![Poetry In Telugu By Sri Sahithi Literature - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/8/sahityam.jpg.webp?itok=VsQ3MCfR)
రూపాన్ని చూస్తే మామూలే.
రాళ్ళు మట్టిని కలబోసుకొని
చింపిరి చింపిరిగా పిచ్చిమొక్కలు
తీగలతో చిందర వందరగా
పుట్టలతో గుట్టలతో ఎగుడు దిగుడుగా
అస్తవ్యస్తంగా
జడివాన కోత పెట్టినా
వడగాడ్పుల సెగ పగ పూనినా
చలిగాలులకు వణుకు పుట్టినా
మౌనంగా తలవంచే అమాయకం
అజ్ఞానాన్ని నటిస్తూ
తేమను...నెర్రెను
దువ్వను...దమ్మును
భరించే సహనం అసమానమే.
ఒక అవసరం నడిసొచ్చి
ఒక ఆలోచన తడిసి పాకి
ఒక తవ్వకం తగిలి తాకి
పులకించిన మేనిలో తలపులూరి
పలకరించే లోతులో మనసు మెరిసి
ఓ నిజం తెలిసేదాక ఇంతే.
-శ్రీ సాహితి
► చీకటి జాతర
కాలం శూలమై..గుండెలపై గుచ్చి
హృదయంలోని పొరలని చీల్చి
ఊపిరినంతటినీ బిగపట్టేస్తుంది.
ఒక తుఫాను మాయమవగానే
మరో తుఫాను చుట్టేస్తుంది.
దశలవారీగా మారి...
బతుకు దిశలను మార్చేస్తుంది.
ఇప్పుడంతా చీకటి జాతరే.
కొన్ని వెలుగు రేఖలు ఆశల్ని బతికిస్తున్నా..
స్వార్ధపు కత్తుల వేటకు అవి
తెగిపడిపోతున్నాయి.
కొన్ని ప్రేమ పలుకులు వినిపిస్తున్నా...
అవి తెగిపోయిన గొంతులైపోయాయి.
కొన్ని నీటి బిందువులు తడారిపోయిన
పెదవుల్ని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్న
బలమైన గాలి తాకుళ్లకు...
చినుకులన్నీ నేలరాలిపోతున్నాయి.
ఇప్పుడంతా మనుషుల అడవి...
కొమ్మలన్నీ విరిగిపోయి
మోడుబారిన వృక్షాల్లా దర్శనమిస్తుంది.
కాసింత నీటి తడి కూడా అందడం లేదు.
ఏమో...ఈ కాలం మళ్ళీ ఎపుడు
చిగురిస్తుందో...?
ఈ చీకటి జాతరలో మళ్ళీ
వెలుగుపూలు ఎప్పుడు పూస్తాయో...?
-అశోక్ గోనె
► మేలిమి పద్యం
శాస్త్రవిజ్ఞాన మద్భుతసరణి బెరుగ
మానవు డొనర్చలేని దేదేని గలదె?
మచ్చుక్రోవుల జీవాణుమార్గ మరసి
చేతనము గొన్ని యేండ్ల సృజింపగలరు
(దువ్వూరి రామిరెడ్డి ‘పలితకేశము’ నుంచి)
తోటి జీవియన్న తొణికిసెలాడెడి
వింత మమత కూర్మి వెల్లువలను
పుట్టి పెరిగినట్టి మట్టియందెల్లెడ
పరిమళించు పాత పరిచయములు
(నాయని కృష్ణకుమారి ‘జీవుని వేదన’ నుంచి)
చేదు నిజమటంచు శ్రీశ్రీ వచించెను
తీయనంచు నొకడు తిరిగి పలికె
నిజము లేదు నీడయే తప్పించి
నలుపు తెలుపు మధ్య తలుపు నిజము
(పాలగుమ్మి పద్మరాజుకు రాసిన ఒక ఉత్తరంలో తిలక్)
Comments
Please login to add a commentAdd a comment