కన్యాశుల్కంలో అయ్యంగార్లు | Bahadur Bhashyam Iyengar Printing kanyasulkam In Telugu Sahityam | Sakshi
Sakshi News home page

కన్యాశుల్కంలో అయ్యంగార్లు

Published Mon, Nov 9 2020 12:46 AM | Last Updated on Mon, Nov 9 2020 12:46 AM

Bahadur Bhashyam Iyengar Printing kanyasulkam In Telugu Sahityam - Sakshi

యుగకర్తలైన కవులూ రచయితలూ కూడా సమకాలిక సమాజాన్నీ తమ జీవితానుభవాల్నీ దాటిపోలేరు. కన్యాశుల్కంలో గిరీశం: ‘మీకే ఇంగ్లీషొస్తే భాష్యం అయ్యంగార్లా అయిపోరా?’ అని అగ్నిహోత్రావధానుల్తో అంటాడు. ఈ అయ్యంగారి ప్రస్తావన మొట్టమొదటి కన్యాశుల్కం (రచన 1892, ముద్రణ 1897)లో లేదు. సమూలమైన మార్పులతో రెండోకూర్పు 1909లో వెలువడింది. ఈమధ్యగా సుమారు ఒక దశాబ్దానికి పైచిలుకు కాలంలో గురజాడ అప్పారావు(1862–1915) జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.  

అప్పారావుగార్ని ఎంతో ఆదరించి ప్రోత్సహించిన విజయనగరం ఆనందగజపతి మహారాజావారు 1897లో ఆకస్మికంగా కాలధర్మం చెందారు. ఆ తరువాత ఎస్టేటు వ్యవహారాల్ని వారి మాతృదేవత అలకరాజేశ్వరి(1832–1802), సోదరి రీవాసర్కార్‌ అప్పలకొండమాంబ (1849–1912) చూసుకోవాల్సి వచ్చింది. గురజాడకీ బరువు బాధ్యతలు పెరిగాయి. ఆనందగజపతికి సంతానం లేదు. వారి వీలునామా ప్రకారం వారి తల్లి తమ మేనల్లుడు విజయరామగజపతి(చిట్టిబాబు )ని దత్తత  తీసుకున్నారు. కానీ ఆయన మైనరు. పాలనా వ్యవహారాల్ని ప్రభుత్వంవారు ఒక రీజెన్సీ కౌన్సిల్‌కు అప్పజెప్పారు. అందులో మాతృశ్రీ, రీవారాణి సభ్యులు. ఇదంతా జ్ఞాతులకు నచ్చలేదు. 

1898లో అప్పారావు, రీవారాణి ఆంతరంగిక కార్యదర్శిగా నియమితులైనారు. దాయాదులు వేసిన వెలగాడ, కొండపాలెం మొదలైన చిల్లర దావాలూ, సంస్థాన వారసత్వపు ‘పెద్దదావా’ ఏలినవార్ని చుట్టుముట్టాయి. వీటన్నిటినీ న్యాయకోవిదుడు దేశిరాజు జగన్నాథరావు పంతులుతోపాటు గురజాడ చూసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ‘పెద్దదావా’ వ్యవహారాన్ని రీవారాణి అప్పారావు భుజాలమీదనే పెట్టింది.   

అప్పటికే దివాన్‌ బహదూర్‌ భాష్యం అయ్యంగార్‌ (1844–1908) మద్రాసులో పేరుపొందిన లాయరు. మైలాపూర్‌లో నివసించేవారు. వీరు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులైన మొదటి భారతీయుడు. వీరి శిలావిగ్రహం ఇప్పటికీ మద్రాసు హైకోర్టు ఆవరణలో వున్నది. వీరిని ‘పెద్ద దావా’ సందర్భంలో మొదట 1900లోనూ, తరువాత 1903లోనూ కలుసుకొని సుదీర్ఘంగా చర్చించారు. భాష్యం అయ్యంగారు అంతటి ప్రతిభావంతులు కనుకనే కన్యాశుల్కం రెండోకూర్పు 1909లో ఎత్తి రాస్తున్నప్పుడు గురజాడ మనోఫలకం మీద వారు కచ్చితంగా వుండేవుంటారు. అంతేకాదు ఆ ముందు సంవత్సరమే వారు కీర్తిశేషులైనారు. కాబట్టి వారి పేరు సంభాషణ రూపంలో అప్రయత్నంగానే లిఖితమైంది.
భాష్యం అయ్యంగారికి స్వయానా వారి మూడో అల్లుడు, లాయరు ఎస్‌.శ్రీనివాసయ్యంగార్‌ (1874–1941) సహాయకుడిగా ఉండేవారు. వారి అనుయాయులు ఆయన్ని ‘దక్షిణాది సింహం’ అనేవారు.

వీరుకూడా 1916–20లో అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ(1919)కు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి సాహితీవేత్త. షేక్‌ స్పియర్‌ నాటక వాఙ్మయంపైన ప్రామాణికుడైన విమర్శకుడు. ఈయనతో గురజాడ ‘పెద్ద దావా’ వ్యవహారంతో పాటు సాహితీ చర్చలు కూడా చేసేవారు. 1907లో అప్పారావు ఊటీనుండి విజయనగరం ప్రయాణిస్తున్నప్పుడు ఆయన లగేజీని ఎవరో తస్కరించారు. ‘దావా’ కాగితాలతోపాటు అప్పటికే రాస్తున్న ‘కొండుభట్టీయం’ సాఫుప్రతి కూడా పోయింది. అందులోని అంశాల్ని బాధతోనే అయ్యంగారికి వివరంగా చెప్పివుంటారు. అయితే ఆయన  తెలివైనవారు. కొండుభట్టీయంలోని సన్నివేశాలకూ అప్పటికే ప్రచురితమైన మొదటి కన్యాశుల్కంలోని పాత్రలకూ పోలికల్ని గుర్తించారు.

1909లో రెండోకూర్పు ముద్రణ   ప్రారంభించేటప్పుడు నాటక రచనలో ఎన్నో సూచనలు చేశారు. నాటకాన్ని ఎత్తి రాస్తున్నప్పుడు గురజాడ వాటిని పాటించారు. ఈ కూర్పు పీఠిక 01–5–1909 మొదటి పేరాలోనే ‘నా మిత్రుడు ఎస్‌. శ్రీనివాసయ్యంగారి సూచనలపై మొత్తం నాటకాన్ని తిరగ రాసాను. సాహిత్య రచనలపై ఆయన అభిప్రాయాల పట్ల నాకెంతో గౌరవం వుంది’ అంటూ ఆత్మీయ పూర్వకంగా ఉల్లేఖించారు. 

పై ఇరువురు అయ్యంగార్లూ కాకుండా కన్యాశుల్కం పీఠికలోనే ‘నామిత్రుడు’ అంటూ గురజాడ మరో అయ్యంగారినికూడా పేర్కొన్నారు. 1906లో గంజాం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు విద్యాశాఖ పరీక్షాధికారిగా జె.ఏ. ఏట్సు దొర వచ్చారు. వృత్తిరీత్యానూ, కుతూహలం కొద్దీ తెలుగు నేర్చుకొంటున్నప్పుడు జనం మాట్లాడే భాషకూ, కాగితం మీద రాసే భాషకూ ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు గమనించారు. ఈ సంగతిని ఆనాటి విశాఖ, ఏ.వి.ఎన్‌.కళాశాల ప్రిన్సిపాల్, పి.టి.శ్రీనివాసయ్యంగారి (1863–1931)ని ప్రశ్నించారు. అయ్యంగార్‌ తమిళులే అయినా విశాఖలో స్థిరపడి ఆ మాండలిక భాషని అలవరచుకొన్నారు. ఈ సమస్య కూడా వారికి కూలంకషంగా తెలుసు.

అయితే ఈ అంశాన్ని గిడుగు, గురజాడగార్లతో చర్చించమని ఏట్సు దొరగారికి సలహా ఇచ్చారు. అప్పటికే ఆ ఇద్దరూ వాడుకభాషోద్యమాన్ని నడుపుతున్నారు. వారితో సంప్రదించి ఏట్సు దొర తాము అధ్యక్షులుగా, అయ్యంగార్‌ కార్యదర్శిగా ‘తెలుగు భాషాబోధన సంస్కరణ సమాజాన్ని’ స్థాపించారు. దానికి గిడుగు, గురజాడలే ప్రధాన సార«థులు. ఈ సమాజం కూడా వాడుక భాషా విప్లవానికి రంగస్థలమైంది. కన్యాశుల్కం రచనలో వాడుకభాష కూడా అంత్యంత కీలకమైనదే. అందుచేతనే 1909 నాటి మలికూర్పు పీఠికలో పి.టి. శ్రీనివాసయ్యంగారిని కూడా ‘నా మిత్రుడు’  అని ప్రస్తావించారు.ఈ విధంగా ప్రపంచ సాహిత్యంలోనే మణిమాణిక్యం వంటి కన్యాశుల్కం నాటకంలో అయ్యంగార్లు చోటుచేసుకొని చరితార్థులైనారు. 
(ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, అంతర్జాలం  సహకారంతో)
-టి.షణ్ముఖ రావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement