రంగస్థల మకుటం!
కన్యాశుల్కం...
గడియారం కంటే వేగంగా పరుగులు తీయాలంటున్న తరం ఇది.
కాలాన్ని రోజులు, గంటలుగా లెక్కించడం మానేసి నిమిషాలు, సెకన్లుగా కొలవడం మొదలైంది.
మూడు గంటల నిడివి ఉండే సినిమా రెండున్నర గంటలకు కుదించుకుపోయి దాదాపు నలభై ఏళ్లయింది.
ఈ తరం యువత అయితే అరగంట నిడివితో సినిమా తీసేసి యూ ట్యూబ్‌లో పెట్టేస్తోంది.
ఈ నేపథ్యంలో ఎనిమిది గంటల నిడివితో నాటకాన్ని ప్రదర్శించాలను కోవడమే ఓ సాహసం.
అశేషాదరణ పొందిన ఆ సాహసం వెనుక ఉన్న హోమ్‌వర్క్ ఆరు నెలల అకుంఠిత దీక్ష!
నియమనిబద్ధతలతో కూడిన గౌరవం!!
ఫిబ్రవరి రెండవ తేదీ... హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి. కన్యాశుల్కం నాటకం ప్రదర్శితమవుతోంది. హాలు నిండిపోయింది. వరండాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి మరీ నాటక ప్రదర్శన చేశారు. ప్రేక్షకుల ముఖాల్లో ఆనందం. 42 మంది నటులు, పాతికమంది సాంకేతిక నిపుణులకు తమ శ్రమకు తగిన ఫలితం దక్కిన అనుభూతి కలుగుతోంది. నాటక దర్శకులు శొంఠినేని కిశోర్ మాటల్లో నాటకం మీద ఆయనకున్న ఇష్టం కనిపిస్తోంది. ఆర్‌టిసిలో సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయిన కిశోర్‌కి నాటకరంగంతో మూడున్నర దశాబ్దాల అనుబంధం.
ఈ తరానికి ఒక గ్రంథం!
గురజాడ 1892లో రాసిన కన్యాశుల్కం నాటకాన్ని యథాతథంగా ప్రదర్శించాలనే ఆలోచనకు బీజం 2011లో పడింది అంటారాయన. ‘‘గురజాడ వారి 149వ జయంతి సందర్భంగా మూడున్నర గంటల నాటకాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో నాటకాన్ని ఎడిట్ చేసివ్వమని నన్ను అడిగారు ఆ నిర్వహకులు. ఆ స్క్రిప్టుని మూడు నెలల పాటు అధ్యయనం చేశాను. దీనిని యథాతథంగా ప్రదర్శించినప్పుడే ఈ నాటకానికి న్యాయం జరుగుతుంది. ఇందులో ఈ తరం తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయనిపించింది. ఆ సంగతి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటించాను.
పాత్రధారుల ఎంపిక!
నటులకు నాటకం మీద ఆసక్తితోపాటు ఎనిమిది గంటల సేపు స్టేజి మీద నిలబడగలిగిన, డైలాగ్ చెప్పగలిగిన శక్తి కూడా ఉండాలి. పాత్రధారుల ఎంపికకు నెలరోజులు పట్టింది. ఏడు అంకాలను ఏకనిడివిన రిహార్సల్స్ చేస్తూ పోతే టైమ్ సరిపోదు. కాబట్టి ఏకకాలంలో నాలుగైదు చోట్ల రిహార్సల్స్ చేసేవాళ్లం. అలా ఆరునెలల శ్రమ తర్వాత తొలి ప్రదర్శన ఇచ్చాం’’ అన్నారు కిశోర్.
అలనాటి నేపథ్యం కోసం...
నూట ఇరవై ఏళ్ల కిందటి దుస్తులు, చెప్పులు, వస్తువులు... ఇలా ప్రతి ఒక్కటీ కీలకమే. ‘‘అగ్గిపెట్టెలు తయారు చేయడం, కరెన్సీ సేకరించడం, దర్జీ దగ్గర కూర్చుని దుస్తులు డిజైన్ చేయించడం, చెప్పులు... ఇలా ప్రతిదీ తయారు చేసుకున్నాం. స్కూళ్లలో, కొందరి ఇళ్లలో ఉన్న ఆ కాలం కుర్చీలు, మేజాలు సేకరించాం. పందిరిమంచం చాలా కష్టమైంది. ఒకరి ఇంట్లో ఉందని తెలిసి వారిని అడిగితే వెంటనే ఇచ్చారు. కానీ మాకు మంచం ఇచ్చి వాళ్లు కింద పడుకుంటున్నారని తెలిసి వాళ్లకు కొత్త మంచం కొనిచ్చాం. వీటి సేకరణ ఇలా ఉంటే నాటక ప్రదర్శన జరిగే చోటుకి ఈ వస్తువులను తరలించడం పెద్ద పని. వీటి రవాణాకే ఇరవై వేలు ఖర్చయింది. నాటకంలోని 39 సీన్లకు 20 కర్టెన్లను తయారు చేసుకున్నాం. రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఖర్చు మూడు లక్షలు. శ్రద్ధగా చేశాం, అంతటి ఆదరణ లభించింది’’ అంటారు కిశోర్. నాటకానికి ఆదరణ లేదనే అపవాదును కొట్టిపారేస్తూ... ‘‘సినిమా, టీవీ, నాటకరంగం... మూడూ మూడు కోణాలు. దేని ఆదరణ దానికి ఉంటుంది. అయితే నాటకాన్ని ప్రకటించిన సమయానికి మొదలు పెట్టకపోతే ప్రేక్షకులు విసుగుచెందుతారు’’ అంటారాయన.
తొలి ప్రదర్శన విశాఖలో...
గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2012 సెప్టెంబరులో విశాఖపట్నంలో ఇచ్చిన ప్రదర్శన మొదటిది. ‘‘ఆ ప్రదర్శన చూసిన వాళ్లకంటే కూర్చోవడానికి స్థలం లేక వెనక్కి వెళ్లిన వాళ్లే ఎక్కువ. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్, ఎన్‌ఎస్‌టిఎల్, విజయవాడ, విజయనగరం ప్రదర్శనలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రదర్శన వర్ణించనలవి కాదు. గురజాడ గారి మీద అభిమానంతో ఈ నాటక ప్రదర్శనకు తోడ్పాటునందిస్తున్న వెలుగు రామినాయుడు, చలసాని ప్రసాద్‌లు కూడా ఆనందించిన క్షణం అది’’ అన్నారు కిశోర్ సంతృప్తిగా.
మన సినీనటుల్లో ఎక్కువ మంది నాటకరంగం నుంచి వచ్చినవారే. ఈ తరం నటులు కూడా థియేటర్ ఆర్ట్స్ కోర్సు చేసి వెండితెరకు పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, మనోజ్ బాజ్‌పేయి, అనుపమ్‌ఖేర్ వంటి బాలీవుడ్ నటులు రంగస్థలం మీద నటించి మురిసిపోతున్నారు. త్వరలో ఈ ట్రెండ్ మన దగ్గరా రావచ్చు. మనకు కన్యాశుల్కమే కాదు, రాగరాగిణి, రసరంజని... ఇలా ఆణిముత్యాల్లాంటి ఎన్నో నాటకాలు ఉన్నాయి. ఆ నాటకాలను కూడా ఈ తరానికి పరిచయం చేసేందుకు కృషి జరిగితే బావుంటుంది.
- వాకా మంజులారెడ్డి
ప్రణాళిక ఉంటే...
ఎనిమిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని మధ్యాహ్నం రెండుకు మొదలు పెట్టి మధ్యలో రెండు విరామాలతో రాత్రి పదింటికి పూర్తి చేసేవాళ్లం. ఉపాహారం అందుబాటులో ఉంచేవాళ్లం. ప్రేక్షకులు ఇంటి దగ్గర భోజనం చేసి వస్తారు, రాత్రి భోజనానికి ఇంటికి వెళ్తారు. నాటకం వేయడానికి సమయపాలన, స్క్రిప్టు ఎంపిక, వేదిక ఎంపిక, ప్రదర్శన సమయాలు ముఖ్యం. అప్పుడు ఈ వందేళ్లే కాదు, మరో వందేళ్లయినా నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించవచ్చు.
- శొంఠినేని కిశోర్
కన్యాశుల్కం నాటక దర్శకులు