రేల పూలు రాల్చుకొని రాల్చుకొని
గాలి ముసల్ది అయ్యింది
కూడబెట్టుకున్న వెన్నెలంతా
పక్షుల పాటకు ఇనామై కరిగిపోతుంది
చెరువు వొడ్డున గరక మంచుపూలు పూసి
మాయమైపోతుంటే
ఏ ఋతువు తెచ్చిన వేదనో కాని,
లోపల కురిసిన వానని
దుఃఖం అనడం ఇష్టం లేదు
పుట్ట తాడు
గంగమ్మ అలికిడి
కోనేటి మూలన
కొలువయ్యి ఉన్నయి కదా
ఇంక ఎంత కాలమైనా
గీ చెరువు వొడ్డునే నిద్రిస్తా
నా కల చేపలతో పాటు
ఈదుతునే ఉంటుంది
శూన్యం తాలుకు శబ్దం
నా గుండెల మీద దిగేవరకు
ఇక్కడే ఉంటా
మబ్బులు వాయిద్యాల్లాగ ఉరుముతుంటే
వాన నాట్యంలా ఆడుతుంది
కాలువలో చేపలు పొర్లుతున్నట్టు
నాలో నీ జాసలు పొర్లుతున్నయి
నన్ను ఎవరేమనుకున్నా సరే
వెన్నెలకు చేతబడి జేసి
నా వెంటే తిప్పుకుంటా
రోగం తిరగబడ్డది అనుకున్నారు
కాదు వయస్సు మర్లబడ్డది
చెరువులో చేపలు
కొత్త నీరును మీటుతుంటే
చెట్లు ఆకుల్ని చెవుల్ని జేసుకున్నాయి
ఏవో పాత నీడలు
నిలదీసి అడుగుతున్నయి
ఏండ్ల నించి
ఎదురు జూస్తున్నవు సరే...
ఇంతకు ఈ విషయం
ఆమెకు తెలుసా.
-మునాసు వెంకట్
దశావతారాలు
వాలితే పువ్వు
ఎగిరితే గువ్వ
రేకలే రెక్కలు కాబోలు.
విరిస్తే మనసు
పరిస్తే తనువు
తలపే పరుపు కాబోలు.
చాస్తే అరచెయ్యి
మూస్తే పిడికిలి
బిగింపే తెగింపు కాబోలు.
తడిపేస్తే అల
ఆరిపోతే కల
ముంపే ప్రేమ కాబోలు.
నిలిస్తే వెదురు
వంగితే విల్లు
ఒంపే వ్యూహం కాబోలు.
కరిగితే వాన
కాలితే పిడుగు
కన్నీరే కార్చిచ్చు కాబోలు.
కోస్తే కాయ
వలిస్తే పండు
అదనే పదును కాబోలు.
కునికితే గొంగళి
లేస్తే చిలుక
మెలకువే మార్పు కాబోలు
చీకితే తీపి
మింగితే తిండి
రుచే బతుకు కాబోలు.
దాస్తే లోహం
దూస్తే ఖడ్గం
చలనమే జననం కాబోలు.
- సతీష్ చందర్
Comments
Please login to add a commentAdd a comment