బయట వర్షం కురుస్తోంది,
నాలోనూ వాన పడుతోంది...
ఓ మేఘం, రెండు కళ్ల పరస్పర
సంభాషణను వింటూ కాలం కళ్లు
తుడుచుకుంటోంది...
ఓ అగ్నిపర్వతం విస్ఫోటించింది,
నాలోనూ నిప్పుల నది ప్రవహిస్తోంది...
దానికి ఎదురీదుతున్న లోపలి మనిషి
ఆర్ధ్ర రోదన, అదో విరహ వేదన...
వలపు వనంలో కార్చిచ్చు రేగింది,
మనసుకంటిన మంటలు మస్తిష్కానికి
వ్యాపించాయి,
ఓ ఆకుపచ్చని జ్ఞాపకం
అగ్నిలో దూకి ఆహుతైంది,
నా సగ దేహాన్ని ఖాళీ చేసి
తాను చీకటిని అలముకున్నాక,
నాలోనూ వెలుతురు అదృశ్యమైంది,
ఆకాశం జంట నక్షత్రాల్ని విడదీసింది...
నింగి తరిమేసిన చుక్క నేలరాలింది,
బహుశా అది నేనేనేమో...?!
దివిలో మిగిలిన ‘ఒంటరి నక్షత్రం‘,
భువిపైనున్న సగం నేను...
లోలోపల రగులుతూనే,
రాత్రి ఒడిలో వెలుగుతున్నాం....!!
- జాబేర్.పాషా
► దివ్వెలు
1. కన్నెర్రజేయకుండా
దేన్నీ సాపు చెయ్యలేం –
నెత్తి చుట్టూ కళ్ళతో
ఇత్తడి ఇస్త్రీపెట్టె
2. అదే ఏరు
ఎక్కడినించో–
నిన్న పువ్వుల్ని
ఇవాళ చెత్తని
3. రెండు కన్నీటి బొట్ల
ఆసరాతో నిలబడి
ఎంత వెలుగో–
కొవ్వొత్తి!
4. గోడని అలంకరించిన
అందమైన పటాల వెనక
లోతుగా దిగిన
మేకులు
5. పొద్దు వాలుతోంది
ఎంత దూరం
ప్రయాణించినా
వింత రంగుల
సంధ్యాకాశం
అల్లంత దూరంలోనే
నల్లని తెరలు దించేస్తూ–
చీకటి
-మూల సుబ్రహ్మణ్యం
► మేలిమి పద్యం
వస్తువులన్నియు పోనీ
పస్తుండగ వచ్చుగాని ప్రాణప్రదములౌ
పుస్తకములు తడియగ గని
వాస్తవ వాస్తవ్యుడగు నెవండు సహించున్!
(మంగిపూడి వెంకటశర్మ ‘సానుభూతి’ ఖండిక నుంచి)
కలను నిజము చేయగలవాడు కానరాడు
కలలు అలలవోలె కరిగిపోవు
కలను తెలిసి చేయగలదేమి రాజుకు
గాని, సార్వభౌముడైన గాని.
(దాశరథి ‘సుప్రభాతము’ నుంచి)
జనులకు మేలొనరింపని
తనువేలా? కాల్పదగదొ? తానొక్కండై
తనవారల నడల నేలా
గున దలయెత్తుకుని తిరుగగూడు నరునకున్!
(కట్టమంచి రామలింగారెడ్డి ‘ముసలమ్మ మరణం’ నుంచి)
ఎందఱులేరు జోస్యులు? మఱెందరు నీవలె హేతువాదులై
మ్రందిరి? వారి పుట్టువుల మాటయె లోక మెరుంగ బోదు; నీ
నందనవాటికన్ గఱికనట్టుల బూబొదరిండ్ల నీడ మా
కందఱకున్ రసార్ద్రకవితాసవమిచ్చితి వాసదీఱగన్!
(దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నుంచి)
Comments
Please login to add a commentAdd a comment