారితోషిక వగైరాలన్నింటినీ అకాడెమి భరించింది. ఎన్నో వ్యయప్రయాసలతో నిర్వహించిన ఈ సాహిత్య మహోత్సవం అపూర్వ పర్వంగా అందగించింది. భారతీయ భాషా,సాహిత్య, సాంస్కృతులకు పెద్ద దివిటీలు పట్టిన శుభఘడియలు ఈ ఆరు దినములు. ప్రతి ఏటా ఇలాగే జరిగితే మన సారస్వత శోభ ప్రభాసమానమవుతుంది. 'ఆజాదీ కా అమృతోత్సవ్' లో భాగంగా జరిగిన ఉన్మేష ఉత్సవాలు కూడా ఆగకుండా జరగాలి. ఇంతటి చారిత్రక సభల ప్రభలు కట్టిన కేంద్ర సాహిత్య అకాడెమికి వీరతాళ్లు వేద్దాం. -రచయిత మా శర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!) -
మూడు దారులు.. వేరు.. వేరే!
'ముగ్గురు ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా చూడాలంటే అయితే రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి లేకపోతే పాత్రికేయుడైనా అయి ఉండాలి. దేవులపల్లి అమర్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడు కావడంతో రాజకీయాల్లో దిగ్గజాలనదగిన ముగ్గురు నాయకులను అతి సమీపంనుంచి చూసి, వారి నడతను, వ్యవహార శైలినీ, రాజకీయ పరిణతిని అంచనా వేసే అవకాశం దొరికింది.' రాసింది ముగ్గురు నేతల గురించే అయినా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటునుంచి మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్ అవతరణ మీదుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ తెలుగునాట చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను రచయిత విపులంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచే ఈ తరానికి, ముఖ్యంగా యువతరానికి ఈ విషయాలన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. (ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కాంగ్రెస్‌లో వేళ్లూనుకుపోయిన ముఠా సంస్కృతి కారణంగా కూలిపోయిందన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఇలాంటి విస్తుగొలిపే అనేక రాజకీయ పరిణామాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది) అప్పటి పరిణామాల గురించి ఈనాటి యువతరానికి జరిగింది జరిగినట్లు చెప్పేందుకు చేసిన ఓ ప్రయత్నమే ఈ పుస్తక రచన అని రచయితే స్వయంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వైఎస్ఆర్, చంద్రబాబుల గురించి విశ్లేషించే క్రమంలో వారిద్దరినీ రచయిత ఒక తాసులో ఉంచి తూచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా, తర్వాత రాజకీయ విరోధులుగా మారిన ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను ఇలా తూచి తీర్పు చెప్పడం తప్పేమీ కాదు. పైగా అప్పట్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు రచయిత సాక్షిగా ఉన్నందువల్ల సాధికారికంగా ఇలా బేరీజు వేసే అర్హత ఆయనకు ఉంది. ‘అధికారం కోసం పార్టీ మారి, అందలం కోసం అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయినా అదే పార్టీలో కొనసాగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు ఏ విషయంలోనూ పోలిక లేదు’ అంటారు రచయిత. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు జగన్ చేసిన ప్రయత్నాలనూ, అధిష్ఠానం తృణీకార ధోరణిని భరించలేక వేరు పార్టీ పెట్టిన వైనాన్ని కూడా పుస్తకంలో విశదంగా పొందుపరిచారు. పదహారు నెలలు జైలులో ఉండి, బయటకు వచ్చి ప్రజాభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమాన్ని ఆసక్తికరంగా రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు మీద రచయిత విమర్శనాస్త్రాలు సంధించినా వాటన్నింటినీ సహేతుకంగా, సాధికారికంగా విశ్లేషించారు. ముఖ్యంగా 1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర, 1995లో చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాలను సరిపోలుస్తూ, ఈ రెండూ సంఘటనలూ ఒకే రీతిలో జరిగినా నాదెండ్ల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజల నుంచీ, ప్రజాస్వామ్య పక్షాలనుంచీ, మీడియా నుంచీ ఎన్టీఆర్‌కు లభించిన మద్దతు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే లభించలేదంటారు. వెన్నుపోటు సంఘటనను వివరించేందుకు ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అంటూ రచయిత ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించారు. తొమ్మిది రోజులపాటు రోజువారీ చోటు చేసుకున్న పరిణామాల గురించి చదువుతున్నప్పుడు రచయిత మరోసారి పాత్రికేయుడిగా పరకాయప్రవేశం చేశారనిపిస్తుంది. అన్నీ తనవల్లనే జరిగాయని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారన్న రచయిత.. అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది తానేనని, ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందనీ, తానే ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ రెండూ అబద్ధాలేనంటూ తగిన సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ సాధికారికంగా విశ్లేషించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ చిత్తశుద్ధిని, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ పాలనను వివరించడానికి రచయిత ఒక ప్రత్యేక చాప్టర్‌ను కేటాయించారు. ఫోటోల ఎంపికలో రచయితకు ఫుల్ మార్కులు పడతాయి. ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఫోటోలు ప్రచురించడం మెచ్చుకోదగినది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వైఎస్ఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలపై, నీతిబాహ్యమైన చర్యలపై రచయితకు గల ధర్మాగ్రహం ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. తప్పయితే తప్పనీ, ఒప్పయితే ఒప్పనీ బల్లగుద్ది చెబుతూ సాగే రచయిత శైలి ఆకట్టుకుంటుంది. ఇప్పటి తరానికే కాదు, భావితరాలకు కూడా తెలుగు రాజకీయ పరిణామాలపై ఈ పుస్తకం ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. – బీ.ఎస్. రామకృష్ణ (బీ.ఎస్.ఆర్) ఇవి చదవండి: భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు' -
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి అభివ్యక్తి
అత్యంత ప్రతిభావంతమైన కవి వేటూరి సుందరరామ్మూర్తి. తెలుగు సినిమా పాటలో కావ్య కవిత్వాన్ని పండించారు వేటూరి. తెలుగు సినిమా పాటల్లో వేటూరి రాసి పెట్టినంత గొప్ప కవిత్వం మరొకరు రాయలేదు. వేటూరి కాలానికి తెలుగు సినిమాలో సముద్రాల, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, దాశరథి, నారాయణ రెడ్డి వంటి గొప్పకవులున్నారు. కానీ సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్పకవి. ఇప్పటికీ వేటూరి అంత గొప్పకవి తెలుగు సినిమాలో రాలేదు. మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి తమిళ్ష్ కణ్ణదాసన్. అంత కణ్ణదాసన్‌ను మరిపించగలిగింది వేటూరి మాత్రమే. వేటూరి రాసిన "మానసవీణ మధుగీతం..." కణ్ణదాసన్ కూడా రాయలేరేమో?తొలిరోజుల్లో పంతులమ్మ చిత్రంలో వేటూరి రాసిన "మానస వీణా మధు గీతం" పాట నుంచీ ఆయన చేసిన కవిత్వ ఆవిష్కరణ ప్రశస్తమైంది. "కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని, తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని" అని ఆయనన్నది అంతకు ముందు తెలుగు సినిమాకు లేని వన్నె. అడవి రాముడు సినిమాలో "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" పాట సీసపద్యం. ఆ పాటలో పైట లేని ఆమెతో "నా పాట నీ పైట కావాలి" అన్నారు వేటూరి. ఆ సినిమాలోని "కుహు కుహు కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి..." పదాల పొందికలోనూ, భావుకతలోనూ ఎంతో బావుండే పాట. మల్లెపూవు సినిమాలో వేటూరి రాసిన "ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో" పాటా, ఆ పాటలో వేశ్యల దుస్థితిపై "ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో/ ఏ ఖర్మం ఈ గాయం చేసిందో" అని అన్నదీ వేటూరి మాత్రమే చెయ్యగలిగింది. ఇలాంటి సందర్భానికి మానవుడు దానవుడు సినిమాలో నారాయణ రెడ్డి రాసిన పాట ఈ పాటంత సాంద్రంగానూ, ఇంత పదునుగానూ, గొప్పగానూ లేదు. ఈ సందర్భానికి ముందుగా ప్యాసా హిందీ సినిమాలో సాహిర్ లూధియాన్వీ రచన "ఏ కూచే ఏ నీలామ్ ఘర్ దిల్ కషీకే" వచ్చింది. దానికన్నా భావం, వాడి, శైలి, శయ్యల పరంగా వేటూరి రచనే గొప్పది. ఝుమ్మంది నాదం సై అంది పాదం" పాట తొలి రోజుల్లోనే వేటూరి గొప్పకవి అవడానికి నిదర్శనమైంది. ఈ పాట సందర్భంలోనూ హిందీ సినిమా సర్గమ్ పాట కన్నా వేటూరి రచనే మేలైంది. "శారదా వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము" అని అనడం సినిమా పాటలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలోనూ మహోన్నతమే."తత్త్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము" అని అన్నప్పుడూ "అద్వైత సిద్ధికి అమరత్వలబ్దికి గానమె సోపానము" అనీ అన్నప్పుడు త్యాగరాజును వేటూరి ఔపోసన పట్టారని తెలుస్తోంది. వేటూరిలో అన్నమయ్య పూనడం కూడా జరిగింది. అందువల్లే "జానపదానికి జ్ఞాన పథం" అనీ, "ఏడు స్వరాలలే ఏడు కొండలై" అనీ ఆయన రాయగలిగారు. "కైలాసాన కార్తీకాన శివరూపం / ప్రమిదేలేని ప్రమాదా లోక హిమ దీపం" అని వేటూరి అన్నది మనం మరో కవి ద్వారా వినంది. సాగర సంగమం సినిమాలో "ఓం నమశ్శివాయ" పాటలోని సాహిత్యం న భూతో న భవిష్యతి. భావుకత, కల్పనా శక్తి , పద కూర్పుల పరంగా అది ఒక మహోన్నతమైన రచన. ఈ పాటలో "నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ" అన్న వాక్యం వేయి కావ్యాల పెట్టు. ప్రస్థానత్రయంలోని ఉపనిషత్తులు పదే. ఆ సత్యాన్నీ, మౌనమే వేదాంతం అన్నదాన్నీ అద్భుతంగా మనకు అందించారు వేటూరి. "గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై" అనడం రచనా సంవిధానంలో వేటూరి మహోన్నతుడని నిరూపిస్తోంది. ఇక్కడ ఈశ్వరుడి సంకల్పం అంటే ఈ సృష్టి - దీనికి గజముఖ,షణ్ముఖ, ప్రమధ గణాలు ఋత్విజ వరులు (అంటే యజ్ఞం చేసే ఋత్విక్కులలో శ్రేష్ఠమైన వాళ్లు) అయ్యారు" అని అన్నారు. ఇక్కడ ఋత్విజ వరులు అన్న పదం వాడడం వల్ల ఈశ్వర సంకల్పం ఒక యజ్ఞం అని యజ్ఞం అన్న పదం వాడకుండా చెప్పారు వేటూరి. ఇది మహాకవుల లక్షణం. వేటూరి ఒక మహాకవి. "శంకరా నాద శరీరా పరా" పాటలో ఆయన వాడిన సంస్కృతం తెలుగు సినిమా పాటకు జిలుగు. వేటూరికి ముందు మల్లాది రామకృష్ణ శాస్త్రి సంస్కృతాన్ని తెలుగు సినిమా పాటలో చక్కగా వాడారు. వేటూరి సంస్కృతాన్ని చిక్కగానూ వాడారు. సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి..." పాట పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ స్తోత్రంగా పూర్తి సంస్కృతంలో అద్భుతంగా రాశారు వేటూరి. తన పాటల్లో వేటూరి ఎన్నో మంచి సమాసాల్ని, అలంకారాల్ని, కవి సమయాల్ని అలవోకగా ప్రయోగించారు. "చినుకులా రాలి నదులుగా సాగి" పాట ప్రేమ గీతాలలో ఒక ఆణిముత్యం. "ఏ వసంతమిది ఎవరి సొంతమిది?" అని వేటూరి కవిత మాత్రమే అడగగలదు. "ఈ దుర్యోధన, దుశ్శాసన..." పాటకు సాటి రాగల పాట మన దేశంలో మరొకటి ఉంటుందా? "ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది / మాధవుడు, యాదవుడు మా కులమే లెమ్మంది" ఇలా రాయడానికి ఎంతో గరిమ ఉండాలి. ఆది శంకరాచార్య, కాళిదాసు, కణ్ణదాసన్లలో మెరిసే పద పురోగతి (Word-proggression) వేటూరిలో ఉంటుంది. తమిళ్ష్‌లో కణ్ణదాసన్ రాశాక అంతకన్నా గొప్పగా తెలుగులో ఒక్క వేటూరి మాత్రమే రాశారు. వేటూరికి ముందు కణ్ణదాసన్ పాటలు రాసిన సందర్భాలకు తెలుగులో రాసిన కవులున్నారు. వాళ్లు కణ్ణదాసన్ స్థాయిని అందుకో లేకపోయారు. వేటూరి మాత్రమే కణ్ణదాసన్ రాసిన సందర్భానికి తెలుగులో ఆయన కన్నా గొప్పగా రాయగలిగారు. అమావాస్య చంద్రుడు సినిమాలో కణ్ణదాసన్ "అందమే అందమూ దేవత/ వేయి కవులు రాసే కావ్యము" అని రాస్తే ఆ సందర్భానికి వేటూరి "కళకే కళ ఈ అందము, ఏ కవీ రాయని కావ్యము" అని రాశారు. ఇలా ఆ పాటలో ప్రతిచోటా వేటూరి రచనే మిన్నగా ఉంటుంది. ఆ సినిమాలో మరో పాట "సుందరమో సుమధురమో" పాట సందర్భానికి ముందుగా తమిళ్ష్‌లో వైరముత్తు రాశారు. ఆ సందర్భానికీ వేటూరి రచనే తమిళ్ష్ రచనకన్నా గొప్పది. కన్నడ కవి ఆర్.ఎన్.జయగోపాల్ సొసె తన్ద సౌభాగ్య సినిమాలో "రవివర్మ కుంచె కళకు భలే సాకారానివో/ కవి కల్పనలో కనిపిస్తున్న సౌందర్య జాలానివో" అని రాస్తే ఆ బాణికి రావణుడే రాముడైతే సినిమాలో "రవివర్మకే అందని ఒకే ఒక అందానివో/ ఆ రవి చూడని పాడని నవ్య నాదానివో" అని వేటూరి రాశారు. ఈ పాట చరణాలలో వేటూరిదే పైచేయి అయింది. ఆ విషయాన్ని ఈ వ్యాస రచయిత జయగోపాల్‌తో ప్రస్తావిస్తే ఆయన కాదనలేకపోయారు. కన్నడ రాష్ట్రకవి జి.ఎస్. శివరుద్రప్ప రాసిన ఒక కవిత తరువాతి రోజుల్లో మానస సరోవర అన్న సినిమాలో పాటైంది. ఆ సినిమా తెలుగులో అమాయక చక్రవర్తి పేరుతో వచ్చింది. ఆ సందర్భానికి శివరుద్రప్ప రచనకన్నా తెలుగులో రాసిన వేటూరి రచనే మేలుగా ఉంటుంది. "వేదాంతి చెప్పాడు బంగారం అంతా మట్టి, మట్టి/ కవి ఒకడు పాడాడు మట్టి అంతా బంగారం, బంగారం" అని కన్నడ రచన అంటే "వేదాంతమంటున్నది జగమంతా స్వప్నం, స్వప్నం/ కవి స్వాంతమంటున్నది జగమంతా స్వర్గం, స్వర్గం" అని వేటూరి అన్నారు. ఈ సందర్భంలోనూ పూర్తిగా వేటూరే మేలుగా నిలిచారు. వేటూరి సినిమా పాటల్లో సాధించిన గజలియత్ గజళ్లు అని రాసి కూడా నారాయాణ రెడ్డి తీసుకురాలేకపోయారు. వీరభద్రుడు సినిమాలో "ఏదో మోహం, ఎదలో దాహం..." పాట పల్లవిలో "నిదురించే నా మనసే ఉలికిపడే ఊహలతో" అని అన్నాక రెండో చరణంలో "చందమామ ఎండకాసే నిప్పు పూలదండలేసే/ గుబులు గుబులు గుండెలోన అర్థరాత్రి తెల్లవారే" అనీ, "ఉండి ఉండి ఊపిరంతా పరిమళాల వెల్లువాయే/ ఆపలేని విరహవేదనే తీపి తీపిగా ఎదను కోయగా" అని వేటూరి అన్నది తెలుగులో గజల్ అని రాసిన, రాస్తున్న చాల మందికి పట్టిబడని గజలియత్. అంతర్జాతీయ స్థాయి కవి గుంటూరు శేషేంద్రశర్మ విశ్వఘోష కవితలో "వేసవి కాలపు వాగై, శుక్ల పాడ్యమీ వేళ శశిరేఖకు విడుచు నూలు పోగై అడగారిందేమో" అని ఒక శ్రేష్ఠమైన రచనా సంవిధానాన్ని ప్రదర్శించారు. వేటూరి ఆ స్థాయిలో, ఆ సంవిధానంలో "వానకారు కోయిలనై/ తెల్లవారి వెన్నెలనై/ ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని/ కడిమివోలె నిలిచానని..." అనీ, "రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై/ ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని..." అన్నారు. ఇది ఒక సృజనాత్మక రచనా వైశేష్యం. "ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక / ఏదారెటు పోతుందో ఎవరెనీ అడగక" అనీ, "త్యాగరాజు కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టుందమ్మా" అనీ, "ఆబాలగోపాల మా బాల గోపాలుని/ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ" అనీ, "ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవలు" అనీ, "దీపాలెన్ని ఉన్నా హారతొక్కటే/ దేవతలెందరున్నా అమ్మ ఒక్కటే" అనీ, "ఇది సంగ్రామం మహా సంగ్రామం/ శ్రమ జీవులు పూరించే శంఖారావం/అగ్ని హోత్రమే గోత్రం ఆత్మశక్తి మా హస్తం/ తిరుగులేని తిరుగుబాటు మా లక్ష్యం" అనీ, "ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకి/ చందమామకు రూపముండదు తెల్లవారితే" అనీ, "కరిగే బంధాలన్నీ మబ్బులే" అనీ, "వేణువై వచ్చాను భువనానికి / గాలినై పోతాను గగనానికి" అనీ, "ఏడు కొండలకైనా బండ తానొక్కటే" అనీ అంటూ వేటూరి సుందరరామ్మూర్తి ఎన్నో కావ్య వాక్యాలను వాక్య కావ్యాలను విరచించారు. "సలిల సావిత్రీ", గమన గాయత్రీ", "అమ్మా ఓం నమామి, నిన్నే నే స్మరామి", "దైవాలకన్నా దయ ఉన్న హృదయం, అమ్మ మా ఇంటి దీపం" వంటి వాక్యాలతో టి.వి. సీరియళ్ల సాహిత్యాన్నీ వెలయించారు వేటూరి. శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి సుందరరామ్మూర్తి అభివ్యక్తి. - రోచిష్మాన్ 9444012279 -
తెలుగు సాహిత్యంలో రారవే వెలుగులు
రాజాం: సాహిత్యం, సమాజం రెండు కళ్లు అనే మూలసూత్రంతో జనవరి 25, 2015లో రాజాం రచయితల వేదిక (రారవే) ఆవిర్భవించింది. రాజాంకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం గార రంగనాథం, మరికొందరు కవులతో కలిసి ఏర్పాటుచేసిన రారవే తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రతినెలా చివరి ఆదివారం ఒక సాహిత్య సమావేశం చొప్పున అనతి కాలంలోనే 107 సమావేశాలు పూర్తిచేసుకుని ఆదివారం (28వ తేదీ) 108వ సమావేశానికి సిద్ధమైంది. రాజాం పట్టణంలోని జేజే ఇనోటెల్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ, రారవే సంయుక్తంగా అబ్బూరి వరద రాజేశ్వరరావు పేరుతో సాహిత్య సదస్సు నిర్వహిస్తుంది. ఈ సమావేశాన్ని రాష్ట్ర నలుమూలలుకు చెందిన సాహితీవేత్తలతో పాటు అకాడమీ తెలుగు కన్వీనర్ సి.మృణాళిని, తెలుగు సలహా మండలి సభ్యుడు చింతకింది శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు. ఉన్నతంగా రాణిస్తున్న రారవే కవులు రారవే సభ్యులు తమ రచనలతో పేరుసంపాదిస్తున్నారు. రారవే నిర్వాహకుడు గార రంగనాథం వ్యాసాలు, కవితలు రాస్తుండగా, పిల్లా తిరుపతిరావు వ్యాసాలు, డాక్టర్ ఆల్తి మోహనరావు, పొదిలాపు శ్రీనివాసరావు వ్యాసకర్తలు, కథకులుగా రాణిస్తునఆనరు. కుదమ తిరుమలరావు, ఉరిటి గున్నేశ్వరరావు, పోలాకి ఈశ్వరరావు, కవితలు రాస్తూ మెప్పు పొందుతున్నారు. పద్య రచనలో గురుగుబెల్లి జగన్నాథరావు, ఒమ్మి రమణమూర్తి, కవితా రచనలో గార రంగనాథం, కుదమ తిరుమలరావు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. రారవే వరుసగా మూడేళ్లపాటు గెడ్డాపు అప్పలస్వామి నందనందనం, వెంకటరావు పరిమళభావ తరంగాలు, గార రంగనాథం తరంగధ్వానాలు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. నేడు రాజాంరచయితల వేదిక వార్షికోత్సవం సాహిత్యకారులతో చర్చాగోష్టికి ఏర్పాట్లు 2015లో ఏర్పడిన రారవే -
సాహిత్య ఒడంబడికలు
59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది. ‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్‌ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు. ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది. అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్‌మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే! ‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు. చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!! మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే! ‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్‌బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది. -
దట్టమైన అడవిలో,చిమ్మ చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు
1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి. జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్. ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… ‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..? ’‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్… ’కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు… ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’ ‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’ ‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’ ‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది. డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది… ‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’ అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే అనుభూతి... -
పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!
జోరున వర్షం కురుస్తోంది.. ఆకాశానికి చిల్లు పడిందాన్నట్టుంది. దట్టంగా మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటి ఆవరించింది. సాయంత్రం నాలుగింటికే అర్ధరాత్రిని తలపిస్తోంది. అచ్చం నా మనఃస్థితిలానే ఉంది వాతావరణం కూడా! ఆ వర్షానికి తడిచిన చీర.. కాళ్ళకడ్డం పడుతున్నా అలానే నడుస్తున్నాను. చినుకులు సూదంటు రాళ్ళలా గుచ్చుతున్నాయి. అవి నా మనసుకు తగులుతున్నాయి. రోడ్డుకి అడ్డంగా నడుస్తున్న నా ముందు, కార్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ‘ఏమ్మా.. చావాలనుకుంటున్నావా? పక్కనే సముద్రముంది, వెళ్ళి అందులో దూకు. మమ్మల్నెందుకు చంపుతావ్?’ విసుగ్గా అని వెళ్ళిపోయాడు. కార్ డ్రైవర్ మాటలకి పక్కకు తిరిగి చూశాను. వర్షానికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గమ్యం లేని నా నడకకు, అదే చివరి మజిలీ అనిపించిందా క్షణం. నా అడుగులు అటువైపు పడ్డాయి. వర్షంలో సముద్రాన్ని చూడాలనేది ఒకప్పటి నా కోరిక. ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడుతున్న అలలు.. నన్నేం భయపెట్టడం లేదు. నిన్నటి వరకు చిన్న బొద్దింక కనబడినా భయపడే ఆ మహిత ఇప్పుడు లేదు. చేతిలో ఫోన్ రింగ్ అవుతుండటంతో తీసి చూశాను. 143వ కాల్ కట్ అయ్యి, మిస్డ్ కాల్‌గా మారిపోయింది. ∙∙ ఒకప్పుడు ఆ నంబరంటే విపరీతమైన క్రేజ్. ఆ నంబర్ వెనుకున్న శౌర్య అంటే ఇష్టం. శౌర్యతో జీవితం, ఇదిగో ఇక్కడే మొదలైంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో కలసి చదువుకున్న క్లాస్మేట్. ఈ అనంతసాగరం ఒడ్డున ఫైనలియర్లో చుట్టూ స్నేహితుల సాక్షిగా.. మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అందరూ చెయ్యడం వేరు.. శౌర్య ప్రపోజ్ చెయ్యడం వేరు అనిపించింది నాకు. అందగాడు.. చదువుల బిడ్డ.. అమ్మాయిలు కోరుకునే లక్షణాలన్నీ శౌర్యలో పుష్కలంగా ఉన్నాయి. అలాంటి శౌర్య.. నాకు ప్రపోజ్ చెయ్యడమనేది నేను ఉహించనిది కావడంతో వెంటనే ఎగిరి గంతేసి కౌగిలించుకుని మరీ ఒప్పుకున్నాను. ఆ తరువాత ఐస్‌క్రీమ్ పార్లర్ నుంచి బీచ్, కొత్త సినిమా ఇలా ప్రతిచోటా తిరిగి, ప్రేమికులుగా మా ముద్ర వేశాం. నాకు అందంగా కనిపించిన ప్రేమ.. నా తల్లిదండ్రులకు కనిపించలేదు. కులం నుంచి అంతస్తుల వరకు ఎత్తి చూపించారు. ఏడు తరాలు చూడాలన్నారు. అరే..మనిషి ఎదురుగా తన గుణం కనిపిస్తుంటే, కనబడని ఏడు తరాలు గురించి మీకెందుకన్నాను. వాళ్ళు మెట్టు దిగలేదు. నేను మాత్రం ఆ ఇంటి మెట్లు దిగి, శౌర్య భార్యగా మెట్టినింట అడుగుపెట్టాను తల్లిదండ్రులను వద్దనుకుని! నేనంటే ఎంతో ప్రేమ చూపించే అత్తగారు, ప్రాణంలా చూసుకునే శౌర్య. నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. నా ఆనందాన్ని కాలదన్నబోయిన తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకుని, కనీసం ఫోనైనా చెయ్యలేదు. ఈనాడు శౌర్య కాకుండా నాకు మరో కుటుంబం, స్నేహం ఏదీ లేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నానేమో, ఇప్పుడిక కన్నీళ్ళు రావడం లేదు. మనిషికి ఎక్స్పైరీ డేట్ ముందే తెలిస్తే అది ఇంత బరువుగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అవును!! నేను చనిపోబోతున్నాను. నాకున్నది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎన్ని కోరికలు, ఆశలు, ఆశయాలుండేవో వాటన్నిటికీ తెర పడింది. ఇంత బాధను అనుభవిస్తూ పోయేకన్నా ఇప్పుడే పోతే? నా ఆలోచనలానే విశాలమైన సంద్రం, రెండు చేతులు చాచి.. ‘నా గర్భంలో నీకు చోటుంది మహితా’ అని చెబుతున్నట్టుంది. వర్షం తగ్గి, మనుషులు తిరగడం ఎప్పుడు మొదలుపెట్టారో గమనించలేదు. సాగర గర్భంలోకి వెళుతున్న నా చేతిని పట్టుకుందో చిట్టి చెయ్యి. బోడిగుండుతో ముద్దుగా, బుజ్జి వామనుడిలా ఉన్నాడు. కిందికి వంగి కళ్ళెగరేశాను. వర్షానికి తడవకుండా, తన చొక్కాలో దాచుకున్న డిబ్బీ తీసి చూపించాడు వాడు. ‘కల్పతరువు’ దాని మీద ఉన్న పేరు అదే! ‘అనాథాశ్రమమా?’ మాట జారి బాధపడ్డాను. బుజ్జి వామనుడు తలూపాడు. మెడలో వేలాడుతున్న మంగళ సూత్రాలతాడు తీసి, డిబ్బీలో వేసేశాను. వాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నవ్వి తల నిమిరాను. చేతికి కుట్లు తాలుకు గోతులు తగిలాయి. వామనుడ్ని వెనక్కి తిప్పి చూసి, ‘ఏంటివి?’ అడిగాను. ‘ఇంకొద్ది క్షణాల్లో చనిపోయే నీకెందుకు?’ అంటూ అంతరాత్మ ప్రశ్నించింది. ‘వాడికి బ్రెయిన్లో కణితి ఉందంట అక్కా! ఆపరేషన్ చేసి తీశారు. కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చిందట. ఈసారి ఆపరేషన్ అనవసరమంటా’ అంది.. వాడి కూడా వచ్చిన అమ్మాయి వాడిని ఎత్తుకుని వెళుతూ. ఎక్స్పైరీ డేట్ మెడలో వేసుకుని కూడా నవ్వుతూ తిరుగుతున్న బుజ్జి వామనుడు.. తనవంకే చూస్తుండిపోయాను. ‘నిన్ను వ్యాన్ దిగొద్దని చెప్పాను కదా? ఈ సారి ఇలా చేశావంటే బయటకు తీసుకురాను చెబ్తున్నా’ అంది ఆ అమ్మాయి వాడిని బెదిరిస్తూ. బుజ్జి వామనుడు నవ్వుతున్నాడు. ఎక్స్పైరీ డేట్ పూర్తయ్యేవరకు కూడా నవ్వుతూ బతకచ్చని చెప్పిన వాడి పరిచయంతో నా గమ్యం మారింది.వాళ్ళ వెనకే వెళ్ళాను. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యాన్ ఎక్కిస్తున్న వాలంటీర్ ‘ఏమ్మా, ఆశ్రమానికి వస్తావా?’ అడిగింది. ఆమెకది అలవాటనుకుంటా.. బహుశా విధివంచితలెందర్నో చూసిన అనుభవమయ్యుంటుంది. అప్రయత్నంగానే తలూపాను. ∙∙ వ్యాన్ పెద్ద ఆశ్రమంలోకడుగుపెట్టింది. కల్ప తరువు పేరు మెరుస్తోంది. ఊరికి దూరంగా, విశాలంగా ఉంది. చాలా బిల్డింగ్స్ తరువు శాఖల్లా విస్తరించాయి.‘పేరేంటమ్మా?’ నా కన్నా చిన్నదే రిసెప్షనిస్ట్.. ఆత్మీయంగా అడిగింది. నా పేరు చెప్పాను.ఒక గదిలోకి తీసుకెళ్ళి.. ‘ఇక్కడే కూర్చోండి! మేడమ్‌గారు వచ్చి మీతో మాట్లాడతారు’ అని వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలైన వర్షాన్ని, కిటికీలోంచి చూస్తున్నాను. నాలానే వర్షం కూడా ఆగి ఆగి తన బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుంది. ‘నీ మజిలీ ఈ అనాథాశ్రమమా!’ అంతరాత్మ ప్రశ్నిస్తోంది. ‘హాయ్ మహితా! ఐయాం గౌరీ’ చక్కటి కాటన్ చీరలో పొందికగా ఉంది వచ్చినామె. నా కన్నా ఐదేళ్ళు పెద్దదేమో బహుశా! నా చూపులో నిర్లిప్తత చూసి.. నా పక్కకొచ్చి నుంచుంది గౌరీ.‘నేను.. నీలానే ఈ కల్పతరువుకి వచ్చాను. వర్షం చూస్తూ ఇదే గదిలో బెరుగ్గా, భయంగా నుంచున్నాను. ఇప్పుడిక్కడే పని చేస్తున్నాను. ఇక్కడ మనలా చాలా మంది ఉంటారు మహితా! అదిగో ఆ బ్లాక్‌లో అనాథపిల్లలు ఉంటారు.. దాంట్లో వృద్ధులు.. ఇదిగో ఇందులో మోసపోయిన ఆడవాళ్ళుంటారు. అందులోనేమో హెచ్ఐవీ బాధితులు ఉంటారు.’ఉలిక్కిపడ్డాను ఆమాటకు! ‘నువ్వు ఏ బ్లాక్‌లో ఉంటావ్ మహితా?’ మాట సౌమ్యంగా ఉన్నా..‘ నువ్వు ఏ జాతి పక్షివి’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉంది. భయంగా చివర్లో చెప్పిన బ్లాక్ వైపు చూపించాను. ఓదార్పుగా నా చుట్టూ చెయ్యి వేసి ‘ఎప్పటినుంచి?’ అడిగింది గౌరీ. ‘నిన్నటి నుంచి’ నా ప్రమేయం లేకుండానే బుగ్గలను కన్నీళ్ళు తడిపాయి.‘చూడు మహితా.. నువ్వు బాధపడుతుంటే ఓదార్చగలను. కానీ పరిష్కారం చూపించలేను. జరిగింది చెప్పు. చెప్పలేనంటవా అదిగో అక్కడ చాలా మంది ఉన్నారు. నీలానే వాళ్ళకూ కథలున్నాయి. వెళ్ళు.. కలువు, మాట్లాడు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు సరేనా!’ అనునయించింది గౌరీ. తలూపాను కానీ వెళ్ళలేదు. ఏం చెప్పాలి? నాలాంటి కథ ఇంకొకరికి ఉంటుందా? ఈ లోకంలో నా అంత చెత్త కథ ఎవరికీ ఉండదేమో..!? ∙∙ మూడు వారాల ముందు ఆఫీసులో, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అందరిలానే నేనూ ఇచ్చాను. కానీ వచ్చిన రిజల్ట్స్ నన్ను షాక్ చేశాయి. ఆ విషయం శౌర్యకి ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతూ, ఏడుపును దిగమింగుకుంటూ నాకసలు హెచ్ఐవీ ఎలా అంటుకుందో అర్థంకాక ప్రతీ సందర్భాన్ని గుర్తుచేసుకుంటుంటే.. రెండు నెలల క్రితం నేను బ్లడ్ డొనేట్ చెయ్యబోతే అడ్డుకున్న శౌర్య గుర్తొచ్చాడు. ‘ఆడవాళ్ళకు పీరియడ్స్ సమయంలోనే బోలెడంత బ్లడ్ పోతుంది. మళ్ళీ నువ్వేం ఇవ్వక్కర్లేదు’ అని అందరిముందు నుంచి నన్ను లాక్కొచ్చాడు. శౌర్యకి నా మీదున్న ప్రేమకి మురిసిపోయాను ఆ క్షణం. కాని సన్నగా మొదలైన అనుమానం.. నన్ను గదంతా వెతికేలా చేసింది. నా అనుమానం నిజమయ్యే సాక్ష్యాలు కనబడటంతో శౌర్య మీదకు విసిరికొట్టి అడిగాను అవేంటని!‘మహా.. సారీ మహా! కావాలని చేసిందికాదు’ కోపంగా మూసేసిన తలుపులు బాదుతూ, బతిమాలడం మొదలుపెట్టాడు. ‘నీకెప్పుడు తెలుసు శౌర్యా?’ ఇంకా ఎక్కడో మిణుకుమంటూ ఆశ.. కన్నీళ్ళను తుడుచుకుని, కిటికీ దగ్గరకొచ్చి అడిగాను.‘మన పెళ్ళికి రెండు రోజుల ముందు. కానీ, నేను తప్పు చెయ్యలేదు మహా! ఇదిగో ఈ టాటూ వలన వచ్చింది. ప్రామిస్! నా జీవితంలో ఉన్న అమ్మాయివి నువ్వొక్కదానివే. ప్లీజ్ మహా, తలుపు తీయ్యి’ కిటికీ దగ్గర నుంచుని అడిగాడు. మరి నన్నెలా పెళ్ళి చేసుకోవాలనిపించింది శౌర్యా? నిన్నట్నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా! నీకెక్కడ నా వలన వస్తుందో, ఇప్పటికే వచ్చిందో తెలియక.. నరకం అనుభవిస్తున్నాను. నాకు హెచ్ఐవీ అని తెలిసినప్పటి నుంచి నాకన్నా నీకోసమే ఎక్కువ ఆలోచించాను. నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా?’ ఏడుస్తూ చేరగిలపడ్డాను.‘చెప్పాలనే అనుకున్నాను మహా..! ధైర్యం సరిపోలేదు. అప్పటికే నువ్వు నా కోసం ఇంటి నుంచి వచ్చేశావ్. నిన్ను వదిలి నేనుండలేను. అందుకే పెళ్ళి చేసుకున్నాను. కానీ నీకు గుర్తుందా మహా..! రెండు నెలల వరకు నిన్ను కనీసం ముట్టుకోలేదు. ఆ తరువాత డాక్టర్ని అడిగి సేఫ్టీ వాడాను. కానీ నా దురదృష్టం.. నీకు వచ్చేసింది’ తల బాదుకుని ఏడుస్తూ చెప్పాడు శౌర్య. ఎంత సులువుగా చెప్పేశాడో..!? నిన్నటి నుంచి ఎన్నో ఆలోచనలు! శౌర్యకి టెస్ట్ చేయించి నెగెటివ్ వస్తే.. ఇక అతని జీవితంలో నుంచి తప్పుకోవాలనుకున్నాను. ఆ నిర్ణయం ఎంత బాధ కలిగించినా సరే.. పాజిటివ్ మాత్రం రాకూడదని ఎంతమంది దేవుళ్ళను మొక్కుకున్నాను!? ఇదే మాటా పెళ్ళికి ముందు చెప్పినా నేను ఒప్పుకునేదాన్ని. శౌర్య అంటే నాకంత ఇష్టం. ‘మోసం చేశావ్ శౌర్యా.. దారుణంగా మోసం చేశావ్!’ గోడకానుకుని ఏడుస్తుండగా.. అత్తయ్య వచ్చినట్టుంది. శౌర్య ఏవేవో చెబుతున్నాడు కానీ నాకేం వినిపించడం లేదు. సగం సగం మాటలు.. ఏవో చెబుతుంటే.. అనుమానంగా తలుపు దగ్గర నుంచి విన్నాను. పలుచటి మంచు పొర కరిగిపోయింది. అత్తయ్య కిటికీ దగ్గరకు వచ్చి ‘అమ్మా మహితా! వాడి మాటలు విను. నిన్ను మోసం చెయ్యాలని కాదు, నిన్ను వదులుకుని బతకలేక అలా చేశాడు.’ శౌర్య కన్నా ఆవిడ మాటలే నాకెక్కువ గుచ్చుకున్నాయి. ఆమెకూ ముందే తెలుసు. ఎంత మోసం! ‘హు..! నేను కోడల్ని కదా?’ చాలా నిస్పృహగా ఉంది. ఇక అక్కడ ఉండబుద్ధవ్వలేదు. బట్టలు, సర్టిఫికెట్స్ అన్నీ సర్దుకుని వెనుక గుమ్మం తలుపు తీసుకుని.. బయటకొచ్చేశాను. ‘మహితక్క అంటే నువ్వేనా?’ చిన్న పాప వచ్చి అడిగింది. తలూపాను. ‘గౌరీ అక్క నిన్ను మా దగ్గరికి తీసుకెళ్ళమంది. దా.. బ్యాగ్ ఎక్కడుంది?’ చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ అడిగింది. ఆ అమ్మాయి వెనుకే అప్రయత్నంగా కదిలాను. చిన్న గది, మూడు మంచాలున్నాయి ఆ గదిలో. ‘అదేమో నాది, ఇదేమో మా తమ్ముడిది. నువ్వు ఈ మంచం తీసుకో!’ ముద్దుగా పంపకాల లెక్కలు చెప్పింది పాప. అవేం పట్టనట్టు పరధ్యానంగా నాకు చూపించిన మంచంపై వాలాను. మనుషుల్ని ఎలా మోసం చేస్తారు? అంత సులువుగా ఎలా మోసపోయాను? ‘నువ్వు నీ తల్లిదండ్రులను చేసింది మోసం కాదా?’ అంతరాత్మ ప్రశ్నించింది. ప్రేమంటేనే మోసమా? సమాధానం లేని ప్రశ్న. ఒక్క రోజులో మారిపోయిన నా జీవితం.. నాకే విచిత్రంగా అనిపిస్తోంది. మర్నాడు యోగా హాల్ అని.. అక్కడకు తీసుకెళ్ళింది పాప. అందరూ ఆసనాలు వేస్తున్నారు. నేను బయటికొచ్చి బెంచ్‌పై కూర్చున్నాను. మొహం మీద సూర్య కిరణాలు పడుతున్నాయి. ‘హాయ్ ఐయాం కిరణ్’ నా మీద కాస్తా పెద్దవాడేమో.. నవ్వుతూ చెయ్యిచ్చాడు.‘మహిత’ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చెప్పాను. కవలలు.. ముద్దుగా ఉన్నారు. ‘వాళ్ళకి అమ్మ, నాన్న లేరా?’ కిరణ్‌ని అడిగాను. ‘ఇద్దరూ చదువుకుని జాబ్ చేస్తున్న వాళ్ళే. డెలివరీ టైమ్‌లో హెచ్ఐవీ అని తెలిసింది. ఆమె ఆ దిగులుతో చనిపోతే, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు.’‘అంటే ఆ పసిపిల్లలకు..?’ లేదని చెప్పాలి అని మనసులోనే వేడుకుంటూ అడిగాను. ‘ఇంచుమించు ఇక్కడున్న ప్రతి పిల్లలవీ ఇలాంటి కథలే మహితా! వాళ్ళకు ఏ మాత్రం సంబంధం లేకుండానే చావును మోస్తూ తిరుగుతున్నారు. కొందరిది అమాయకత్వం, కొందరిది మూర్ఖత్వం. ఇంకొందరు డబ్బు కోసం ఒళ్ళమ్ముకుని ఇప్పుడు ఆ దారి కూడా లేక వీథిపాలైన వాళ్ళు. విచిత్రం ఏమిటంటే చదువుకోని వాళ్ళ కన్నా చదువుకుని మోసపోయిన వాళ్ళే ఎక్కువిక్కడ’ అన్నాడు. ‘నువ్వెందుకున్నావ్ కిరణ్?’ ఆ చిన్న పరిచయం ఇచ్చిన చనువుతో ఏకవచనంలోనే ప్రశ్నించాను. ‘మీరా.. తన పేరు! ప్రేమించుకున్నాం. ఒక మైకంలో హద్దులు దాటాం. తనకి నేనే అంటించానని నా మీద తోసేసి పారిపోయింది. తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. ఇంతమంది వద్దనుకున్న బతుకు నాకు మాత్రం ఎందుకనిపించింది. హెచ్ఐవీ అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అంతే మహిత. మందులు వాడితే కొన్ని ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి, కొన్నింటికి సమయం పడుతుంది. దీని వ్యవధి మాత్రం జీవితకాలం అంతే! మన కోరికలు, ఆశలు ఏవీ నాశనమయిపోవు. హ్యాపీగా మన లైఫ్ మనం లీడ్ చెయ్యొచ్చు. ఇదే నేను తెలుసుకున్నాను. చాలామందికి ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాను’ అన్నాడు కిరణ్. కిరణ్ సమాధానం.. నిన్నటి నుంచి భయపడుతున్న నా ప్రశ్నలన్నింటికీ సమాధానమైంది. ఇంచుమించు ఇద్దరం ఒకే సిట్యుయేషన్లో ఉన్నామనిపించింది. ‘మీరా మోసం నీకు బాధ కలిగించలేదా?’ అడిగి.. కిరణ్ జవాబు కోసం ఎదురుచూడసాగాను. ‘పుట్టుకతోనే ఎవరూ మోసగాళ్ళు కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్ని జరిగాకనే.. వారు లోకం ముందు మొసగాళ్ళలా నుంచుంటారు’ అంటూ లేచి నిలబడి చేతులు విశాలంగా చాపి ఆ బిల్డింగ్ ఆవరణను చూపిస్తూ ‘మీరా మోసం విలువ ఈ ఫాండేషన్’ అని చెప్పి.. ‘ఐయాం వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కల్పతరువు.. వెల్కమ్ మహితా!’ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కర్తవ్య బోధచేస్తున్నట్టుగా అనిపించింది. 420వసారి మోగుతున్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి కిరణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. -నార్కిడిమిల్లి జ్యోతి శ్రీ (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
దేశంలోని సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా ఏది?
అది కేరళలోని ఒక జిల్లా. అక్కడి పౌరులందరికీ రాజ్యాంగంలో నియమనిబంధనలు, హక్కులు గురించి క్షుణ్ణంగా తెలుసు. జిల్లాలోలోని ప్రతీ పౌరుడు రాజ్యాంగాన్ని చదివాడు. ఇటువంటి విలక్షణత కలిగిన జిల్లా దేశంలో ఇదొక్కటేనని చెప్పవచ్చు. ఈ జిల్లా పేరు కొల్లాం. ఈ జిల్లాలలో 10 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరికీ రాజ్యాంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. రెండేళ్ల క్రితం కేరళలోని పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. ‘సిటిజన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఈ జిల్లాల్లోని పిల్లలు, పెద్దలు, అధికారులు, శ్రామికులు ఇలా అందరూ రాజ్యాంగాన్ని చదివి, దానిపై అవగాహన ఏర్పరుచుకున్నారు. కొల్లాం జిల్లా జనాభా 14 లక్షలు. ఈ జిల్లాలోని వారికి వివిధ పంచాయతీలు, కొల్లాం జిల్లా యోజన సమితి, కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ ఎడ్మినిస్ట్రేషన్ మొదలైనవన్నీ ‘సిటిజన్-2022’ కింద రాజ్యాంగంపై అవగాహన కల్పించాయి. ఈ నేపధ్యంలో కొల్లాం రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా మార్పునొందింది. 2023 జనవరి 14న కేరళ సీఎం పినరయి విజయన్ కొల్లాం జిల్లాను భారత తొలి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా ప్రకటించారు. జిల్లాలోని 7 లక్షల కుటుంబాలకు చెందిన 23 లక్షల మంది పౌరులకు రాజ్యాంగ అక్షరాస్యతను అందించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కొల్లంలో దాదాపు 90% మందికి అవగాహన తరగతులు నిర్వహించారు. ఫలితంగా జిల్లాలో సంపూర్ణ రాజ్యాంగ అక్షరాస్యత సాధ్యమయ్యిందని అధికారులు చెబుతున్నారు. -
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు!
సాక్షి: "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది.కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం. ఎంత ఎంత ఎడమైతే... అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు,తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం. మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు. మూడు భారతీయ భాషల విశేషం.. తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు,అని ఎందరెందరో కీర్తించారు. మిగిలిన భాషలను గౌరవిస్తూనే,మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.సర్వమత సహనం వలె,సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి, 10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి. ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్,స్పానిష్,జర్మన్, ఫ్రెంచ్,అరబిక్,రష్యన్,పోర్చుగీస్, జపనీస్,హిందీ,ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి. భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. జనని సంస్కృతంబు సకల భాషలకు.. "జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు. ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో,రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది. భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది. విద్యా బోధనలో, ఉద్యోగ, ఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం. ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. తల్లిభాష తల్లిపాల వంటిది.. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. వ్యాకరణం లేకపోతే పునాదిలేని భవనంలా భాషలు దెబ్బతింటాయి. నిన్నటి వరకూ మైసూర్లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు. వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత. - మాశర్మ -
వర్జీనియాలో కొలకలూరి ఇనాక్‌తో ఆత్మీయ సమ్మేళనం!
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్టోబరు 7న లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధానులు శ్రీ నరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని కథా-నవలా రచయిత, ఫిలిం మేకర్, ఇనాక్ అమెరికా పర్యటన పర్యవేక్షకులు వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, సాహిత్యాభిమానులు వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, సాహిత్యాభిమానులు ప్రసాద్ చెరసాల, కవి చంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డల సంయుక్త నిర్వాహణలో జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో దేన్ని అయినా, ఎంతటి కఠినాత్ములని అయినా ప్రేమతో మాత్రమే జయించవచ్చని, శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని తెలిపారు. బలహీనులని పీడిస్తే , ఏదో ఒకరోజు వారు తిరగబడతారని బలవంతులు గ్రహించాలని అన్నారు. తన రచనలన్నీ సమాజంలోజరిగిన సంఘటనలే అని వాటి ద్వారా కొంత నయినా అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. సభాధ్యక్షులు నరాల రామిరెడ్డి మాట్లాడుతూ, ఇనాక్ సభలో అధ్యక్షత వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇనాక్ రచనలు చాలా చదివానని, సాహిత్యంలో కథ, నవల, పద్యం, వ్యాసం ఇలా ప్రతి అంశాన్ని సృజించి ప్రతి ప్రక్రియలో అవార్డులు పొందిన ఘనత ఇనాక్ గారిదే అని అన్నారు. సభా నిర్వాహకులు వేణు నక్షత్రం మాట్లాడుతూ.. ఇనాక్‌కి ఇప్పటికే వచ్చిన ఎన్నో అవార్డులతో పాటు ఉత్తమ తండ్రి అనే అవార్డు కూడా ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే ఇనాక్ తన ముగ్గురు పిల్లలు ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా కేవలం ప్రతిభతో అత్యుత్తమ చదువులు చదివి సమాజంలో అధ్యాపకులుగా, క్లాస్ వన్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఇనాక్ గారి సాహిత్యం ఎంతో ఉపయోగపడిందని వేణు నక్షత్రం అన్నారు. ఇనాక్ రాసిన మునివాహనుడు కల్పిత నవల అంశం ఇప్పుడు సమాజంలో మునివాహన సేవగా ప్రాచుర్యం పొందడం లాంటి ఘనత ఇనాక్ రచనలకే చెందిందని కొనియాడారు. రవి వేలూరి , రమేష్ రావెళ్ల గారు ఇనాక్ని, నరాల రామిరెడ్డి ని శాలువాతో సత్కరించారు. కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షులు సతీష్ వడ్డీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతీ సంవత్సరం ఒకసారి ప్రత్యేక సాహిత్య సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిసానని అన్నారు. అమెరికాలో తెలుగు సంస్థలు ప్రతి రెండేళ్ళకోసారి కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహిస్తారని, అందులో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని, అందుకే ప్రతి సంవత్సరం ఒక సారి ప్రత్యేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తే, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారవుతారని వేణు నక్షత్రం తెలుగు సంఘాలని కోరారు. వాషింగ్టన్, మేరీలాండ్, వర్జీనియా ప్రాంతంలోని సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం: ప్రపంచలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యం కేటగిరిలో 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. కాగా, 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. ఇక, ఇప్పటికే రసాయన శాస్త్రం, భౌతిక, వైద్య రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రకటించారు. తాజాగా సాహిత్యంలో నోబెల్ ప్రకటించారు. శాంతి కేటగిరిలో ప్రకటించాల్సి ఉంది. The 2023 Nobel Prize in Literature is awarded to the Norwegian author Jon Fosse “for his innovative plays and prose which give voice to the unsayable". (Pic: The Nobel Prize) pic.twitter.com/RI2jThwOYV — ANI (@ANI) October 5, 2023 -
శాంతం–సంగీతం
వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి. వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు. ‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం. త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి. మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..
మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం! ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు. సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు. ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ గారిని కోరారు. పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ సాహితీ వేత్తల కందలేదు! పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు (చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి) -
ఆదిభట్ల అంటే 'హరికథ'..'హరికథ' అంటే..
తెలుగు వారిని ఊరించి ఊగించి ఉప్పొంగించిన కళాస్వరూపాలలో అపురూపమైనది 'హరికథ'. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల అంటే హరికథ - హరికథ అంటే ఆదిభట్ల. వీరికి పూర్వం కూడా హరికథ ఉంది,హరికథకులు ఉన్నారు. ఈ ప్రక్రియకు కొత్తరూపును, సరికొత్త ప్రాపును తెచ్చినవాడు కేవలం నారాయణదాసు. సంగీత సాహిత్య సార్వభౌముడుగా, లయబ్రహ్మగా ప్రసిద్ధుడు. 'హరికథా పితామహుడు'గా సుప్రసిద్ధుడు.'ఆటపాటల మేటి'గా అనంత వైభవశ్రీమంతుడు. ఆధునిక కాలంలో,తెలుగునేలపై ఇంతటి బహుముఖ ప్రతిభామూర్తి మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సామాన్యులను, అసామాన్యులను అనుపమానంగా మెప్పించి 'హరికథ'కు పట్టం కట్టిన ప్రతిభాశాలి.కేవలం తెలుగువారే కాదు,యావత్తు భారతీయులు,ఆంగ్లేయులు సైతం ఆయన ప్రజ్ఞకు మోకరిల్లారు. బహుకళా ప్రావీణ్యం,బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము."ఆధునిక కాలంలో నా దృష్టిలో దైవాంశ సంభూతులు ముగ్గురే ముగ్గురు. ఒకరు అసమాన దేహబల సంపన్నుడైన కోడి రామ్మూర్తి, ఇంకొకరు మారుత వేగ కవితా స్వరూపులైన కొప్పరపు కవులు, మరొకరు పంచముఖీ పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాసు"..... అని 'కవి సమ్రాట్ ' విశ్వనాథ సత్యనారాయణ ఒక సమావేశంలో నారాయణదాసు శక్తి స్వరూపానికి అక్షరార్చన చేశారు. నారాయణదాసుపై అద్భుతమైన పరిశోధన చేసి డాక్టరేట్,గోల్డ్ మెడల్ తీసుకున్న డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ (గుంటూరు) ఈ విషయాన్ని ఆత్మీయుల దగ్గర చెబుతుండేవారు. కథాగానం చేస్తూ..ఏకకాలంలో శరీరంలోని ఐదు భాగాలతో ఐదు తాళలను మేళవించడం అతిమానుష శక్తిగా (సూపర్ హ్యూమన్ ) నాటి మహాకవి పండిత,క ళామూర్తులు నిలువెల్లా భజించారు. రెండు చేతులు,రెండు కాళ్ళు, తలతో అయుదు తాళాలకు దరువు వేసి చూపించే ఆ ప్రజ్ఞ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు. అది అనితర సాధ్యం. ఇంతటి శక్తి కేవలం నారాయణదాసుకే వశమైంది. ఇది నభూతో ! న భవిష్యతి! గా పెద్దలందరూ నిర్ణయించారు. మహారాష్ట్రలో 'అభంగులు', తమిళనాడులో 'కాలక్షేపం', కర్ణాటకలో 'హరికథా కాలక్షేపం', మనకంటే కాస్త ముందుగా రూపుదిద్దుకున్నాయి. మనకు 'యక్షగానం ఉంది. ఉన్నప్పటికీ, హరికథకు - యక్షగానానికి కొన్ని పోలికలతో పాటు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. నారాయణదాసు చేతిలో 'తెలుగు హరికథ' సర్వాంగ సుందరంగా కొత్త రూపును దిద్దుకుంది, తీరు మార్చుకుంది, కొంగ్రొత్త వన్నెలు, వయ్యారాలు పోయింది. మరాఠా, తమిళ, కన్నడుల ప్రభావంతో, మన తెలుగుదేశంలో నారాయణదాసు కంటే ముందు కొందరు హరికథా ప్రదర్శనలు చేశారు.' కథాగానం' మూలంగా రూపుదిద్దుకున్న ఈ కళ అత్యంత ప్రాచీనమైంది. మిగిలిన రాష్ట్రాలలో సంగీతం, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం అనేవి ఉండేవి కావు. సంగీతం,కవిత్వం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ సర్వ కళాస్వరూపం మన ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తిన 'హరికథా రూపం. హాస్య ప్రసంగాలు, పిట్టకథలు, విసుర్లు,చెణుకులు, చమత్కార భరితమైన చాటుపద్య మణిమంజరులతో,గజ్జెకట్టి, చిరు తాళాలు మోగిస్తూ... నారాయణదాసు హరికథా ప్రదర్శన చేస్తూంటే... కొన్ని వేలమంది ఒళ్ళు మరచి,ఆ రససముద్రంలో మునిగితేలేవారు. తెల్లవార్లూ సాగే ఆ ఆటపాటలతో అలిసిసొలసి పోయేవారు. ఆదిభట్ల వారి 'బేహాగ్' రాగ ప్రస్థానానికి 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ మంత్రముగ్ధుడైపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజనీదేవి వంటి విజ్ఞులు,ప్రాజ్ఞులు ఎందరో ఆదిభట్లవారి ప్రజ్ఞకు నీరాజనాలు పట్టారు. విజయనగరంలో ఐదుతాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి 'పంచముఖీ పరమేశ్వర' బిరుదును గెలుచున్న ఘనుడు ఆదిభట్ల. హరికథలే కాక, అష్టావధానాలు చేశారు. తెలుగు,సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లిష్, అరబ్బీ, పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం. శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని - సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. తాత్వికత సిద్ధాంతాల శాస్త్ర గ్రంథాలు రాశారు. హరికథలు, ప్రబంధాలు,శతకాలు, నాటకాలు,అనువాదాలు ఇలా అనంతముఖంగా ఆ రచనా విన్యాసం విజృంభించింది. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను అనువాదం చేసిన తీరు అనన్య సామాన్యం.నాలుగు విధాలుగా ఆ అనువాదం సాగింది. పారశీలో నుంచి సంస్కృతంలోకి, అచ్చ తెలుగులోకి అనువాదం చేశారు. పీట్స్ జెరల్డ్ ఇంగ్లిష్ లో రాసిన దానిని కూడా అచ్చతెలుగు,సంస్కృతంలో భిన్న ఛందస్సుల్లో అనుసృజన చేసిన తీరు ఆదిభట్లకే చెల్లింది. 'నవరస తరంగిణి' అద్భుతమైన రచన.కాళిదాసు సంస్కృత కవిత్వం,షేక్స్ పియర్ ఇంగ్లిష్ సాహిత్యంలోని నవరసాలను తెలుగులో అనువదించిన వైనం అనితర సాధ్యం.'దశవిధ రాగ సవతి కుసుమ మంజరి' మరో మాణిక్యం. మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఈ రచన సాగింది.ఋగ్వేదంలోని ఋక్కులను స్వరపరచి వీణపై వినిపించడమే కాక,ఎందరికో నేర్పించారు.ఆ ఋక్కులను తెలుగుగీతాలు గానూ సృష్టించాడు.ఆయన 'శంభో..' అంటూ నినాదం చేస్తూంటే.. విజయనగరం మొత్తం వినపడేది. కేవలం,ఆయన గురించే విజయనగరంలో సంగీత విద్యాలయాన్ని స్థాపించారు.దానికి ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఉత్సాహం చూపించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఎన్నో రచనలు చేశారు.ఎన్నో వేషాలు వేశారు. 'అచ్చతెలుగు'పై మక్కువ ఎక్కువ పెంచుకొని విశిష్టమైన కృషి చేశారు, రచనలు అందించారు. నూరుగంట, మొక్కుబడి,వేల్పువంద,తల్లి విన్కి (లలితా సహస్ర నామం), వెన్నుని వేయిపేర్ల వినికరి (విష్ణు సహస్ర నామ కీర్తనం) మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అనేక అచ్చతెలుగు పదాలను సృష్టించారు. ఆయన ముట్టని కళ లేదు.ఆయనకు దక్కని బిరుదు సత్కారాలు లేవు.తెలుగునాట గజ్జెకట్టి కథ చెప్పే ప్రతి హరిదాసు మొట్టమొదటగా తలుచుకొనేది నారాయణదాసునే.సర్వ విద్యా పారంగతుడు,సర్వ కళాస్వరూపుడైన ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు.ఆన్నీ స్వయంగా సిద్ధించినవే.రససిద్ధిని చేకూర్చినవే.చెన్నపట్టణానికి చెందిన భాగవతార్ కుప్పుస్వామి నాయుడు విజయనగరంలో చెప్పిన హరికథ విని,నారాయణదాసు 'ధ్రువ చరిత్రం' అనే హరికథను రాశారు.అదే ఆదిభట్ల రచించిన మొట్టమొదటి కథ. సొంత కీర్తనలు,భాగవత పద్యాలు, పంచతంత్రకథలు కలిపి రూపకల్పన చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయంలో 1883లో తొట్టతొలిగా ప్రదర్శన చేశారు. కాళ్ళకు గజ్జెకట్టి ఆడిన ఆ ఆటే తర్వాత ' ఆటపాటల మేటి'గా అనంతమైన కీర్తిశిఖరాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సంస్థానంలో తొలిసారిగా సంగీత సాహిత్య సమలంకృతంగా 'అష్టావధానం' చేశారు. ఎవరో సవాల్ విసిరితే! రాత్రికి రాత్రి 'అంబరీషోపాఖ్యానం' హరికథను రూపొందించారు. అదంతా ధారణలో ఉంచుకొని, ఆ మర్నాడే అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అమితాశ్చర్యపరచారు. అది కూడా ఉర్లాం సంస్థానంలోనే జరిగింది. ఇది ఆయన రూపొందించిన రెండో హరికథ. 20 ఏళ్ళ వయస్సు రాకముందే ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు హరికథకు కొత్త రూపాన్ని ఇచ్చారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఏదైనా కేవలం ఒక్కసారి వింటే,హృదయంలో నాటుకుపోయేది. చిన్నప్పటి నుంచీ అదే తీరు. నాలుగేళ్ల వయస్సులోనే భాగవత పద్యాలు చదివేవాడు. పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ స్కూల్ ముఖమే చూడలేదు. కొన్ని వందల పద్యాలు, శ్లోకాలు,కీర్తనలు కేవలం విని హృదయస్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ ఏ పాసయ్యారు. పదేళ్ల ప్రాయంలోనే తాళపత్ర రచనలో ప్రావీణ్యం పొందారు. వీణావాదనా ప్రజ్ఞ కూడా సహజ ప్రతిభా సంస్కారాలతోనే అబ్బింది. బొబ్బిలి సంస్థాన విద్వాంసుడు వాసా సాంబయ్య దగ్గర కేవలం ఒక నెలరోజుల పాటు వీణలో శిష్యరికం చేశారు. తదనంతర జీవితంలో ఎందరో పెద్దలతో పరిచయ భాగ్యం ఏర్పడింది. వారి నుంచి అనేక విశేషాలు, మెళుకువలను తన సూక్ష్మగ్రాహ్య ప్రజ్ఞతో ఒంటపట్టించుకున్నారు. ఆ గానం,ఆ గాత్రం,ఆ ప్రదర్శనం,ఆ వ్యక్తిత్వం,ఆ వైభవం ఆన్నీ ముగ్ధమనోహరమైనవే.ఆయన ఆత్మకథ ' నా ఎరుక' పెను సంచలనం.తన ముప్పైఏళ్ళ వరకూ జీవితంలో సాగిన విశేషాలన్నీ అందులో ఉంటాయి.తన విలాస పురుషత్వం,రసికత్వం ఆన్నీ అక్షరబద్ధం చేశారు. ఏ అనుభవాన్నీ దాచిపెట్టని తెగువ ఆయనకే చెల్లింది. ఆయన జీవితమే ఒక ప్రభంజనం. ఆగష్టు 31 ఆదిభట్లవారి జయంతి.యఎనిమిది పదుల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన పరిపూర్ణుడు (1864-1945). సూర్యనారాయణ నుంచి నారాయణదాసుగా మహా అవతారమూర్తిగా వాసికెక్కిన ప్రతిభామూర్తి. ఈ హరికథా పితామహుడు మన తెలుగువాడు. సర్వ కళలకు రేడు. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భాషోద్యమంలో పిడుగు గిడుగు!) -
భాషోద్యమంలో పిడుగు గిడుగు!
"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు. తెలుగు వెలుగు గిడుగు ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి. Warm wishes on #TeluguLanguage Day! The KMC team pays homage to Gidugu Venkata Ramamurthy, whose ideas and literary work for social reform endure, leaving an indelible mark on generations. pic.twitter.com/bnErRj3wmV — Commissioner Kadapa (@KadapaComsr) August 29, 2023 ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. The Governor said the Telugu Language Day marks the birth anniversary of eminent Telugu linguist, poet and visionary Sri Gidugu Venkata Ramamurthy.#Telugulanguageday #giduguvenkataramamurthy — governorap (@governorap) August 29, 2023 పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. #TeluguLanguageDay Gidugu Venkata Ramamurthy, born on 29 August 1863, was a Telugu writer and one of the earliest modern #Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a #language comprehensible to the common man #philately pic.twitter.com/15sG2jw4Q1 — South India Philatelists' Association, Chennai (@SIPA_chennai) August 29, 2023 అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక. మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి) -
''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..''
పొద్దు మీకింది. మొగులు మీద చుక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ఎపటి తీర్గనే ఆనంద్ బాగ్ చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మాదోస్తుల అడ్డ.‘‘ఎలచ్చన్లు దగ్గర బడుతున్నయి. లీడర్లు ఏం జేస్తున్నరు?’’ అని సత్నారి అడిగిండు.‘‘ముందుగాల సర్వేలు జేపిచ్చిండ్రు’’ అని యాద్గిరిజెపిండు.‘‘సర్వేలు ఎందుకు?’’‘‘ఎవలకు ఎంత బలముందో ఎర్క జేస్కునేతందుకు.’’‘‘ఎర్క జోస్కోని ఏం జేస్తరు?’’‘‘ఎవ్వలికి ఎక్వ బలముంటె గాల్లకు ఎమ్మెల్యె టికిట్ఇస్తరు.’’‘‘టికిట్ రానోల్లు ఏం జేస్తరు?’’‘‘గోడ దుంకుతరు. లేకుంటె రెబల్ క్యాండిడేట్లుగ పోటి జేస్తరు.’’‘‘అన్ని పార్టిల లీడర్లు ఏం జేస్తరు?’’‘‘పాదయాత్రలు జేస్తరు. బస్సు యాత్రలు జేస్తరు.’’‘‘ఇంకేం జేసిండ్రు?’’‘‘పార్టీ కార్యకర్తలకు ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు.’’‘‘ఎవలితోని ఇపిచ్చిండ్రు?’’‘‘ముందుగాల బిచ్చపతి అనేటి బిచ్చగానితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు. ‘ఒక్క పది రూపాయలు దానమియ్యి. దానమిస్తె పున్యమొస్తది. నీ పేరు జెప్పుకోని బత్కుత. నీ పెండ్లాం పిల్లలు సల్లగుంటరు అనుకుంట బిచ్చమడ్గాలె. బిచ్చమేసె దాంక సతాయించాలె. ఇండ్లల్ల అడుక్కునేటప్పుడు గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ ఎయ్యమ్మా అని పాడాలె. ధర్మతల్లీ! నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లి అయితది. నీ కొడ్కుకు కొల్వు దొర్కుతది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వడ్డాన వొస్తయి. చేతులకు బంగారి గాజులు,చెవులకు కమ్మలొస్తయి. నీ మొగడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. అమెరిక గొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావాలన్నాఇస్తడు. గింత ఉడుకుడు బువ్వెయ్యమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! గిలాసల జెరంత సల్లబొట్టు బొయ్యమ్మా అని అనాలె. బిచ్చం బెట్టెదాంక ఇంటి ముంగటనే ఉండాలె. ఇయ్యాల బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లుఅడ్గుడు మీకు అల్కగైతది’అనుకుంట బిచ్చపతి పాటం జెపిండు.థియరీ క్లాసులైనంక ప్రాక్టికల్స్ షురువైనయి. చిన్గిన అంగి, పైంటును పార్టీ కార్యకర్తలు దొడుక్కున్నరు. ఒక చేత్ల బొచ్చె, ఇంకో చేత్ల కట్టె బట్టుకున్నరు. కొందరు గుడి మెట్ల మీద గూసోని బిచ్చమడిగిండ్రు. కొందరు రేల్టేషన్ల, బస్టాండ్లల్ల బిచ్చమడిగిండ్రు. కొందరు గుడ్డోల్లు, కుంటోల్ల లెక్క యాక్టింగ్ జేస్కుంట బిచ్చమడిగిండ్రు.పొద్దు మీకినంకగా దినం అడ్క తెచ్చినయి గాల్లు బిచ్చపతికి సూబెట్టిండ్రు. గవ్విటిని జూసి గాడు మార్కులేసిండు.’’‘‘ఇంకెవలితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు?’’‘‘తిట్ల మీద పాటం జెపెటందుకు నర్సమ్మ అనేటామెను బిల్సిండ్రు. గామె తిట్లల్ల మషూర్. ముందుగాల తిట్టినంకనే గామె మాట్లాడ్తది. ‘నీ నోట్లె మన్నువడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్ దగ్గర బడ. నీ తలపండు బల్గ. నీకు పిండం బెట్ట. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూది బెట్ట. నీ చేత్ల జెష్ట మొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ యాపారం జెడ. నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు.బట్టె బాజ్ గానివి. బద్మాష్వి. సన్నా సివి. దద్దమ్మవు. బేకార్గానివి. నక్కవు. గజ్జి కుక్కవు.పందివి. జిల్ల పుర్గువు. నీ కాల్లు చేతులిర్గ. నీకు గత్తర్ దల్గ’ అనుకుంట నర్సమ్మ తిట్ల దండకం సదివింది. తిట్ల దండకంను చపాయించి తలా ఒక కాపి ఇచ్చిండ్రు.’’‘‘ఇంకెవ్వరితోనైన ట్రేనింగ్ ఇపిచ్చిండ్రా?’’‘‘ఒక గూండాను బిలిసిండ్రు. మీటింగ్‌లను ఎట్ల చెడగొట్టాలెనో, సూటి జూసి కోడిగుడ్లు, టమాటలు, పాత చెప్పులు ఎట్ల ఎయ్యాలెనో గాడు నేరిచ్చిండు. ఒక బైరూపులోడు వొచ్చిండు. రంగు బూస్కోకుంటనే యేసాలు ఎట్ల ఎయ్యాలెనో జెపిండు.ఇంకొగాయిన వొచ్చిండు. ఏం లేకున్నా గంటలు,గంటలు ఎట్ల సీచ్ గొట్టాలెనో పాటాలు జెపిండు.’’గీ తీర్గ మా దోస్తులు మాట్లాడుకుండ్రు. -తెలిదేవర భానుమూర్తి, సీనియర్ జర్నలిస్ట్,99591 50491 -
'ఆ చిన్నచూపే ఆమె కళ్లలోని కలలను చిదిమేశాయని తెలుసుకో'
అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వేర్వేరా? అంటే కశ్చితంగా కాదు అని చెప్పగలిగే ధైర్యం, సమానత్వం ఈ సమాజంలో ఉందా? ఆడవాళ్లకు దేశాన్ని పాలించే సత్తా ఉంది అని టీవీల్లో, పేపర్లో చూసి వాళ్లను మెచ్చకుంటారు..కానీ అలాంటి నైపుణ్యాలు ఉన్న ఆడపిల్ల నీ ఇంట్లోనూ ఉందని ఏనాడైనా తెలుసుకున్నావా? అబ్బాయిని పై చదువులకు పంపాలంటే ధూమ్‌ధామ్‌గా పంపే తల్లిదండ్రులు అమ్మాయిల చదువులకు మాత్రం ఆలోచిస్తున్నారు. ఆ డబ్బలన్నీ కట్నం కింద పోగేసి పెళ్లి చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది అనుకునేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇది ఎంతకాలం? అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పటికీ భయపడుతూ, భయపెడుతూ బతకాల్సిందేనా? నీ దృష్టిలో అబ్బాయే ఆదర్శనీయుడైతే, అమ్మాయి కూడా ఆధునికురాలే. మహిళ దేశాన్ని ఏలగలదు అనుకుంటావు. కానీ నీ కూతుర్ని మాత్రం ఇంకా ఆ పుక్కిడి పురాణాల్లోనే బంధిస్తున్నావు. నువ్వు కనీసం ఒక్కసారైనా ఇలా ఆలోచించలేదు.నువ్వుంటున్న ఆ గాఢాంధకారం వల్లే ఆమె ఇంకా వెలుగులను చూడలేకపోతుందని.ఒక్కసారి ఆ కళ్ళలోతుల్లోకి చూసే ప్రయత్నం చేశావా? నువ్వు చూసిన ఆ చిన్న చూపే ఆమె కళ్ళలో ఉన్న కలలను చిదిమేశాయని తెలుసుకో.తను ఒంటరై ఏడ్చిన ఆ కన్నీళ్ల బరువు తెలుసుకో.ఏ సమాజమైతే ఆమెను ఇన్నాళ్లు ఛీత్కరించిందో అదే హీన చూపు తనను ఇంకా అభద్రతా భావంలోకి నెట్టేసిందని తెలుసుకో.అయినా గతమంతా ఇదే కదా..అదే కథా!ఇప్పటికే ఆ చీత్కారాలే ఇంకా చెవుల్లో కర్ణకఠోరంగా మ్రోగుతూనే ఉన్నాయి. ఓ ప్రియ మిత్రమా.. ఇది నీకే ..ఇప్పటికీ నువ్వు పిశాచాల వేటకు బలికావలసిందేనా?నీ జీవితమంతా ఇతరులపై ఆధారపడడమేనా?కానీ వాళ్ళు నీ అసలు సిసలు నిర్వచనాన్ని ఎలా మరిచారు?బహుశా నీతో పోటీ పడలేమని వాళ్ల భయం కావచ్చు. అందుకే నీ లక్ష్యాలను అణచివేయాలని నిర్ణయించుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎలా మరచిపోయారు నిన్ను చేరుకోవడం అసాధ్యం అని.ప్రేమను పంచడంలో ఒక అమ్మ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని.నిస్వార్థమైన ప్రేమను చూపే కూతురి సంతోషం ముందర ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనందాలను తీసుకొచ్చినా సరిపోల్చలేమని.నీ కలల సామ్రాజ్యానికి నువ్వే మహారాణివైతే వేరెవరి విమర్శలు నీ స్థానాన్ని తగ్గించలేరని.. ఇంగ్లీష్ రచన -శ్రీయాన్షు, సెయింట్ ఆన్స్ స్కూల్,హైదరాబాద్ తెలుగు అనువాదం - శ్రీధర్ కందుకూరి, హైదరాబాద్ -
చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది. చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు. చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు. ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది. అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో. బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట. ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట. "నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట. "బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట. తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు) నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది. పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు
సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం. ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్‌ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి. తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. 18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్‌కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే. ‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం. ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ (నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి) -
గద్దర్ గళం... విప్లవ గానం
కరీంనగర్/ కరీంనగర్‌కార్పొరేషన్/ తిమ్మాపూర్: ఉమ్మడి జిల్లాతో గద్దర్‌కు ఎనలేని బంధం ఉంది. హుస్నాబాద్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం మర్రి చెన్నారెడ్డి నక్సల్స్‌పై నిషేధం సడలించిన సమయంలో ఆమరవీ రుల స్తూపాన్ని ఆవిష్కరించడం ప్రధాన ఘ ట్టమని చెప్పవచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రాజీనా మా చేసి 2006లో ఉపఎన్నికకు సిద్ధమైతే కళా కారులను, కవులను పోగు చేసి జిల్లాకేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో తెలంగాణ ధూంధాం వేదికకు పురుడుపోసిన అగ్రగన్యుల్లో గద్దర్ ఒకరు. దళిత, సామాజిక, వామపక్ష, కుల,వర్గ పోరాటాల్లో గద్దర్ తన పాటలతో జనాన్ని జాగృతం చేసిన తీరును ఉమ్మడి జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. ఆర్ నారాయణమూర్తి భావోద్వేగం గద్దర్ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది' అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల జైత్రయాత్ర.. పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల నిర్మాణా నికి ఊపిరులూదిన జగిత్యాల జైత్రయాత్రలో అప్పటి విప్లవ రఽథసారఽఽథులతో కలిసి గద్దర్ పాల్గొన్నారు. జననాట్య మండలి తరఫున గడీల్లో దొరల పాలన, వెట్టిచాకిరీ, భూస్వాముల ఆగడాలపై పాటతో ధ్వజమెత్తారు. సింగరేణి పరిరక్షణకు.. గద్దర్‌తో సింగరేణికి విడదీయరాని అనుబంధం ఉంది. సింగరేణి సంస్థ పరిరక్షణకు గోలేటి నుంచి కొత్తగూడెం వరకు చైతన్యయాత్ర నిర్వహించారు. సంస్థవ్యాప్తంగా గనులపై మీటింగ్‌లు నిర్వహించారు. ఏఐటీయూసీతో కలిసి సంస్థ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. మానేరుతీరం.. గద్దర్ పాట ప్రవాహం సిరిసిల్ల, వేములవాడలో సాగిన సాయుధ పో రాటంలో గద్దర్ పాట ప్రవాహమైంది. 1990 దశకంలో నిజామాబాద్‌లో జరిగిన అప్పటి పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ బహిరంగ సభకు జిల్లా నుంచి వేలాది మంది యువకులు తరలివెళ్లారు. లారీలు, బస్సుల్లో తరలివెళ్లి గద్దర్ సభలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో వందలాది మంది యువకులు పీపుల్స్‌వార్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. గద్దర్ గళంతోనే పోరుబాట స్వరాష్ట్ర సాధనలో ప్రతిఒక్కరూ పోరుబాట పట్టడానికి గద్దర్ గళమే కారణమని మేయర్ సునీల్‌రావు తెలిపారు. విప్లవోద్యమంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తుచేశారు. ఎర్ర జెండాను ఎత్తి పీడిత ప్రజలను పోరుబాట పట్టించిన వ్యక్తి అన్నారు. గద్దర్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటన్నారు. 1973 నుంచి పరిచయం 1973లో వేములవాడలో రైతుకూలీ సభలో పాల్గొనేందుకు జననాట్యమండలి గాయకుడిగా వచ్చిన గద్దర్‌తో పరి చయమైందని మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్‌రావు అన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక సామాజిక, దళిత, తెలంగాణ మలిదశ ఉద్యమాలతో పా టు సాంస్కృతిక ఉద్యమాల్లో పాలుపంచుకున్నానని గుర్తు చేశారు. తీరని లోటు ప్రజా యుద్ధనౌక, జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం అణగారిన వర్గాలకు తీరని లోటన్నారు. 1978లో వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్(ఆర్ఈసీ)లో మొట్టమొదటిసారి తాను ఇంటర్ విద్యార్థిగా గద్దర్‌ను చూశానని తెలిపారు. అప్పుడు విద్యార్థులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. పొడుస్తున్న పొద్దు అస్తమించింది ప్రజాగాయకులు గద్దర్ మరణం నమ్మలేకపోతున్నామని, పొడుస్తున్న పొద్దు అస్తమించిందని, గర్జించే గొంతు మూగబోయిందని మానకొండూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్‌స్టాయ్‌కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్‌స్టాయ్‌కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్‌కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్‌కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్‌కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్‌కి సరే, ప్రేమ్‌చంద్, శరత్‌లు నోబెల్‌కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్‌లిస్ట్‌లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
పుస్తక మర్యాద
ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హ్యాండిల్ చేస్తారు. కొందరు నీటుగా బుక్ మార్క్స్ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మడుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్లైన్ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తకం తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు. ఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి. ఫ్యోదర్ దోస్తోవ్స్కీ నవల ‘ద పొసెస్డ్’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్ ్స’, ‘డెవిల్స్’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్నివిధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్ షతోవ్ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు. దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు. వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బైండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్‌లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్ చేయిస్తున్నారు.’’ 1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్చస్థితిని అందుకొందనుకునే రష్యా సైతం ఒక దేశంగా చదివే సంస్కతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి? ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్ వెర్కోవెన్ స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల (సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్స్పియర్, రఫేల్ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తం కంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం. నిజమైన ఫలం. బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్ స్కీ. ఇది ఆర్ట్ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తిలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు. ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గంవాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన నవల ‘పొసెస్డ్’. విషాదాంతంగా ముగిసే ఈ సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే సముచిత మర్యాద! -
ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!
అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం. ‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్ జావేద్. 2022లో ‘ద ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రై జ్’ను స్వీకరించారు. ‘నేమత్ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్ ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్ వ్యాపారవేత్త జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్సైట్లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్ వర్క్’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్ లిస్ట్ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్ లిస్ట్ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్ డేస్’ నవలకుగానూ బెన్యామిన్ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్ హబీబ్ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్’ నవలకుగానూ ప్రైజ్ గెలుచుకున్న ఎస్.హరీశ్ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్ పగల్ నేరత్తు మయక్కమ్’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాక్వీ’ని కూడా ఈ ప్రైజ్ వరించింది. రచయిత ఎం.ముకుందన్ . 2019లో ‘ద ఫార్ ఫీల్డ్’ నవలకుగానూ మాధురీ విజయ్ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు. పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అయితే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు! -
పారిస్ పవనాలు
తెలుగువాళ్లు ఉగాది జరుపుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రపంచ సాహిత్యానికి ‘వసంతం’ వచ్చింది. సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన మ్యాగజైన్ గా పేరున్న ‘ద పారిస్ రివ్యూ’ తన 70వ వార్షికోత్సవ ‘స్ప్రింగ్’ సంచికను ఈ వారంలోనే విడుదల చేసింది. అన్ని సంచికలనూ క్రమసంఖ్యతో వెలువరించే సంప్రదాయం ఉన్నందున పత్రిక పరంపరలో ఇది 243వ ఇష్యూ. 2018లో మ్యాన్ బుకర్ గెలుచుకుని, అదే ఏడాది నోబెల్ పురస్కారం పొందిన పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ ఇంటర్వ్యూ ఈ సంచిక విశేషాల్లో ఒకటి. కవిత్వం, వచనం, కళలకు అత్యంత ప్రాధాన్యముండే ఈ పత్రికలో రచయితల అంతరంగాలను లోలోతుల నుంచి అత్యంత సూక్ష్మంగా, విశదంగా స్పృశించడం మొదటినుంచీ ఒక ప్రత్యేకతగా నిలిచిపోయింది. నేపథ్యం, రాసే విధానం, విచారధారతో పాటు సాహిత్య సృజనను ప్రయోగ శాలలో పరిశీలించినంత లోతుగా జరిపే కాలాతీత సంభాషణలు ఇవి. ‘ఒక రాత్రి ఓ స్నేహితుడు నాకు ఫ్రాంజ్ కాఫ్కా కథల పుస్తకం అరువిచ్చాడు. నేనుంటున్న లాడ్జికి తిరిగివెళ్లి ‘ద మెటమార్ఫసిస్’ చదవడం మొదలుపెట్టాను. ఆ మొదటివాక్యమే నన్ను దాదాపు మంచంలోంచి కిందపడేసినంత పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మొదటి వాక్యం ఇలా ఉంది: ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’ అని తన సాహిత్య ప్రస్థానం గురించి చెబుతారు గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘ఫిక్షన్ నా జర్నలిజానికి సాహిత్య విలువను ఇచ్చింది. జర్నలిజం నా ఫిక్షన్ ను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు చేసింది’ అంటారు ఈ పాత్రికేయ రచయిత. ‘నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను’ అని చెబుతారు తన మాతృభాష రష్యన్ కు దూరమైన వ్లాదిమీర్ నబకోవ్. ‘అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ’ అంటారు ఈ పర్ఫెక్షనిస్టు. ‘నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పే భారత మూలాలున్న ట్రినిడాడ్–బ్రిటిష్ రచయిత వి.ఎస్.నైపాల్, ‘మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను’ అంటారు. ఎర్నెస్ట్ హెమింగ్వే, జేమ్స్ థర్బర్, రే బ్రాడ్బరీ, స్టీఫెన్ కింగ్, రేమండ్ కార్వర్, మాయా ఏంజెలో, లిడియా డేవిస్ లాంటి వందలాది మేటి రచయితల ఇంటర్వ్యూలను ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ ’ విభాగంలో ప్రచురించింది పారిస్ రివ్యూ. జార్జ్ లూయీ బోర్హెస్, హారుకీ మురకామి, మిలన్ కుందేరా, సైమన్ దె బువా, ఒర్హాన్ పాముక్, సల్మాన్ రష్దీ, చినువా అచేబే లాంటి భిన్న మూలాలున్న రచయితలు ఇందులో ఉన్నారు. ‘ది ఆర్ట్ ఆఫ్ పొయెట్రీ’గా రాబర్ట్ ఫ్రాస్ట్, టీఎస్ ఎలియట్, అక్తావియో పాజ్, పాబ్లో నెరూడా, ఎజ్రా పౌండ్ లాంటి కవుల సంభాషణలను నమోదు చేసింది. ఇవన్నీ ‘ద రైటర్స్ ఎట్ వర్క్’ పుస్తకాల సిరీస్‌గా వచ్చాయి. ప్రపంచ చరిత్రలో పట్టువిడవకుండా ఒంటిచేత్తో నెరిపిన సాంస్కృతిక సంభాషణగా దీన్ని అభివర్ణించారు సాహిత్య విమర్శకుడు జో డేవిడ్ బెలామీ. ఈ త్రైమాసిక ఆంగ్లభాష పత్రిక ఫ్రాన్ ్స రాజధాని నగరం పారిస్‌లో 1953లో ప్రారంభమైంది. 1973లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి తన కార్యస్థానాన్ని మార్చుకుంది. పత్రికను స్థాపించిన నాటి నుంచీ 2003లో మరణించేదాకా– యాభై ఏళ్లపాటు అమెరికా రచయిత జార్జ్ ప్లింప్టన్ దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన ముద్ర ఎంతటిదంటే, ఈయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బ్రిజిడ్ హ్యూస్... ప్లింప్టన్ గౌరవార్థం ‘సంపాదకురాలు’ అనిపించుకోవడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎమిలీ స్టోక్స్ సంపాదకురాలిగా ఉన్నారు. పత్రిక చరిత్రలో ఈమె ఆరో ఎడిటర్. ఫిలిప్ రాత్, ఇటాలో కాల్వీనో, శామ్యూల్ బెకెట్, డేవిడ్ ఫాస్టర్ వాలెస్ లాంటి మహామహుల రచనలు పారిస్ రివ్యూలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 24,000 ప్రింట్ కాపీల సర్క్యులేషన్, నెలకు సుమారు 12 లక్షల ఆన్ లైన్ వ్యూస్ ఇది కలిగివుంది. ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ‘ఎన్ని పోయినా మనకు ‘పారిస్’ మాత్రం ఉంటుంది’ అంటారు రచయిత వుహాన్ విడాల్. ‘పారిస్ రివ్యూ చచ్చేంత బోర్ కొడుతోందని ఎప్పటికీ అనలేం’ అంటారు పబ్లిషర్ జెస్సా క్రిస్పిన్ . ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయడంతో పాటు, ఆర్కైవు మొత్తాన్నీ అందుబాటులో ఉంచడం, అందులోని క్లాసిక్స్‌ను నవతరపు రచయితల వ్యాఖ్యానంతో పునఃప్రచురించడం లాంటివి కొత్త పాఠకులను పాత సాహిత్యంతో పరిచయం చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. 2012 నుంచీ మొబైల్ యాప్ ప్రారంభించింది. 2017లో పాడ్‌కాస్ట్ మొదలుపెట్టింది. సమకాలీన రచయితల రచనలను తమ గొంతుల్లోనే వినిపించడం కూడా మొదలుపెట్టింది. ఎలా రాయాలో శిక్షణ ఇచ్చే రోక్సానే గే తన ‘మాస్టర్ క్లాస్’లో వర్తమాన రచయితలకు ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా: పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలను లోతుగా చదవడం! సాహిత్యం రెండో ఆలోచనగా మాత్రమే ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సాహభరితం చేస్తూ, ప్రధాన స్రవంతికి తేగలిగింది ‘ద పారిస్ రివ్యూ’! -
సకల జన సమ్మతము
ఒక సాధారణ జీకే ప్రశ్నతో దీన్ని మొదలుపెట్టవచ్చు. తెలుగులో తొలి సంకలన కావ్యం ఏది? ‘సకల నీతి సమ్మతము’ అన్నది జవాబు. దీన్ని తెలుగులో తొలి నీతిశాస్త్ర గ్రంథంగానూ చెబుతారు. దీని సంకలనకర్త మడికి సింగన. తెలుగులో ఇలాంటి సంకలన గ్రంథాలకు శ్రీకారం చుట్టింది ఆయనే. సింగనది ప్రధానంగా రాజనీతి దృష్టి. తనకు పూర్వులైన ఆంధ్రకవుల గ్రంథాల నుండి అందుకు సంబంధించిన పద్యాలను మాల కట్టాడు. పంచతంత్రి (మనకు తెలిసిన పంచతంత్రం కాదు), కామందకము, ముద్రామాత్యము, నీతిభూషణము, బద్దెన నీతి, కుమార సంభవము, భారతము, రామాయణము, మార్కండేయ పురాణము, విదురనీతి, చారుచర్య, పురుషార్థసారము, పద్మ పురాణము లాంటి మిక్కిలి కావ్యాలు ఆయనకు ఆధారం. ఆ పద్యాలను తిరిగి నీతిశాస్త్ర ప్రశంస, ప్రజా పాలనము, రాజాదాయవ్యయ ప్రకారము, రాజునకు గొఱగాని గుణములు, కరణికపు నీతులు, పురోహిత నీతి, రాయబార ప్రకారము, చారుల నీతులు, అష్టాదశ వ్యసనములు అంటూ మూడు ఆశ్వాసములుగా విభజించాడు. పద్దు లెక్కలు ఎలా వేయాలో, రుణ పత్రాలు ఎలా రాయాలో కూడా ఇందులో ఉంటుంది. ఆయన గొప్పతనం పద్యాలను ఏర్చడంలోనే కాదు, కూర్చడంలోనూ ఉంది. ఆయా వర్గాల పద్యాలకు అతుకులుగా తన సొంత పద్యాలను రాశాడు. అందుకనో, అంతకుమునుపు ఈ సంకలన ప్రక్రియ లేనందునో తన కావ్యాన్ని ప్రబంధమనే చెప్పుకొన్నాడు. కానంతమాత్రాన దీని విలువ ఏమీ తగ్గలేదు. తరువాతి కాలంలో వచ్చిన సంకలన గ్రంథాలకు ఇది ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇలాంటి ఉత్తమ గ్రంథాన్ని మానవల్లి రామకృష్ణ కవి 1923లో సంపాదించి ప్రకటించారు. ఆ ప్రచురణకు ఇది శతాబ్ది సంవత్సరం. విస్మృత కవుల కృతులలో ఒకటిగా మానవల్లి దీన్ని వెలువరించారు. ‘ఆంధ్రపత్రికా ముద్రాక్షర శాల’లో ముద్రితమైంది. తిరిగి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ 1979లో దీన్ని ‘విద్యారత్న’ నిడుదవోలు వేంకటరావు, డాక్టర్ పోణంగి శ్రీరామ అప్పారావు సంపాద కులుగా ప్రచురించింది. తెలంగాణ సాహిత్య అకాడెమీ కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ముద్రించింది. మడికి సింగన క్రీ.శ.1420 ప్రాంతపువాడు. ‘ఓరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్టణమున కధీశ్వరుండగు కందన మంత్రి కాశ్రితుడై బహు గ్రంథముల రచించె’ని మానవల్లి రామకృష్ణ కవి రాశారు. ఇప్పటి వ్యవహారంలో చెప్పాలంటే తెలంగాణలోని ‘పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి’. పద్మ పురాణోత్తర ఖండము, భాగవతము దశమ స్కంధము(ద్విపద), జ్ఞాన వాసిష్ఠ రామాయణము ఆయన లభ్య రచనలు. ఆయన పేరు నిలిచి ఉన్నది మాత్రం సకల నీతి సమ్మత సంకలనకర్తగానే! ‘అల్లకల్లోలమైన దుగ్ధనిధి ద్రచ్చి / దేవామృతము తేటదేర్చుపగిది/ గంధకారుడు మున్నుగల వస్తువులు జోక గూర్చి సుగంధంబు గూడినట్లు/ అడవి పువ్వుల తేనెలన్నియు మధుపాళి యిట్టలంబుగ జున్ను వెట్టుభంగి/ దననేర్పు మెఱసి వర్తకుడు ముత్తెములీడు గూర్చి హారంబు తాగ్రుచ్చు కరణి’ రీతిలో ఈ గ్రంథం కూర్చానని సింగన చెప్పుకొన్నాడు. రాజసభలలో పద్యాలను గమకముతో, అంటే రసోచిత స్థాయులతో చదివే వారి వాచకం ఎట్లుండాలో– ‘వెనుకకు బోక హాయనక వేసట నొందక బంతి బంతిలో బెనపక... యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుడై యనుపమ భక్తితో జదువునాతని వాచకుడండ్రు సజ్జనుల్’ పద్యం చెబుతుంది. ‘రవికి మఱుగైన గొందిని దివియ’ ప్రకాశింపజేసినట్టుగా, అధికుడు తెలుపని యుక్తివిశేషాన్ని ‘చిఱుతవాడు’ చెప్పగలండంటుంది ఇంకొక పద్యం. ‘సరస కవిత రుచి యెఱుగని పురుషుల బశువులని నిక్కముగ నెఱుగు’మంటుంది మరొకటి. ‘కుక్క తోక బట్టుకొని మహాంబుధి దాట’డం, ‘తల్లి సచ్చినను జూదరి లేచిపోవండు’ లాంటి వాడుకలు, జాతీయాలు ఇందులో కనిపిస్తాయి. వాఙ్మయ పరిశోధన మనకు 15వ శతాబ్దిలోనే, అంటే మడికి సింగనతోనే మొదలైందంటారు పెద్దలు. అంతకుముందున్న కావ్యాలను చదివి, వాటిని క్రోడీకరించి, ఒక్కచోట అందుబాటులో ఉంచారు కదా! ‘‘ఆంధ్ర సాహిత్య పరిశోధనా రంగమున సింగన ప్రథముడు; అతని కృతి తెలుగున ప్రథమ పరిశోధనా గ్రంథము’’ అంటారు నిడుదవోలు వేంకటరావు. ‘‘అయితే, ప్రస్తుత కాలము వలె, ఆ కాలమున పరిశోధనకు పట్ట ప్రదానము లేదు. అంతే భేదము.’’ మనం సంబరపడటానికి ఇంకొక విషయం కూడా ఉన్నది. అంతకుముందు ఇంత నిధి ఉన్నదని మరోమారు రుజువవుతోంది కదా! సకల నీతి సమ్మతమును వెలికి తెచ్చిన మానవల్లి రామకృష్ణ కవి(1866–1957) మద్రాసులో జన్మించిన బహుభాషా పండితుడు. పదహారేళ్లకే ‘కవి’ బిరుదును పొందినవాడు. తెలుగు ‘కుమార సంభవం’ కావ్యాన్ని వెలికి తీసి, నన్నెచోడుని పేరును లోకానికి చాటిన మహానుభావుడు. అనంతర గొప్ప పరిశోధకులైన వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల రామచంద్ర వంటివారికి మార్గదర్శి. తాళపత్ర గ్రంథాల కోసం ఆయన ఊరూరా తిరిగేవారు. వాటిని ఇవ్వడానికి ఆ యజమానులు ఒప్పుకోకపోతే అక్కడే చదివి ఏకసంథాగ్రాహిలా బసకు వచ్చి అక్షరం పొల్లుపోకుండా రాసుకునేవారట. ‘నైజాము రాజ్యమున... అమరచింత రాజాస్థానామున’ ఆయన ‘సకల నీతి సమ్మతము’ లిఖిత ప్రతిని చూశారు. మానవల్లి తన అవసాన దశలో కఠిన దారిద్య్రాన్ని అనుభవించి, వీధుల వెంట భిక్షాటన చేస్తూ బతికాడంటారు. కానీ ఆయనే తెలుగు సాహిత్య లోకానికి కావ్య సిరులను భిక్షగా వేశారని చెప్పాలి. ఆయన తన పేరును ‘మా– రామకృష్ణ కవి’ అని పూర్వపు తెలుగు పద్ధతిలో రాసుకునేవారు. అలా ఆయన ‘మా రామకృష్ణ కవి’ అవుతారు, మన రామకృష్ణ కవి అవుతారు. మన మడికి సింగన! మన రామకృష్ణ కవి!! -
కాంతులీనిన కళా కౌముది.. ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: సాహిత్యం, చిత్రలేఖనం తదితర కళలకు వేదికగా నిర్వహించిన 13వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సైఫాబాద్ లోని విద్యారణ్య పాఠశాలలో జరిగిన ఈ వేడుక 3 రోజుల పాటు నగర వాసులను అలరించింది. ఆద్యంతం.. వైవిధ్యం.. చివరి రోజైన ఆదివారం తొలి ప్యానెల్ చర్చలో భారతీయ ఒంటరి యువతి.. దగ్గర తనం కోసం అన్వేషణ, స్వేచ్ఛ అనే అంశంపై వరల్డ్ బ్యాంక్ ఉద్యోగినిగా సేవలు అందిస్తున్న శ్రేయణ, సి.రామమోహన్‌రెడ్డిల మధ్య డెస్పరేట్లీ సీకింగ్ ఫర్ షారూఖ్ రచనపై జరిగిన సంభాషణ అర్థవంతంగా సాగింది. హైదరాబాద్ బుక్ 2 ఆఫ్ ది పార్టిషన్‌పై రచయిత్రి మన్రీత్ సోథీ, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సోమేశ్వర్ సాతి, ఎ.సునీతలు చర్చ చరిత్రలోకి తొంగిచూసింది. అదే విధంగా పలు అంశాలపై ప్యానెల్ చర్చలు ఆసక్తికరంగా సాగాయి. కావ్యధారలో భాగంగా సరోజిని నాయుడు కవిత నుంచి స్ఫూర్తి పొందిన బర్డ్ ఆఫ్ టైమ్‌ను నగరానికి చెందిన కాలేజ్ ప్రొఫెసర్, నృత్య కళాకారిణి మైథిలి ప్రదర్శించారు, హమ్ ఐసీ బోల్లీ పేరిట హైదరాబాద్‌కి చెందిన పలువురు కవుల సమూహం అందించిన కవితలు స్థానికతకు పట్టం కట్టాయి. వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్‌షాప్‌లో పర్యావరణ వేత్త నల్లపురాజు చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తించాయి. భారతీయ సైన్ లాంగ్వేజ్‌పై సంబంధిత నిపుణురాలు అంజుఖేమాని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా సైన్స్ స్టోరీస్ ఫర్ ఆల్ అంటూ రోహిణి చింత సైన్స్‌ని కొత్తగా వినిపించారు. మూవీ ఇమేజెస్‌లో నాచో–మియా కంపోజర్ ప్రదర్శన... ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇండీ ఎక్స్‌ప్రెస్ సంగీతం వీనుల విందు చేయగా, తుది కార్యక్రమంగా నిర్వహించిన మనాల్ పాటిల్, రవి గైక్వాడ్ల స్టాండప్ కామెడీ ఆహూతులకు నవ్వుల్ని పంచింది. నృత్యం, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం.. ఇలా విభిన్న అంశాల మేలు కయికగా సాగిన ఫెస్ట్‌ని ఆహూతులు, కళాభిమానులు బాగా ఆస్వాదించారు. రెండేళ్ల విరామం తర్వాత కూడా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తనదైన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. -
మహాత్మా! చూస్తున్నావా!!
ఓ మహాత్మా! చెడు అనకు, వినకు, చూడకు అన్న పలుకులు నీవైతే నేటి సమాజానికవే ప్రీతిపాత్రం. అహింసాయోధుడవు నీవు, హింసా వీరులు నేటి నాయకగణం. సర్వమత ఐక్యత నీ పథం అనైక్యతే నేటి జనుల మార్గం. మద్యం వద్దని నీవు, అదే ముద్దని నేటి ప్రభుత. మహిళా సాధికారత నీ కల, మరి నేడో కలకంఠి కంట కన్నీరు చూడందే నిద్రపోని పాషండులెందరో! గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి, దాని అభావానికై నేటి పాలకుల శక్తివంచన లేని కృషి. నీవు చూపిన నాటి విరి బాట నేటి రాజకీయులకు ముళ్లబాట. సమానతే నీ ధ్యేయం, అసమానతే నేటి తరం లక్ష్యం. నిరాడంబరతే నీ భావనైతే ఆడంబరయుత పోకడలు నేటి యువత చిరునామా! నాటి నీ పాదయాత్ర ఏకతా రాగమైతే నేటి పాదయాత్రలు హింసాయుత మార్గాలు, శాంతి భద్రతల భగ్నానికి దగ్గర దారులు. బాపూ! నీ మార్గంలో నేటితరం పయనించేలా దీవించవా! – వేమూరి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం (నేడు మహాత్మా గాంధీ వర్ధంతి) -
హక్కుల రక్షణకు రచయిత కాపలాదారు కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూ క్యాంటీన్లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం... గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు వైవిధ్యం... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు. అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్‌ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్: రెండో రోజు విశేషాలు ఇవే..
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు ‘ది లాస్ట్ హీరోస్–ఫూట్ సోల్జియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడ మ్’ అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 10.50 నుంచి 11.35 గంటల వరకు ‘కాన్స్టిట్యూషన్ : ఏ సిస్ఫియన్ లైఫ్ ఇన్ లా’ అనే అంశంపై ప్రొఫెసర్ కల్పన కన్నబీరన్, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడతారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 11.40 గంటల నుంచి 12.25 వరకు ఎవరెస్టు అధిరోహించిన విజేతలు అపర్ణ తోట, పూర్ణ మాలావత్లతో ఉమా సుధీర్ ప్రత్యేక కార్యక్రమం. ► కావ్యధార వేదికపై ఉదయం10.50 గంటలకు బహు భాషా కవితా పఠనం. దీప్తి నావల్, జెర్రీ పింటో, కల్యాణీ ఠాకూర్లు పాల్గొంటారు. ► స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా ఉదయం 10 .30 నుంచి 11.20 వరకు ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ ఆసక్తికరమైన కథలు చెబుతారు. ► మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు గోవా భాషలు (గోవా బార్డరీ బర్రెట్టో) అనే అంశంపైన ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో,జెర్రీ పింటో మాట్లాడతారు. గిరిధర్‌రావు సమన్వకర్తగా వ్యవహరిస్తారు. ► మధ్యాహ్నం 3.40 నుంచి 4.25 వరకు విమెన్ ఇన్ సైన్స్ అనే అంశంపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. నస్రీన్ ,వినీత బాల్, సాగరి రాందాస్, తదితరులు పాల్గొంటారు. ► సాయంత్రం 5.20 నుంచి 6.20 గంటల వరకు ఫుగ్డీ అండ్ ధాలో కొంకణి జానపద నృత్యరూపకం. ధ్యానజ్యోతి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ► సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు నాన్ నూకడ్ వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమం. వరిజశ్రీ వేణుగోపాల్ నిర్వహిస్తారు. -
మూడు రోజులు.. పదమూడు వేదికలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవం(హెచ్ఎల్ఎఫ్) సంబరంగా ప్రారంభమైంది. సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విద్యారణ్య స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లిటరరీ ఫెస్టివల్ ఆరంభమైంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రచయిత దామోదర్ మౌజో ముఖ్య అతిథిగా హాజరు కాగా, జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈశాన్యరాష్ట్రాల నుంచి దక్షిణాది కేరళ, తమిళనాడు, ఒడిశా, తదితర అన్ని రాష్ట్రాలకు చెందిన సాహితీప్రియులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్,తదితర దేశాలకు చెందిన రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్యోత్సవం కోసం 13 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల పాటు సాహిత్యం, కళలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన సుమారు 150 కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 250 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. (క్లిక్ చేయండి: పేరెంటింగ్.. కూతురు నేర్పిన పాఠం) -
సామాజిక మాధ్యమాలపై సాహిత్య వెలుగులు
సాక్షి, అమరావతి: సాహిత్యం అంకాత్మక (డిజిటల్) వేదికలనూ ఆక్రమిస్తోంది. సాంకేతిక తరంగాలపై సరికొత్తగా వెలుగుతోంది. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్, జూమ్, గూగుల్ మీట్ వంటి సోషల్ మీడియా యాప్‌లతోపాటు ప్రత్యేక బ్లాగుల్లోనూ తెలుగు సాహిత్యం విస్తరిస్తోంది. మరుగున పడుతున్న కళలను, కళాకారులను వెలుగులోకి తీసుకువస్తున్న సామాజిక మాధ్యమాల్లో ఇటీవల సాహిత్య రచయితలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అంతర్జాతీయంగా వారందరినీ ఏకం చేస్తూ.. సాహిత్య పరిమళాలను అంతర్జాలంలో వెదజల్లుతోంది. సామాజిక మాధ్యమాల ప్రవేశంతో.. సాహిత్యం పద్య ప్రక్రియ నుంచి చంపూ కావ్యాలుగా, ద్విపదలుగా, వచన గద్యాలుగా, గేయాలుగా, పాటలుగా అనుకూలతలను బట్టి ఆధునిక కాలానికి పయనం సాగించింది. వ్యాసాలు, కథానికలు, నవలలు, రుబాయిలు, గజల్స్ వంటివి సైతం ఇలా వచ్చినవే. ఆ తరువాత నానీలు, హైకూలు, నానోలు, మెరుపులు, త్రిపదలు అంటూ అనేక ప్రక్రియలతో రచయితలు జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయారు. సామాజిక మాధ్యమాల ప్రవేశంతో ఆధునిక సాహిత్య ప్రక్రియలు సైతం వాటి రూపాలను మార్చుకుని మరింతగా ప్రపంచంలో విస్తరించడం మొదలైంది. అలవోకగా, ఆటవిడుపుగా తమ భావాలకు అక్షర రూపం కల్పించే ఎందరో రచయిత(త్రు)లకు, అనేక సరికొత్త ప్రక్రియలకు సోషల్ మీడియా వేదికైంది. ఛందస్సు ఆధారంగా కొన్ని ప్రక్రియలు రూపొందగా, నిర్వాహకులు మరికొన్ని ప్రక్రియలను పరిచయం చేస్తున్నారు. అలా సమ్మోహనాలు, పెన్ కౌంటర్లు, షాడోలు, సున్నితాలు, సూర్య వర్ణాలు, పంచపదులు, నవరత్నాలు, సిసింద్రీలు, హరివిల్లు, కిటుకులు, దోహాలు వంటి ఎన్నో రకాల ప్రక్రియలు రూపొందాయి. సోషల్ మీడియా వేదికగా సాహితీ సంస్థలు కోకొల్లలుగా వెలిశాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యకారులను సోషల్ మీడియా వేదికలపై ఏకం చేస్తూ.. తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నాయి. నిత్యం అనేక ప్రక్రియలపై పోటీలు సైతం నిర్వహిస్తూ సర్టిఫికెట్లను డిజిటల్‌గానూ, పోస్టులోనూ అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. తెలుగు సాహిత్యం ప్రజ్వరిల్లేలా అంతర్జాల సమావేశాలను నిర్వహిస్తున్నాయి. కాగా, కొన్ని సంస్థలకు ఎటువంటి ప్రామాణికం లేకపోవడం, వారిచ్చే గుర్తింపు పత్రాలపై ఎలాంటి రిజిస్ట్రేషన్ నంబర్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితేనేం తెలుగు భాష ప్రాచుర్యానికి దోహదపడే ఏ పదమైనా, ఏ ప్రయత్నమైనా గొప్పదేననే వాదన కూడా ఉంది. ఆత్మ పరిశీలనతో రచనలు చేయాలి ఒకప్పుడు రచనలు ప్రచురితం కావాలంటే పత్రికలకు పంపించి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. అవి ప్రచురించిన తరువాత పాఠకుల్లోకి వెళ్లి వారు చదివి తమ స్పందనను తిరిగి లేఖల రూపంలో పత్రికకు పంపితేగానీ రచన ఎలా ఉందనేది తెలిసేది కాదు. ఇప్పుడలా కాదు. రాసిన వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. క్షణాల్లో అందరికీ చేరిపో తోంది. స్పందన కూడా వెంటనే వచ్చేస్తోంది. కళాకారులైనా, రచయితలైనా తమ ప్రయత్నానికి వెంటనే ఫలితం రావాలని కోరుకుంటుంటారు. కా కపోతే పత్రికల్లో ఉన్నట్టు ఇక్కడ ఎడి టర్లు ఉండరు. అందుకని రచయితలు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుని, సమాజా నికి పనికివచ్చే మంచి రచనలు చేయాలి. – పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత్రి అడ్మిన్లు బాధ్యతగా ఉండాలి సోషల్ మీడియా ప్రభావం నేటి తరం రచయితలపై చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శనలకు వస్తున్న రచనలపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదు. దీనివల్ల కొందరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిలో సాహిత్య సమూహాలను నడిపే నిర్వాహకులు (అడ్మిన్స్) ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే సాహిత్యాన్ని వారు వెంటనే తొలగించాలి. భాషకు సంబంధించి తప్పొప్పులను నిస్సంకోచంగా సభ్యులకు తెలియజేస్తుండాలి. ఇలా చేయగలిగితే సోషల్ మీడియా వల్ల తెలుగు సాహిత్యానికి మంచి జరుగుతుంది లేదంటే తాము రాసిందే గొప్పఅనుకుని, కొందరు బాగుందని చెప్పగానే ఇక భాషపై పట్టు సాధించేశామనుకుంటున్నారు. అది సాహిత్యానికి మంచిది కాదు. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ(బాల) పురస్కార గ్రహీత సంఘర్షణ పెరుగుతోంది సోషల్ మీడియాలో సాహిత్య వేదికల వల్ల అనేక రకాల రచనలు, కవితలు, కథలు వెలుగులోకి వస్తున్నాయి. భిన్న భావజాలాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కొంత సంఘర్షణ పెరుగుతోంది. అది మంచా.. చెడా అనేది చెప్పడం సాధ్యం కాదు. భాషతో పనిలేకుండా తమకు వచ్చింది రాస్తున్నారు. గతంలో తమ భావాలను చెప్పలేకపోయిన వారు ఇప్పుడు స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు రావడం అనేది గొప్ప పరిణామం. సోషల్ మీడియాలో వస్తున్న ఈ మొత్తం భావజాలం అంతా సమాజానికి ప్రతిబింబం వంటిది. ఇది కొందిరికి కష్టం కలిగించవచ్చు. కానీ దీనిని పాలకులు, ప్రభుత్వాలు గమనిస్తుంటే సమాజంలో ఏం జరుగుతుందో, జనం ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. – కొలకలూరి ఇనాక్, ప్రముఖ రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరిష్టం వారిది ఎవరికి వారు రచనలు చేసేందుకు సోషల్ మీడియా దోహదపడుతోంది. సంఘంలో జరిగే పరిణామాలు, సమాజంలో ఎదురయ్యే అనుభవాలనే తమ రచనలుగా మలుస్తున్నవారు చాలా మంది ఉన్నారు. వాటిలో ఎలాంటి కట్టుబాట్లు లేవు. ఉండకూడదు. భాషకంటే ఇక్కడ భావమే ముఖ్యం. అన్ని రచనలకూ స్టాండర్డ్స్ ఉండాలని గిరిగీస్తే మంచి రచనలు కూడా రాకపోవచ్చు. ఒక్కొక్కరూ తమ జీవితంలో జరుగుతున్న ఘటనలనే కథలుగా, కవితలుగా రాస్తున్నారు. అవి ఎంతోమందిని కదిలిస్తున్నాయి. స్ఫూర్తి నింపుతున్నాయి. – కొచ్చెర్లకోట జగదీష్, డిజిటల్ క్రియేటర్, రచయిత -
హైదరాబాద్ సాహిత్యోత్సవం.. ప్రత్యేకతలు ఇవే
సాక్షి, హైదరాబాద్: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సాహితీ ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్) 13వ ఎడిషన్‌కు నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యారణ్య స్కూల్ వేదికగా వేడుకలు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్ సాహిత్యోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి నిరాటంకంగా (కోవిడ్ కాలం మినహా) జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యాన్ని గడించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, భిన్న భావజాలాలు, విభిన్న జీవన సమూహాలను ప్రతిబింబించే కళారూపాలకు, సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలకు ఇది వేదికగా నిలిచింది. మూడు రోజుల పాటు సాహితీ ప్రియులను అక్కున చేర్చుకొని సమకాలీన సాహిత్య, సామాజిక అంశాలపై లోతైన చర్చలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అతిథి దేశంగా జర్మనీ.. హెచ్ఎల్ఎఫ్ 13వ ఎడిషన్‌కు జర్మనీ అతిథి దేశంగా హాజరు కానుంది. ఆ దేశానికి చెందిన పలువురు రచయితలు, మేధావులు భాగస్వాములు కానున్నారు. ప్రముఖ జర్మనీ యువ నవలా రచయిత్రి ఎవేన్‌కో బుక్కోసీ ఈ వేడుకల్లో పాల్గొంటారు. జర్మనీ కళారూపాలను ప్రదర్శించనున్నారు. కొంకణి సాహిత్యం ఎంపిక.. ఈ ఏడాది కొంకణి భాషా సాహిత్యాన్ని భారతీయ భాషగా ఎంపిక చేశారు. గతేడాది జ్ఞానపీఠ అవార్డు పొందిన కొంకణికి చెందిన ప్రముఖ రచయిత దామోదర్ మౌజో ఈ వేడుకల్లో కీలకోపన్యాసం చేయనున్నారు. కొంకణి భాషా చిత్రాల దర్శకుడు బార్డ్‌రాయ్‌బరెక్టో పాల్గొంటారు. కొంకణి నృత్యాలు, జానపద కళలను ప్రదర్శించనున్నారు. ప్రముఖుల ప్రసంగాలు ప్రఖ్యాత దర్శకుడు దీప్తీ నవల్, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పాలగుమ్మి సాయినాథ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి గీతా రామస్వామి, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. జర్మనీతో పాటు అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్ చారిత్ర వైభవాన్ని, వాస్తు నైపుణ్యాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉషా ఆకెళ్ల రూపొందించిన ‘హమ్ ఐసీ బాత్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది అందరి వేడుక: ప్రొఫెసర్ విజయ్‌కుమార్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఈసారి మెట్రో రైల్ ప్రత్యేక ప్రచారం నిర్వహించనుంది. ఖైరతాబాద్ నుంచి విద్యారణ్య స్కూల్ వరకు మూడు రోజుల పాటు ప్రతి 15 నిమిషాలకో ఉచిత ట్రిప్పును ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) -
మరపురాని కవిసమ్మేళనం.. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’
జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనానికి హాజరు కావటం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. ఏటా ఆలిండియా రేడియో – భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన 22 భాషల నుంచి 23 మందిని (ఒక్క హిందీ భాష నుంచి మాత్రం ఇద్దరు) సెలెక్ట్ చేసి, ఏదో ఒక నగరంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో నిర్వహించిన సర్వభాషా కవిసమ్మేళనానికి తెలుగు భాష నుంచి నా కవిత ‘అమృతోపనిషత్’ ఎన్నికైంది. మొదటిరోజు (9వ తేదీ) ఢిల్లీ ఆకాశవాణి సమావేశ మందిరంలో రిహార్సల్స్ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రసారభారతి ఉన్నతాధికారులు హాజరై ప్రతి కవినీ జ్ఞాపిక, శాలువాలతో సగౌరవంగా సత్కరించారు. రెండోరోజు (10వ తేదీ) తొలుత మూలభాషలో కవిత చదివించి, వెంటనే హిందీ అనువాదం వినిపించారు. ప్రతి కవినీ ఆహ్వానించే ముందు ఆ కవి గురించి హిందీలో పరిచయం చేశారు. నేను సాహిత్యంలో చేసిన కృషి, ప్రచురించిన పుస్తకాలు, చేస్తున్న ఉద్యోగంతో పాటు... మా నాన్న స్మృత్యర్థం స్థాపించిన ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి కూడా యాంకర్ స్వచ్ఛమైన హిందీలో చెప్పి నప్పుడు నా భావోద్వేగం తారస్థాయికి చేరుకుంది. ఆ పెద్ద హాలులో తెలుగు తెలిసిన ఒక్కరూ లేకపోయినా, నా మట్టుకు నేను సీరియస్‌గా కవితను (ఆలిండియా రేడియో రికార్డింగ్ కోసం) చదివాను. ఆ తర్వాత డాక్టర్ పుష్పాసింగ్ నా కవితకు హిందీ అనువాదం చదివినప్పుడు, మంచి స్పందన వచ్చింది. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’ సభలో సందడి చేశాయి. ఆమె మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అరుదైన సందర్భంలో అన్ని రాష్ట్రాల కవులతో పాటు ప్రత్యేకించి గోవా, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులను కలవటం ప్రత్యేక అనుభూతి. వారి అనుభవాల్ని గ్రహించటం సాహిత్యంలో సరికొత్త పాఠాలు నేర్చుకోవటమే. పంజాబీ కవి గురుతేజ్తో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం దొరికింది. ఇండో–పాక్ బోర్డర్లో ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సింగ్ అనేక విషయాలు నాతో పంచుకున్నారు. కశ్మీరీ కవి డాక్టర్ గులామ్ నబీ హలీమ్ చలాకీగా తిరుగుతూ అందరినీ అల్లుకుపోయాడు. ఈ ఇద్దరూ నా ఇతర కవితల ఆంగ్లానువాదాలు తమకు పంపమని, వాటిని తమ భాషల్లోకి తర్జుమా చేస్తామని అడిగారు. నేను వేదిక దిగగానే ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు మహిళలు కూడా ఇదే అభ్యర్థన చేశారు. ఇవి నాకు సరికొత్త ద్వారాలు. నా రూమ్మేట్ అయిన మరాఠీ కవి అనిల్ సబాలే, పక్క గదిలో దిగిన సంథాలీ కవి గౌరు ముర్ము, పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసే మణిపురి కవి క్షేత్రి రాజన్ తదితరులతో ఎక్కువగా చర్చించే అవకాశం దొరికింది. నా సాహిత్యపు డైరీలో కొత్త మిత్రులు చేరారు. నా కవిత 21 భాషల్లోకి తర్జుమా అవుతుందన్న సంతోషం మరింత కిక్కిచ్చే అంశం. ఈ సర్వ భాషా కవిసమ్మేళనం జనవరి 25వ తేదీ రాత్రి 10 గంటలకు అన్ని రేడియో స్టేషన్ల నుంచి ప్రసారమవుతుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) – ఎమ్వీ రామిరెడ్డి, రచయిత -
అనగనగా ఓ కథ.. రాయలసీమ కథా కార్యశాల
రాయలసీమ కథా కార్యశాల.. అనగానే.. ఏంది కథ? అనుకున్నా.. ఏమిరా వీరశంకర్రెడ్డీ.. దీనివల్ల సమాజానికి లాభం? పొరపాటుగా అలవాటైన సినీ ‘సీమ’యాసలో నన్ను నేను ప్రశ్నించుకున్నా.. నిర్వాహకులకు మోయలేని భారమేమో.. మనుషులు రాకపోతే అవమానమేమో.. నమ్మకంతో కూడిన సందేహం వ్యక్తం చేసుకున్నా.. కడపలో కథా కార్యశాల ముగిసి రెండు వారాలవుతున్నా వదలని ఆ జ్ఞాపకాలు..అనుభూతులు.. అనుభవాలు పై సందేహాలను పటాపంచలు చేశాయి. చంచలమైన మనసుకు జవాబుదారీతనాన్ని నేర్పాయి. సమాజం నుంచే కథ పుడుతుందని.. కథ వల్ల సమాజం అర్థమవుతుందని.. ఇదే సమాజానికి ప్రయోజనకరమని అవగతమైంది. మంచి కథకు మనుషుల కరువేం లేదని.. వచ్చినోళ్లందరూ గొప్ప రచయితలుగా రూపొందకపోయినా సరికొత్త ‘మనుషులు’గా మారతారని .. మనసులను చూసే దృక్పథం ఒకటి అలవాటవుతుందని.. ‘మనో భార’మితి కనిపెట్టినంత సంతోషం వేసింది. హాజరు కోసం నేను గడిపింది కాసేపే అయినా.. కార్యశాల విజయగాథను వినిపించడానికి చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. కథ రాయడం ఓ కళ అని వర్ణించినా.. దానిని శాస్త్రీయంగా చెప్పి, ఇలా చెప్పడం పేద్ద కళ అని నేర్పకనే నేర్పించారు. రెండు రోజుల ప్రయాణంలో కొత్తదారిని కనుక్కునేలా చేశారు. – షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్ కడపలోని విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణం.. ఈ నెల 17, 18 తేదీల్లో రాయలసీమ కథాకార్యశాలకు విచ్చేసిన అతిరథ మహారచయితలు, భావి కథకులతో కళకళలాడింది. సీమకు చెందిన మూడు తరాల రచయితలతో పాటు కథారచనలో మెళకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది వర్తమాన కథకులకు వేదికైంది. లబ్దప్రతిష్టులు జీవితకథలు చెప్పేందుకు ఈ కార్యశాల పాఠశాలలా మారింది. ప్రసిద్ధ కథకులు డా.కేతు విశ్వనాథ్ రెడ్డి, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణల చేతుల మీదుగా కార్యశాల ప్రారంభమైంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు.. శాంతి నారాయణ, దాదాహయాత్, డా.మేడిపల్లి రవికుమార్, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, జి.ఉమామహేశ్వర్, డా.వి.ఆర్.రాసాని, శ్రీనివాసమూర్తి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.ఎన్.ఈశ్వర్ రెడ్డి, యువ పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య తదితరుల అనుభవాలకు సజీవశిల్పంలా నిలిచింది. చివర్లో ప్రసిద్ధ రచయిత డా.బండి నారాయణ స్వామితో కథారచన మెళకువలపై ముఖాముఖి నడిచింది. మొత్తానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి కథాకార్యశాల సాహితీలోకంలో సరికొత్త పరిమళాలు వెదజల్లింది. యువ కథకుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది. పేరుకు రాయలసీమ అని పెట్టినా.. గుంటూరు, ప్రకాశం, వైజాగ్, హైదారాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు హాజరు కావడం కార్యశాల ప్రాధాన్యత తెలిపింది. రాయలసీమ కథా కార్యశాలే కాదు.. ఇపుడు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కూడా విశేషంగా విజయవంతం కావడం.. తెలుగు సాహిత్యం ఎన్నటికీ సుసంపన్నమేనని స్పష్టతనిస్తోంది. 2022 వెళుతూ వెళుతూ సాహితీపంట పడించింది. 2023 తెలుగింట కథల పండుగ తెస్తుందని చెప్పింది. ఉపసంహారం ఇలాంటి కథా కార్యశాలలు మరిన్ని జరగాలి. ప్రతి చోటా నిర్వహించాలి. తద్వారా ప్రతి వ్యక్తి ఒక సంస్కారి కావాలి. ఇంటింటా సాహిత్యం విరబూయాలి. పుస్తక పఠనం మరింత పెరగాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రతి మనసు ఒక పుస్తకమై పరిమళించాలి. ఆపాదమస్తకం అనుభూతించాలి. కొత్తకథకు జీవితమవ్వాలి. కథకు(డికి) ఉండాల్సిన లక్షణాలు కథ జీవితం నుంచి, హృదయం నుంచి రావాలి. జీవితాంతం పాఠకుడి మనసులో నిలిచిపోవాలి. జీవితం పట్ల అవగాహన, విస్తృత పరిశీలన ఉండాలి. విమర్శనాత్మకంగా చూడాలి. కథ ఓ కళ. శ్రద్ధతో నిరంతరం సాహిత్య, జీవిత అధ్యయనం చేస్తే.. దానిని పదికాలాలు కళకళలాడేలా రాయవచ్చు. కథ ముందుగా మనసులో, మెదడులో, హృదయంలో, ఆలోచనల్లో నలగాలి. సమాజమే కథా కార్యశాల. సమాజంలోని చలనాలను, మార్పుని చూడగలగాలి. కథలకు సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రశ్నతోనే జీవితం బాగుపడుతుంది. ప్రశ్నలు వేయండి. వేసుకోండి. ఎంత ఎక్కువ చదివితే అంత చక్కగా రాయగలరు. అన్నీ మన జీవితకాలంలో అనుభవించలేం, చూడలేం.. కాబట్టి చదవాలి. చదవడం ద్వారా జీవితం, అనుభవాలు అక్షరీకరించగలగాలి. కథ ఉద్దేశ్యం వ్యక్తి సంస్కరణ. తద్వారా సమాజ సంస్కరణ. కథ సమస్య నుంచి సంస్కరణ దిశగా ఉండాలి. అయితే సందేశాలు ఇవ్వకూడదు, ఉండకూడదు. మార్పు వస్తుంది. నిదానం కావచ్చు. కానీ తప్పకుండా వస్తుంది. వ్యక్తులు మారితే కానీ సమాజం మారదు. బాహ్య పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. పాత కథే అయినా కథాంశం కొత్తగా ఉండాలి. దానిని ఎలా చెప్పాలనే విషయంలో మనదైన దృష్టికోణం కనిపించాలి. కథాంశం దగ్గరే కథ సగం విజయం సాధిస్తుంది. కథకు ఆది..మధ్య..తుది ఉండాలి. ప్రారంభం ఆసక్తిగా.. ముగింపు ఆలోచింపజేసేదిగా ఉండాలి. కథావస్తువుల ఎంపికలో పునరుక్తి లేకుండా చూసుకోవాలి. కథల్లో భాష సూటిగా, స్పష్టంగా, అత్యంత సహజంగా ఉండాలి. కథా శిల్పంలో సర్వం ఇమిడి ఉంటుంది.. శిల్పం వేరు భాష వేరు కాదు. కథ ఎలా చెప్పాలో, ఎవరి కోణంలో చెప్పాలో రచయిత సాధన చేయాలి కనిపించని వ్యవస్థ కూడా కథలో పాత్రేనని గుర్తుంచుకోవాలి. మనిషి మోసం... ప్రాంతానికి, సందర్భానికి అన్వయించుకుంటే ఆశ్చర్యపోయే అంశాలు కథలుగా మారతాయి. ప్రాంతీయత, మాండలికం పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేస్తాయి. పాత్రలు, జీవితం, సమాజం, ప్రకృతిలో సంఘర్షణ తప్పదు పాత్రలకు తమవైన నేపథ్యాలు, వైరుధ్యాలుంటాయి. ఉండాలి. సంఘర్షణ అనివార్యం. సంఘర్షణ ద్వారా పాత్రల మధ్య గొప్ప డ్రామా పుడుతుంది. కథల్లో పాత్రలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వాస్తవికతకు దగ్గరగా ప్రవర్తించాలి. వర్తమానానికి పునాది చరిత్ర. కథ చీకటి నుంచి వెలుగు వైపు నడిపించాలి . సమాజం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండాలి. కవిలో భావావేశం అవసరం. రచయితలో అనవసరం. రచయితకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. వర్తమాన రచయితలు విమర్శను తట్టుకోవాలి. -
ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..
(డెస్క్ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు. యువతలో సాహిత్యాభిలాష ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు, గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు. ఆనాడే అక్షరాంకురార్పణ అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్ 1939 మార్చి 15న డిక్లరేషన్ ఇచ్చారు. పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు. ఎందరో మహానుభావుల ప్రశంస నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం. ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ 2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు. ఆంధ్రి విశిష్టతలు ► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్ సీఆర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి. ► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది. ► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి. ► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది. ► ప్రెస్ అకాడమీ ఆర్కివ్స్ వెబ్సైట్లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం. – మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం -
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల
మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’. ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ సాండ్ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది. లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది. స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు. ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు. - పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి -
కళింగసీమలో స్వర్ణోత్సవ ‘వికాసం’
తెలుగునేలకు వెలుపల ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సంస్థ ‘వికాసం’ స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సంస్థ పూర్తిపేరు ‘వికాసాంధ్ర సాహితీ సాంస్కృ తిక సంవేదిక’. ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు అధ్యక్షతన 1970 నవంబర్ 14న ‘వికాసం’ ఆవిర్భవించింది. అవసరాల అధ్యక్షునిగా ఉన్నకాలంలోనే ‘మనం మనం బరంపురం’ కథా సంకలనాన్ని ‘వికాసం’ వెలువరించింది. అవసరాల విశాఖకు తరలిపోయాక, రష్యా నుంచి స్వస్థలమైన బరంపురం తిరిగి వచ్చేసిన డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ‘వికాసం’లో ఉన్నకాలంలోనే ఆయన ‘అతడు–ఆమె’ నవలను పూర్తిచేశారు. ఉప్పల లక్ష్మణరావు సారథ్యంలో ‘వికాసం’ ఆదర్శప్రాయమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకుంది. ‘వికాసం’ మలిప్రచురణ ‘ఉండండుండండి’ కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాద కత్వంలో వెలువడింది. బి.ఎల్.ఎన్.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు, సేతుపతి ఆదినారాయణ, మండపాక కామేశ్వరరావు, గరికిపాటి దేవదాసు, మురళీమోహన్, దేవరాజు రవి, వై.ఎన్.జగదీశ్, బచ్చు దేవి సుభ్రదామణి, పోతాప్రగడ ఉమాదేవి, సుశీల తదిత రులు తొలితరం సభ్యులు. ‘వికాసం’ సభ్యులు విజయచంద్ర, దేవరకొండ సహదేవ రావు, రమేష్‌రాజు తదితరులు కొంతకాలం ‘స్పృహ’ సాహితీ పత్రికను నడిపారు. శ్రీశ్రీ ఆవిష్కరించిన ఈ పత్రిక రెండున్నరేళ్ల పాటు కళింగాంధ్ర రచయితలకు వేదికగా నిలిచింది. కాళోజీ, శివారెడ్డి, నందిని సిధారెడ్డి, వంగపండు ప్రసాద్ తదితర కవి ప్రముఖులు ‘స్పృహ’ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ‘వికాసం’ అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఎందరో సాహితీ ప్రముఖులను బరంపురానికి ఆహ్వానించింది. ‘వికాసం’ వారం వారం సాహితీ సమావేశాలతో పాటు ‘నెలనెలా వెన్నెల’ క్రమం తప్పకుండా నిర్వహించేది. ఇందులో ఎందరో స్థానిక ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొని స్వీయరచనలను వినిపించేవారు. ప్రస్తుతం ప్రతినెలా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా, సాధ్యమైనంత విరివిగానే తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బరంపురంలోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి తదితర సంస్థలతో కలసి మెలసి పనిచేస్తోంది. ఒడిశాలో తెలుగు చదువులు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ ‘వికాసం’ యాభయ్యేళ్లుగా తన ఉనికిని నిలుపుకొంటూ రావడం విశేషం. ‘వికాసం’ స్వర్ణోత్సవాలు డాక్టర్ దేవరకొండ సహదేవరావు అధ్యక్షతన డిసెంబర్ 24, 25 తేదీల్లో బరంపురం ఆంధ్రభాషాభివర్ధనీ సమాజం ప్రకాశం హాలులో జరగనున్నాయి. శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, భూసురపల్లి వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అట్టాడ అప్పల నాయుడు, ఒడియా సాహితీవేత్తలు బంగాళి నందా, గౌరహరి దాస్ పాల్గొననున్నారు. ఇందులో కెవీవీఎస్ మూర్తి అనువదించిన ‘గౌరహరిదాస్ కథలు’, రొక్కం కామేశ్వరరావు ‘ముఖారి’ కవితా సంపు టితో పాటు, అంతర్ముగం (తమిళ అనువాదం), అంతర్ముఖ్ (హిందీ అనువాదం), ‘జ్ఞానా మృత్’ (హిందీ అనువాదం), ఇన్నర్ విజన్ (ఇంగ్లిష్ అనువాదం), పి. ఉమాదేవి ‘ఉమాదేవి సాహితీ సుమాలు’, విజయచంద్ర కవితల ఇంగ్లిష్ అనువాదం ‘విండ్స్ ఆర్ అలైవ్’, వరదా నర సింహారావు ‘కన్యాశుల్కం నాటకం: స్త్రీల స్థితిగతులు’, ‘మనం మనం బరంపురం’ రెండో ప్రచురణ, పన్యాల జగన్నాథ దాసు తొలి కవితా సంపుటి ‘ఏడో రుతువు కోసం’ విడుదల కానున్నాయి. – పన్యాల జగన్నాథ దాసు, సీనియర్ జర్నలిస్ట్ -
సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!
ఇటీవల సాహిత్య సభల్లో – అది పుస్తకా విష్కరణ సభ గానీ, ఇంకోరకం సభ గానీ– ఒక ధోరణి అంటువ్యాధి లాగా తయారైంది. ఆ సభలకి సంబంధించిన దాదాపు అన్ని ఆహ్వాన పత్రాల్లోనూ ఇలా ఉంటుంది: ‘‘ముఖ్య అతిథి, గౌరవ అతిథి, విశిష్ట అతిథి, ఆత్మీయ అతిథి’’– అని నాలుగు రకాల అతిథులూ, వారి పేర్లూ ఉంటాయి. ఇంతకీ, ఈ అతిథుల్లో ఎవరు ముందో, ఎవరు తర్వాతో, ఎవరు ఎక్కువ గొప్పో, ఎవరు తక్కువ గొప్పో తేల్చడం కష్టం. ఆ ఆహ్వాన పత్రంలో, ఏ వరసలో ఆ మాటలు రాశారో, బహుశా ఆ వరసలోనే వాళ్ళ అంతస్తు లేదా హోదా వుంటుందనుకోవాలేమో! అతిథుల్లో ఈ నాలుగు రకాల్నీ చూస్తే, చాతుర్వర్ణ వ్యవస్థ అంటారే అది గుర్తొస్తుంది. ఈ హైరార్కీని (అంతస్తుల వారీ సంబంధాలను) 11వ శతాబ్దంలో, రాజాస్థాన కవులు పాటిం చారో లేదో తెలియదు. కానీ, ఈ 21వ శతాబ్దంలో, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాల కాలంలో మాత్రం, ఆధుని కులూ, ఉత్తరాధునికులూ, అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ, దళిత వాదులూ, స్త్రీ–పురుష సమానత్వ వాదులూ... ఇలా అన్ని రకాల వారూ ఈ హైరార్కీని పాటిస్తు న్నారు. నోరు తెరిస్తే, ‘చాతుర్వర్ణ వ్యవస్థ’, ‘మనువాదం’, ‘బ్రాహ్మణీయ సంస్కృతి’, ‘ఫ్యూడల్ సంస్కృతి’, ‘పితృస్వామ్య సంస్కృతి’ అని మైకులు బద్దలయ్యేలాగా నినాదాలిస్తారు. మళ్ళీ ఆ అసమాన సంస్కృతినే పాటిస్తారు. అటు సభా నిర్వాహకులకు గానీ, ఇటు అతిథులుగా ఆహ్వానం పొందిన సాహిత్యకారులకు గానీ, ‘ఇదేమి పద్ధతి?’ అనే ఆలోచనే రావడం లేదు. ఈ మధ్య, ఇలాంటి ఆహ్వాన పత్రాలు మూడు వేరు వేరు సభలకి సంబంధించినవి, ఫోనులో నాకు అందాయి. వాటిని పంపిన వాళ్ళతో, ‘చాతుర్వర్ణాల్లాగా, ఇన్ని రకాల అతిథు లేమిటండీ?’– అంటే, ఒకరు ‘నిజమే’ అనీ; ఇంకొకరు ‘ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాం’ అనీ; మరొకరు, రాయ డానికి బద్ధకం వేసి, ఎమోజీలు అంటారే, ఒక నవ్వు బొమ్మా, రెండు నమస్కారాల బొమ్మలూ జవాబుగా పంపారు. కొందరు అతిథులు తమ పేరుకు ముందుగానీ, కిందగానీ, తమకు ఉన్న డిగ్రీల్నీ (డాక్టర్, ప్రొఫెసర్), ఇంతకు ముందు అనుభవించిన పదవుల్నీ (డైరెక్టర్, వైస్–ఛాన్సలర్), పొందిన అవార్డుల్నీ (అకాడెమీలో, పీఠాలో ఇచ్చిన వాటిని), ఇంకేమైనా అదనపు బిరుదులు వుంటే వాటినీ, ఆహ్వాన పత్రంలో రాయమంటారని విన్నాను. రైలు ఇంజను వెనక వరసగా రైలు పెట్టెల్లాగా ఆ విశేషణాల్ని పేర్చ మంటారన్నమాట! చాతుర్వర్ణ విమర్శను, ‘నిజమే’ అని అంగీకరించినాయన, ‘‘ఇంతకీ, ఈ సభల్లో ‘పంచములు’ ఎవరంటారు?’’ అని ప్రశ్న వేశాడు. ‘‘ఇంకెవరు? సభకి వచ్చి, ఈ గొప్ప అతిథులందరూ కూర్చున్న వేదికని ముట్టుకోడానికి వీల్లేనంత దూరంగా (అస్పృశ్యత), ప్రేక్షక స్థానాల్లో కూర్చుంటారే వారే పంచములు!’’ అని జవాబిచ్చాను. సాహిత్యసభల్లో పాటిస్తున్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఈ నాటిది కాదు. పాతికేళ్ళ కిందట, హైదరాబాదు యూనివర్సిటీలో, ఇతర విద్యార్థి సంఘాల వారి లాగే, ఒక దళిత విద్యార్థి సంఘం వారు, వాళ్ళ సభకి సంబంధించి ఒక ఆహ్వాన పత్రాన్ని నాకు ఇచ్చారు. ఆ పత్రంలో అన్ని అంతస్తుల అతిథుల పేర్లూ రాసి, ఆ పత్రాన్ని ఖరీదైన కవరులో పెట్టి ఇచ్చారు. ‘‘ఇదేమిటి బాబూ! సభకి వచ్చే వాళ్ళల్లో ఇన్ని తేడాలు ఎందుకు? ‘వేదిక మీద వాళ్ళే ముఖ్యులు, వేదిక కింద ఉన్న వాళ్ళు ముఖ్యులు కారు’– అనా? ‘వక్తలు’ అని, ఆ సభలో మాట్లాడేవారి పేర్లు రాస్తే సరిపోతుంది గదా? మాట మాట్లాడితే ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి!’ అంటారు. అసమానత్వాన్ని సూచించే పద్ధతిని మీరూ పాటిస్తే ఎలా? పైగా, ఇంత ఖరీదైన కవరు ఎందుకూ? ఆ డబ్బులేవో ఇతర వాటికి ఖర్చు చెయ్యవచ్చు గదా?’’ అన్నాను. దానికి, ఆ ఉద్యమకారుడి జవాబు: ‘‘మీ కమ్యూనిస్టులు చెయ్యడం లేదా ఈ రకంగా? ఈ కవరంటారా, ఒకతను చందాగా ఇచ్చాడు’’ అని. దానికి నా జవాబు: ‘‘కమ్యూనిస్టులు ఎప్పుడో చెడిపోయారు. వాళ్ళు బూర్జువా పార్టీలకి తోకలుగా తయారయ్యారు. మరి మీరు ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి! మనువాదం నశించాలి!’ అని భీకరంగా నినాదాలిస్తారే? ఈ విషయంలో, మీకూ మనువాదులకీ తేడా ఏమిటి?’’ అంటే జవాబు లేదు. జవాబు చెప్పాలంటే వారికి కష్టం. ఎందుకంటే, వారు ఆరాధ్య దైవంగా భావించే అంబేడ్కర్ అధ్యక్షతన తయారైన రాజ్యాంగంలోనే, చాతుర్వర్ణాలను తలపించే నాలుగు రకాల ‘బిరుదులు’ ఇచ్చే ఏర్పాటు ఉంది. పౌరులందరూ సమానులే అని ఒక వైపు చెపుతూనే, కొందరు భారతరత్నలు, కొందరు పద్మ విభూషణులు, కొందరు పద్మభూషణులు, మరికొందరు పద్మశ్రీలు! సాధారణ ఉద్యమకారులే కాదు, విప్లవవాదులు కూడా మనుషుల మధ్య ఉండే ఈ రకం అసమాన విభజనను (ఒక రకం వ్యక్తిపూజని) వ్యతిరేకించరు. ఎందుకంటే, ప్రపంచంలో ఎవ్వరూ చేయించుకోనన్ని వ్యక్తి పూజలు చేయించుకున్న ‘మహా మహో పాధ్యాయులైన కామ్రేడ్స్ స్టాలిన్, మావో’ల్ని ఎవరైనా విమర్శిస్తే ఈ విప్లవవాదులు సహించలేరు. సాహిత్య సభలలో, అతిథులందరూ వేదికను ‘అలంకరించి’, ఒకరు మాట్లాడుతుండగా, మిగతా వాళ్ళు ఇద్దరేసి చొప్పున చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అసలు ఒకరు మాట్లాడుతూ ఉంటే, మిగతా వక్తలందరూ, ఆ టైములో శ్రోతలే. వాళ్ళూ ప్రేక్షకులున్న చోటే కూచుని శ్రద్ధగా వినాలి. తమ వంతు వచ్చినప్పుడు, వేదిక మీదకి వెళ్ళి మాట్లాడాలి. ఇది తర్క బద్ధమైన ప్రవర్తన. సమానత్వ భావన. దీనికి విరుద్ధంగా జరిగే సభలకి ఆత్మగౌరవం గల వారెవరైనా వెళ్ళగలరా? (క్లిక్ చేయండి: ఎలా ఉంటే స్వతంత్రత?) - బి.ఆర్. బాపూజీ రిటైర్డ్ ప్రొఫెసర్ -
Kundurti Anjaneyulu: వచన కవితా మూర్తి
జాషువా, విశ్వనాథల ప్రేరణా ప్రభావాలతో పద్య కవిత రచనకు పూనుకున్నాడు కుందుర్తి ఆంజనేయులు. విశ్వనాథ వారి ప్రౌఢమైన శైలిలో ‘సౌప్తికం’ అనే కావ్యాన్ని రచించాడు. ఆయన 1922 డిసెంబర్ 16వ తేదీన నరసరావుపేట సమీపంలో కోటవారిపాలెంలో పేదకుటుంబంలో జన్మించాడు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో అనిసెట్టి, రెంటాల, బెల్లంకొండ రామదాస్, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. మాచిరాజు దేవీప్రసాద్ ప్రేరణతో శ్రీశ్రీ కవిత్వ లాలసుడై వచన కవిత్వం వైపు దృక్పథం మరల్చుకున్నాడు. నవ్యకళా పరిషత్, నరసరావుపేట ఆధ్వర్యంలో ఏల్చూరి, బెల్లంకొండ రామదాసులతో కలసి తెలుగులో తొలి వచనా కవితా సంపుటి ‘నయాగరా’ను 1944లో ప్రచురించాడు. తొమ్మిది కవితల సంపుటి నయాగరాలో కుందుర్తి రచించిన ‘మన్యం లోకి’ కవితలో మన్యం వీరుడు అరి విప్లవాగ్నిని ప్రశంసించాడు. ‘జయిస్తుంది’ కవితలో బ్రిటిష్ వారి దురాగతాలను నిరసించాడు. క్విట్ ఇండియా ప్రభావంతో అసమ సమాజాన్ని ఈసడిస్తూ ‘ఒకవేపున అధికోత్పత్తీ/ మరోవేపు డొక్కల కరువు’ ఇకపై సాగవని హెచ్చరిక చేశాడు. ఆయన కవితలపై శ్రీశ్రీ మరోప్రపంచం గేయం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘పాతకాలం పద్యమైతే / వర్తమానం వచన గేయం’ అంటూ ‘నాలో నినాదాలు’లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఎందరో అధునిక కవులను ప్రభావితం చేశాడు. అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి, సి. నారాయణ రెడ్డి, రెంటాల వంటి వారు వచన కవితను ఆదరించి వచన కవితా సంపుటాలు ప్రచురించారు. వచనకవితా మూర్తి కుందుర్తికి ఫ్రీవర్స్ ఫ్రంట్ ఊపిరి. ప్రాచీన కవిత్వంపై తిరుగుబాటు చేసి ‘రచనల పూలతోటలో ఛందస్సుల మొక్కలు నాటను’ అని ప్రతిజ్ఞ చేశాడు. ఆధునిక కాలానికి అనువైన ప్రక్రియ వచన కవిత్వ మేనని నిరూపించేందుకు ఎంతో శ్రమపడ్డాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వ్యాసాలు, పీఠికల ద్వారా వచన కవితా ప్రచారం ముమ్మరంగా చేసినందున కుందుర్తిని వచన కవితా పితామహుడిగా విమర్శకులు పేర్కొన్నారు. ఆశ, ఆచారిగారి అమ్మాయి, శిక్ష వంటి గేయ నాటికలు రాశాడు. తెలంగాణ, యుగేయుగే, నగరంలో వాన, నాలోని నాదాలు, కుందుర్తి కృతులు పాఠకుల మన్ననలు పొందాయి. ‘హంస ఎగిరిపోయింది’ అనే సతీస్మృతి కావ్యం విశిష్టమైంది. ఆయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రకృతిని సామాజిక స్పృహతో సమన్వయించటం, చమత్కారమైన అధిక్షేపణ, ఆకర్షణీయమైన అంత్యప్రాసలు ఎందరో యువకులను ప్రభావితం చేశాయి. ఆయన 1982 అక్టోబర్ 25వ తేదీన మరణించినా, వచన కవితా పితామహుడిగా ఆధునికాంధ్ర కవిత్వంలో చిరస్మరణీయుడు! (క్లిక్ చేయండి: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము) – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (డిసెంబర్ 16 కుందుర్తి ఆంజనేయులు శత జయంతి ముగింపు) -
ప్రపంచ సాహిత్యంలో అరుదైన ప్రక్రియ తెలుగు పద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలోనూ లేని అరుదైన ప్రక్రియ పద్యమని.. తెలుగు వారి సొత్తైన ఈ ప్రక్రియ కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుంక్తాధ్వర్యంలో సిటీ కళాశాలలో జరిగిన మహోన్నతం మన పద్యం విద్యార్థి పద్యగాన సభలో అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రాచీన పద్యాలలో ఉన్న మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటిని నేటితరం విద్యార్థులకు అందించడం, అలాగే పద్య పఠనం ద్వారా వారిలో ఏకాగ్రత, ధారణశక్తి, జ్ఞాపకశక్తి వంటిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పౌరాణిక నాటక పద్యాలలో గొప్ప జీవన విలువలున్నాయి. పౌరాణిక నాటకాల ప్రదర్శనతో తెలుగు పద్యానికి విస్తృతి పెరిగిందని రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ పాండవీయం తదితర పద్య నాటకాలు తెలుగు ప్రజానీకానికి గొప్ప సంస్కృతి సంతృప్తిని కలిగించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాల భాస్కర్ మాట్లాడుతూ... సిటీ కళాశాల విద్యార్థులలో చైతన్యం కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఘట్టి బాల చైతన్యం, పద్య పరిమళం వంటి సంస్థలలో శిక్షణ పొందిన 25 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల చిన్నారులు ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు, శతకాలలోని పద్యాలను రాగయుక్తంగా, భావ గర్భితంగా ఆలపించి ఆధ్యాపకులను, సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. (క్లిక్ చేయండి: తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు) -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
Telugu Children Books: మణిరత్నాలు ఈ పుస్తకాలు
ఆడుతూ పాడుతూ కాలం గడిపే పిల్లలను అందమైన ఊహా లోకంలోనికి తీసుకెళ్ళేవి కథలు. కథలు వినడమన్నా, చదవడమన్నా పిల్లలకు చాలా ఇష్టం. భావి భారతాన్ని అందంగా ఆవిష్కరించేది బాల సాహిత్యం. నేటి పిల్లలలో నైతికత, సామాజిక భావం, మానవత్వం, సహృదయత, ఆధ్యా త్మికత, క్రమశిక్షణ వంటి సుగుణ లక్షణాలు అలవడాలంటే, వారి కల్మషం లేని మనసులను సాహిత్యం వైపునకు మరల్చాలి. అందుకు సరైన వేదిక బాల సాహిత్యం. పాఠ్యపుస్తకాలు పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తే, కథల పుస్తకాలు వారిలో ఉన్న సృజనాత్మక అంశాలను, జీవన నైపుణ్యాలను అందిస్తాయి. సాహిత్యం ద్వారానే బాలలలో సంపూర్ణ వికాసం కలుగుతుందని వారికోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో సదా ముందుంటారు మణికొండ వేద కుమార్. వీరు ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి’ ఛైర్మన్‌గా ఉంటూ, దాదాపు మూడు దశాబ్దాలుగా బాల వికాసం కోసం పనిచేస్తున్నారు. ‘బాల చెలిమి’ పత్రిక, ‘బాల చెలిమి’ గ్రంథాలయాలు, నెల నెలా ‘బాల చెలిమి ముచ్చట్లు’ నిర్వహిస్తూ బాల సాహి త్యానికి ఎనలేని సేవ చేస్తున్నారు. తమ అకాడమీ ద్వారా పిల్లలు రాసిన అనేక పుస్తకాలను ముద్రించి, వారి రచనలు వెలుగులోకి తెస్తున్నారు. వేదకుమార్ సంకల్పానికి, బాల సాహితీ వేత్తలు గరిపెళ్లి అశోక్, పత్తిపాక మోహన్ తోడయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడి పిల్లలు రాసిన కథలను సేకరించారు. గరిపెళ్లి అశోక్ రాష్ట్ర కన్వీనర్‌గా ఉంటూ, వివిధ జిల్లాల్లోని కన్వీనర్లను సమన్వయపరుస్తూ, ఉపాధ్యాయుల ద్వారా పిల్లలు రాసిన కథలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 కథలు రాగా, కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు పలుమార్లు కథలను పరిశీలించి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారీగా ప్రచురణ కొరకు కథలను ఎంపిక చేశారు. ( క్లిక్ చేయండి: Writers Meet 2022.. కొత్త రచయితల గట్టి వాగ్దానం) 2020 జనవరి 29న హైదరాబాద్‌లో పది జిల్లాల బడిపిల్లల కథలను బాలల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. అలాగే పిల్లల కోసం తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల బాల సాహిత్య రచయితలు రాసిన ‘పెద్దలు రాసిన పిల్లల కథలు’ ఉమ్మడి పది జిల్లాల పేరుతో పది సంకలనాలను అందమైన బొమ్మలతో వెలువరించడమనేది బాల సాహిత్యంలో చరిత్రాత్మక ఘట్టం. ఈ బాల సాహిత్య యాగం తెలంగాణకే పరిమితం కాకూడదని ఆంధ్రప్రదేశ్‌లోని బడి పిల్లల నుండీ కథల సేకరణ ప్రారంభించడం ముదావహం. (క్లిక్ చేయండి: GN Saibaba Poems.. ఒంటరి గానాలాపన) – దుర్గమ్ భైతి ఉపాధ్యాయులు, సిద్దిపేట -
GN Saibaba Poems: ఒంటరి గానాలాపన
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు. ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు. ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన! సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం. – అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు -
Writers Meet 2022: కొత్త రచయితల గట్టి వాగ్దానం
‘తెలుగులో ఇంత వరకూ బెస్తవారి మీద మంచి నవల లేదు. ఆ నవల బెస్త సమూహంలోని రచయిత నుంచే రావాలి. నేను ఆ వెలితిని పూడ్చాలనుకుంటున్నాను’ అన్నాడు ప్రసాద్ సూరి. ఇతను హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. ఇప్పటికే రెండు నవలలు రాశాడు. ‘మా చిత్తూరులోని బహుదా నది ఎండిపోతే ఏడుస్తాను. ప్రవహిస్తే నవ్వుతాను. దాని చుట్టుపక్కల జీవితాలను కథలుగా రాస్తాను’ అన్నాడు సుదర్శన్. ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ‘బహుదా కథలు’ అనే పుస్తకం వెలువరించాడు. ‘మా పార్వతీపురంలో నా వయసు రచయితలు ఎవరూ లేరు. ఇప్పటి కాలంలో నాతోనే మా ప్రాంతంలో మళ్లీ కథలు మొదలయ్యాయి’ అంటాడు భోగాపురం చంద్రశేఖర్. ‘రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, కరువు అనుకోవద్దు. ఆకాశం ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయతలు ఉన్నాయి. అవి నేను రాస్తు న్నాను’ అన్నాడు సురేంద్ర శీలం. రెండు రోజుల ‘శీతాకాల కథా ఉత్సవం’లో యువ రచయితల మాటలు ఇవి. ప్రతి ఏటా జరుగుతున్న ట్టుగానే ఈ సంవత్సరం ‘రైటర్స్ మీట్’ ఆధ్వర్వంలో హైదరాబాద్ సమీపాన శామీర్‌పేటలో ‘ల్యాండ్ ఆఫ్ లవ్’ సౌందర్య క్షేత్రంలో నవంబర్ 26, 27 తేదీలలో 50 మంది రచయితలు, విమర్శకులు, పాఠకులు ‘శీతాకాల కథాఉత్సవం’లో పాల్గొన్నారు. వీరిలో అందరినీ ఆకట్టున్నది యువ రచయితలే. ఐటీ రంగంలో పని చేస్తూ కథలు రాస్తున్న శ్రీ ఊహ, అంట్రప్రెన్యూర్‌గా ఉంటూ కథను ప్రేమించే రుబీనా పర్వీన్, స్త్రీల సమస్యలను ప్రస్తావించే నస్రీన్ ఖాన్, విజయవాడ కథకుడు అనిల్ డ్యాని, తెలంగాణ కథను పరిశోధించిన దేవేంద్ర... ఇక కుల వివక్షను, పేదరికాన్ని అధిగమించి రచయితగా ఎదిగిన యాకమ్మ ప్రయాణం అందరి చేత కంటతడి పెట్టించింది. స్పార్క్ ఉన్న వర్ధమాన రచయితలను వెతికి ఆహ్వానాలు పంపడం రైటర్స్ మీట్ ప్రత్యేకత. వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయటంతో పాటు సీనియర్ రచయితలచే కథారచనలో మెళకువలను నేర్పుతారు ఈ శిబిరంలో. రచయితల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి ఒకరికి ఒకరు దోహదపడేలా చేయడం కూడా రైటర్స్ మీట్ ఉద్దేశాలలో ఒకటి. ఈ సంవత్సరం జరిగిన రైటర్స్ మీట్లో ప్రముఖ రచయితలు వి.రాజా రామమోహనరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, అయోధ్యా రెడ్డి కథా రచనలో తమ అనుభవాలను పంచారు. ఖాన్ యజ్దానీ, జి.వెంకట కృష్ణ, రమణమూర్తి, ఆదిత్య కొర్రపాటి కథావిమర్శ చేశారు. మలయాళ భాష రచయితలు బుకర్ ప్రైజ్ వరకూ ఎదుగుతుంటే తెలుగులో ఎవరూ అంతవరకు ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న వచ్చింది. ‘కథను ఏ రచయితైనా చదివిస్తాడు. కానీ రెండోసారి పాఠకుడు ఆ కథను చదవాలంటే అందులో ఏం ఉండాలి’ అనే ప్రశ్న ఆలోచనల్లో పడేసింది. కథకులకు ఉండాల్సిన దృక్పథం గురించి ఖాన్ యజ్దానీ మాట్లాడితే, ‘కథలు రాయండి. ప్రవక్తలుగా మారకండి. రాస్తూ వెళ్లడమే మీ పని’ అన్నారు అయోధ్యా రెడ్డి. వి.రాజా రామమోహనరావు యువతరాన్ని భయపడవద్దనీ, నచ్చినట్టు రాయమనీ సలహా ఇచ్చారు. పాల్గొన్న ప్రతివారు తమ రచనల నేపథ్యాన్నో, రాయవలసిన కథాంశాలనో స్పృశించారు. కరుణ కుమార్, మహి బెజవాడ, సాయి వంశీ తదితరులు తాము ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారో తెలియ చేశారు. చాలా ఆలస్యంగా కథా రచన ఆరంభించిన మారుతి పౌరోహిత్యం, చిలు కూరు రామశర్మ తమ రచనలను చెప్పిన తీరు ఆకర్షణీయమే. పాఠకులుగా విచ్చేసిన శుభశ్రీ, దేవిరెడ్డి రాజేశ్వరి లోతు తక్కువ కథలు రావడానికి రచయితలు తగినంతగా చదవకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) శీతాకాల కథా ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడంలో భాగంగా ఈసారి రఘు మందాటి ఫొటో ఎగ్జిబిషన్ ‘థండర్ డ్రాగన్’, శ్రీపాల్ సామా దర్శకత్వం వహించిన ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే’ సినిమా ప్రదర్శన, రచయిత్రి ఝాన్సీ పాపుదేశి కథల పుస్తకం ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ ఆకర్షణలుగా నిలిచాయి. కథా రచన పట్ల కొత్త కమిట్మెంట్ను, కథకుల మధ్య కొత్త బాండింగ్‌ను ఏర్పరచిన ఈ రైటర్స్ మీట్ సమావేశాలు కొత్త తరానికి నూతనోత్సాహాన్ని పంచే కాంతిపుంజాలు. (చదవండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - సి.ఎస్. రాంబాబు ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి, రచయిత -
అవధులు లేనిదదే!
‘మనవాళ్లొట్టి వెధవాయిలోయ్’ అని ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం నోట పలికించారు గురజాడ. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మనవాళ్లు కూడా ఆయన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా, వెధవాయిత్వాన్ని కడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారులెండి. దేశంలో నిరక్ష రాస్యత ఎంతగా తగ్గుముఖం పట్టినా, ఎన్ని విశ్వవిద్యాలయాలు పుట్టుకొస్తున్నా, ఎన్నెన్ని జ్ఞాన ప్రవచనాలు మన చెవుల్లో అనుదినమూ మార్మోగుతూనే ఉన్నా, మన వెధవాయిత్వం మాత్రం నానాటికీ వర్ధిల్లుతూనే ఉంది. వెధవాయిత్వం అనగా మూర్ఖత్వం. ఇది మానవ సహజ లక్షణం. ఈ లక్షణం గురజాడవారికి ముందూ ఉంది, ఆ తర్వాతా ఉంది. మూర్ఖత్వానికి మూలకారణమేంటి అని తరచి చూస్తే, అజ్ఞానమే కారణంగా కనిపిస్తుంది. అజ్ఞానాన్ని అంతం చేస్తే, మూర్ఖత్వం తొలగిపోతుంది కదా అనుకోవచ్చు. అదంత తేలికపాటి వ్యవహారం కాదు. ‘మూర్ఖత్వానికీ జ్ఞానానికీ ఉన్న తేడా అల్లా జ్ఞానానికి అవధులు ఉన్నాయి’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్. మూర్ఖత్వం అవధులు లేనిదని ఆయన కవిహృదయం. లోకంలో అవధులు లేని మూర్ఖత్వమే లేకుంటే, జ్ఞానానికి విలువెక్కడిది? చీకటి ఉన్నచోటే కదా చిరుదీపానికి విలువ! చరిత్రంతా మూర్ఖత్వానికీ జ్ఞానానికీ మధ్య సంఘర్షణే! ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు/ దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు/ తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు’ అని భర్తృహరి ఏనాడో సంస్కృతంలో చెప్పిన మాటలను ఏనుగు లక్ష్మణకవి తేట తెలుగులో చెప్పాడు. లోకంలో ఎలాంటి అసాధ్యాన్నయినా సాధించవచ్చు గాని, మూర్ఖులను ఒప్పించి మెప్పించడం సాధ్యంకాని పని అని గుర్తించిన భర్తృహరిని మించిన మహాజ్ఞానులు ఇంకెవరుంటారు? భర్తృహరి మాటలను గుర్తుంచుకుంటే, మూర్ఖులతో పేచీ లేకుండా మన మానాన మనం కడుపులో చల్ల కదలకుండా బతికేయవచ్చు. కాదూ కూడదని పని గట్టుకుని మరీ మూర్ఖులను ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం అది వికటించి, ప్రాణాల మీదకు కూడా రావచ్చు. మూర్ఖబలాన్ని తక్కువగా అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుంది. కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించిన గెలీలియో ఉదంతమే ఇందుకు ఉదాహరణ. సూర్యుని చుట్టూనే భూమి తిరుగుతుందని చెప్పిన పాపానికి నాటి మతాధి కారులు గెలీలియోను ఖైదుపాలు చేశారు. చివరకు ఖైదులోనే అతను కన్నుమూశాడు. అంతకంటే ముందుకాలం వాడు సోక్రటీస్. యువకులకు జ్ఞానబోధ చేశాడు. మూర్ఖ మతాధిపతులు కన్నెర్ర చేశారు. అతడి చేతికి విషపాత్రనిచ్చారు. అదీ మూర్ఖత్వం తడాఖా! సత్యాన్ని వెల్లడించిన పాపానికి ప్రాణాలనే బలిగొనేంత బలవత్తర శక్తి మూర్ఖత్వానిది. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజి చేస్తుంటేగాని పొలిటీషియను కానేరడు’ అని మహాజ్ఞాని గిరీశం నుడివాడు. పొలిటీషియన్ అయినా కాకున్నా, మానవమాత్రులందరూ కాలానుగుణంగా అభిప్రాయాలను మార్చుకుంటూనే ఉంటారు. బాల్యంలో ఉన్న అభిప్రాయాలు యవ్వనంలో మారి పోతాయి. యవ్వనంలోని అభిప్రాయాలు వార్ధక్యంలో పటాపంచలైపోతాయి. అసలు అభిప్రాయాలను మార్చుకోని వారు ఇద్దరే ఇద్దరు అంటాడు అమెరికన్ కవి జేమ్స్ రసెల్ లోవల్. ‘ఈ ప్రపంచంలో మూర్ఖుడూ, మృతుడూ మాత్రమే తమ అభిప్రాయాలను మార్చుకోరు’ అన్నాడు. ‘ఎఱుగువాని దెలుప నెవ్వడయినను జాలు/ నొరుల వశము గాదు వోగు దెల్ప/ యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా?’ అన్నాడు వేమన. అయినా, మూర్ఖులకు జ్ఞానబోధ చేయాలనే కాంక్ష కొందరు జ్ఞానులలో మితిమీరి ఉంటుంది. పరిసరాలను, పరిసరాల్లోని పరిస్థితులను పట్టించు కోకుండా ప్రవచనాలకు లంకించుకునే ‘జ్ఞానులు’ ఆ బాపతులోకే వస్తారు. అయితే, మూర్ఖులను జ్ఞానబోధ చేయడంతోనే మన విద్యావ్యవస్థలో పురోగతి మొదలైన సంగతిని మనం మరువరాదు. మూర్ఖులైన ముగ్గురు రాకుమారులకు విష్ణుశర్మ బోధించిన ‘పంచతంత్రం’ ప్రపంచ సాహిత్యంలోనే ఒక మైలురాయి. మూర్ఖులకు జ్ఞానబోధ చేయడం అంటే కత్తిమీద సాము వంటి విన్యాసమే! విష్ణుశర్మ ఆ పనిని విజయవంతంగా చేసి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటి రచన ‘పంచతంత్రం’. దాదాపు అదేకాలంలో– క్రీస్తుశకం ఐదు నుంచి పదిహేనో శతాబ్ది మధ్యకాలంలో యూరోప్‌లో ‘ఫూల్స్ లిటరేచర్’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘ఫూల్స్ లిటరేచర్’లో వెలువడిన కవితలు, కథలలో ‘ఫూల్’ పాత్ర తప్పనిసరి. యూరోపియన్ మూర్ఖసాహిత్యంలోని ‘ఫూల్’ పాత్ర ఒక్కోసారి తెలివితక్కువ మూర్ఖునిగా, ఒక్కోసారి మొండి మూర్ఖునిగా, ఒక్కోసారి అతితెలివి మూర్ఖునిగా కనిపిస్తాడు. ప్రపంచ సాహిత్యంలో మూర్ఖపాత్రలు కోకొల్లలు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అనేది సనాతన మూర్ఖత్వం. ‘అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయిష’ అనేది హైటెక్ మూర్ఖత్వం. కాలం శరవేగంగా మారుతోంది. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పురోభివృద్ధి చెందుతోంది. మనుషుల మూర్ఖత్వంలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే, ముడి పదార్థమైన మూర్ఖత్వం మాత్రం యథాతథంగానే ఉంటోంది. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని మనసారా ఆకాంక్షించాడు గురజాడ. మనుషుల్లోని మూర్ఖత్వం మాసిపోయి, జ్ఞానమొక్కటే నిలిచి వెలిగే రోజులు ఎప్పటికైనా వస్తాయా? -
Translator: తోడుదొంగ?
‘‘అనువాదకుడనేవాడు మూలరచయితకి తోడుదొంగ!’’ అన్నాడు హొర్హే గాంజాలిజ్ మోర్. అనువాదాలు చదువుకునేవాళ్ళలో చాలామందికి తెలిసిన విషయమే ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడు చెప్తున్నాడు! అతను చెప్పని మాటొకటి వుంది– ఈ తోడుదొంగలు ఉమ్మడిగా దోచుకునేది పాఠకుల హృదయాలను!! అవును మరి, రచయితలన్నాకా అన్ని విషయాలూ విప్పిచెప్పేస్తారా? కాస్తా అర చాటుగానో, తెరచాటుగానో వాళ్ళు చెప్పే మాటల్లోని సారాంశాన్ని గ్రహించాల్సిన రసజ్ఞత వినే వాడిది. పోతే, రచయితలు – అనువాదకుల గురించి మోర్ చెప్పిన విషయం తెలుగుజాతికి బాగా తెలుసు. ఎందుకంటే, మన ‘‘ప్రామాణిక సాహిత్యం మొదలయిందే ఓ అనువాదంతో. వ్యాసుడనే కృష్ణ ద్వైపాయనుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని ‘కవిత్రయం’ అనే నన్నయ, తిక్కన, ఎర్రన తెలిగించడంతోనే ప్రామాణిక సాహిత్య సృజన మొదలయిందని మన పెద్దలు చెప్పారుగా! కాకపోతే, భారతానువాదం పూర్తయ్యేసరికి పాఠకులకు దక్కేది మూలపాఠంలోని 21.5 శాతమేనని వాళ్లు చెప్పలేదు. తర్వాతి రోజుల్లో మరో పెద్దాయన ఆ లెక్కతీశాడు! అయినా, అనువాదమంటే ఆషామాషీ వ్యవహారమా? శ్రీనాథుడు ఆరేడువందల సంవత్సరాల కిందట అదేమాట అన్నాడు కదా! శబ్దాన్ని అనుసరించి–భావాన్ని ఉపలక్షించి – అభిప్రాయాన్ని గ్రహించి – రసాన్ని పోషించి–అలంకారాన్ని భూషించి – ఔచిత్యాన్ని ఆదరించి – అనౌచిత్యాన్ని పరి హరించి మరీ తాను అనువాదం సాగించానన్నాడా పండిత కవి. మనలో మనమాట – విద్వదౌషధం అనిపించుకున్న నైషధాన్ని తెనిగిస్తూ, ‘‘గమికర్మీకృత నైకనీవృతుడనై’’ అంటూ పదబంధాలకు పద బంధాలను ఎత్తుకొచ్చి మెత్తేసిన శ్రీనాథుడు చెప్పినట్లే చేసివుంటే, ‘‘మీ ‘డుమువులు’ మీరు తీసేసు కుని, మా నైషధం మాకు ఇచ్చెయ్యం’’డని సంస్కృత విద్వాంసులు ఎందుకంటారు? అయితే, కవిగా ఏం చేసినా, పండితుడిగా శ్రీనాథుడికి అనువాదం కేవలం భాషాంతరీకరణం మాత్రమే కాదని బాగా తెలుసు! ‘‘అనువాదం మాటలకే పరిమితమయిన వ్యవహారం కాదు సుమా! ఒకానొక సంస్కృతిని సంపూర్ణంగా బోధపరచడమే అనువాదమవుతుం’’దని మనకాలపు బహుముఖ ప్రజ్ఞావంతుడు యాంటనీ బర్జెస్ అదే మాట మనకర్థమయ్యేలా – ఆంగ్లంలో– అన్నాడు! ‘అనువాదమనే ప్రక్రియే లేకపోతే, మనం సరిహద్దులకే పరిమితమైపోతాం! అంచేత అను వాదకుడే నా కీలక సహచరుడు. అతగాడే, నన్ను విశాల విశ్వానికి పరిచయం చేస్తా’’డన్నాడు ఇటాలో కాల్వినో – పశ్చిమాంధ్ర భాషలో. (అనగా, ‘‘ఇటాలియన్లో’’ అని వివరించాలంటారా?) ప్రపంచానికి ఈ కొసన ఉన్న దక్షిణాంధ్ర ప్రాంతంలో, ఏడెనిమిది వందల సంవత్సరాల కిందట పుట్టిన ధూర్జటి రాసిన ‘‘శ్రీకాళహస్తీశ్వర శతకం’’ ఆంగ్లంలోకి అనువాదమయి, అనేక విదేశ భాషలకు పరిచయం కావడం చూస్తే కాల్వినో మాటలు ఎంత వాస్తవాలో బోధపడుతుంది! ఎక్కడో ఐరోపా ఖండం ఉత్తరాంచలంలో పొడుగ్గా వ్యాపించి వుండే దేశం నార్వే. అక్కడ పుట్టిన హెన్రిక్ ఇబ్సెన్, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచమంతటా ఆధునిక నాటక కళను వ్యాపింపచేశాడంటే, అది అనువాదకుల సహాయంతోనే సాధ్యమయింది. అలాగే, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచాన్నం తటినీ ప్రభావితం చేసిన మార్క్స్–ఎంగెల్స్ లాంటి అసాధారణ మేధావులనే ప్రభావితులను చేసినవాడు ఫ్రెంచ్ నవలారచయిత, నాటకకర్త ఆనరే ద బాల్జాక్. బాల్జాక్ రచనలు కూడా అను వాదకుల పుణ్య మానే అన్ని దేశాల్లోనూ భావవిప్లవాన్ని రగిలించగలిగాయి. ‘‘మాటలు ప్రపంచ మంతా పర్యటిస్తాయి; వాటికి అనువాదకులే చోదకు’’లంది ఆనా రుస్కోనీ. అది అక్షర సత్యం!! ఆమె స్వయంగా ఓ అనువాదకురాలు కావడం వల్లనే అంత చక్కగా చెప్పగలిగిందనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్దం ఉత్తరార్ధంలో చాలా దేశాల గురించిన సమాచారం దూరదేశాలకు సైతం వ్యాపించినందువల్ల ఉన్నదున్నట్లుగా అనువాదాలు చేసినా పాఠకుల ఆదరణకు పాత్రం కాగలుగు తున్నాయి. కానీ, అంతకుముందు – ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు – చాలామంది అనువాదకులు అనువాదాలను అనుసృజనల రూపంలో చేయవలసివచ్చింది. కానీ, రచయితలు ఈ తరహా అనుసృజనలను మెచ్చలేదు. ‘‘మూలంలోని ఏ విషయమూ మార్చకుండానే, ఆ భాషలో చెప్పిందాన్ని అంతటినీ మరో భాషలోకి మార్చడమే అనువాద’’మని గ్యుంథర్ గ్రాస్ అన్నమాట రచయితలకు అనువాదకుల మీద ఉన్న ఫిర్యాదును ప్రతిధ్వనిస్తోంది. ఉదాహరణకు, ఆలివర్ గోల్డ్‌స్మిత్ నవల ‘‘ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్’’ను, కందుకూరి వీరేశలింగం కొంతవరకూ అనువాదమే చేశారు. కానీ, తన ప్రయత్నం సఫలం కాదనిపించి, ‘రాజశేఖర చరిత్రము’ పేరిట అనుసృజనగా వెలువరించారు. అది పాఠకుల సౌకర్యార్థం చేస్తున్న పనేనని ఆయన త్రికరణశుద్ధిగా నమ్మారు. ఆయన అనుసృజన ‘ద ఫార్చ్యూన్ వీల్’ పేరిట యథామూలంగా ఆంగ్లంలోకి అనువాదం కావడం ఓ విశేషం! సృజనాత్మక సాహిత్యం విషయంలో అనుసృజనలను –ఒక మేరకు– కవిత్వంలో ఏమైనా సహిస్తున్నారేమో కానీ, ఇతరత్రా ఈ ఆచారం అంతరించిందనే చెప్పాలి. చివరిగా ఒక్కమాట– ‘విద్వత్వంచ నృపత్వంచ న ఏవతుల్యే కదాచన– స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే!’ అని చిన్నప్పుడు మనమందరం చదువుకున్న ఓ సుభాషితం చెబుతోంది. ఈ ఏడాది శతజయంతి జరుపుకొంటున్న రాచమల్లు రామచంద్రారెడ్డి అలా అన్నిచోట్లా ఆరతు లందుకున్న విద్వాంసుడు. ఆయనకి మనమూ అర్పిద్దాం నీరాజనం! -
Rachamallu Ramachandra Reddy: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!
విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! విమర్శకుల్లో రా.రా. మెథడాలజీని, మెథడ్‌ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది! ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్! ఈ విష యంలో ఫ్రాస్ట్‌కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్.ఎస్. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్ ఖయావ్ు, రబీంద్రనాథ్ టాగోర్ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్‌ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్ ఎట్ హార్ట్) అయివుండాలి!! దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి చెప్తూ ‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి. ‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా. రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! - మందలపర్తి కిశోర్ సీనియర్ పాత్రికేయుడు (నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి) -
అక్షరాల రెక్కలనిద్దాం!
బాల్యంలోనే పిల్లల ఊహలకు రెక్కలొస్తాయి. ఆట పాటలతో గడిపే పిల్లలకు ఆటవిడుపుగా కథలు చెప్పాలి. పాటలు పాడించాలి. బొమ్మలు గీయాలని ఉబలాటపడే చిట్టి చేతులకు పెన్సిళ్లు, రంగులు, కాగితాలు అందివ్వాలి. వాళ్ల లేత భుజాల మీద చదువుల భారాన్ని తగ్గించాలి. విజ్ఞానాన్ని వినోదాత్మకంగా పెంపొందించు కోవడానికి ఉపయోగపడే సాధనం బాలసాహిత్యం. పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యం ఉండాల్సిన అవసరాన్ని పాశ్చాత్య ప్రపంచం పద్దెనిమిదో శతాబ్ది నాటికి గాని గుర్తించలేదు. మన దేశం పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యాన్ని క్రీస్తుశకం తొలి సహస్రాబ్ది ప్రారంభం లోనే సృష్టించింది. విష్ణుశర్మ ‘పంచతంత్ర’ ద్వారా పిల్లలను ఆకట్టుకునే కథలు రాశాడు. విష్ణుశర్మ రాసిన ‘పంచతంత్ర’ కథలలో ఎక్కువగా జంతువులు, పక్షులే ప్రధాన పాత్రలు. ఇందులోని కథలేవీ పుక్కిటి పురాణాలు కావు. ఇందులోని కథలు పిల్లల ఆలోచనలకు పదును పెడతాయి. వారికి లోకం పోకడను అవగతం చేస్తాయి. ‘పంచతంత్ర’ కథలు పిల్లలను మాత్రమే కాదు, పెద్దలనూ ఆకట్టుకుంటాయి. ‘పిల్లల పుస్తకాన్ని మీరు పిల్లల కోసం మాత్రమే రాసేటట్లయితే, మీరు విఫలమైనట్లే’ అని అమెరికన్ రచయిత, సినీ దర్శకుడు డాన్ రాఫ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పాడు. సార్వజనీనతే ఉత్తమ బాలసాహిత్యానికి గీటురాయి. ఒకప్పుడు తెలుగులో విరివిగా బాలల పత్రికలు ఉండేవి. రేడియోలో బాలల కార్యక్రమాలు వచ్చేవి. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేనిరోజుల్లో పిల్లలకు వాటితోనే చక్కని కాలక్షేపం జరిగేది. చక్రపాణి, నాగిరెడ్డి ప్రారంభించిన ‘చందమామ’ దాదాపు ఆరున్నర దశాబ్దాలు ఆబాల గోపాలాన్నీ అలరించింది. ‘చందమామ’ తెలుగు సహా పదకొండు భాషలలో ప్రచురితమయ్యేది. అగ్రశ్రేణి రచయిత కొడవటిగంటి కుటుంబరావు దాదాపు మూడు దశాబ్దాల పాటు ‘చందమామ’కు సంపాదకుడిగా వ్యవహరించి, ‘చందమామ’ను భారతీయ బాలల పత్రికల్లోనే ధ్రువతారగా తీర్చిదిద్దారు. ‘చందమామ’ ప్రచురణ నిలిచిపోయినా, పాత సంచికలన్నీ ఇంట ర్నెట్లో అందు బాటులో ఉన్నాయి. పెద్దలుగా ఎదిగిన తర్వాత కూడా కొందరు మనసులో బాల్యాన్ని నింపుకొనే ఉంటారు. బహుశా అలాంటి వాళ్లను గురించే ‘పెద్దలు కాలం చెల్లిన పిల్లలు’ అని అమెరికన్ బాలల రచయిత డాక్టర్ సూస్ చమత్కరించాడు. ‘చందమామ’ పాత సంచికలను ఇప్పటికీ ఇష్టంగా చదువుకునే కాలం చెల్లిన పిల్లలు చాలామందే ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యానికి పంతొమ్మిదో శతాబ్దిలోనే పునాదులు పడ్డాయి. రావిపాటి గురుమూర్తి 1834లో ‘పంచతంత్ర కథలు’ సంస్కృతం నుంచి అనువదించారు. ఆ తర్వాతి కాలంలో ‘పంచతంత్ర’ కథలకు తెలుగులో దాదాపు అరడజను అనువాదాలు వెలువ డ్డాయి. పూడూరి సీతారామశాస్త్రి 1845లో ‘పెద్దబాలశిక్ష’ను తొలిసారిగా ప్రచురించారు. ఆయనే 1856లో పిల్లల కోసం ‘నీతి కథలు–చిత్ర కథలు’ ప్రచురించారు. ‘జనవినోదిని’ పత్రిక 1884లో పిల్లల పాటలను ప్రచురించింది. ‘వివేకవతి’ పత్రిక 1908 నుంచి పిల్లల రచనలను ప్రచురించేది. ఆనాటి సుప్రసిద్ధ రచయితల్లో దాదాపు అందరూ బాలల కోసం ప్రత్యేకమైన రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం ‘నీతికథామంజరి’ రాశారు. గిడుగు సీతాపతి పిల్లల కోసం ‘చిలకమ్మ పెండ్లి’, ‘రైలుబండి పాటలు’ రాశారు. వేంకట పార్వతీశ కవులు ‘బాలగీతావళి’ రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడివి బాపిరాజు, వావిలికొలను సుబ్బారావు, చింతా దీక్షితులు వంటి సుప్రసిద్ధులు బాలల సాహిత్యాన్ని సృష్టించారు. ‘భారతి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రభూమి’ వంటి పత్రికలు బాల సాహిత్యానికి చెందిన రచనలను కూడా ప్రచురించేవి. తొలి బాలల పత్రిక ‘బాలకేసరి’ 1940లో ప్రారంభమైంది. దానికి ఏడాది ముందే– 1939లో మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి న్యాపతి రాఘవరావు బాలల కార్యక్రమాలను ప్రారంభించారు. తెలుగు బాలసాహిత్యంలో ఇవన్నీ ముఖ్యమైన మైలురాళ్లు. తెలుగులో బాలల సాహిత్యానికి ఆనాటి కాలం స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఇరవై ఒకటో శతాబ్ది మొదలయ్యాక తెలుగు బాలల పత్రికలు ఒక్కొక్కటే కనుమరుగవడం మొదలైంది. ఇంగ్లిష్, హిందీ సహా మిగిలిన పలు ప్రధాన భారతీయ భాషల్లో బాలల పత్రికలు ఇంకా ప్రచురితమవుతున్నా, తెలుగులో మాత్రమే కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ప్రధాన దినపత్రికల ఆదివారం అనుబంధాలకు మాత్రమే ప్రస్తుతం బాలసాహిత్యం పరిమితమవుతోంది. జనాదరణ గల బాలల పత్రిక తెలుగులో ఒక్కటైనా ప్రస్తుతం మనుగడలో లేకపోవడం దురదృష్టకర పరిణామం. ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ కేవలం బాలల కోసమే ప్రత్యేకంగా రచనలు సాగిస్తున్న రచయితలు ఇంకా ఉండటమే విశేషం. కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు ఏటేటా బాల సాహితీవేత్తలకు కూడా అవార్డులు అందిస్తున్నాయి. అయితే, బాల సాహిత్యాన్ని ప్రత్యేకంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు తగినంత చొరవ తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ‘బాల సాహిత్యాన్ని తక్కువ ధరకు అందించాలి. ప్రచురణలకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాటలను ప్రభుత్వాలు కాస్త పట్టించుకుంటే బాగుంటుంది. రేపటి పౌరులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలంటే, వారికి తగిన సాహిత్యాన్ని విరివిగా అందుబాటులోకి తేవడం, ఆ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేలా వారిని ప్రోత్సహించడమే సరైన మార్గం. ఇదంతా కాలం చెల్లిన పిల్లలు తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత. -
CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు
తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్ దంపతులైన డేవిడ్ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్ 10న బ్రౌన్ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. ఫ్రెంచ్ కాథలిక్ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్‌లోకి అనువదించి ‘వెర్సేస్ ఆఫ్ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్‌లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకునేలా చేశారు. బ్రౌన్ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు. తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్‌కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్లా, జాన్హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్ పేరును ప్రస్తావించనే లేదు. భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్ మద్రాస్ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్‌లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్ రచనలన్నీ రెవరెండ్ టైలర్ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్‌లో ముద్రించారు. ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్‌బార్న్ గ్రోవ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..) - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖ సాహితీ పరిశోధకులు (సీపీ బ్రౌన్ 225వ జయంతి సంవత్సరం) -
మేమూ రచయితలమే.. వాణిజ్య ఫన్నులు పుస్తకావిష్కరణ
-
కథ: ఔను.. అందరి దైవం అమ్మే!
‘మీ అమ్మ ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఇబ్బందేమీ లేదు’ ఆ రోజు రాత్రి పక్కమీద చేరాక వేదవ్యాస్ రమణితో చెప్పిన మొదటి మాట.. ‘మీక్కాదు.. నాకు ఇబ్బంది. మా అమ్మ క్షణక్షణం తినేస్తోంది. మడి తడి అంటోంది. చెప్పిందే పదిసార్లు చెబుతోంది..’ అంది రమణి విసుగ్గా. ‘వయసు మీద పడింది కదా! ఆ మాత్రం చాదస్తం ఉండకపోదు. ముసలైనాక నీకూ వస్తుందిలే!’ అన్న భర్త మాటకు అడ్డుపడుతూ.. ‘ఐనా మా తరం మరీ అంతలా బుర్ర తినేయం లెండి’ జవాబిచ్చింది రమణి. ‘వయసులో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలే ఇవి. ఉడిగాక మన కళ్ళముందు ఇతరులు చేసే పనులన్నీ తప్పుగా కనిపించి హెచ్చరిస్తూనే ఉంటాం’ మళ్ళీ నొక్కి చెప్పాడు వేదవ్యాస్. వారిద్దరి నడుమ సాగిన చర్చకు అసలు కారణం రమణి తల్లి.. నాగమ్మ! ఆమె భర్త నాంచారయ్య పదిహేనేళ్ళ క్రితం తనువు చాలించాడు. రమణికి ఒక్క అన్నదమ్ముడు వెంకటాచలం. అతగాడు ఒక్కోసారి తీసుకెళ్లి మూడునెలలపాటు ఉంచుకుని దిగబెట్టేస్తాడు. మిగతా తొమ్మిది నెలలు రమణే భరిస్తుంది. వేదవ్యాస్, రమణి దంపతులకు ఒక పాప సంహిత, బాబు రక్షిత్. కొంతకాలం రమణి ఒక చోట చిన్న ఉద్యోగం చేసింది. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదాకా పిల్లలను చూసుకుంటూ వాళ్లకి ఏ లోటూ రాకుండా ఎంతో జాగరూకతతో నాగమ్మే సంరక్షణ చేసింది. వేదవ్యాస్‌కి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వలన అసలు తీరికుండేది కాదు. ఐనప్పటికీ వంటవార్పులలో రమణికి నాగమ్మే చేదోడుగా ఉండేది. అవసరమైతే దగ్గరలో కూరగాయల మార్కెట్‌కి పోయి అన్నీ కొనుక్కొచ్చేది. ఇంత చేసినా తల్లి అంటే భార్య రమణికి ఈమధ్య కాలంలో ఎందుకు వ్యగ్రత ఏర్పడిందో అర్థం కాలేదు వేదవ్యాస్‌కి. ఒకరోజు బైటకెళ్ళి వచ్చిన రమణి చెప్పులు విడిచి లోపలికి రాగానే చేతిలో బ్యాగ్ లేకపోవడం చూసిన నాగమ్మ ‘అమ్మా! ఎక్కడైనా మరచిపోలేదు కదా? నీకు మతిమరపు మరీ ఎక్కువౌతోంది’ అని చీవాట్లేసింది. ‘అయ్యో! నువ్వలా తినీకు.. చెప్పులు విప్పుతూ బైట బల్లమీద మరచిపోయానమ్మా!’ అంది పళ్ళు నూరుతూ. ‘అందులో నీ ఆధార్ కార్డ్, లైసెన్స్, ఏటీఎమ్ కార్డ్ ఉంటాయి కదాని జాగ్రత్త చెప్పానంతే’ అంది బాధగా నాగమ్మ. ‘నువ్వు చెబితే కాని నాకు తెలీదా? ప్రతిదానికీ రియాక్ట్ ఐపోతున్నావ్?’ చిరాగ్గానే అన్నది రమణి. విషయం తెలుసుకుని వేదవ్యాస్ ‘చెబితే తప్పేముంది రమణీ! నీ అజాగ్రత్తకి చెప్పిందామె! వినటం నీ ధర్మం’ అన్నాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! రమణికి తల్లి తన మంచి కోసం చెప్పినా అది ఒక చాదస్తంగా అనిపించడం, ఆమె మాటలను ప్రతిబంధకంగా భావించడం తరచుగా జరుగుతున్నదే! తమ్ముడు వెంకటాచలం దగ్గర తల్లి ఉన్నంతకాలం రమణికి హాయిగా ఉంటుంది. వీలైనప్పుడు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ భాగం తన వద్దనే ఉంచుకోవలసి రావడం గండకత్తెరలాగే తోస్తోంది. అందుకనే వెంకటాచలాన్ని రెండుమూడుసార్లు అభ్యర్థించింది ‘తమ్ముడూ! అమ్మని నువ్వు ఆరునెలల కాలం ఉంచుకోవచ్చుకదా! నీక్కావలిస్తే నేను డబ్బు పంపిస్తూంటాను’అని. ఐనా అతను అందుకు ఒప్పుకోలేదు. ‘నా దగ్గర ఉంటే మా ఆవిడకీ అమ్మకీ ఉప్పు..నిప్పులా ఉంటోంది. సమర్థించడం నా వల్ల కావడం లేదు. అదేదో నువ్వే చూసుకో. కేవలం మూడు నెలలే భరిస్తాను’ అని నిక్కచ్చిగా చెప్పేశాడు. తదాదిగా తల్లి బాధ్యత రమణిదే అయింది. ‘నీకు బాధ్యత తప్పనప్పుడు ఆమెపై విసుర్లు అనవసరం. ఎలాగోలా సర్దుకుని ఉండాలి. ఆమె చేత అన్నీ చేయించడం నీకంతగా ఇబ్బందైతే ఒక పనిమనిషిని పెట్టుకో’అనేవాడు వేదవ్యాస్. అప్పుడే కుదిరింది పనిమనిషిగా సుబ్బులు. ఆమె రాకతో కొంత పని ఒత్తిడి తగ్గింది. ప్రతి పని తల్లి చేత చేయిస్తున్నట్లుగా మనసు గింజుకోవడం లేదు. ఐతే పనిమనిషి సుబ్బులు కొద్దిగా వాగుడుకాయ. తల్లితో కుచ్చుటప్పాలు కొట్టేది. ఆ సందర్భంలోనే కొన్ని విషయాల్లో నాగమ్మను పొగడ్డం కనిపించేది. ‘సూడమ్మా! మనకు పెద్దోల్లు ఏవేవో సెబుతుంటారు. ఆట్ని మనం పెడసెవిన పెడుతుంటాం గానీ ఆటిలో ఎంత సారముంటాది? ఉన్నన్నాల్లు తెలీదమ్మా పెద్దోల్ల యిలువ! పెతి పనికీ అడ్డు తగులుతున్నట్లుంటాది గానీ, అది మనకే మంచిదమ్మా!’ అంటూ. ఇప్పుడింత అధాటుగా తనకు ఉద్బోధ చేస్తోందేమిటో ఓ పట్టాన అర్థం కాలేదు రమణికి. ఒకవేళ తను లేని సమయంలో తల్లి.. పనిమనిషికి గత సంగతులన్నీ పూసగుచ్చలేదు కదా? లేకపోతే ఈ అప్రస్తుత ప్రసంగం ఎందుకు తెస్తోంది? తన వైఖరిగాని పసిగట్టలేదు కదా? అలాగైతే చులకన అయిపోమూ? ‘అమ్మా! నువ్వు ఆ పనిమనిషి సుబ్బులుతో అన్ని విషయాలు వాగుతున్నావా? ఇరుగుపొరుగుకి అన్నీ చేరవేస్తుంది’ అంటూ ఒకరోజున హెచ్చరించింది రమణి. ‘నేనెందుకు చెబుతానమ్మా! దాని బాధలేవో చెబుతుంటే నాకు నచ్చితే ఒక సలహా పారేస్తూంటాను. అంతేగానీ మన ఇంటి సంగతులు చెబుతానా ఎక్కడైనా?’అని కొట్టి పారేసింది నాగమ్మ. సుబ్బులుతో పెద్దగా మాట్లాడ్డమూ మానేసింది. అది పసిగట్టిన సుబ్బులు ‘ఏటమ్మా! ఏటైనాది? బంగారంనాటి మాటల్సెప్పేవోరు.. ఇప్పుడేటైనాదని నోరు మూసేసుకున్నారు? మీతో మాటాడితే మాయమ్మతో మాటాడినట్టుంటాది. మా అమ్మంటే ఎంతిట్టమో నాకు’అని నాగమ్మ వైపు దృష్టిసారిస్తూ చెప్పింది. ‘ఐనా ఆవిడతో నీకేమిటే మాటలు? నీ కష్టాలేమైనా ఆవిడ తీర్చగలదా? ఎందుకు లేనిపోని పోచుకోలు కబుర్లు?’ సుబ్బులు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నది రమణి. ‘వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు? మీ అమ్మంటే సుబ్బులుకిష్టం కాబోలు’ ఎప్పుడైనా అక్కడ ఉంటే ఒక మాటగా అనేవాడు వేదవ్యాస్. అది సహించలేకపోయేది రమణి. ఇలా ఉండగానే ఒకరోజున అధాటుగా దిగాడు వెంకటాచలం..‘అక్కా! అమ్మను నాతో తీసుకెళ్లడానికొచ్చాను. కొంతకాలం నా దగ్గర ఉంచుకొని పంపిస్తానులే! నీకూ కొంత హాయిగా ఉంటుంది’ అంటూ. ‘అదేంటి మొన్ననేగా నా దగ్గర దిగబెట్టావు. ఏమైందిట?’ అలా అన్నదేగాని తల్లి నాగమ్మను తమ్ముడి దగ్గరకు పంపడం రమణికి సంబరంగానే ఉంది. ‘అబ్బే!ఏం లేదులే! మామూలే! పిల్లలు తలుస్తున్నారు’ అన్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరాడు వెంకటాచలం తల్లిని తోడ్కొని. ‘చాలా ఆశ్చర్యంగా ఉందే? మూడు నెలలకు మించి ఒక్కరోజు కూడా భరించలేక ఇక్కడ దిగబెట్టేస్తాడు కదా? ఇంత హఠాత్తుగా తీసుకెళ్లాడేమిటి మీ తమ్ముడు?’ అన్నాడు వేదవ్యాస్ సాయంత్రం ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాక. ‘వెళ్ళనిద్దురూ! హాయిగా ఉంటుంది ప్రాణానికి’ అంటూ నిట్టూర్చింది రమణి. ఆ సాయంత్రం సుబ్బులు వచ్చి గిన్నెలన్నీ తోమాక గమనించి ‘అదేటమ్మగోరూ! అమ్మ కనబడ్నేదేటి?’ అన్నది విస్తుబోతూ. ‘మా తమ్ముడు తీసుకెళ్ళాడు’ ముక్తసరిగా చెప్పింది రమణి. ‘అదేటోనమ్మా! మీకెలాగుంటదో గానీ మాయమ్మ ఒక్క సెనం నాకాడ లేకపోతే నాకుండబట్టదు. ఒల్లమాలిన పేమ. నన్నొగ్గదు కూడా. దాని యిసయంలోనే మా అన్నకీ నాకూ గొడవలు. దాన్ని ఆల్ల ఇంటికి తీసుకుపోతానంటాడు.. అది నాకు సిర్రెత్తిపోద్ది’ అంటూంటే మనసులో నవ్వుకుంది రమణి. పిచ్చిదానిలా ఉంది. తనకే రోజు గడవడం కష్టమని అప్పుడప్పుడు వాపోతుంటుంది. మరి తల్లి బాధ్యత పడడం అంత ఇష్టంగా చెప్పుకుంటోందేమిటి? అనుకుంటూ. సుబ్బులు వెళ్ళిపోయాక పిల్లలిద్దరూ రమణి దగ్గరకు చేరి ‘అమ్మా! అమ్మమ్మ ఏదమ్మా? కనబడటం లేదు?’ ప్రశ్నించారు. ‘మీ మామయ్య తీసుకెళ్ళాడు. ఎంతసేపూ మీకు అమ్మమ్మ ధ్యాసేనా? హోమ్‌వర్క్ చేసుకుని పడుండలేరా?’ కసురుకుంది రమణి. ‘అమ్మమ్మ ఐతే ఎంచక్కా కథలు చెబుతుంది. మంచి మంచి పాటలు పాడుతుంది. సామెతలు చెబుతుంది. పొడుపు కథలు చెప్పి విప్పమంటుంది’ ఆమెలేని లోటును భరించలేనట్లుగా మాట్లాడారు పిల్లలు. పిల్లలిద్దరికీ తన తల్లి మీదే మక్కువ ఎక్కువగా ఉంది. కొంతకాలానికి తననే మరచిపోయేట్లున్నారు. ఇదే విధంగా కొనసాగితే పిల్లల దగ్గర తన ఉనికి శూన్యమౌతుంది. అందువల్ల కూడా తల్లిని తైనాతూ ఇక్కడ ఉంచుకోకూడదనిపిస్తోంది రమణికి. ఒక రెండురోజుల తరువాత ఆఫీసు నుంచి వస్తూనే వేదవ్యాస్ ‘మీ తమ్ముడు మహాఘటికుడు. అమ్మపైన అధాటుగా ప్రేమ కురిసిపోయిందనుకుంటే తప్పే! అక్కడ మీ మరదలు పుట్టింటికి వెళ్లిందట! పనిమనిషి కూడా మానేసి చాలాకాలమైందట. అందుకే మీ అమ్మను ఇక్కడి నుండి లాక్కుపోయి అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడట. వెంకటాచలం పక్కింటాయన నాకు మిత్రుడే! అతడి వలన ఈ భోగట్టా అంతా తెలిసొచ్చింది’ చెప్పాడు. ‘అక్కడెలా ఏడ్చినా నాకనవసరం. వాడు తీసుకెళ్తానన్నాడు అంతే! అంతకు మించి నేనాలోచించలేదు. మళ్ళీ కొంతకాలమైనాక ఎలాగూ తప్పదు కదా? ఆవిడగారి రాక!’ నిమిత్తమాత్రంగా అన్నది రమణి. ఆ మాటకు మాత్రం ఒళ్ళు మండింది వేదవ్యాస్‌కి. ఆమెకు తల్లి ఉన్నప్పుడు విలువ తెలీదు. తనకి ఆ విలువ తెలుసు కాబట్టే మనసులో గింజుకుంటాడు వేదవ్యాస్. తన తండ్రి పోయాక తన తల్లి తామందరినీ ఆప్యాయంగా సాకటం తనకిప్పటికీ జ్ఞాపకమే! తన ఇద్దరు అక్కచెల్లెళ్ల పెళ్ళి తనొక్కతేధైర్యంగా నిలబడి చేసింది. తనను కూడా ఇంటి వాడిని చేసింది ఆమే! తల్లి బతికున్నంత కాలం తమ కుటుంబానికి స్వర్ణయుగమే! ఏ సలహాకైనా సహాయానికైనా సరే ఆమే ముందుండేది. తన భర్త పింఛను కూడా ఒక్క పైసా ఉంచుకోకుండా తన చేతిలోనే పెట్టేది. కోడలు రమణిని కూడా తన సొంత కూతురు మాదిరి అభిమానంగా చూసుకున్నది. ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ తలచుకుంటే కళవళపడుతుంది మనసు. మరో రోజున పనిలోకి వచ్చిన సుబ్బులు బావురుమన్నది. ‘ఏం జరిగింది? అంతలా ఏడుస్తున్నావ్?’ అడిగింది రమణి. ‘సెబుతున్నా పెడసెవినెట్టి మాయమ్మను ఆల్ల యింటికి లాక్కెల్లిపోయాడు. నలుగురినీ పంచాయతి ఎట్టయినా నాకాడికి తెచ్చుకుంటా. ఎదవ సచ్చినాడు. దాన్సేత ఏ ఎట్టిసాకిరి సేయిత్తాడోనని గుండె గుబేల్మంటోంది. అసలే దానికి అలికెక్కువ (ఆయాసం). డాకటేరు కాడిక్కూడా సూపించడు. ముదనట్టపోడు’ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే మెటికలు విరిచింది సుబ్బులు. ‘నువ్వెందుకలా గింజుకుపోతున్నావో నాకు అర్థంకావడం లేదు. ఎక్కడో అడవుల్లో లేదు కదా మీ అమ్మ! మీ అన్న దగ్గరే కదా ఉంది. పోషణంతా అతగాడే చూసుకుంటాడు కదా? ఒకవైపు ఇంట్లో నువ్వే అంతా చూసుకోవాలంటావు. మళ్ళీ మరో బరువు నీ మీదనేసుకుంటావు. కష్టం కాదా? ఎందుకలా?’ అంది మేధావిలా మాట్లాడుతూ రమణి. ‘కష్టమనుకుంటే ఎలాగమ్మా? మనం సిన్నబిడ్డలుగా ఉన్నపుడు ఆల్లు అడ్డాలలో పెట్టి మనల్ని చూసుకోనేదా? అప్పుడు మనం బారమనుకుని ఒగ్గీనేదు కదా? అందుకే ఆల్లు పెద్దయినపుడు మనం సూసుకోవాలి. మా అన్న తాగుబోతు నా కొడుకు. సమంగా సూత్తాడో నేదోనని నా బయం.. వత్తానమ్మా!’ అని ఇల్లు ఊడ్చేసిన వెంటనే వెళ్ళిపోయింది సుబ్బులు. ‘దీన్ని భగవంతుడు కూడా మార్చలేడు. ఇల్లు సంభాళించుకోలేక సతమతమవుతూ ఎందుకో ఈ వెంపర్లాట’ తన మనసులోనున్న మాట ఆ రాత్రి వచ్చిన భర్త వేదవ్యాస్ దగ్గర అన్నది. ఐనా మౌనమే వహించాడు. ఒకరోజున సాయంత్రం వేదవ్యాస్ ఇంటికి వచ్చేసరికి విచార వదనంతో కనిపించింది రమణి.. ‘సంహితకి ఒళ్ళు కాలుతోందండీ’ అంటూ. బైట వాతావరణం ఏమీ బాగులేదు. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే వేదవ్యాస్ ‘ఎందుకైనా మంచిది డాక్టర్‌కి చూపించాలి. మన సొంత వైద్యాలొద్దు. మరి ఇంటి దగ్గర బాబును చూసుకోడానికి ఎవరుంటారు?’ అంటూ ఆలోచనలో పడ్డాడు. బైట వాన మొదలైంది భారీగానే. అంతలోనే వీధి తలుపు చప్పుడైంది. వెళ్లి తీశాడు. గొడుగులో వచ్చిన సుబ్బులు. పరిస్థితి తెలుసుకుని ‘మీరేం కంగారు పడకండమ్మా! ఆసుపత్రికి జాయిన్ సేయండి. మీరెల్లండి.. నేనీడ బాబుని సూసుకుంటా’అన్నది ధైర్యమిస్తూ. వేదవ్యాస్, రమణి ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అన్ని పరీక్షలు చేశాక అది డెంగ్యూ జ్వరమని తేల్చారు. ఒక వారంరోజుల పాటు అక్కడే ఉండాలన్నారు. ఆ సంక్లిష్ట పరిస్థితికి ఒక్కసారిగా గుండె దడ పట్టుకుంది ఇద్దరికీ. ఇంటి దగ్గర బాబుని చూసుకునే దిక్కు లేదు. ఇక్కడ ఆసుపత్రిలో సహాయం చేసేవాళ్లు కరువైనారు. ఏం చేయాలో ఓ పట్టాన బోధపడలేదు. డాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రిలో ఒక గది తీసుకుని అక్కడ నర్స్‌కి అప్పగించి ఇంటి దగ్గర ఎలాగుందో చూడ్డానికి వెళ్ళాడు వేదవ్యాస్. బాబుకి బిస్కట్లు తినిపిస్తూ కనిపించింది సుబ్బులు. అతన్ని చూసి దిగ్గున లేచి ‘ఏటన్నారు బాబూ! పాపకి ఏటైనాది?’ అని అడిగింది ఆత్రుతగా. వేదవ్యాస్ చెప్పి కలవరపడుతుంటే ‘ఇంటికాడ సంగతి నాకొగ్గేయండయ్యా! ఇల్లు సక్కంగా సూసుకుంటాను. బాబు గురించిన బెంగ మీకక్కర్లేదు. పనుంటే అక్కడికెళ్ళండి’ అని సుబ్బులు భరోసా ఇవ్వడంతో గుండెల్లో గుబులంతా మటుమాయమైంది. వేదవ్యాస్ వెళ్ళేసరికి పాపకి ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడం కోసం అప్పటికే డాక్టర్ చికిత్స మొదలెట్టినట్లు చెప్పింది రమణి. మూసిన కన్ను తెరవలేదు సంహిత. బాబు గురించి ఆందోళన పడుతుంటే అక్కడ సుబ్బులు చూసుకుంటోందని చెప్పాక కాస్త నిబ్బరపడింది రమణి మనసు. ఒక ఐదురోజులకే సంహిత ఆరోగ్యం చక్కబడింది. ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పాడు డాక్టర్. మర్నాడుదయం ఇల్లు చేరారు. లోపలికెళ్ళాక అక్కడ ఎవరో ఒక ముసలామె కనిపించేసరికి గాబరాపడి ‘ఏయ్! ఎవర్నువ్వు?’ అని గదమాయించేసరికి ఉలిక్కిపడి ‘బాబూ! నాను సుబ్బులు అమ్మను. అది నాలుగిల్లల్లో పనులు సేయడానికి ఎల్లింది. మీరొచ్చీసరికి వచ్చేత్తానంది’ అంటూండగానే సుబ్బులు బైట నుండి లోపలికి అడుగుపెడుతూ ‘ఔనయ్యా! మాయమ్మే! తైనాతూ నేనీడుండడానికి అవదని మా ఈదిలో పెద్దల్ని మా అన్న కాడికి పంపి మాయమ్మను రప్పించీసినాను. ఎంటనే యిక్కడి యిసయం తెలుసుకుని తోడుంటానని లగెత్తుకొచ్చింది. ఇందుకేనయ్యా మాయమ్మంటే నాకు సాలా ఇట్టం. నా పెనిమిటి కుదుర్నేక తిరుగాడుతున్నా మాయమ్మే నిచ్చెం నాతో కలిసుంటాది’ అని తెగ సంతోషపడుతూ సంహితను దగ్గరగా తీసుకుంది. ‘సుబ్బులూ! నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు వేదవ్యాస్. ‘ఎంతమాటయ్యా! ఎపుడే ఆపదొచ్చినా ఇట్టా కాకిసేత కబురెడితే సాలు అట్టా వాలతాను. కట్టం ఎవరికొచ్చినా కట్టమే కదా?’ అని తల్లి మరియమ్మతో సహా బైటకు నడిచింది సుబ్బులు. సుబ్బులు మాటలు వింటూంటే గుండె కలుక్కుమనసాగింది రమణికి. ‘చూశావా రమణీ! మీ ఇద్దరి భావాల్లో ఎంత వ్యత్యాసమో? తల్లిపట్ల నీకుండే భావాలు వేరు. మీ అమ్మ నీ తమ్ముడి దగ్గరుంటే నీకు భారం తగ్గుతుందన్న యోచనలో నువ్వుంటే సుబ్బులేమో తన తోడబుట్టిన వాడు తీసుకెళ్ళినా అక్కడ తల్లి సుఖపడదంటూ తన తోటే ఉంచుకోవాలన్న ఆలోచనలో గడిపింది. పైగా మనక్కూడా ఉపయోగపడేలా చేసింది. మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సలహాకైనా సంప్రదింపుకైనా లేదా చిన్నచిన్న సహాయాలకైనా మనకే ఉపయోగపడతారు. వాస్తవానికి మొన్న మనం ఎదుర్కొన్న క్లిష్టపరిస్థితిలో మీ అమ్మే మన దగ్గరుంటే కొండంత అండగా నిలబడి ధైర్యం ఇచ్చేది. తల్లిని కోల్పోయిన నేను ఆరోజుల్లో ఎంత గుంజాటన పడ్డానో చెప్పలేను. నీకు తల్లి ఉండి కూడా ఆమెను చాదస్తమంటూ, ఎద్దేవా చేస్తున్నావ్. నువ్వు నీ తల్లిని దూరం చేస్తున్న ధోరణి పిల్లలు కనిపెడితే వాళ్లకూ అదే అబ్బుతుంది. రేపు వాళ్లూ నిన్ను దూరం చేసినా తప్పు లేదనుకుంటారు. దెప్పుతున్నాననుకోకు.. తల్లి తోడు.. నీడ.. అన్నీను!’ అన్నాడు వేదవ్యాస్. భర్త ఉద్వేగంతో చెప్పిన మాటలు రమణి హృదయంలో బాగా నాటుకున్నాయి. ఆ వెంటనే మరో మాటకు తావులేకుండా మర్నాడే జరిగిన పరిస్థితులను వివరించి తల్లిని వెంటనే దిగబెట్టమంటూ వెంకటాచలాన్ని ఒత్తిడి చేసింది. ఆమె ప్రయత్నం ఫలించింది. తల్లి నాగమ్మను వెంటనే తీసుకుని వచ్చాడు వెంకటాచలం. తల్లిని చూడ్డంతోనే గుండెలో బరువంతా ఒక్కసారిగా దిగిపోయి తేలికపడినట్లయింది రమణికి. పిల్లలిద్దరినీ చూసి తన అక్కున చేర్చుకుంటున్న నాగమ్మను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు వేదవ్యాస్ దంపతులు. ‘ఔను! ప్రపంచంలో అందరి దైవం అమ్మే!’అనుకుంది రమణి.. కళ్ళల్లో నీరు చిమ్ముతుండగా! -
పన్నుల శాఖలో సాహిత్యం
కమర్షియల్ టాక్స్ అనగానే.. ముందుగా గుర్తొచ్చేది లెక్కల చిక్కులు, పన్నుల కోసం సోదాలు, సీరియస్‌గా పని చేసుకునే వ్యక్తులు. వీటికి భిన్నంగా సాహిత్యంతో ముందుకొచ్చారు వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ హర్షవర్ధన్ . ఆయన రచించిన "వాణిజ్య ఫన్నులు" పుస్తకాన్ని హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవనంలో ఆవిష్కరించారు. మేమూ రచయితలమే వాణిజ్య పన్నుల శాఖ గురించి ఇలాంటి పుస్తకం రావడం బహుశా ఇదే మొదటిదని, పన్నుల వసూలే కాదు, అక్షర సేద్యంలోని తమ అధికారులు ఉండడం సంతోషకరమని సభాధ్యక్షులు రిటైర్డ్ జాయింట్ కమిషనర్ పి.వి.సుబ్బారావు అన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ కమిషనర్ సాయికిషోర్ తొలి ప్రతిని తెలంగాణ సేల్స్ టాక్స్ ప్రాక్టీషనర్స్ అధ్యక్షుడు నగేష్ రంగికి అందించారు. పన్నులు కాదు హాస్యం "వాణిజ్య ఫన్నులు" పుస్తకాన్ని పరిచయం చేసిన ఉస్మానియా తెలుగు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.రఘు.. వ్యంగ, హాస్యాలతో పాటు వారి ఉద్యోగానుభవాలను అందమైన శైలిలో, ఆకట్టుకునే రీతిలో రాశారని ప్రశంసించారు. "వాణిజ్య ఫన్నులు" అనగానే ఇదేదో కమర్షియల్ టాక్స్ వాళ్లు మాత్రమే చదవాలని అనుకోవద్దని, నిజానికి ఇది సగటు పాఠకులందరూ చదువదగిందని, అందరూ ఎంజాయ్ చేసేలా వేర్వేరు అంశాలను, జీవిత పాఠాలను, అనుభవాలను చేకూర్చారన్నారు. సమావేశంలో పలువురు రిటైర్డ్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కమర్షియల్ టాక్స్‌కు సంబంధించిన అధికారులు చాలా మంది పాల్గొనడంతో... అదొక విశిష్ట వేదికగా మారింది. వయస్సును లెక్క చేయకుండా.. కార్యక్రమానికి 93 ఏళ్ల వయో వృద్ధులు రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ పతివాడ సూర్యనారాయణ రావడం అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసింది. -
Shanti Narayana: ‘అనంత’ సాంస్కృతిక సేనాని
జీవితాన్ని వెతుక్కునే దశ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకునే దశకు శాంతి నారాయణ ఎదగడం నల్లేరు మీద బండి నడకలా సాగలేదు. ‘నీ కొడుక్కి చదు వెందుకు, కూలికి పంపించు’ అనిపించుకున్న దశ నుంచి ఎంఏ, పీహెచ్డీ చేసే దశకు శాంతి నారాయణ ప్రయాణం సునాయాసంగా జరగలేదు. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమా నతలను అనుభవించే దశ నుంచి, వాటిని నిర్మూలించాలనే రచనలు చేసే దశకు ఆయన చేరడం చిన్నపని కాదు. అదొక సంఘర్షణ. అదొక సమరం. బాల్యంలో తగిలిన గాయాలను స్వయంకృషితో, సహృదయుల చేయూతతో మాన్పుకుంటూ, మాన్పుకుంటూ గాయాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా సాహిత్య సృష్టి చేస్తున్న రచయిత డాక్టర్ శాంతి నారాయణ. డెబ్భై అయిదేళ్ళ వయసుగల (1946) శాంతి నారాయణకు 50 ఏళ్ళ సాహిత్య జీవితం (1972–2022) ఉంది. ఆయన కవి, కథా రచయిత, నవలా రచయిత, ఫీచర్ రచయిత. జీవితాన్ని వెతు క్కుంటూ, 50 ఏళ్ళలో అనేక సామాజిక, సాహిత్య కార్యకలాపాల్లో నిమగ్నమౌతూ, యాభై ఏళ్ళలో అసంఖ్యాక రచనలు చేసిన నిబద్ధత, నిమగ్నత గల రచయిత. శాంతి నారాయణ జీవితం మూడు ముఖాలుగా సాగుతున్నది. 1. వ్యక్తిగత జీవితం. 2. సామాజిక జీవితం. 3. సాహిత్య జీవితం. శాంతి నారాయణ వ్యక్తిగత జీవితంలో కుల వ్యతిరేకి. లౌకిక వాది. భౌతికవాది. తాను కులాంతర వివాహం చేసుకోవడమేగాక, తన సంతానానికీ కులాం తర వివాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన చాలామంది మహా మహులను వెనక్కి నెట్టేశారు. రచయితగా శాంతినారాయణ గత అయిదు దశాబ్దాలలో 16 పుస్తకాలు ప్రచురించారు. ఆయన అవధాని కాబోయి ఆధునిక రచయిత కావడం గుర్తించదగిన విశేషం. 1972లో ‘రక్తపు ముద్ద పిలిచింది’ అనే కథా సంపుటి ప్రచురణతో ఆయన సాహిత్య జీవితం మొదలై, 2022లో ‘ముడి’, ‘సాధన’ అనే రెండు నవలల ప్రచురణ దాకా వచ్చింది. ఈ మధ్యలో ‘నడిరేయి నగరం’(1978), ‘కొత్త అక్షరాలమై’ (2017) అనే కావ్యాలూ; ‘రస్తా’ (1976), ‘పల్లేరు ముళ్ళు’ (1998), ‘నమ్ముకున్న రాజ్యం ’(2004), ‘కొండచిలువ’ (2016), ‘బతుకుబంతి’ (2017) కథల సంపుటాలు; ‘మాధురి’ (1980), ‘పెన్నేటి మలుపులు’ (2001) వంటి నాలుగు నవలలు; ‘నాలుగు అస్తిత్వాలు–నాలుగు నవలికలు’ అనే గ్రంథం; ‘నాగల కట్ట సుద్దులు’ అనే ఫీచర్ రచన రెండు సంపుటాలు ప్రచురించారు. శాంతి నారాయణ అనంతపురం జిల్లా సామాజిక రంగంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 1989కి ముందు రాయదుర్గంలో పనిచేస్తున్నప్పుడు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంకు బదిలీ అయ్యాక 1989–2002 మధ్య ‘జిల్లా రచయితల సంఘం’ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఆయన అనేక విలువైన కార్యక్రమాలు నిర్వహించారు. ఏళ్ళతరబడి నిద్రా వస్థలో ఉండిపోయిన జిల్లా రచయితల సంఘాన్ని పునరుజ్జీవింప జేయడంలో శాంతినారాయణ చురుకైన పాత్ర నిర్వహించారు. తెలుగు నవల వచ్చి 116 ఏళ్ళ చరిత్ర పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సు చరిత్రాత్మకమైనది. 2002–2004 మధ్య అనంతపురం జిల్లాను కరువు అతలాకుతలం చేసినప్పుడు అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు చేసిన కరువు అధ్యయన యాత్ర, రైతు ఆత్మవిశ్వాస యాత్రల్లో శాంతి నారాయణ భాగస్వామి అయ్యారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తరఫున ‘వొరుపు’ అనే కవిత్వ సంకలనాన్నీ, ‘ఇనుప గజ్జెల తల్లి’ అనే కథల సంకలనాన్నీ సంపా దకత్వం వహించి ప్రచురించారు. అలాగే అనంతపురం జిల్లాలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళిత సంఘీభావం సమితి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలలో ఆయన పాల్గొన్నారు. తాను రచనలు చేయడమే కాకుండా, ‘విమలా శాంతి సామాజిక సాహిత్య సేవా సమితి’ స్థాపించి 2006 నుండి, 17 ఏళ్ళుగా, కవులు, కథా రచయితలకు పురస్కారాలిస్తున్నారు. ఇవాళ ప్రసిద్దిగాంచిన రచయితలుగా పేరు పొందిన వాళ్ళలో చాలామంది ఆయన పురస్కారాలు తీసుకున్నవారే. అంతేగాక, విమలా శాంతి జీవిత సాఫల్య పురస్కారం స్థాపించి మొదటిసారిగా, 2021లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి ఇచ్చారు. ఇది శాంతి నారాయణ బహుముఖీన జీవితం. (క్లిక్ చేయండి: తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!) - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు (నవంబర్ 1న డాక్టర్ శాంతి నారాయణకు‘వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార’ప్రదానం) -
3 రోజుల పాటు తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నవంబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందచారి తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో లిటరరీ ఫెస్ట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిటరరీ ఫెస్ట్‌లో వాగ్గేయ కారుల సమ్మేళనంతోపాటు సినిమా పాటల సాహిత్యంపై సెమినార్ ఉంటుందన్నారు. సుమారు 85 మంది కవులు రాసిన సినిమా పాటల సాహిత్యంపై వ్యాసాల పత్ర సమర్పణ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది పాటకు పట్టం కడుతూ.. గీత రచయితలను, గీతాలాపకులను, వాగ్గేయ కారులను, సినిమా సాహిత్యకారులను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయకులు రాంపల్లి రమేష్, అనంతోజు మోహన కృష్ణ, తంగిరాల చక్రవర్తి, ఎస్.కె. సలీమా, రేఖ, శరత్, ప్రభాకరచారి, రామకృష్ణ, చంద్రమౌళి, పేర్ల రాములు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ వారియర్స్ వాళ్లే)