
రవీంద్రభారతిలో యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆలయ ముఖ్య అర్చకులు నర్సింహమూర్తి
తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని కూడా సాధిస్తా..
రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం విజయవంతమవుతుందని ఆశిస్తున్నా
మా ప్రయత్నాలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం
ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉందని. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడన్న సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తన జీవితంలో సంకల్పించిన లక్ష్యం ఏదీ ఇప్పటివరకు విఫలం కాలేదన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రవీంద్రభారతిలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు.
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ
‘తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని నిజం చేస్తూ దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. లాంటి కీలక నిర్ణయాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారుస్తాం. మన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఆ ఆలోచనకు నమూనాగా నిలవబోతుంది. ఇది జనావాస యోగ్యానికే పరిమితమయ్యే నగరం కాదు. ఉద్యోగ, ఉపాధి కల్పన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కావాలంటే ఆ నగరానికి పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంది. అందుకే ఆ నగరం జనావాసాలకే పరిమితం కాకుండా ఓ పెట్టుబడుల నగరంగా రూపు దిద్దుకుంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..
‘అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి నూరు శాతం మద్దతు వస్తుందని మా ప్రభుత్వం అనుకోవటం లేదు. దేవుళ్ల ఆరాధన విషయంలోనే భిన్నాభిప్రాయాలుండే సమాజం నుంచి.. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి ఆమోదం ఆశించలేం. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం మేం తీసుకునే చర్యలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజల నుంచి మాకు సూచనలొస్తున్నాయి. కాబట్టి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..’ అని రేవంత్ అన్నారు.
ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్
‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి లాగానే ఉంది. తీపి ఉంది, పులుపు ఉంది, కారం ఉంది. కాస్తోకూస్తో ఉప్పు కూడా ఉంది. కొన్ని అంశాల్లో స్వేచ్ఛగా నిధులిచ్చారు. కొన్నింటి విషయంలో తప్పనిసరి నియంత్రణ పాటించారు. ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య వైద్యం తదితరాలకు మెరుగ్గా నిధులిచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు కావాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండాలి. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పేదలు సన్న బియ్యం కోరుకుంటున్నారు..
నేను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని పురోగమన పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. గతంలో పండుగ పూట మాత్రమే తెల్లన్నం చూసే భాగ్యం పేదలది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కే, తర్వాత ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇచ్చి కొంత మార్పు తెచ్చారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆహారభద్రత చట్టం వచ్చాక ఇప్పుడు పేదలు శ్రీమంతుల తరహాలో సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వారికోసం హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్టీలు, ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు..’ అని సీఎం అన్నారు.
ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాభివృద్ధి: భట్టి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం నూతనంగా రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. యాదగిరి క్షేత్ర ముఖ్య అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తిని ఉగాది పురస్కారం, అవార్డుతో సన్మానించారు.