kanyashulkam
-
కాసింత కపటం
‘నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించాలి’ అంటాడు ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులు. అందుకు ‘నమ్మినచోట మోసం, నమ్మని చోట లౌక్యం’ ప్రదర్శించాలంటాడు. కన్యాశుల్కం మలికూర్పు 1909లో జరిగింది కనుక రచనాకాలం ఇదమిత్థంగా తెలియకపోయినా ఇందులోని పాత్రలన్నీ 1880– 1910 కాలం నాటివి. అంటే నాటి మనుషుల జీవనాన్ని తెలిపేవి. వారు పాటించిన విలువలు, తొక్కగల పాతాళాలు, చూపిన చిత్తవృత్తులు, చేసిన టక్కుటమారాలు, హీనత్వాలు, అల్పత్వాలు... ఇవి తెలియాలంటే కన్యాశుల్కానికి మించిన ఆనవాలు లేదు. వందేళ్ల కాలం తర్వాత కూడా గురజాడ, ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ వర్తమాన విలువను కలిగి ఉండటానికి నాటకంలో గురజాడ ఎంచుకున్న సాంఘిక సమస్య గాంభీర్యం ఎంత మాత్రం కారణం కాదు. సాంఘిక సంస్కరణ కూడా కాదు. పసిపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేయడం, వితంతువుల పెళ్ళిళ్లు నిరాకరించడం, వేశ్యావృత్తి ప్రబలంగా ఉండటం... వీటి నిరసనగా గురజాడ కన్యాశుల్కాన్ని రాసినా కేవలం ఈ కారణం చేతనైతే నాటకం అవసరం ఏ పదేళ్లకో తీరిపోయి కనుమరుగైపోయేది. కన్యాశుల్కం బతికి ఉన్నదీ... ఇక మీదటా బతికి ఉండేదీ... అది కేవలం మనుషుల నిజ ప్రవర్తనల విశ్వరూపం చూపడం వల్లే! అగ్నిహోత్రావధాన్లకు మెరకపొలం ఉంది. భార్య వెంకమ్మ పసుపూ కుంకాలతో తెచ్చిన పొలమూ ఉంది. ఇరుగింటి గోడ, పొరుగింటి గోడ తనదేనని దబాయించి కలుపుకుంటున్నాడు. పెద్ద కూతురు బుచ్చమ్మను పదిహేను వందలకు అమ్మి, ఆమె విధవగా మారగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బుచ్చమ్మ (చనిపోయిన) మొగుడి భూముల్లో వాటా కోసం దావా కూడా తెచ్చాడు. ఇన్ని ఉన్నా బంగారం లాంటి, పసిమొగ్గ వంటి చిన్నకూతురు సుబ్బిని పద్దెనిమిది వందలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు– అరవై దాటిన, కాటికి కాళ్లుజాపుకున్న లుబ్ధావధాన్లకు! కొడుకు వెంకటేశం పెళ్లి జరగాలంటే చంటిదాన్ని అమ్మాల్సిందేనట. ఈ కాఠిన్యం, కపటత్వం ఎంత వెలపరం! ఇక కపటుల వరుస చూడండి. డబ్బుపై యావ తప్ప వేరే ఏ లిటిగేషన్ ఎరగని ముసలి లుబ్ధావధాన్లను పెళ్లికి ఎగదోసి, అతగాడు పిల్లకు పుస్తె గట్టి ఇంటికి తెచ్చుకుంటే గనక తన ఇలాకా చేసుకుందామని ఆరాటçపడుతుంటాడు ఉమనైజర్ రామప్పపంతులు. అప్పటికే అతడు లుబ్ధావధాన్ల పెద్ద కూతురు మీనాక్షిని లొంగదీసుకున్నాడు. మధురవాణిని ఉంచుకున్నాడు. చాలక అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లను కబళించేందుకు లుబ్ధావధాన్ల హితం పలుకుతుంటాడు. గిరీశం ఇంతకన్నా దిగదుడుపు. స్త్రీలపై పడి బతుకుతాడు. పూటకూళ్లమ్మను ఉంచుకుని, ఆమె సరుకుల కోసం దాచుకున్న 20 రూపాయలను కాజేసి మధురవాణికిచ్చి ఆమెను ఉంచుకుంటాడు. సరైన పెద్దమనిషి దొరికితే ‘మధురవాణి లాంటి ఇరవై మందిని సపై్ల చేస్తానంటా’డు. బుచ్చమ్మ మీద కన్నేసి, విడో మేరేజీ పేరుతో ఆమెను నగానట్రాతో ఉడాయించుకు పోవాలని చూస్తాడు. గిరీశానికి ఇంగ్లిష్ వచ్చు. శ్రమ రాదు. చదువు ఉంది. నీతి లేదు. మేనకోడలైన సుబ్బిని కాపాడటానికి రంగంలో దిగిన కరటక శాస్త్రికి ఎన్ని సదుద్దేశాలున్నా అతడు మధురవాణికి పాత గిరాకీ. ‘ఎవరూ లభ్యం కాకపోతే నేను యాంటీ నాచే’ అంటాడు. ఇక ఆవు నైయ్యెనా ఇస్తాగానీ ఖూనీ కేసులో చిక్కుకున్న లుబ్ధావధాన్ల తరఫున సాక్ష్యం చెప్పననే పొలిశెట్టి, లేని దెయ్యాలను సీసాలో బంధించే గవరయ్య, హరిద్వార్‌లో మఠం కడతానని చిల్లర చందాలతో సాయంత్రాలు సారా కొట్లో గడిపే బైరాగి, కేసుంది అనగానే ఎంతొస్తది అనే కానిస్టేబు, చదవక తండ్రిని మోసం చేసే వెంకటేశం... కపటులు. మనుషులు బతకాలి. బతకడం ముఖ్యమే. అందుకై కాస్తో కూస్తో కపటత్వం అవసరం కావచ్చుగాని అందులోనే సోయి మరిచి కొట్టుకుపోవడమా? తెల్లారి లేస్తే కుత్సితాలు చేస్తూ, ఎదుటి వారి నెత్తిన చేయి పెడ్తూ, ఇతరుల కీడు కోరుతూ, బాగా గడుస్తూ ఉన్నా అత్యాశకొద్దీ విలువలు కాలరాస్తూ, పై అంతస్తుకు చేరేందుకు అయినవారిని కాలదంతూ, కేసులూ కోర్టులని తిరుగుతూ... ఆ కాలం మనుషులను తలుచుకుని గురజాడ– సౌజన్యారావు పంతులు రూపంలో కాసింత చింతిస్తూ ‘చెడ్డలో కూడా మంచి ఉండదా’ అంటాడు. ‘ఉన్నవారు వీరే. వీరిలో మంచి వెతికి సర్దుకుపోక తప్పదు’ అనే అర్థంలో! కాని నేటి రోజులు చూస్తుంటే ఆనాటి కపటులంతా మహానుభావులు అనిపించక మానదు. నేటి మనుషులకు కిందా మీదా పడి బతకడం రావడం లేదు. కపట జీవన సౌందర్యం తెలియడం లేదు. అసలు అంత ఓర్పు లేదు. చెడి బతికినా, బతికి చెడినా... బతకడం ముఖ్యం అనుకోవడం లేదు. చంపు లేదా చావు... అని క్షణాల్లో క్రూరత్వానికి తెగబడుతున్నారు. గురజాడ నేడు ‘కన్యాశుల్కం’ రాస్తే బుచ్చమ్మ, వెంకమ్మ కలిసి అగ్నిహోత్రావధాన్లకు విషం పెడతారు. లుబ్ధావధాన్ల పీక నొక్కి మీనాక్షి ఆస్తిపత్రాలతో పారిపోతుంది. చీటికి మాటికి తార్చి బతుకుతున్నాడని గిరీశం నిద్రలో ఉండగా మధురవాణి ఖూనీ చేస్తుంది. రామప్ప పంతులు ‘పోక్సో’ కింద అరెస్ట్ అవుతాడు. వెంకటేశం డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు. దారుణం అనిపించవచ్చుగాని పేర్లను మారిస్తే ఇవాళ్టి వార్తలు ఇవే! ఆగస్టు – ‘కన్యాశుల్కం’ మొదటిసారి ప్రదర్శించిన మాసం. సినిమాగా రిలీజైన మాసం. మనుషులు పరిహాసం ఆడదగ్గ అల్పత్వాలతోనే జీవించాలని, ఈసడించుకునే స్థాయి కపటత్వంతోనే బతకాలని, భీతి కలిగించే రాక్షస మనస్తత్వాలకు ఎన్నటికీ చేరకూడదని కోరుకునేందుకు ఈ మాసం కంటే మించిన శుభతిథి ఏముంది – నెలాఖరైనా? -
చైనా బ్యాచ్.. కన్యాశుల్కం
ఇది సీరియస్ విషయమో... సరదా అంశమో చివరిలో మాట్లాడుకుందాం. ముందుగా సరదాగా మొదలుపెడదాం. నిజానికి చైనా బ్యాచ్లర్స్ గురించి మాట్లాడుకోవాలి.. ఇండియాలోని బ్యాచ్‌లర్ తన యాంగిల్లో చెబుతున్న ‘భోజరాజు కథ’ ముందుగా విందాం. ఇందులో కాస్త కడుపుమంట కనిపిస్తుంది. భోజరాజీయం కథ ఇదీ.. ఓ పేద బ్రాహ్మణుడు. చదువు సంధ్యాలేదు. ఇల్లూవాకిలీ లేవు. ఏమీ లేని వారికి పిల్లనెవరిస్తారు. అందుకే సత్రాల్లో కాలక్షేపం చేస్తూ, ఊరూరూ తిరుగుతూ కాశీ చేరాడు. అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు మోదీ పీఎం అయ్యాక బాగా డెవలప్ చేసినట్టున్నారు కానీ, అప్పుడంత సీన్ లేనట్లుంది. భోజనానికి ఢోకాలేకుండా కొంతకాలం నడుస్తోంది. విభూది పూసుకుని శివావతారంలో దేశ సంచారం చేసే బృందమొకటి కనిపించింది. వారితోపాటు కలిసి తిరుగుతూ, వారు ప్రయాగ యాత్రకు వెళుతుంటే వారితో పాటు ప్రయాగకు చేరాడు. ఏమీ పాలుపోక, చేసేదేమీ లేక అక్కడ పుష్కరిణి నది వద్ద కూచున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు అమ్మాయిలు వచ్చారు. చాలా అందగత్తెలు. నలుగురు మాట్లాడుకుంటూ నదిలోకి దూకారు. ఇదంతా మనవాడు గమనిస్తున్నాడు. ఒకమ్మాయి.. నాకు నవ మన్మథాకారుడు, చక్రవర్తి భర్తగా కావాలి..అని చెప్పుకుంటూ దూకింది. మరొకామె.. నాకు కండల వీరుడు కావాలి.. అన్నది. ఇంకొకామె.. నాకు కవీశ్వరుడు భర్తగా రావాలి అని కోరుకున్నది. చివరి అమ్మాయి.. వచ్చే జన్మలో నాకు సంగీత లలిత కళా వల్లభుడు భర్తగా కావాలి అనుకుంటూ దూకేసింది. ‘ఈ జన్మలో ఇలాంటివి సాధ్యం కాదు..వచ్చే జన్మలోనైనా సాధ్యపడేలా చెయ్యి దేవుడా..’ అంటూ ప్రార్థిస్తూ, ఇలా అయితే వచ్చే జన్మలో తప్పక సిద్ధిస్తుంది అనుకుంటూ ఆనందంగా దూకేశారు. ఇదంతా వింటున్న మన హీరో బుర్ర పాదరసంలా పని చేసింది. వచ్చే జన్మలో ఆ నలుగురు నాకు భార్యలు కావాలి అంటూ తానూ దూకేశాడు. ఆ తర్వాత జన్మలో మనవాడు భోజరాజుగా జన్మించాడు. వారందరూ అన్ని లక్షణాలు, ఐశ్వర్యం, రాజ్యం ఉన్న భోజరాజుకు భార్యలయ్యారు ఇదీ కథ. కడుపు మంట ఇదీ.. ‘...ఇప్పుడు యూత్ అంతా భోజరాజులయితే కానీ పెళ్లి అయ్యేట్లు లేదు. కనీసం ఆ కాలంలో ఒక్కొక్క వరుడిలో ఒక్కో క్వాలిటీ అడిగారు. కానీ, ఈ తరం అమ్మాయిలు అన్ని లక్షణాలూ ఒక్కడిలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందగాళ్లు, ఎన్ఆర్ఐ సంబంధాలు, హై ఎడ్యుకేషన్లు, లక్షల్లో ప్యాకేజీలు, కార్లు, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు.. ఒక్కటేమిటి అన్నీ..’ ‘..ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు వచ్చాయి.. ఎన్నో సంబంధాలు పోయాయి.. నెత్తి మీద అరెకరం మిగిలింది.. క్యాంపస్ సెలెక్షన్లు, సంపన్న సంబంధాలు పోను మా లాంటి థర్టీ ప్లస్ గాళ్లం ‘లెఫ్ట్ ఓవర్’లాగా మిగిలిపోయాం,. ఏ మ్యాట్రిమోనీకి పోయినా.. ఎంత ఏజీ, ఎంత ప్యాకేజీ, వెనుక ఎంత బ్యాగేజీ అని అడుగుతున్నారు. ఇక ఈ జీవితానికి ఇంతే..’ – సోషల్ మీడియాలో ఓ బ్యాచ్‌లర్ సోదరుడి బాధ. మరి చైనా కథేంటీ అంటారా... ఇండియాలోని పెళ్లికాని ప్రసాదులకే ఇన్ని బాధలుంటే మనకు మించిన జనాభా ఉన్న.. చైనాలో బ్యాచ్లర్స్ బాధ ఇంత కన్నా ఎక్కువ. అక్కడో వరుడు అచ్చంగా కోటి రూపాయలకు పైగా వధువుకు ‘కన్యాశుల్కం’ సమర్పించుకున్నాడు. కన్యాశుల్కం అంటే తెల్సుగా.. మన దగ్గర వరకట్నానికి రివర్స్. అక్కడ కన్యాశుల్కం బాగా పెరుగుతోంది. మార్కెట్లో లక్షలు పలుకుతోందట! కరోనా వైరస్లాగా చైనా నుంచి కన్యాశుల్కం మనదేశానికి పాకుతుందేమోనని మన యూత్, పెళ్లి కాని ప్రసాద్‌ల బ్యాచ్.. చైనా బ్యాచ్‌ను చూసి బెంబేలెత్తుతున్నారని సోషల్ మీడియా భోగట్టా. చైనా బ్యాచ్.. ‘కన్యాశుల్కం’ చైనాలో చాలా కాలంగా కన్యాశుల్కం ఆచారం ఉంది. కానీ అది నామ్కేవాస్తే లాగా ఉండేది. కమ్యూనిస్టు పాలనలో కూడా అది విజృంభిస్తూనే ఉంది. ఈ కన్యాశుల్కం 60–70వ దశకంలో మంచాలు, పరుపులు లాంటి చిన్న గిఫ్టుల నుంచి, 80వ దశకంలో టీవీలు, ఫ్రిజ్‌ల దాకా చేరింది, 1990లలో అక్కడ ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక, కన్సూమరిజం పెరగడం, ఆర్థిక అంతరాలు పెరగడంతోపాటు లైంగిక వివక్ష పెరగడంతో కన్యాశుల్కం రాకెట్ వేగం అందుకుంది. కార్లు, రియల్ ఎస్టేట్ దాకా పోయింది. ఇప్పుడు పురుషులు వధువుకు, వధువు కుటుంబానికి కానుకల రూపంలో లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తోందట. కార్లు లాంటి వాహన రూపంలో, ఆస్తుల రూపంలో సమర్పించుకుంటున్నారు. దీన్నే ‘బ్రైడ్ ప్రైస్’ అంటున్నారు. ఈ సంప్రదాయం ఎక్కువగా చైనా గ్రామీణ ప్రాంతంలో కనిపించేది. ఇప్పుడు సిటీలకు కూడా బాగా పాకుతోంది. ఇటీవల ఓ వధువు కుటుంబం కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేయడం, అది మీడియాలో బాగా చర్చ కావడంతో అందరి దృష్టి చైనా బ్యాచ్లర్ల కష్టాలపై పడింది. చివరికి చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా దీనిపై దృష్టి పెట్టడం దీని సీరియస్‌నెస్‌కు అద్దం పడుతోంది. చైనా ‘వన్’ వే.. చైనా ఏది చేసినా కరోనా స్థాయిలోనే చేస్తుంది. జనాభా పెరిగిపోతోందన్న ఆందోళనతో దశాబ్దాల పాటు ఒకే బిడ్డను కనాలన్న ‘వన్ చైల్డ్’ పద్ధతిని చాలా సీరియస్‌గా ఇంప్లిమెంట్ చేసింది. ఇండియాలో లాగానే.. మగబిడ్డ కావాలనే సెంటిమెంట్ చైనా సమాజంలో కూడా ఉంది. దానితో వారు కనే ఒక్క బిడ్డను మగబిడ్డను కనడానికే ఆసక్తి చూపారు. ఇది తీవ్ర లింగ వివక్షకు దారితీసి లింగ నిష్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. మగబిడ్డ కావాలనే ఆకాంక్ష వల్ల అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017లో చేసిన ఒక సర్వేలో 100 మంది పెళ్లికాని పురుషులకు 66 మంది పెళ్లి కానీ స్త్రీలే ఉన్నట్లు తేలింది. చైనాలో 1986 నుంచి ప్రతి మ్యారేజ్‌ను రిజిస్టర్ చేయాలన్న రూల్ తెచ్చారు. ఈ లెక్కల ప్రకారం 2021లో 76 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన వచ్చాక అతి తక్కువ పెళ్లిళ్లు అయిన ఏడాది ఇదే. యువత లేట్‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మ్యారేజ్ ఏజ్ పెరిగింది. ఒంటరిగా ఉండిపోతున్న అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. తద్వారా కన్యాశుల్కం పెరుగుతోంది. అక్కడ అన్నీ ఆర్థిక హంగులున్న భోజరాజులకు మాత్రమే పెళ్లిళ్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇక్కడా వస్తుందేమోనని చైనా బ్యాచ్‌ను చూసి మన ఇండియా బ్యాచ్ బ్యాచ్లర్ల భయం. ఎంకరేజ్ ‘వ్యాక్సిన్’.. పైన చెప్పిన కారణాలు, వన్చైల్డ్ సిస్టమ్‌తో జనాభా తగ్గిపోవడంతో వన్చైల్డ్ పద్ధతికి చైనా స్వస్తి పలికింది. అయినా 2022లో చైనా జనాభా తగ్గింది. ప్రపంచానికి భిన్న పోకడ ఇది. ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందేమోనన్న కంగారు పడుతున్న చైనా సర్కారు ఇప్పుడు ఎక్కువ మందిని కనాలని ఎంకరేజ్ చేస్తోంది. మ్యారేజ్ చేసుకున్న కొత్త దంపతులకు ఇప్పటిదాకా మూడు రోజులు పెయిడ్ లీవ్‌లు ఉండేవి. ఇప్పుడు వాటిని 30 రోజులకు పెంచారు. ప్రపంచంలోనే రెండు అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టం అవుతోంది. పెళ్లి.. ఆర్థిక, సామాజిక సమస్యగా మారింది. పెళ్లి ‘మార్కెట్’ కావడంతో ..మార్కెట్లో నిలబడలేని ఎంతోమంది పెళ్లి కాకుండానే ఉండిపోతున్నారు. ప్యాకేజీల కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. చైనాలో పెరుగుతున్న కన్యాశుల్కం ఓ రకంగా అమ్మాయిలను మార్కెట్లో పెట్టడమే.. అంగడి సరుకుగా మార్చడమే! ఈ పరిస్థితి.. ఆడపిల్ల అమ్మ కడుపులో ఉండగానే సమాజం మూకుమ్మడిగా కత్తులు దూసినందుకు తగిలిన ఉసురు కాదా..?.. ఇదీ సీరియస్ అంశం! -సరికొండ చలపతి -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..!
Anasuya As Prostitute In Kanyasulkam Web Series: బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. 'రంగస్థలం'లో 'రంగమ్మత్త'గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా చేసి మరింత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్లో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. తాజాగా మరో క్రేజీ పాత్రలో అనసూయ నటించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథతో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నాడట. ఈ వెబ్ సిరీస్‌కు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ క్రిష్ చూసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ రోల్లో నటించేందుకు అనసూయ సైతం ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో అనసూయ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు -
కన్యాశుల్కంలో అయ్యంగార్లు
యుగకర్తలైన కవులూ రచయితలూ కూడా సమకాలిక సమాజాన్నీ తమ జీవితానుభవాల్నీ దాటిపోలేరు. కన్యాశుల్కంలో గిరీశం: ‘మీకే ఇంగ్లీషొస్తే భాష్యం అయ్యంగార్లా అయిపోరా?’ అని అగ్నిహోత్రావధానుల్తో అంటాడు. ఈ అయ్యంగారి ప్రస్తావన మొట్టమొదటి కన్యాశుల్కం (రచన 1892, ముద్రణ 1897)లో లేదు. సమూలమైన మార్పులతో రెండోకూర్పు 1909లో వెలువడింది. ఈమధ్యగా సుమారు ఒక దశాబ్దానికి పైచిలుకు కాలంలో గురజాడ అప్పారావు(1862–1915) జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పారావుగార్ని ఎంతో ఆదరించి ప్రోత్సహించిన విజయనగరం ఆనందగజపతి మహారాజావారు 1897లో ఆకస్మికంగా కాలధర్మం చెందారు. ఆ తరువాత ఎస్టేటు వ్యవహారాల్ని వారి మాతృదేవత అలకరాజేశ్వరి(1832–1802), సోదరి రీవాసర్కార్ అప్పలకొండమాంబ (1849–1912) చూసుకోవాల్సి వచ్చింది. గురజాడకీ బరువు బాధ్యతలు పెరిగాయి. ఆనందగజపతికి సంతానం లేదు. వారి వీలునామా ప్రకారం వారి తల్లి తమ మేనల్లుడు విజయరామగజపతి(చిట్టిబాబు )ని దత్తత తీసుకున్నారు. కానీ ఆయన మైనరు. పాలనా వ్యవహారాల్ని ప్రభుత్వంవారు ఒక రీజెన్సీ కౌన్సిల్‌కు అప్పజెప్పారు. అందులో మాతృశ్రీ, రీవారాణి సభ్యులు. ఇదంతా జ్ఞాతులకు నచ్చలేదు. 1898లో అప్పారావు, రీవారాణి ఆంతరంగిక కార్యదర్శిగా నియమితులైనారు. దాయాదులు వేసిన వెలగాడ, కొండపాలెం మొదలైన చిల్లర దావాలూ, సంస్థాన వారసత్వపు ‘పెద్దదావా’ ఏలినవార్ని చుట్టుముట్టాయి. వీటన్నిటినీ న్యాయకోవిదుడు దేశిరాజు జగన్నాథరావు పంతులుతోపాటు గురజాడ చూసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ‘పెద్దదావా’ వ్యవహారాన్ని రీవారాణి అప్పారావు భుజాలమీదనే పెట్టింది. అప్పటికే దివాన్ బహదూర్ భాష్యం అయ్యంగార్ (1844–1908) మద్రాసులో పేరుపొందిన లాయరు. మైలాపూర్‌లో నివసించేవారు. వీరు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులైన మొదటి భారతీయుడు. వీరి శిలావిగ్రహం ఇప్పటికీ మద్రాసు హైకోర్టు ఆవరణలో వున్నది. వీరిని ‘పెద్ద దావా’ సందర్భంలో మొదట 1900లోనూ, తరువాత 1903లోనూ కలుసుకొని సుదీర్ఘంగా చర్చించారు. భాష్యం అయ్యంగారు అంతటి ప్రతిభావంతులు కనుకనే కన్యాశుల్కం రెండోకూర్పు 1909లో ఎత్తి రాస్తున్నప్పుడు గురజాడ మనోఫలకం మీద వారు కచ్చితంగా వుండేవుంటారు. అంతేకాదు ఆ ముందు సంవత్సరమే వారు కీర్తిశేషులైనారు. కాబట్టి వారి పేరు సంభాషణ రూపంలో అప్రయత్నంగానే లిఖితమైంది. భాష్యం అయ్యంగారికి స్వయానా వారి మూడో అల్లుడు, లాయరు ఎస్.శ్రీనివాసయ్యంగార్ (1874–1941) సహాయకుడిగా ఉండేవారు. వారి అనుయాయులు ఆయన్ని ‘దక్షిణాది సింహం’ అనేవారు. వీరుకూడా 1916–20లో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ(1919)కు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి సాహితీవేత్త. షేక్ స్పియర్ నాటక వాఙ్మయంపైన ప్రామాణికుడైన విమర్శకుడు. ఈయనతో గురజాడ ‘పెద్ద దావా’ వ్యవహారంతో పాటు సాహితీ చర్చలు కూడా చేసేవారు. 1907లో అప్పారావు ఊటీనుండి విజయనగరం ప్రయాణిస్తున్నప్పుడు ఆయన లగేజీని ఎవరో తస్కరించారు. ‘దావా’ కాగితాలతోపాటు అప్పటికే రాస్తున్న ‘కొండుభట్టీయం’ సాఫుప్రతి కూడా పోయింది. అందులోని అంశాల్ని బాధతోనే అయ్యంగారికి వివరంగా చెప్పివుంటారు. అయితే ఆయన తెలివైనవారు. కొండుభట్టీయంలోని సన్నివేశాలకూ అప్పటికే ప్రచురితమైన మొదటి కన్యాశుల్కంలోని పాత్రలకూ పోలికల్ని గుర్తించారు. 1909లో రెండోకూర్పు ముద్రణ ప్రారంభించేటప్పుడు నాటక రచనలో ఎన్నో సూచనలు చేశారు. నాటకాన్ని ఎత్తి రాస్తున్నప్పుడు గురజాడ వాటిని పాటించారు. ఈ కూర్పు పీఠిక 01–5–1909 మొదటి పేరాలోనే ‘నా మిత్రుడు ఎస్. శ్రీనివాసయ్యంగారి సూచనలపై మొత్తం నాటకాన్ని తిరగ రాసాను. సాహిత్య రచనలపై ఆయన అభిప్రాయాల పట్ల నాకెంతో గౌరవం వుంది’ అంటూ ఆత్మీయ పూర్వకంగా ఉల్లేఖించారు. పై ఇరువురు అయ్యంగార్లూ కాకుండా కన్యాశుల్కం పీఠికలోనే ‘నామిత్రుడు’ అంటూ గురజాడ మరో అయ్యంగారినికూడా పేర్కొన్నారు. 1906లో గంజాం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు విద్యాశాఖ పరీక్షాధికారిగా జె.ఏ. ఏట్సు దొర వచ్చారు. వృత్తిరీత్యానూ, కుతూహలం కొద్దీ తెలుగు నేర్చుకొంటున్నప్పుడు జనం మాట్లాడే భాషకూ, కాగితం మీద రాసే భాషకూ ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు గమనించారు. ఈ సంగతిని ఆనాటి విశాఖ, ఏ.వి.ఎన్.కళాశాల ప్రిన్సిపాల్, పి.టి.శ్రీనివాసయ్యంగారి (1863–1931)ని ప్రశ్నించారు. అయ్యంగార్ తమిళులే అయినా విశాఖలో స్థిరపడి ఆ మాండలిక భాషని అలవరచుకొన్నారు. ఈ సమస్య కూడా వారికి కూలంకషంగా తెలుసు. అయితే ఈ అంశాన్ని గిడుగు, గురజాడగార్లతో చర్చించమని ఏట్సు దొరగారికి సలహా ఇచ్చారు. అప్పటికే ఆ ఇద్దరూ వాడుకభాషోద్యమాన్ని నడుపుతున్నారు. వారితో సంప్రదించి ఏట్సు దొర తాము అధ్యక్షులుగా, అయ్యంగార్ కార్యదర్శిగా ‘తెలుగు భాషాబోధన సంస్కరణ సమాజాన్ని’ స్థాపించారు. దానికి గిడుగు, గురజాడలే ప్రధాన సార«థులు. ఈ సమాజం కూడా వాడుక భాషా విప్లవానికి రంగస్థలమైంది. కన్యాశుల్కం రచనలో వాడుకభాష కూడా అంత్యంత కీలకమైనదే. అందుచేతనే 1909 నాటి మలికూర్పు పీఠికలో పి.టి. శ్రీనివాసయ్యంగారిని కూడా ‘నా మిత్రుడు’ అని ప్రస్తావించారు.ఈ విధంగా ప్రపంచ సాహిత్యంలోనే మణిమాణిక్యం వంటి కన్యాశుల్కం నాటకంలో అయ్యంగార్లు చోటుచేసుకొని చరితార్థులైనారు. (ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, అంతర్జాలం సహకారంతో) -టి.షణ్ముఖ రావు -
మూలాల్ని ఛేదించటమే ‘మీటూ’
స్వార్థ ప్రయోజన పునాదులపైన ఆదినుంచీ బలుస్తూ వచ్చిన ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలకు ‘సిజేరియన్ ఆపరేషన్’ జరక్కుండా సమాజాన్ని, సామాజిక పరిస్థితుల్ని మార్చలేం. ఆ శస్త్ర చికిత్స ఈ వ్యవస్థకు జరగనందునే నైతిక బలహీనతలు ముదిరిపోయి– అవి జర్నలిస్టులకు, నటులకు, సినీ దర్శకులకు, కవులకు, రచయితలకు, కళాకారులకు, సంగీత కళాకారులకు కార్పొరేట్ భద్ర పురుషులకు, పార్లమెంటేరియన్లకు, సైనిక పోలీస్ శాఖలకు, పాలకులకు– ఒకరేమిటి సమాజాన్ని శాసించే సర్వ శాఖలకూ వ్యాపించి, కానరాని కీచక పర్వాలు తెరచుకుంటున్నాయి. అందుకే మూలాన్ని ఛేదించడమే మీటూ ఉద్యమ కర్తవ్యం కావాలి. ‘స్త్రీలు పనిచేస్తున్న సంస్థల్లో కేవలం స్త్రీల పట్ల జరిగే వేధింపుల పరిష్కారానికి మాత్రమే 1997లో న్యాయస్థానం విశాఖ ఆదేశిక సూత్రాల (గైడ్‌లైన్స్)ను రూపొందించింది. కానీ గతం నుంచీ స్త్రీల పట్ల జరుగుతున్న వేధింపుల, అత్యాచారాల పరిష్కారానికి కూడా నేడు విశాఖ గైడ్‌లైన్స్ వర్తింపచేయాల్సిన అవసరముంది’’ – జస్టిస్ (రిటైర్డ్) సుజాత మనోహర్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇంటర్వ్యూ ‘నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో మానవుల విజయానికి ప్రజల గుర్తింపు అనే ముద్రను ఒక ఆరాధ్యమంత్రంగా భావించడం జరుగు తోంది. కానీ ఈ విజయభావన చాటున జరుగుతున్నది సామాజిక అన్యా యాల పట్ల సామాజికులు నోరెత్తకుండా చేయడమే! ఇలాంటి తప్పుడు పవిత్ర భావనను సృష్టించడానికి పితృస్వామిక వ్యవస్థ తన శక్తియుక్తుల్ని ఇప్పటికే చాలా వెచ్చించింది. కానీ ఈ వ్యవస్థ తనకు తాను అద్దంలో చూసుకుంటే దాని వికృతాకారం బయటపడుతుంది. సామాజిక ఔన్నత్యం పేరిట విర్రవీగే దాని డాబు దర్పాలన్నీ నేడు ‘నేను (మేము) సైతం’’ అని ఆత్మరక్షణార్థం విరుచుకు పడుతున్న మహిళా ఉద్యమం ముందు డుల్లి పోతాయి. అది కదలబారుతున్న లక్షలాదిమంది బాధాతప్తుల çహృదయ స్పందన అని గుర్తించాలి’ – మిస్ ఫరా నక్వీ, ప్రసిద్ధ మీడియా రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఢిల్లీ ఇప్పటికీ సమాజంపై పెత్తనం చలాయిస్తున్న పితృస్వామిక వ్యవస్థ అనాదిగానే తన ఉనికికోసం, స్త్రీ పరంగానూ, పురుషుడి పరంగానూ కొన్ని సామెతలను సమాజం మీదికి వదిలి కూర్చుంది. ఆడదాని బతుకు అరిటాకు బతుకుగా చిత్రించి ఆమెను అనాథగా మార్చింది. స్త్రీ మాట ఆపదలకు మూలమని చెప్పి నోరు నొక్కింది. కానీ అదే వ్యవస్థ తాను మాత్రం మారకుండా ఉత్తరోత్తరా రానున్న పరిణామాలను ఊహించు కుని బహుశా దోపిడీ సమాజంలో స్త్రీకి ఒక ‘రాయితీ’గా ఆడదాన్ని నోరు పెట్టుకుని బతకమనడంలో కూడా బోలెడంత అర్థముండి ఉండాలి. అందుకే అన్ని రకాల దాష్టీకాలకు చరమాంకాన్ని రచించేందుకు ఇపుడు ‘నేను (మేము) సైతం’ (మీటూ–ఉయ్ టూ) అంటూ ప్రపంచ మహిళా ఉద్యమ ఉ«ధృతిలో భాగంగా మన దేశంలో కూడా పితృస్వామిక వ్యవస్థ ఆగడాలకు భరతవాక్యం చెప్పే వైపుగా ఉద్యమిస్తోంది. నిజానికి ఈ మహోద్యమ పునాదులు ఈనాటివి కావు. ఒక వైపునుంచి తెలుగునాట వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, గిడుగు... మరోవైపునుంచి రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, జ్యోతిబాయి పూలే, గాంధీజీలు సామాజిక అసమానతలకు, స్త్రీ పురుషుల మధ్య వివక్షతకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలు నిర్వహించారు. అయినా ఫలితం నేటికీ పాక్షికంగానే ఉండిపోయింది. నిజానికి నిర్భయ హత్యోదంతం తర్వాత కూడా వేధింపులకు నిస్సిగ్గుగా పాల్పడిన వారిలో కొందరికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా గత దశాబ్దిన్నర కాలం లోనూ దేశంలో ‘రేప్’ కేసులు అదుపులోకి రాకపోవడం చూస్తుంటే పితృస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్థల్లో మౌలికంగా ఏ పరివర్తనా రాలేదు. కనీసం అందుకు జరిగిన ప్రయత్నమూ చిత్తశుద్ధితో జరగలేదు. ఒకనాటి జార సమాజం అనుకున్న రాజుల, చక్రవర్తుల కాలంలోనే ఆ సమాజాన్ని సరిదిద్దడం కోసం శృంగారానికి సంబంధించిన కథల ద్వారా ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేసే యత్నంలో అన్యాపదేశంగా 17–18 శతాబ్దాలలోనే ‘హంసవింశతి’లో అయ్యలరాజు నారాయణామా త్యుడు, ‘శుకసప్తతి’ కథల ద్వారా పాలవేకరి కదిరీపతి పండితుడూ గొప్ప నీతిని బోధించారు. ఒక మంచివాడున్న చోట ఒక దుష్టుడూ ఉంటాడన్న సూక్తి ఫ్యూడల్ వ్యవస్థలోనూ, పెట్టుబడి సమాజంలోనూ అనివార్యం. చెడును చూపడం ద్వారా మంచిని వ్యవస్థాపించడానికి ప్రయత్నించడం ప్రజాహితమైన కావ్యసృష్టి నాటక కళా రంగాలకు ధ్యేయంగా ఉండాలనీ, తద్వారా జన సామాన్యంలో మానసికంగా ఔన్న త్యానికి దారులు పరచాలనీ నిరూపించిన స్త్రీ, పురుష రచయితలు నేటికీ లేకపోలేదు. అయితే తమ స్వార్థ ప్రయోజన పునాదులపైన ఆదినుంచీ బలుస్తూ వచ్చిన ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలకు ‘సిజేరియన్ ఆపరేషన్’ జరక్కుండా, సామాజిక పరిస్థితుల్ని మార్చలేం. అందుకే గురజాడవారి ‘కన్యాశుల్కం’లో గిరీశం ‘అటునుంచి నరుక్కురమ్మని’ చెప్పింది. ఆ శస్త్ర చికిత్స ఈ వ్యవస్థకు జరగనందునే నైతిక బలహీనతలు ముదిరిపోయి– అవి జర్నలిస్టులకు, నటులకు, సినీ దర్శకులకు, కవు లకు, రచయితలకు, కళాకారులకు, సంగీత కళాకారులకు కార్పొరేట్ భద్ర పురుషులకు, పార్లమెంటేరియన్లకు, సైనిక పోలీస్ శాఖలకు, పాల కులకు– ఒకరేమిటి సమాజాన్ని శాసించే సర్వ శాఖలకూ వ్యాపించి, కాన రాని కీచక పర్వాలు తెరచుకుంటున్నాయి. మనం ప్రేమించే పాండవుల్ని సహితం ఈ జాఢ్యం పీడించింది. కాబట్టే వ్యాస భారతం సహితం ‘పాండవాంః జారజాతాః’ అని పేర్కొనవలసి వచ్చింది. చెప్పుకుంటూ పోతే చాలా ‘చిత్రమైన’ చరిత్రలు మనలోనే గూడుకట్టుకుని ఉన్నాయి. ఈ వేధింపుల, అత్యాచారాల జాఢ్యం ఒక్క యువతులపట్లనే కాదు, వివాహిత స్త్రీలనూ వదలడం లేదు. దేశంలోని వివాహిత మహి ళలలో నూటికి 80 మంది తమ భర్తల నుంచే గృహ హింసను ఎదు ర్కొంటున్నారని ఒక తాజా సర్వే పేర్కొనగా, 27 శాతంమంది అవి వాహిత స్త్రీలు సొంత బంధువులనుంచీ, 18 శాతం మంది స్త్రీలు మగ కుర్రకారు స్నేహితుల నుంచీ, 17 శాతం స్త్రీలు పరిచయస్తులనుంచీ వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలో బయటపడింది. కాగా, 99.1 శాతం మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, ఆ కేసులు అసలు రిపోర్టు కాకుండానే కనుమరుగు చేశారని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ తాజాగా వివరాలు నమోదు చేసింది. ఈ సందర్భంగా అన్నింటికన్నా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురయ్యే వ్యక్తులపైగాని, వేధింపు లకు పాల్పడే వ్యక్తులపైగానీ మానవుల మెదడులోని ‘హార్మోన్లు’ కల్గించే ప్రభావం గురించి శాస్త్రవేత్త టాటా ఇనిస్టిట్యూట్ సోషల్ సైన్సెస్ విభాగంలో పరిశోధకురాలు, మనస్తత్వ శాస్త్రవేత్త అయిన ప్రసిద్ధ ప్రొఫె సర్ శ్రీమతి ప్రాచీ యాదవ్ కొన్ని విషయాలను వెల్లడించారు: ‘‘లైంగిక వేధింపునకు లేదా అత్యాచారానికి పాల్పడేవారు వ్యక్తి జాఢ్య ఉన్మాదులు. ఈ జాఢ్యం ఉన్న ప్రతివ్యక్తి అనుభవం వేర్వేరుగా ఉంటుంది. కానీ ఇందుకు లోనయ్యే బాధితురాళ్లు మాత్రం దుర్భలులై పోయి, నిస్త్రాణమైపోతారు. ఈ దారుణానుభవం బాధితుల జీవితం లోని ప్రతి ఒక్క దశల్లోనూ వెన్నాడుతూనే ఉంటుంది. మహిళల మనస్సుపై పడే ఈ హింస/గాయం– జీవిత భాగస్వామి లేదా తెలిసిన వ్యక్తినుంచో లేదా కుటుంబ సభ్యులనుంచో, స్నేహితుల నుంచో, పని చేసేచోటనో లేదా వీధిలో వెంటాడుతున్నప్పుడో, అసలు ఏ మాత్రం పరి చయం లేని వ్యక్తులనుంచో ఎదురుకావచ్చు. చివరికి చిన్నారులైన ఆడ పిల్లలూ ఈ హింసకు గురికావచ్చు. ఈ లైంగిక దాడులకు ప్రధాన కారణం మనిషి మెదడు పనిచేసే ప్రక్రియల్లోనే ఉంది. ఈ దారుణ ఘటనలకు మనిషి శరీర భాగాల్లోని హార్మోన్లు వెంటనే ప్రతిస్పంది స్తాయి. లైంగిక ప్రమాదానికి గురైన స్త్రీ అప్పుడు తాను ఎదురు తిరిగి పోరాడటమా లేక హింస బారినుంచి తప్పించుకుని పారిపోవడమా అని ఆ క్షణంలోనే తేల్చుకుంటుంది. ఈ నిర్ణయ శక్తిని నిర్ణయించేది ఆమె మెదడులోని ‘కాటెకోలమైన్’ హార్మోన్. అలాగే ‘కోర్టిసోల్’ అనే హార్మోను ఎదురు తిరగమని బాధితురాల్ని ప్రోత్సహించే నైతిక బలమిస్తుంది. ఇలా హింసకు గురికాబోతున్న సమయంలో ఆ వ్యక్తి భౌతికంగా, ఉద్రే కంగా అనుభవించే బాధను తట్టుకునేందుకు ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ వేదనలో ఉన్న స్త్రీ/పురుషులు హేతుబద్ధంగా వ్యవహరించే శక్తిని తాత్కా లికంగా కోల్పోతారు. మొత్తం శరీరమే స్తంభించిపోతుంద’’ని ప్రొఫెసర్ ప్రాచీ వివరించారు (డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్). ఈ వైపుగా కూడా ఆలోచించి, పరిశీలించి దేశంలోని సామాజిక కార్యకర్తలు, మహిళా ఉద్యమకారులు అధ్యయనం చేసి ఉన్న పరిస్థితు లతో రాజీ పడకుండానే మహిళా ఉద్యమానికి మరింతగా శక్తియుక్తుల్ని పొందుపరిచి అవిశ్రాంత పోరును ఉధృతం చేస్తేగానీ పితృస్వామ్య– పెట్టుబడి వ్యవస్థలు ఈ మాత్రమైనా అంకెకు రావని గుర్తించాలి. శరీర సౌందర్యంకన్నా బుద్ధి బలానికి ప్రాధాన్యత కల్పించిన ప్రాచీన హంస– చిలక కథల్ని మరొకసారి చదివి, నేటి యువతీ యువకులు సన్మార్గ స్ఫూర్తిని పొందడం అవశ్యం. అందుకనే మహాకవి గురజాడ వందేళ్ల క్రితమే ‘స్త్రీల కన్నీటి గాథ లకు కారణం నాకు తెలుసు. వారికి వకాల్తా పట్టడానికే నేను నిర్ణయిం చుకున్నాను’ అన్నాడు. కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర ద్వారా ఒక బరువైన మాటను, తప్పును సవరించుకునే లోచనా శక్తినీ, ఆలోచనా శక్తినీ తనను ప్రలోభ పెట్టబోయిన సౌజన్యారావుకు కల్పిస్తూ ఒక నీతిని ప్రబోధించిన తీరు కూడా ‘నభూతో నభవిష్యత్’. ‘చెడని వారిని చెడ గొట్టవద్దని చెప్పింది మా అమ్మ’ అన్న అంత బరువైన సందేశాన్ని ఆమె ద్వారా గురజాడ ఎందుకు సమాజానికి అందించాడు? ఇంతకూ స్త్రీ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఎందుకు తహతహలాడుతుందో గుర జాడ, చలం తమ గుండె గొంతుకల్ని ఇలా విప్పారు: ‘‘ప్రేమలేక, సంతో షం లేక జీవితంలో ఇంటరెస్టు కోల్పోయి, తను ఏ బాధపడ్డా కరుణించే వారు లేక, ఇంక విధిలేక బండచాకిరీలో తన శక్తినీ, ద్వేషంలో తన ప్రేమనీ, తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలనే ప్రయత్నిస్తుంది స్త్రీ’’ ఆ ప్రయత్నానికి నేటి వైజయంతినే ‘మీటూ’ మహిళా ఉద్యమం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
శంకరశాస్త్రి పుణ్యమా అని నేను, అన్నయ్య ఎనిమిదేళ్లు మాట్లాడుకోలేదు..!
జె.వి. సోమయాజులుది నిండైన విగ్రహం... ఖంగుమని వినిపించే స్వరం... తమ్ముడు రమణమూర్తితో కలసి ఆయన ప్రాణం పోసిన నాటక పాత్రలనేకం... కానీ, ఒక్క సినిమా, ఒకే ఒక్క పాత్ర ఆయన జీవితాన్నే మార్చేశాయి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రిగా చెరగని ముద్ర వేసిన సోమయాజులు ‘కన్యాశుల్కం’కీ, తమ్ముడికీ కొన్నేళ్ళు ఎందుకు దూరమయ్యారు? ఎన్నో ఏళ్ళు కలసి నటించినా, తమ్ముణ్ణి ఎందుకు మెచ్చుకోలేదు? ఇవాళ సోమయాజులు జన్మదినం సందర్భంగా నిజజీవిత శంకరశాస్త్రి జ్ఞాపకాల కిటికీని 81 ఏళ్ళ తమ్ముడు తెరిచారు. మాది శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారం. మా తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. మా నాన్న గారు జె.వి. శివరామమూర్తి ఆ రోజుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. మా అమ్మా నాన్నలకు మేము అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, నేను నాలుగో సంతానం. అన్నయ్య పూర్తి పేరు - జొన్నలగడ్డ వెంకటసుబ్రహ్మణ్య సోమయాజులు. మేమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అన్నదమ్ముల లాగా కాకుండా, మంచి స్నేహితుల లాగా ఉండేవాళ్ళం. ఒకరినొకరం ‘ఒరేయ్’ అంటూ, పేర్లతోనే పిలుచుకొనేవాళ్ళం. రంగస్థలంపై తొలి రోజుల్లో... మా అన్నయ్య సోమయాజులు, నేను, నా తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - మేమంతా రంగస్థల పక్షులం. స్కూలు, కాలేజ్ రోజుల నుంచే అందుకు భూమిక ఏర్పడింది. నాటకం పేరు గుర్తు లేదు కానీ, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశాడు అన్నయ్య. అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత పెద్ద బ్యాచ్‌ను వదిలేసి, మా పిల్లకుంకల బ్యాచ్‌లో సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి నేను, అన్నయ్య కలసి మా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో పట్టుదలగా, ఉత్సాహంగా ఆడేవాళ్ళం! డెరైక్టర్‌గా నాటకంలో ముఖ్యమైన పాత్ర అన్నయ్యకిచ్చేవాణ్ణి. మిగిలినవాళ్ళకు తగిన పాత్రలు ఇచ్చేసి, అందరూ వదిలేసిన పాత్ర నేను వేసేవాణ్ణి. అదీ పద్ధతి. నాటకంలో పాత్రపోషణ ఎలా ఉండాలనే దాని మీద మా అన్నయ్యకూ, నాకూ వాదనలు జరిగిన సందర్భాలున్నాయి. వాడి దగ్గర సుగుణం ఏమిటంటే, ఒకసారి డెరైక్టర్ చెప్పాక, దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లు చేసేసేవాడు. ఏళ్ళ తరబడి ‘కన్యాశుల్కం’ జైత్రయాత్ర ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, వాడు అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి స్క్రిప్టు చదివి వినిపించేవాణ్ణి. అవన్నీ గుర్తుపెట్టుకొనేవాడు. అన్నదమ్ములం నాటకాలు వేస్తుంటే, మా అమ్మ చూసి, ఎంతో ఆనందించేది. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ చేపట్టినప్పుడు కీలకమైన రామప్ప పంతులు వేషం మా అన్నయ్యకిచ్చి, నేను గిరీశం వేషం కట్టాను. తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశాం. ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. దేశమంతటా మాకు అఖండ కీర్తి వచ్చింది. నటుడిగా వాడిలో ఉన్న పెద్ద బలం - ఆత్మవిశ్వాసం. పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవాడు. ఇద్దరం కలసి నాటకాలు వేస్తున్నప్పుడు పరిషత్ పోటీల్లో చాలాసార్లు ఉత్తమ నటుడి విషయంలో నాకూ, వాడికీ మధ్య పోటీ టై అయ్యేది. ఫ్లాప్‌తో... సినీ రంగ ప్రవేశం 1957లో నేను సినిమాల్లోకి వెళ్ళాను. ఎల్వీ ప్రసాద్ మేనల్లుడు కె.బి. తిలక్ ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యా. తరువాత 22 ఏళ్ళకు దర్శకుడు యోగి ‘రారా కృష్ణయ్యా!’ ద్వారా వైజాగ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అన్నయ్యను తెరపైకి తెచ్చాడు. మొదట వేయనని పట్టుబట్టినా, నా చీటీ చూసి, స్క్రిప్టు చదివి, నా సలహా మేరకు అన్నయ్య ఒప్పుకున్నాడు. తీరా, సినిమా ఫ్లాపైంది. ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజంలోనూ మా అన్నయ్యను రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు మా అన్నయ్య పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, అన్నయ్య ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన నేను అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించాడు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయాడు. మనిషిని మార్చేసిన ‘శంకరాభరణం’ వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు. అయితే, ఒకరకంగా చూస్తే - ఆ సినిమా, పాత్ర సోమయాజులుకు ఎంత పేరు తెచ్చాయో, నటుడిగా అంత చెరుపూ చేశాయని తరువాత తరువాత నాకు అనిపించింది. అంతటి అఖండ కీర్తితో సహజంగానే ఎవరికైనా దర్పం వస్తుంది. చుట్టూ భజనపరులు తయారయ్యారు. తరువాత కొద్దికాలానికి మునుపెప్పుడో ఒప్పుకున్న ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన చేయాల్సి వచ్చింది. కానీ, ‘ఇంత పేరొచ్చాక, ఇప్పుడు ‘కన్యాశుల్కం’ రామప్ప పంతులు పాత్ర చేయలేను. జనం నన్ను ఆ పాత్రలో అంగీకరించరు’ అన్నాడు సోమయాజులు. దాంతో, నాకు కోపం వచ్చింది. ‘నాటకం కన్నా, పాత్ర కన్నా నటుడు గొప్పవాడేమీ కాదు. ఏ వేషం నీకు గుర్తింపు తెచ్చి, నిన్ను నటుడిగా తీర్చిదిద్దిందో అది వేయనంటున్నావు. నీ లాంటివాడితో కలసి మళ్ళీ రంగస్థలం ఎక్కను’ అని చెప్పేశాను. అలా శంకరశాస్త్రి పాత్ర పుణ్యమా అని దాదాపు తొమ్మిదేళ్ళు నాకూ, వాడికీ మధ్య రాకపోకలు, మాటలు లేవు. కానీ, చివరకు ‘కన్యాశుల్క’మే మళ్ళీ మమ్మల్ని కలిపింది. ఆ నాటకం నూరేళ్ళ పండుగకు విజయనగరం వాళ్ళు మళ్ళీ మా బృందంతో ప్రదర్శన వేయించాలని పట్టుబట్టి, మమ్మల్ని కలిపారు. గురజాడ వారు తొలిసారిగా ప్రదర్శించిన విజయనగరం కోటలోనే ఆ నాటక ప్రదర్శన దిగ్విజయంగా వేశాం. ఆ నూరేళ్ళ ఉత్సవ సందర్భంగా ఆ ఒక్క ఏడాదిలోనే దేశమంతటా మళ్ళీ కొన్ని పదుల ప్రదర్శనలిచ్చాం! గొడవ కాకముందైతేనేం, తరువాత అయితేనేం... మా అన్నయ్య, నేను - ఇద్దరం కలసి తెరపై నటించాం. కలిసి నటించినా, మాట్లాడుకున్నా ఎందుకనో నాకూ, వాడికీ మధ్య మునుపటి సద్భావం పోయింది. ముభావంగానే ఉండేవాడు. కానీ, (గద్గదికంగా...) అప్పటికీ, ఇప్పటికీ వాడంటే నాకు ప్రేమ, గౌరవమే. అరుదైన నిజాయతీ... అపూర్వ గౌరవం... మా అన్నయ్యలోని మరో గొప్పతనం ఏమిటంటే, క్లర్క్‌గా మొదలైనవాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగాడు. ఎవరైనా వచ్చి ఏ సాయం అడిగినా, తన అధికార పరిధిలో చేయగలిగినదంతా చేసేవాడు. వాళ్ళ ఇల్లు నిలబెట్టేవాడు. కానీ, ఏనాడూ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. ‘శంకరాభరణం’ తరువాత వాడి ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి, పారితోషికం తీసుకున్నాడని గిట్టనివాళ్ళు పిటిషన్లు పెట్టారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘శంకరాభరణం’ సినిమా తెప్పించుకొని, చూసి, ‘మన రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇంత గౌరవం తెచ్చినవాణ్ణి మనం గౌరవించుకోవాలి’ అన్నారు. ఆ వెంటనే మన తెలుగునాట తొలిసారిగా కల్చరల్ ఎఫైర్స్ అనే శాఖను సృష్టించి, దానికి డెరైక్టర్‌గా సోమయాజులును నియమించారు. అలాగే, ‘కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి, పారితోషికం అందుకోవచ్చు. దానికి అనుమతి అవసరం లేదు’ అని కూడా ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. గమ్మత్తేమిటంటే, అసలు ‘శంకరాభరణం’కి అన్నయ్యకు దక్కిన పారితోషికం కేవలం రూ. 6 వేలు. అదీ సినిమా విడుదలై, అఖండ విజయం సాధించాక ఓ ఏడాది గడచిన తరువాత! ‘శంకరాభరణం’ తరువాత ‘త్యాగయ్య’, ‘సప్తపది’, ‘వంశవృక్షం’ - ఇలా అనేక సినిమాల్లో అన్నయ్య నటించినా, శంకరశాస్త్రి లాంటి చిరస్మరణీయ పాత్ర మరొకటి కనపడలేదు. ఆ పాత్ర ఒక స్టార్‌ను సృష్టించింది. కానీ, అదే పాత్రతో వచ్చిపడ్డ ఇమేజ్ ఒక మంచి నటుణ్ణి మింగేసింది. - సంభాషణ: రెంటాల జయదేవ -
రంగస్థల మకుటం!
కన్యాశుల్కం... గడియారం కంటే వేగంగా పరుగులు తీయాలంటున్న తరం ఇది. కాలాన్ని రోజులు, గంటలుగా లెక్కించడం మానేసి నిమిషాలు, సెకన్లుగా కొలవడం మొదలైంది. మూడు గంటల నిడివి ఉండే సినిమా రెండున్నర గంటలకు కుదించుకుపోయి దాదాపు నలభై ఏళ్లయింది. ఈ తరం యువత అయితే అరగంట నిడివితో సినిమా తీసేసి యూ ట్యూబ్‌లో పెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో ఎనిమిది గంటల నిడివితో నాటకాన్ని ప్రదర్శించాలను కోవడమే ఓ సాహసం. అశేషాదరణ పొందిన ఆ సాహసం వెనుక ఉన్న హోమ్‌వర్క్ ఆరు నెలల అకుంఠిత దీక్ష! నియమనిబద్ధతలతో కూడిన గౌరవం!! ఫిబ్రవరి రెండవ తేదీ... హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి. కన్యాశుల్కం నాటకం ప్రదర్శితమవుతోంది. హాలు నిండిపోయింది. వరండాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి మరీ నాటక ప్రదర్శన చేశారు. ప్రేక్షకుల ముఖాల్లో ఆనందం. 42 మంది నటులు, పాతికమంది సాంకేతిక నిపుణులకు తమ శ్రమకు తగిన ఫలితం దక్కిన అనుభూతి కలుగుతోంది. నాటక దర్శకులు శొంఠినేని కిశోర్ మాటల్లో నాటకం మీద ఆయనకున్న ఇష్టం కనిపిస్తోంది. ఆర్టిసిలో సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయిన కిశోర్‌కి నాటకరంగంతో మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఈ తరానికి ఒక గ్రంథం! గురజాడ 1892లో రాసిన కన్యాశుల్కం నాటకాన్ని యథాతథంగా ప్రదర్శించాలనే ఆలోచనకు బీజం 2011లో పడింది అంటారాయన. ‘‘గురజాడ వారి 149వ జయంతి సందర్భంగా మూడున్నర గంటల నాటకాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో నాటకాన్ని ఎడిట్ చేసివ్వమని నన్ను అడిగారు ఆ నిర్వహకులు. ఆ స్క్రిప్టుని మూడు నెలల పాటు అధ్యయనం చేశాను. దీనిని యథాతథంగా ప్రదర్శించినప్పుడే ఈ నాటకానికి న్యాయం జరుగుతుంది. ఇందులో ఈ తరం తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయనిపించింది. ఆ సంగతి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటించాను. పాత్రధారుల ఎంపిక! నటులకు నాటకం మీద ఆసక్తితోపాటు ఎనిమిది గంటల సేపు స్టేజి మీద నిలబడగలిగిన, డైలాగ్ చెప్పగలిగిన శక్తి కూడా ఉండాలి. పాత్రధారుల ఎంపికకు నెలరోజులు పట్టింది. ఏడు అంకాలను ఏకనిడివిన రిహార్సల్స్ చేస్తూ పోతే టైమ్ సరిపోదు. కాబట్టి ఏకకాలంలో నాలుగైదు చోట్ల రిహార్సల్స్ చేసేవాళ్లం. అలా ఆరునెలల శ్రమ తర్వాత తొలి ప్రదర్శన ఇచ్చాం’’ అన్నారు కిశోర్. అలనాటి నేపథ్యం కోసం... నూట ఇరవై ఏళ్ల కిందటి దుస్తులు, చెప్పులు, వస్తువులు... ఇలా ప్రతి ఒక్కటీ కీలకమే. ‘‘అగ్గిపెట్టెలు తయారు చేయడం, కరెన్సీ సేకరించడం, దర్జీ దగ్గర కూర్చుని దుస్తులు డిజైన్ చేయించడం, చెప్పులు... ఇలా ప్రతిదీ తయారు చేసుకున్నాం. స్కూళ్లలో, కొందరి ఇళ్లలో ఉన్న ఆ కాలం కుర్చీలు, మేజాలు సేకరించాం. పందిరిమంచం చాలా కష్టమైంది. ఒకరి ఇంట్లో ఉందని తెలిసి వారిని అడిగితే వెంటనే ఇచ్చారు. కానీ మాకు మంచం ఇచ్చి వాళ్లు కింద పడుకుంటున్నారని తెలిసి వాళ్లకు కొత్త మంచం కొనిచ్చాం. వీటి సేకరణ ఇలా ఉంటే నాటక ప్రదర్శన జరిగే చోటుకి ఈ వస్తువులను తరలించడం పెద్ద పని. వీటి రవాణాకే ఇరవై వేలు ఖర్చయింది. నాటకంలోని 39 సీన్లకు 20 కర్టెన్లను తయారు చేసుకున్నాం. రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఖర్చు మూడు లక్షలు. శ్రద్ధగా చేశాం, అంతటి ఆదరణ లభించింది’’ అంటారు కిశోర్. నాటకానికి ఆదరణ లేదనే అపవాదును కొట్టిపారేస్తూ... ‘‘సినిమా, టీవీ, నాటకరంగం... మూడూ మూడు కోణాలు. దేని ఆదరణ దానికి ఉంటుంది. అయితే నాటకాన్ని ప్రకటించిన సమయానికి మొదలు పెట్టకపోతే ప్రేక్షకులు విసుగుచెందుతారు’’ అంటారాయన. తొలి ప్రదర్శన విశాఖలో... గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2012 సెప్టెంబరులో విశాఖపట్నంలో ఇచ్చిన ప్రదర్శన మొదటిది. ‘‘ఆ ప్రదర్శన చూసిన వాళ్లకంటే కూర్చోవడానికి స్థలం లేక వెనక్కి వెళ్లిన వాళ్లే ఎక్కువ. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్, ఎన్ఎస్టిఎల్, విజయవాడ, విజయనగరం ప్రదర్శనలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రదర్శన వర్ణించనలవి కాదు. గురజాడ గారి మీద అభిమానంతో ఈ నాటక ప్రదర్శనకు తోడ్పాటునందిస్తున్న వెలుగు రామినాయుడు, చలసాని ప్రసాద్‌లు కూడా ఆనందించిన క్షణం అది’’ అన్నారు కిశోర్ సంతృప్తిగా. మన సినీనటుల్లో ఎక్కువ మంది నాటకరంగం నుంచి వచ్చినవారే. ఈ తరం నటులు కూడా థియేటర్ ఆర్ట్స్ కోర్సు చేసి వెండితెరకు పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, మనోజ్ బాజ్‌పేయి, అనుపమ్‌ఖేర్ వంటి బాలీవుడ్ నటులు రంగస్థలం మీద నటించి మురిసిపోతున్నారు. త్వరలో ఈ ట్రెండ్ మన దగ్గరా రావచ్చు. మనకు కన్యాశుల్కమే కాదు, రాగరాగిణి, రసరంజని... ఇలా ఆణిముత్యాల్లాంటి ఎన్నో నాటకాలు ఉన్నాయి. ఆ నాటకాలను కూడా ఈ తరానికి పరిచయం చేసేందుకు కృషి జరిగితే బావుంటుంది. - వాకా మంజులారెడ్డి ప్రణాళిక ఉంటే... ఎనిమిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని మధ్యాహ్నం రెండుకు మొదలు పెట్టి మధ్యలో రెండు విరామాలతో రాత్రి పదింటికి పూర్తి చేసేవాళ్లం. ఉపాహారం అందుబాటులో ఉంచేవాళ్లం. ప్రేక్షకులు ఇంటి దగ్గర భోజనం చేసి వస్తారు, రాత్రి భోజనానికి ఇంటికి వెళ్తారు. నాటకం వేయడానికి సమయపాలన, స్క్రిప్టు ఎంపిక, వేదిక ఎంపిక, ప్రదర్శన సమయాలు ముఖ్యం. అప్పుడు ఈ వందేళ్లే కాదు, మరో వందేళ్లయినా నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించవచ్చు. - శొంఠినేని కిశోర్ కన్యాశుల్కం నాటక దర్శకులు -
గొప్ప విమర్శకుడు.... విలువైన విమర్శ...
మంచి పుస్తకం సర్దేశాయి తిరుమలరావు ఆయిల్ టెక్నాలజీలో గొప్ప సైంటిస్ట్. ఆ రంగంలో ఆయన చేసిన కృషి, చేసిన ఆవిష్కరణలు, సమర్పించిన పత్రాలు జాతీయ స్థాయిలో ఆయనకు కీర్తి సంపాదించిపెట్టాయి. అయితే ఆయన తెలుగు సాహిత్య సారస్వత రంగాల్లో చేసిన కృషి మాత్రం మరుగున పడిపోయింది. రాయలసీమ నుంచి ఎదిగిన భంగోరె, రారా వంటి విమర్శకుల కోవలో విశేష కృషి చేసిన పండితులు సర్దేశాయి తిరుమలరావు. అనంతపురం పట్టణంలో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి, ప్రచారాలకు పటాటోపాలకు లొంగకుండా నిక్కచ్చి విమర్శతో తెలుగు సృజనను దిశా నిర్దేశంలో పెట్టడానికి కృషి చేశారాయన. తెలుగు సాహిత్యంలో మిగతా శాఖలు వృద్ధి చెందినంతగా విమర్శ వృద్ధి చెందలేదని అనేవారట ఆయన. తెలుగులో గొప్ప నాటకం ‘కన్యాశుల్కం’, గొప్పకావ్యం ‘శివభారతం’, గొప్ప నవల ‘మాలపల్లి’ అని అంటారు తిరుమలరావు. 1994లో ఆయన మరణించినా ఇన్నాళ్లకు ఆయన కృషినీ ఆయన రాసిన విమర్శనా వ్యాసాలనూ పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరిగింది. ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ పేరుతో తెచ్చిన ఆ పుస్తకంలో తెలుగు లిపి, వచన పద్యం, మినీ కవిత, వీరశైవం, సజీవ గణితం, సూఫీ తత్త్వం వంటి అనేక అంశాల మీద తిరుమలరావు విపుల వ్యాఖ్యానం ఉంది. కొలకోవ్ స్కీ రాసిన ‘మాడర్నిటీ ఆన్ ఎండ్లెస్ ట్రయల్’ సుదీర్ఘ వ్యాసానికి సర్దేశాయి చేసిన అనువాదం, చేసిన టిప్పణి ఆలోచనాపరులందరూ చదవాలి. ‘సత్యం శివం సుందరం’ అనడం అందరికీ తెలుసు. కాని ఆ మాటను అన్నదెవరు? సర్దేశాయి వ్యాసాన్ని చదవాల్సిందే. ఇలాంటివే ఇంకా ఎన్నో. ఒంటికి ఆహారం కాక బుద్ధికి ఆహారం వెతికేవారు తప్పక పరిశీలించాల్సిన పుస్తకం ఇది. వెల:రూ.150/- ప్రతులకు: 9701371256