‘నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించాలి’ అంటాడు ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులు. అందుకు ‘నమ్మినచోట మోసం, నమ్మని చోట లౌక్యం’ ప్రదర్శించాలంటాడు. కన్యాశుల్కం మలికూర్పు 1909లో జరిగింది కనుక రచనాకాలం ఇదమిత్థంగా తెలియకపోయినా ఇందులోని పాత్రలన్నీ 1880– 1910 కాలం నాటివి. అంటే నాటి మనుషుల జీవనాన్ని తెలిపేవి. వారు పాటించిన విలువలు, తొక్కగల పాతాళాలు, చూపిన చిత్తవృత్తులు, చేసిన టక్కుటమారాలు, హీనత్వాలు, అల్పత్వాలు... ఇవి తెలియాలంటే కన్యాశుల్కానికి మించిన ఆనవాలు లేదు.
వందేళ్ల కాలం తర్వాత కూడా గురజాడ, ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ వర్తమాన విలువను కలిగి ఉండటానికి నాటకంలో గురజాడ ఎంచుకున్న సాంఘిక సమస్య గాంభీర్యం ఎంత మాత్రం కారణం కాదు. సాంఘిక సంస్కరణ కూడా కాదు. పసిపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేయడం, వితంతువుల పెళ్ళిళ్లు నిరాకరించడం, వేశ్యావృత్తి ప్రబలంగా ఉండటం... వీటి నిరసనగా గురజాడ కన్యాశుల్కాన్ని రాసినా కేవలం ఈ కారణం చేతనైతే నాటకం అవసరం ఏ పదేళ్లకో తీరిపోయి కనుమరుగైపోయేది. కన్యాశుల్కం బతికి ఉన్నదీ... ఇక మీదటా బతికి ఉండేదీ... అది కేవలం మనుషుల నిజ ప్రవర్తనల విశ్వరూపం చూపడం వల్లే!
అగ్నిహోత్రావధాన్లకు మెరకపొలం ఉంది. భార్య వెంకమ్మ పసుపూ కుంకాలతో తెచ్చిన పొలమూ ఉంది. ఇరుగింటి గోడ, పొరుగింటి గోడ తనదేనని దబాయించి కలుపుకుంటున్నాడు. పెద్ద కూతురు బుచ్చమ్మను పదిహేను వందలకు అమ్మి, ఆమె విధవగా మారగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బుచ్చమ్మ (చనిపోయిన) మొగుడి భూముల్లో వాటా కోసం దావా కూడా తెచ్చాడు. ఇన్ని ఉన్నా బంగారం లాంటి, పసిమొగ్గ వంటి చిన్నకూతురు సుబ్బిని పద్దెనిమిది వందలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు– అరవై దాటిన, కాటికి కాళ్లుజాపుకున్న లుబ్ధావధాన్లకు! కొడుకు వెంకటేశం పెళ్లి జరగాలంటే చంటిదాన్ని అమ్మాల్సిందేనట. ఈ కాఠిన్యం, కపటత్వం ఎంత వెలపరం!
ఇక కపటుల వరుస చూడండి. డబ్బుపై యావ తప్ప వేరే ఏ లిటిగేషన్ ఎరగని ముసలి లుబ్ధావధాన్లను పెళ్లికి ఎగదోసి, అతగాడు పిల్లకు పుస్తె గట్టి ఇంటికి తెచ్చుకుంటే గనక తన ఇలాకా చేసుకుందామని ఆరాటçపడుతుంటాడు ఉమనైజర్ రామప్పపంతులు. అప్పటికే అతడు లుబ్ధావధాన్ల పెద్ద కూతురు మీనాక్షిని లొంగదీసుకున్నాడు. మధురవాణిని ఉంచుకున్నాడు. చాలక అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లను కబళించేందుకు లుబ్ధావధాన్ల హితం పలుకుతుంటాడు.
గిరీశం ఇంతకన్నా దిగదుడుపు. స్త్రీలపై పడి బతుకుతాడు. పూటకూళ్లమ్మను ఉంచుకుని, ఆమె సరుకుల కోసం దాచుకున్న 20 రూపాయలను కాజేసి మధురవాణికిచ్చి ఆమెను ఉంచుకుంటాడు. సరైన పెద్దమనిషి దొరికితే ‘మధురవాణి లాంటి ఇరవై మందిని సపై్ల చేస్తానంటా’డు. బుచ్చమ్మ మీద కన్నేసి, విడో మేరేజీ పేరుతో ఆమెను నగానట్రాతో ఉడాయించుకు పోవాలని చూస్తాడు. గిరీశానికి ఇంగ్లిష్ వచ్చు. శ్రమ రాదు. చదువు ఉంది. నీతి లేదు.
మేనకోడలైన సుబ్బిని కాపాడటానికి రంగంలో దిగిన కరటక శాస్త్రికి ఎన్ని సదుద్దేశాలున్నా అతడు మధురవాణికి పాత గిరాకీ. ‘ఎవరూ లభ్యం కాకపోతే నేను యాంటీ నాచే’ అంటాడు. ఇక ఆవు నైయ్యెనా ఇస్తాగానీ ఖూనీ కేసులో చిక్కుకున్న లుబ్ధావధాన్ల తరఫున సాక్ష్యం చెప్పననే పొలిశెట్టి, లేని దెయ్యాలను సీసాలో బంధించే గవరయ్య, హరిద్వార్‌లో మఠం కడతానని చిల్లర చందాలతో సాయంత్రాలు సారా కొట్లో గడిపే బైరాగి, కేసుంది అనగానే ఎంతొస్తది అనే కానిస్టేబు, చదవక తండ్రిని మోసం చేసే వెంకటేశం... కపటులు.
మనుషులు బతకాలి. బతకడం ముఖ్యమే. అందుకై కాస్తో కూస్తో కపటత్వం అవసరం కావచ్చుగాని అందులోనే సోయి మరిచి కొట్టుకుపోవడమా? తెల్లారి లేస్తే కుత్సితాలు చేస్తూ, ఎదుటి వారి నెత్తిన చేయి పెడ్తూ, ఇతరుల కీడు కోరుతూ, బాగా గడుస్తూ ఉన్నా అత్యాశకొద్దీ విలువలు కాలరాస్తూ, పై అంతస్తుకు చేరేందుకు అయినవారిని కాలదంతూ, కేసులూ కోర్టులని తిరుగుతూ... ఆ కాలం మనుషులను తలుచుకుని గురజాడ– సౌజన్యారావు పంతులు రూపంలో కాసింత చింతిస్తూ ‘చెడ్డలో కూడా మంచి ఉండదా’ అంటాడు.
‘ఉన్నవారు వీరే. వీరిలో మంచి వెతికి సర్దుకుపోక తప్పదు’ అనే అర్థంలో! కాని నేటి రోజులు చూస్తుంటే ఆనాటి కపటులంతా మహానుభావులు అనిపించక మానదు. నేటి మనుషులకు కిందా మీదా పడి బతకడం రావడం లేదు. కపట జీవన సౌందర్యం తెలియడం లేదు. అసలు అంత ఓర్పు లేదు. చెడి బతికినా, బతికి చెడినా... బతకడం ముఖ్యం అనుకోవడం లేదు. చంపు లేదా చావు... అని క్షణాల్లో క్రూరత్వానికి తెగబడుతున్నారు.
గురజాడ నేడు ‘కన్యాశుల్కం’ రాస్తే బుచ్చమ్మ, వెంకమ్మ కలిసి అగ్నిహోత్రావధాన్లకు విషం పెడతారు. లుబ్ధావధాన్ల పీక నొక్కి మీనాక్షి ఆస్తిపత్రాలతో పారిపోతుంది. చీటికి మాటికి తార్చి బతుకుతున్నాడని గిరీశం నిద్రలో ఉండగా మధురవాణి ఖూనీ చేస్తుంది. రామప్ప పంతులు ‘పోక్సో’ కింద అరెస్ట్ అవుతాడు. వెంకటేశం డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు.
దారుణం అనిపించవచ్చుగాని పేర్లను మారిస్తే ఇవాళ్టి వార్తలు ఇవే! ఆగస్టు – ‘కన్యాశుల్కం’ మొదటిసారి ప్రదర్శించిన మాసం. సినిమాగా రిలీజైన మాసం. మనుషులు పరిహాసం ఆడదగ్గ అల్పత్వాలతోనే జీవించాలని, ఈసడించుకునే స్థాయి కపటత్వంతోనే బతకాలని, భీతి కలిగించే రాక్షస మనస్తత్వాలకు ఎన్నటికీ చేరకూడదని కోరుకునేందుకు ఈ మాసం కంటే మించిన శుభతిథి ఏముంది – నెలాఖరైనా?
కాసింత కపటం
Published Mon, Aug 28 2023 12:56 AM | Last Updated on Mon, Aug 28 2023 12:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment